నోటి దురుసు రంగయ్య - సరికొండ శ్రీనివాసరాజు‌

Noti durusu rangayya

రంగయ్య ఏ పనీ చేయకుండా చాలా సోమరిగా బ్రతికేవాడు. భార్య సంపాదన మీదనే ఆధారపడుతూ సుఖంగా కాలం వెళ్ళదీసేవాడు. అతని భార్య పోచమ్మ కూలీ పని చేస్తూ, తీరిక సమయాల్లో ఇతరుల బట్టలను ఉతుకుతూ, ఇస్త్రీ పనులు చేస్తూ డబ్బులు సంపాదించేది. కుమారులకు యుక్త వయసు రాగానే వాళ్ళూ ఈ పనులు చేస్తూ, సంపాదిస్తూ తల్లికి సాయపడేవారు. రంగయ్య ఒక గాడిదను, కుక్కనూ పెంచుతున్నాడు. రంగయ్య ఏ పనీ చేయకున్నా నోటి దురుసుకు మాత్రం ఏమీ తక్కువ లేదు. తరచూ భార్య మీద, కొడుకుల మీద నోరు పారేసుకోవడం పరిపాటి అయింది.

పెద్ద కొడుకు పాండును చిన్న చిన్న పొరపాట్లకే గాడిద కొడకా అని తరచూ తిట్టేవాడు. చిన్న కొడుకు మధు మీద కోపం వచ్చినప్పుడల్లా ఒరేయ్ కుక్కా! లేదా కుక్కల కొడకా అని తిట్టేవాడు. తండ్రి తిట్లను పట్టించుకోకుండా కుమారులు తమ పనిని తాము చేసేవారు. కానీ ఈ తిట్లను విన్నప్పుడల్లా గాడిద, కుక్కలు ఎంతో బాధపడేవి. తమను చిన్న చూపు చూస్తున్న రంగయ్యపై వాటికి ఎంతో కోపం వచ్చేది. ఒకదానికి ఒకటి తమ గోడును వెళ్ళబోసుకోవడం తప్ప అవి ఏమీ చేయలేకపోయేవి.

ఒకరోజు రంగయ్య పనిగట్టుకుని మరీ తన కొడుకులను విపరీతంగా తిడుతున్నాడు‌‌. ఆ తిట్ల ప్రవాహం గంటలు గడిచినా ఆగడం లేదు. సహనం కోల్పోయిన కొడుకులు ఇద్దరూ ఆ ఇంట్లోంచి విసురుగా బయటకు వచ్చారు. బయట నిలబడి చాలా సేపటి నుండి ఈ తిట్ల పురాణాన్ని వింటున్న రంగయ్య మిత్రులు రామయ్య, భీమయ్య పాండు, మధులతో '"మీ సహనానికి జోహార్లు. ఇంకొకరు అయితే ఈ తిట్లు వినలేక చచ్చే వారే. ఎలా భరిస్తున్నారయ్యా ఇతనిని? గాడిదా, కుక్కా అంటూ ఆ తిట్లేమిటి?" అన్నారు. అప్పుడు పాండు ఇలా అన్నాడు. "పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాడండీ! పైగా ఏమన్నాడండి? గాడిద కొడకా అన్నాడు. గాడిద ఎంతో శ్రమజీవి. ఈ లోకంలో శ్రమజీవి ఎంతో గౌరవించదగ్గ వ్యక్తి. అలాంటి శ్రమజీవి గాడిదకు కొడుకును అంటే నేను గర్వపడాలి కానీ ఎందుకు సిగ్గుపడాలి? ఏ పనీ చేతగాని సోమరి రంగయ్య కొడుకును అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి." అని. అప్పుడు మధు ఇలా అన్నాడు. "విశ్వాసానికి మారుపేరు అయిన కుక్కతో పోల్చడం నాకూ గర్వ కారణమే. ఏ పనీ చేయకపోయక పోగా కనీసం మా చదువులు త్యాగం చేసి, మేము చేస్తున్న పనిని అయినా గుర్తించకుండా, మాపై విశ్వాసం కూడా లేని మా తండ్రి కంటే ఆ కుక్కే నయం." అని. ఈ మాటలు విన్న రంగయ్య ఎంతో సిగ్గు పడ్డాడు.

అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. "ఇంతకీ మేము వచ్చిన పని ఏమిటంటే మీ నాన్న తాగుడు మొదలైన వ్యసనాల కోసం మా దగ్గర బాగా అప్పు చేశాడు. అవి వసూలు చేద్దామని వచ్చాము." అని. "మా నాన్న చేసే అప్పులకు మాకూ ఏ సంబంధమూ లేదు. ఆ డబ్బులు మేము ఎప్పుడూ అనుభవించలేదు. మా కష్టార్జితంతో మేము బతుకుతున్నాము. మా నాన్నను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిండి. బాగా పని చేయించి, ‌ఆ బాకీలు వసూలు చేసుకోండి. మీ అప్పులు తీరి, అతనికి కనువిప్పు కలిగాకే మా ఇంటికి పంపించండి." అన్నాడు మధు. ఏకీభవించారు పోచమ్మ, పాండులు. రామయ్య, భీమయ్యలు రంగయ్యను తీసుకుని వెళ్ళారు. గొడ్డు చాకిరీ చేయించుకున్నారు.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు