పసితనం - B.Rajyalakshmi

Pasitanam

ఆదిత్య కు యెందుకో తన బతుకంతా చీవాట్ల గుణింతం లా కనిపిస్తున్నది .ఎంత ఆలోచించినా అమ్మా ,నాన్నా బళ్లో మేష్టారు అందరూ తనతో యెందుకింత కఠినం గా వుంటారో అతని చిన్ని బుర్రకు అర్ధం కావడం లేదు .ఆదిత్య ఐదో తరగతి చదువుతున్నాడు .

మంచిపిల్లల్ని యెవరూ విసుక్కోరు అంటారుకదా !కానీ అమ్మా ,నాన్నా తనతో యెప్పుడూ సీరియస్ గా ఎందుకుంటారు? అదేమంటే “నువ్వు యింటికి పెద్దవాడివి “ అంటారు .పెద్దవాడైతే చివాట్లు తినాలా ? అమ్మ చెప్పిన పనులు నాన్న చెప్పిన చేస్తాను కదా ! ఆదిత్య కు అమ్మా నాన్నా అంటే భయం ! బళ్లో కూడా బాగా చదువుతాడు ! పరీక్షల సమయం లో నాన్న దగ్గర కూర్చోబెట్టుకుని చదివిస్తాడు ! అమ్మ యే పని చెప్పదు! అప్పుడు బలే హాయిగా వుంటుంది.బళ్లో మేష్టారు మంచి మార్కులు తెచ్చుకున్నందుకు ముద్దుపెట్టుకుని ఒక పెన్ను కూడా బహుమానం గా యిస్తారు .ఇంట్లో కూడా నాన్న మెచ్చుకోడు కానీ అమ్మ మాత్రం తనకు నచ్చిన స్వీట్స్ చేస్తుంది !పొద్దున్నే లేవకపోతే అమ్మ అరుస్తుంది ,నాన్న అరుస్తాడు . ఈ చిక్కులన్నీ తమ్ముడికీ , చెల్లాయికీ లేవు .అదేమంటే వాళ్లు చిన్నవాళ్లంటారు !అందరికీ గారాబం !వాళ్లను విసుక్కోరు కూడా ! తనకే యెందుకు యివన్నీ !ఆదిత్యకు ఒక్కోసారి యేడుపు కూడా వస్తుంది . ఇంకా తెల్లవారలేదు !రెండేళ్ల చెల్లాయి అప్పుడే రాగం మొదలు పెట్టింది .పక్కనే పడుకున్న పార్వతి చేత్తో తట్టింది . అయినా యేడుపు ఆగలేదు . "ఆదిత్యా ఒరేయ్ ఆదిత్యా లే చెల్లాయిని చూస్తూ వుండు , పాలు కలుపుకొస్తాను . అంటూ పార్వతి ఆదిత్యను లేపింది .
బద్ధకం గా కళ్ళునులుపుకుంటూ మంచం దిగి చెల్లాయి పక్కన కూచుని కళ్లుమూసుకునే 'జో జో ' అంటున్నాడు .
ఆదిత్య చెయ్యి తగలగానే చిన్నారికి ఏమర్ధమయ్యిందో కానీ యింకా బిగ్గరగా యేడవడం మొదలు పెట్టింది .
"ఏం చేసావురా వెధవా దాన్ని !!గిచ్చావా ? సరిగా పట్టుకో " అని పార్వతి వంటింట్లోనించే ఆదిత్య ని కసిరింది .
"అమ్మా నేనేం చెయ్యలేదమ్మా అదే నన్నుచూసి యేడుస్తున్నది " ఆవులిస్తూ అన్నాడు ఆదిత్య .!
మొత్తానికి పార్వతి వచ్చి పాపాయి నోటికి పాలసీసా అందిచ్చింది .
ఆదిత్య మళ్ళీ లేచి మంచం మీద పాడుకోబోయాడు ,యింతలో "ఒరేయ్ తెల్లారిందిరా !!!యింకా పడకేమిటి ?లే ,మంచినీళ్లొస్తున్నాయి ,పంపుకింద బకెట్ పెట్టు పాపాయికి పాలు పట్టి వస్తాను " అని పార్వతి అరిచింది .
" నాకు నిద్ర వస్తోంది అమ్మా "అంటూ గొణిగాడు .
" నిద్రలేదు ,గిద్ర లేదు !ఫో "విసుక్కుంటూ కసిరింది పార్వతి .
తప్పదురా అనివిసుక్కుంటూ బద్ధకం గా లేచి వెళ్లాడు ఆదిత్య .
"ఇంటికి పెద్దవాడివి !అంతమాత్రం అమ్మకు సాయం చెయ్యకపోతే ఏలారా ' అంటూ ఆదిత్య నాన్న రామేశం అరుపులు . ఈ అరుపులకు తమ్ముడూకూడా లేచాడు . వాళ్లు కవలపిల్లలు .
"ఒరేయ్ ఆదిత్య బుజ్జోడు లేచాడు ,బకెట్ పంపుకిందపెట్టి అమ్మదగ్గరకు వెళ్లు " నాన్న కేకలు !
అసలు తనెందుకు చెయ్యాలి యివన్నీ !! నాన్న చెయ్యెచ్చుగా !! నాన్న నీళ్లు పట్టొచ్చుగా గొణుక్కున్నాడు ఆదిత్య .
అమ్మదగ్గరికి వెళ్లాడు . పార్వతి వాణ్ణి వుంచి బుజ్జోడికి పాలుకలిపి తెచ్చింది .
మళ్లీ నాన్న అరుపులు . "ఒరేయ్ ఆదిత్యా స్నానం అయ్యిందా ?దేవుడికి దణ్ణం పెట్టుకున్నావా ?"
" లేదు నాన్నా ఇప్పుడె వెళ్తున్నాను " అన్నాడు ఆదిత్య ,.
"ఎప్పుడో లేచావు ! ఏం చేస్తున్నావురా !1బద్ధకం ఎక్కువయ్యిందిరా నీకు !!రెండు తగిలిస్తే కానీ దారికి రావు " రామేశం విసుగుతో కసిరాడు ,.
తను అమ్మ చెప్పినట్టు పొద్దుటినించీ చేస్తూనే వున్నాడు కదా !బద్ధకం అంటాడేమిటి నాన్న !యేమిటో అమ్మా నాన్నా యెప్పుడూ కసురుకోవడమే ! అదేమంటే ' ఇంటికి పెద్దవాడివి ' అంటారు .
ఆదిత్య స్నానం దేవుడికి దణ్ణం పెట్టుకుని వచ్చేటప్పటికి అమ్మ వంట చేసేసింది . గబగబా తినేసి లంచ్ బాక్స్ బాగ్ లో పెట్టుకుంటున్నప్పుడు లెక్కల హోంవర్క్ గుర్తుకొచ్చింది . వెంటనే చెయ్యడం మొదలుపెట్టాడు . అప్పటికే 8. 30 దాటింది . .
"ఇప్పుడు గుర్తుకొచ్చిందా హోంవర్క్ ? నిన్నంతా గాడిదలు కాసావా !!" అమ్మా నాన్నా కూడబలుక్కుని కేకలేస్తున్నారు . ఇంకా తెలుగు పద్యం నేర్చుకోలేదు ,బళ్లో దెబ్బలు తప్పవు అనుకుంటూ ఆదిత్య బడికి వెళ్లాడు .
ఎంత వేగం గా నడిచినా బడికి వెళ్లేటప్పటికి ప్రేయర్ అయిపొయింది . ఆలస్యం అవుతే హెడ్మాస్టరుగారు బెత్తం పట్టుకుని రెడీ గా వుంటారు . దెబ్బలు తప్పవు అనుకున్నాడు .
"ఆదిత్యగారూ ఏం నాయనా గాడిదలకు పళ్లు తోమొచ్చావా ?స్నానం కూడా చేయించొచ్చావా !!నీకు అసలు బుధ్హి లేదురా " అంటూ చేతిమీద గట్టిగా బెత్తం దెబ్బలు వేసారు హెడ్మాస్టరుగారు .
దెబ్బలబాధకు కాళ్ళు తుడుచుకుంటూ తన క్లాసులోకి వచ్చాడు . లెక్కల మేష్టారు సీతారాం గారు లోపలికి రమ్మని సైగ చేసారు . అయన అప్పుడే బోర్డు మీద లెక్క చేస్తున్నారు . క్లాసులో మిగతా పిల్లలంతా ఆదిత్యను చూసి వేళాకోళం గా నవ్వుతున్నారు .
అకారణం గా దెబ్బలు ,నిష్కారణం గా చివాట్లు !క్లాసులో వెక్కిరింతలు !! ఛీ ఛీ అసలు తనెందుకు పుట్టాడు !!యెక్కడికైనా దూరం గా పారిపోవాలి !!బడి వదిలారు . కానీ యింటికి వెళ్లాలనిపించడం లేదు . మళ్లీ అక్కడా చీవాట్లూ పనులే !! దోవలో ఒకచెట్టు కింద ఆదిత్య కూర్చుని ఆలోచిస్తున్నాడు .
ఇంట్లో పని తనెందుకు చెయ్యాలి ?యెప్పుడు చదువుకోవాలి !చదువుకోకపోయినా ,హోంవర్క్ చెయ్యకపోయినా ,నేర్చుకోకపోయినా ,ఆలస్యం గా వెళ్లినా దెబ్బలూ ,వెక్కిరింతలూ !ఆదిత్య దృష్టిలో అందరూ తనల్ని అనవసరం గా విసుక్కుంటున్నారు ,దెబ్బలు వేస్తున్నారని అనుకుంటున్నాడు . చివాట్లు ,తన్నులు యెంతకాలం !!యెక్కడికైనా పారిపోవాలి !!ఆదిత్య చిన్నిబుర్రలో బోలెడు ఆలోచనలు !!
"బాబూ ఆదిత్యా యిక్కడ ఏం చేస్తున్నావు ?ఆలస్యమైతే అమ్మా ,నాన్నా కంగారు పడతారు . చీకటిపడుతోంది వెళ్లు "అంటూ ఆదిత్య పెద్దనాన్న ఆదిత్యను అనుమానం చూస్తూ ప్రశ్నించాడు .
అంతే !!!ఆదిత్యకు వుప్పెనలాగా దుఃఖం ముంచుకొచ్చింది . భోరున యేడ్చేసాడు .
"పెద్దనాన్నా "అంటూ ఆయన్ను చుట్టేసుకున్నాడు .
.
"పెద్దనాన్నా నాకే అన్ని పనులూ యెందుకు చెప్తారు ??పని సరిగా చెయ్యకపోతే పొతే తన్నులు !!నేను సరిగా చదవలేకపోతున్నాను . హోంవర్క్ చెయ్యలేకపోతున్నాను . అందుకే నేను యింటికీ వెళ్ళను ,బడికి వెళ్ళను "అంటూ పెద్దగా యేడ్చేసాడు ఆదిత్య .
పెద్దనాన్న బిత్తరపోయాడు . ఆదిత్యను దగ్గర తీసుకున్నాడు .
""అమ్మా ,నన్న నీ మంచికోరేవాళ్లు రా !నువ్వు యెలా ప్రవర్తిస్తే ని తమ్ముడూ చెల్లాయి అలాగే ప్రవర్తిస్తారు ! అందుకే అమ్మా ,నాన్నా నిన్ను సరిగా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు . నువ్వు యింటికి పెద్దవాడివి . పెద్దయ్యాక వాళ్లను నువ్వేగా చూడాలి !నువ్వు తెలివికలవాడివి . నువ్వు రాలేదని వాళ్లు యెంత కంగారు పడుతున్నారో పద "అంటూ ఆయన ఆదిత్యను యింటి దగ్గర దిగబెట్టారు .
వీధిగుమ్మం దగ్గరే నిలబడ్డ పార్వతీ ,రామేశం ఒక్కసారిగా ఆదిత్యను కౌగలించుకుని ముద్దులు పెట్టేసారు .
"ఎందుకురా లేట్ అయ్యింది ?చూడు అమ్మ నీకోసం యిందాకటినించీ యేడుస్తూనే వుంది "అంటూ రామేశం తన కళ్లల్లో నీళ్లతో ఆదిత్యను ముద్దు పెట్టుకున్నాడు .
అమ్మా ,నాన్నా ముద్దులతో ఆదిత్యకు యేదో హాయి ,యేదో భద్రత ఆదిత్యకు అనిపించింది . ఏదో తృప్తి !!నిజమే !అమ్మా ,నాన్నకు నేనేగా పెద్దవాడిని !1అవును యింటికి పెద్దవాడిని . హాయిగా నవ్వుతూ అమ్మా నాన్నల వొళ్లో గువ్వలా ఒదిగిపోయాడు .

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు