దిలీప్ తన ఊరికి వస్తున్నానని ఉత్తరం వ్రాసాడు. ఆ ఉత్తరం చదువుతూ కసిగా పళ్ళు కొరుక్కుంది సుందరి. "ఇప్పుడెందుకు వస్తున్నాడు? అసలు ఇంకా నాతో ఇతనికి ఏమిటి పని?" అనుకుంది.
ఎర్రబడిన ముఖంతో రకరకాల మనోభావాలతో రగిలిపోతున్న సుందరిని చూసి "ఏమే నీ మిత్రుడు ఈసారి ఏంరాసాడు?" అని అడిగింది సీమ. ప్రసార మాధ్యమాలతో వ్యాపారం చే సే సుందరి స్వంత సంస్థ లో ఉన్నత సలహాదారు మాత్రమే కాక సుందరి చిన్ననాటి స్నేహితురాలు కూడా కావటం వలన సీమ కి ఆఫీస్ తో పాటు కాక సుందరి తాలూకు వ్యక్తిగత విషయాలూ తెలుసు.
దిలీప్ రెండు రోజులకొకసారి ఇమెయిల్ లో స్కాన్ చేసిన ఉత్తరం పంపిస్తాడు. అతనికి ఇప్పటికీ ఉత్తరాలు రాసే అలవాటు ఉండటం వలన ముందు ఉత్తరం స్వహస్తాలతో రాసి ఆ ఉత్తరాలని స్కాన్ చేసి పంపిస్తాడు. ఆ ఉత్తరాలలో వాళ్లిద్దరూ ఇక్కడ కలిసి ఉన్నప్పటి జీవితంలోని జ్ఞాపకాలు తలుచుకోవడం తప్ప మరేమీ ఉండేది కాదనీ అతను దూరదేశాలకి వెళ్ళాక సుందరిలో అసహనం మరింత పెరిగిందనీ ఈ ఉత్తరాల వలన ఆమె బాధ ఇంకొంచెంపెరగటం తప్ప ఆమెకి ఏమీ స్వాంతన చేకూరటం లేదని ఆమెకెంతో సన్నిహితమైన సీమ కి తెలుసు.
సీమ ప్రశ్నకి సమాధానంగా "వాడు ఇక్కడికి వస్తాడట" అని కసిగా అంది సుందరి.
"నిజమా? అది మంచి విషయమే కదా?" అంది సీమ.
సుందరి తన తల కొట్టుకుంది. "ఎందుకు ఇతను నన్ను హింసిస్తున్నాడు?" అని మనసులోనే అనుకుంటుంటే "ఎందుకే అంత కోపం? అతను వస్తే ముఖం మీదే అన్నీ మాట్లాడుకోవచ్చు కదా?" అంది సీమ.
"నా నెత్తి. అతనితో ముఖాముఖీ కొత్తగా మాట్లాడుకునేదేముంది? ఇన్నేళ్లు ఇక్కడే ఉన్నాడు కదా? ఏడాది క్రితమే కదా వెళ్ళింది?" అరిచినట్టు చెప్పింది సుందరి.
"అదీ నిజమే" నిట్టూర్చింది సీమ. సుందరి మానసిక పరిస్థితి చూసి మౌనంగా ఉన్న సీమతో మళ్ళీ సుందరే అంది "వచ్చినప్పుడు నా ఇంట్లోనే ఉంటాడట" అంది.
సుందరి తో ఇంత వరకూ జరిగిన అనుభవాలతో సీమ ఎక్కువ మాటాడకుండా "అలాగా?" అని ఊరుకుంది.
"అతని సొంతిల్లు అనుకున్నాడా? ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి?" అని మళ్ళీ పళ్ళు కొరికింది సుందరి.
సీమ అవున్నిజమే అన్నట్టు హు అని నిట్టూర్చి అక్కడనుంచి తన సీట్ దగ్గరికి వెళ్ళింది.
దిలీప్, సుందరి, సీమ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. సుందరి ఎదురింట్లోనే ఉండే దిలీప్ తండ్రి బొగ్గు గనులలో పనిచేసే ఒక దిగువ మధ్య తరగతికి చెందిన వాడయితే సుందరి వాళ్ళ నాన్న ఆర్థికంగా ఒకటి రెండు మెట్లు పైన ఉండేవాడు. ఆ అంతరం పట్టించుకోకుండా పెద్ద వారిద్దరూ స్నేహంగా ఉండటంతో సుందరి దిలీప్ ల మధ్య కూడా స్నేహం పెరిగింది. తండ్రితో పాటు బొగ్గు గనులలో సాయం చేస్తూ చదువుకుంటున్న దిలీప్ స్వతహాగా చాలా భావుకుడు.
వాడి చదువు వాడు చదివేసుకునేవాడు గానీ మామూలు వ్యవహారాలకి సంబంధించిన అంశాలలో సుందరి సాయం లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేకపోయేవాడు. ఎప్పుడు మొదలయ్యిందో గుర్తు లేదు గానీ తనకి తెలిసినంత వరకూ దిలీప్ ఒక్క సారి కూడా కనీసం ప్రయత్నం కూడా చెయ్యకుండా తన వ్యవహారాలన్నీ సుందరికి వదిలేసే వాడు. చిన్నప్పుడే వాడి చదువులో భాగంగా బడిలో ఎన్నో రకాల లావాదేవీలు తమ చేత చేయమని టీచర్లు చెప్పినపుడు వాడికి ఏంచెయ్యాలో తెలిసేది కాదు. బాంకుకి వెళ్లి ఒక చలాన్ కట్టి రమ్మని గురువుగారు అడిగితే అందరూ చకచకా చేసుకు వచ్చేసేవారు. వీడు మాత్రం సుందరి దగ్గరికి వచ్చేవాడు. సుందరి కూడా వాడి వయసు లోనే ఉన్నా పెద్ద ఆరిందాలా వాడిని తీసుకెళ్లి వాడిచేత ఒక్కొక్క పనీ చిలక్కి చెప్పినట్టు చెప్పి చేయించి ఆ చీటీని గురువుగారికి ఇప్పించేది. తపాలా కార్యాలయానికి వెళ్లి రకరకాల తపాలా బిల్లలకి డబ్బులిచ్చి సరైన చిల్లరతో రావటం ఒక పరీక్షయితే వాడికి ఎంత డబ్బులివ్వాలి ఎంత చిల్లర తెచ్చుకోవాలి లెక్కలు తెలిసినా ఆ పని చేసుకురావటం మాత్రం తెలిసేది కాదు. మళ్ళీ మామూలే. "సుందరీ! ఇదేదో చేసి పెట్టు" అని తనువచ్చేవరకూ ఆమె ఇంటి అరుగు మీద కూర్చునే వాడు. "సుందరీ. ఈరోజు గురువుగారు రకరకాల పప్పులు తెచ్చుకురమ్మన్నారు. నాకు కూడా నువ్వే తెచ్చేయ్" అనేవాడు. వాడు చెప్పాడు కనుక తన ఇంట్లోంచి రకరకాల పప్పులు వాడికోసం కూడా పొట్లాలు కట్టి ఇస్తే వాడు గురువుగారికి తన వంతుగా చూపించేవాడు. మెల్లిగా ఇంటర్మీడియట్ పరీక్ష కి కావలసిన అప్లికేషన్ నింపటం అతనికి కావలసిన సర్టిఫికెట్లు వగైరా సద్దుకుని అతని చేత సబ్మిట్ చేయించటం ఆ తర్వాత ఇంకా ఇంకా పెద్ద పనులలో కూడా సుందరే వాడి బాధ్యత తీసుకోవటం జరిగిపోయాయి.
అలా అని వాడు తెలివి తక్కువ వాడేమీ కాదు. చదువులో ఎప్పుడూ మొదట ఉండే వాడు. ఎవ్వడికైనా సాయం చేసేవాడు. డబ్బు కి సంబంధించని విషయాలలో వాడు అందరికీ సహాయం చేసేవాడు. పెద్ద చదువుల్లో వర్క్ షాప్ అనీ వేరే ప్రాక్టికల్స్ లోనూ వాడు తన క్లాసుమేట్ లందరికీ సాయం చేసేవాడు. చెక్కలని కోసి కుర్చీగానో బల్లగానో చేసే లాంటి పనులు వాడు అందరికంటే ముందే పూర్తి చేసి మరో ఇద్దరు ముగ్గురికి చేసి పెట్టేవాడు. తండ్రితో పాటు వృత్తి పనులు చేసిన అనుభవం వాడికి బాగా పనికొచ్చేది. అందుకు ప్రతిఫలంగా కొందరు ఏమయినా ఇచ్చే ప్రయత్నం చేస్తే తీసుకునేవాడు కాదు. "నాకు కూలీ ఇవ్వకండిరా." అనేవాడు. సాయం చేసే ఆ గుణం కూడా వాడితోనే పెరిగి వాడి సమర్ధత పెరిగినకొద్దీ ఇంకా ఇంకా సహాయం చేస్తూనే వుండే వాడు. ఇవన్నీ ఎలా చేసినా తనకి సాయం కావాలంటే మాత్రం దిలీప్ చేరేది సుందరి దగ్గరికే.
వారిద్దరి స్వచ్ఛమైన స్నేహం వారితో పాటే పెరిగి ఇంకా ఇంకా గాఢంగా మారి ప్రతితోజూ దిలీప్ సుందరిని చూడకుండా రోజు గడిపేవాడే కాదు.
చదువు పూర్తయ్యి దిలీప్ కి ఒకేసారి అయిదు చోట్ల ఉద్యోగాలు వస్తే అందరూ ఆరోజులలో కథలుగా చెప్పుకున్నారు. బెంగుళూరులో పనిచేయవలసిన ఉద్యోగం అన్నివిధాలా ఆకర్షణీయంగా ఉన్నా దిలీప్ విశాఖలోనే తన తండ్రి ఉద్యోగం లో చేరిపోయాడు. సుందరి దగ్గరికి వచ్చి తన నిర్ణయాన్ని చెప్తూ "సుందరీ! నా చదువు కథ ముగిసింది. ఇక ఉద్యోగంతో కొత్త జీవితం" అన్నాడు.
సంభాషణ కొనసాగిస్తూ "నేనే ఆయన ఉద్యోగంలో చేరితే తప్ప నాన్న ఆ ఉద్యోగం మానరు. ఆ బొగ్గుల మధ్య పని చేసి చేసి ఆయన ఆరోగ్యం పాడయిపోతోంది. నే ఉద్యోగంలో చేరితే తప్ప నాకెక్కడా ఉద్యోగం రావటం లేదని ఆయనకి చెప్పాను సుందరీ" అన్నాడు. విశాఖలో ఆ ఉద్యోగం అంత డబ్బు సంపాదించగలిగేది కాదు. పైగా దేశవాళీ సంస్థ కావటం వలన ఆ సంస్థ నుంచి విదేశాలలో పని చేసే అవకాశం రానే రాదు. ఇంత దిక్కుమాలిన నిర్ణయం ఎందుకు తీసుకున్నావురా అని వాడి స్నేహితులు వాడిని మందలిస్తే "ఇక్కడయితే మనందరం కలిసి ఉంటాం కదురా" అని నవ్వేసాడు. అతను చెప్పిన రెండు కారణాలూ అతని నిర్ణయానికి కారణం కాదని సుందరి కి తెలుసు. అతను సుందరిని వదిలి ఎక్కడికో వెళ్లి బతకలేడు.
మరి ఆ తర్వాత దూర ప్రదేశాలకి (ఒక్కడే) వెళ్లిపోవాలని ఇంత సులువుగా నిర్ణయం తీసుకుని ఎలా వెళ్లిపోయాడో ఇప్పటికీ ఆమెకి అర్ధం కాలేదు. కరెంటు బిల్ ఎలా కట్టాలో తెలియని ఈ మనిషి ఎక్కడికో పోయి స్వతంత్రం గా బతకగలడా? అనుకున్న సుందరికి అదొక పెద్ద షాక్.
***
సుందరి ఇంకా ఆలోచనలలో ఉండగా సీమ తన హ్యాండ్ బాగ్ తో వచ్చి "నేనిక ఇంటికి వెళ్తాను" అంది.
"వెళ్ళిపోతున్నావా? దిలీప్ కి పెంకుటిల్లు సిద్ధం చెయ్యమని బహదూర్ కి చెప్పావా?" అని అడిగింది సుందరి.
సీమ నిర్ఘాంతపోయి "నువ్వేదో కోపంగా ఉన్నావు కదా అతన్ని ఇంకెక్కడో ఉండమంటావేమో అనుకున్నా" అంది.
"నా మొహం. ఆ విషయం అతను వచ్చాక తేల్చుకుంటాం. వచ్చిన వెంటనే ఎక్కడ ఏడుస్తాడు?" అంది సుందరి బింకంగా.
"నువ్వు నాకు అర్ధం కావే తల్లీ" అంటూ బంగాళా వెనక పెంకుటింటిని సిద్ధం చెయ్యమని ఆ ఇంటి కాపలాదారు బహదూర్ కి ఫోన్ లో చెప్పటానికి మళ్ళీ లోపలికి వెళ్ళింది సీమ.
దిలీప్ జీవితంలో చిన్నప్పటి నుంచి సుఖం గానీ శాంతి గానీ ఎప్పుడూ లేవు. అతను స్కూల్ కి వచ్చే ముందర ఇంటి పక్కన తోటలో పుల్లలేరి నీళ్లు కాస్తాడు. తర్వాత గంజి వార్చి వారానికి రెండు సార్లు బట్టలు ఉతికి చుట్టుపక్కల కాలనీలలో పాలు సరఫరా చేసి అప్పుడు స్కూల్ కి వస్తాడు. ప్రతిరోజూ ఆలస్యంగా వస్తే మాస్టారు గవర్రాజు గారి శిక్షాస్మృతి ప్రకారం మోకాళ్ళ మీద మొదటి క్లాసంతా కూర్చోవటం అతనికి అలవాటే. వాడు శుభ్రమైన బట్టలేసుకుని తలకి నూనె రాసుకుని రావటం లేదని మంచి అలవాట్లు నేర్చుకోవటం లేదని బెన్హర్ టీచర్ రోజూ వాడి చేతులు కాయలు కాసేలా బెత్తంతో కొట్టేవారు. ఎన్ని జరిగినా వాడి కంట్లోంచి ఒక్క చుక్క వచ్చేది కాదు. వాడి స్నేహితుడు బలరాం ఒకసారి "నీకు నెప్పి ఉండదేమిటిరా?" అని అడిగితే "నేను చేస్తున్నది తప్పే కదురా!తప్పు చేసినపుడు శిక్ష అనుభవించేస్తే ఎంతో తెరిపిగా ఉంటుంది" అన్నాడు. "సాయంత్రం కూర్చుని ఓ నాలుగు మంచి పాటలు పాడేసుకుంటే కథ మారిపోతుంది" అంటాడు.
వాడికి పాటంటే ప్రాణం. ఇంట్లో రేడియో కూడా ఉండక రోడ్డు పక్కన ఎక్కడ పాటలు వినపడితే అక్కడ నుంచుని వింటూ నచ్చిన పాటల సాహిత్యం రాసుకునేవాడు. స్కూల్ లంచ్ టైం లో సుందరీ సీమా బలరాం దిలీప్ కొంత దూరం నడుస్తుండేవారు. మొదట్లో వీడి వ్యవహారం తెలియక వాడు తమతోనే ఉన్నాడనుకుని వాడితో మాట్లాడుతూ కొంత దూరం నడిచాక వాడు మాయమయ్యాడని గ్రహించి గతుక్కుమన్నారు. అక్కడా అక్కడా వెతుక్కుంటూ వెనక్కి వచ్చి చెన్నకేసు హోటల్ దగ్గర నోరు వెళ్ళబెట్టుకుని బాలు గారి ఒక మంచి పాట వింటూ ఏదో లోకంలో ఉన్న దిలీప్ ని చూసి హమ్మయ్య వీడెక్కడా తప్పిపోలేదు అని ముందు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత పాటలకోసం లోకాన్ని మరిచిపోయే వాడి పాటల పిచ్చికి మురిపంగా భళ్ళుమని నవ్వుకున్నారు. "నువ్వే సైకిల్ మీద పోతున్నపుడో పాత వినిపిస్తే పడిపోతావు రా" అని వేళాకోళం చేసేవారు. ఎప్పుడైనా క్లాస్ టీచర్ రాకపోతే దిలీప్ ని బల్లెక్కించి ఒక్కొక్కడూ వాళ్లకి ఇష్టమైన పాటని అడిగి పాడించుకునేవారు.
రోజూ గవర్రాజు మాస్టారి దగ్గర ఆలస్యంగా వచ్చినందుకూ బెన్హర్ టీచర్ దగ్గర సరైన బట్టలు వేసుకోవనందుకూ దెబ్బలు తింటూనే పెరుగుతున్న దిలీప్ మీద చివరికి కంప్లైంట్ వెళ్ళింది. ఇక తప్పదని వాడి తల్లి స్కూల్ కి వచ్చింది. ఇద్దరూ టీచరులూ ఒకేచోట ఉండగా వారి దగ్గరికి వచ్చి "అయ్యా! ఈ వయసుకి వాడిని కూలి పనిలో పెట్టి మరిన్ని కాసులు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్న మేము వాడి మంచి కోసం పళ్ళబిగువున చదివిస్తున్నాం. కానీ వాడికి నూనెలూ పౌడర్లూ కూడా కొనాలంటే మేమంత డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితిలో లేము బాబూ!" అని ఏడిచింది. ఆవిడ చెప్పిన మాటలు విని గవర్రాజు గారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగి "వాడికి క్రమశిక్షణ తప్పుతోందని బాధతో వాడిని శిక్షిస్తున్నాను గానీ ఇప్పుడు నా తప్పు తెలిసిందమ్మా. వాడికి అభిమానం చాలా ఎక్కువ. శిక్ష అనుభవించేవాడు తప్ప ఎప్పుడూ నాకు ఆలస్యానికి కారణం చెప్పలేదు. పేదరికం అన్నింటికన్నా పెద్ద రోగం. ఈరోజు నుంచి మెదటి పాఠం నేనే కొంచెం ఆలస్యంగా మొదలెడతాను. ఏరా పిల్లలూ మీరేమంటారు?" అన్నాడు. పిల్లలంతా బల్లల మీద చరుస్తూ "తప్పకుండా మాస్టారూ" అన్నారు. దిలీప్ అంటే ఇష్టం లేనిదెవరికి?
బెన్హర్ టీచర్ ఆరోజే వాడికి రెండు జతల బట్టలు కుట్టించుకోమని డబ్బులిచ్చి అప్పటినుంచి వాడి తల్లికి ప్రతి రెండు నెలలకీ ఒక కొబ్బరినూనె సీసా ఒక పౌడర్ డబ్బా ఇచ్చేవారు. దిలీప్ కి ఈ విషయం చెప్పద్దని వట్టు పెట్టించుకుని పంపించారు. ఎందుకంటే దిలీప్ ఎవరిదగ్గరా సహాయం తీసుకోవటానికి ఇష్టపడే వాడు కాదు. కేవలం సుందరి మాత్రమే అతనికి స్పెషల్ కనుక అన్ని సాయాలూ ఎంతో హక్కుగా తీసుకునేవాడు.
ఎప్పుడూ చిరునవ్వు చెదరని దిలీప్ జీవితంలో తుఫాను రేగింది. రాత్రి మాములుగా పడుకున్న తల్లి పొద్దున్న లేవలేదు. ఆ రోజు దిలీప్ సుందరి దగ్గరికి వచ్చి "సుందరీ!కథ ముగిసింది. అమ్మ ఇంక లేదు" అంటూ మరో మాట లేకుండా ఎప్పుడూ లేనిది ఆమె వళ్ళో పడుకుండిపోయాడు. ఏంజరిగిందో అప్పటికి తెలియని సుందరి విషయం అడగాలనుకున్నా ఒక్కమాట కూడా చెప్పకుండా దిగులుగా శూన్యంలోకి చూస్తూ తన వడిలో పడుకున్న అతని పరిస్థితి చూసి తను కూడా మౌనంగా ఉండిపోయింది. చెయ్యవలసిన కార్యక్రమాలెన్నో ఉండగా వీడేమయిపోయాడో తెలియని స్నేహితులు వెతుక్కుంటూ సుందరి ఇంటికి వచ్చి విషయం చెప్తే గానీ సుందరికి అతని తల్లి మరణించిందని తెలియదు. వాడి స్నేహితులందరూ వచ్చి ఎన్ని రకరకాలుగా వాడిని ఓదార్చి అంత్యక్రియలని రమ్మంటున్నా దిలీప్ తన వడిలో నుంచి లేవలేదు. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అతనికి ఎంతో దగ్గర స్నేహితుడైన స్ఫూర్తి ఓర్పు నశించి "సుందరీ! వాడికి జరిగిన నష్టం పూడ్చలేనిది. కానీ ఇప్పుడు చెయ్యవలసినది చెయ్యాలి. వాడే చెయ్యాలి. వాడిని ఎలాగోలా తీసుకురా' అని చెప్పి వెళ్లి పోయాడు. నిరాశగా మౌనంగా దిగులుగా తన వళ్ళో పడుకున్న అతనికి ఏమాత్రం భంగం కలగకుండా సుందరి ఎంతో ఓర్పుతో అలాగే కూర్చుంది. దిలీప్ కి దుఃఖం ఉంది కానీ బైటికి రావటం లేదు. అతను ఏడవాలి. ఏడుస్తాడు అని ఆమె అలాగే వేచి ఉంది. మూడు భారమైన గంటల తర్వాత అతను మనసారా ఏడ్చాడు. ఆమె వడిలో కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. అతని ఏడుపు ఆపేవరకూ అతని తల నిమురుతూ ఆమె ఉండిపోయింది. సుందరి అమ్మా నాన్నా చూసి కూడా పరిస్థితి అర్ధం చేసుకుని లోపలికి వెళ్లిపోయారు. వారి మధ్య ఉన్న అనుబంధం తాలూకు తీవ్రత మొదటి సారి అందరూ గ్రహించిన రోజు అది. సుందరి సాంగత్యంతోనే ఎన్నో రోజుల తర్వాత అతను మళ్ళీ మామూలు మనిషయ్యాడు "కథ ఇంకా ఉంది" అని విచారంగా నవ్వేవాడు.
మళ్ళీ అతనికి ఎప్పుడూ తోడుగా ఉండే సంగీతంలో ఉపశమనం తీసుకోసాగాడు. వాడి పాటలు విని వాడి స్నేహితుడు సుబ్బారావు తండ్రి అతనికి ఒక వేణువు కొని ఇస్తే ఎంతో ఉత్సాహంతో సుందరి ఇంటి మేడమీద ఇద్దరూ సాధన చేసి వేణువు ఊడటం నేర్చుకున్నారు. సుందరి తండ్రి ఇంకా కొంతమంది పెద్దలు సంగీతమంటే ఇంత ఇష్టం ఉంటే నేర్చుకోవచ్చు కదా అంటే నవ్వేసి "నేను త్వరగా ఉద్యోగం చేసి సంపాదించాలండి. నాన్నని చూసుకోవాలి" అనే వాడు. అందరి దగ్గరా ఎన్నో పాటలు పాడినా ప్రతిరోజూ తన ఇంటికి వచ్చినపుడు తన దగ్గర మాత్రమే శ్రావ్యమైన వేణుగానం వినిపించేవాడు. ఆ మేడమీదే ఎన్నో మధురమైన సాయంత్రాలలో అతనివేణుగానానికి తన గాత్రం జోడించి ఇద్దరూ ఆ సంగీతంలో మైమరచిపోయేవారు. ఇద్దరూ రేడియో లో ఎన్నో దేశాల పాటలు ఏవి బావున్నా విని ఆస్వాదించేవారు. ఆ పాటలనే తన గానంతో మళ్ళీ సృష్టించి మధురమైన అనుభూతులు పొందే వారు. వేణువు విషయంలో దిలీప్ గీసుకున్న పరిధులు అందరికీ తెలుసు కనుక మొదట్లో వాడిని వేణువు వాయించమని అడిగిన వాళ్ళు కూడా తర్వాత అడగటం మానేసి వాడి పాటలు మాత్రమే అడిగి వింటుండేవారు. వేణువు మాత్రం సుందరి కోసమే. విదేశాలకి వెళ్తూ అతను ఆ వేణువు సుందరి కిచ్చి వెళ్ళిపోయాడు.
తన తో ఇంత సన్నిహితంగా ఉన్నవాడు తనకి చెప్పవలసిన ఆ ఒక్క ముక్కా ఎందుకు చెప్పలేదు? అహంకారమా? భయమా? ఆ మాట కొస్తే ఎప్పుడైనా నాతో ఒక్క మాట కృతజ్ఞతగా అన్నాడా? ప్రతి పనినీ నేనేదో స్వంతమనిషిలా నాకప్పజెప్పి వెళ్లిపోయేవాడు. ఒక్కసారి కూడా నువ్వు నా తోడుగా లేకపోతే నేనేమయిపోయేవాడిననే విషయం వప్పుకున్నాడా? పైగా నీతో నాకేంటి పని అని ఎక్కడికో ఒక్కడూ వెళ్ళిపోతాడా? అక్కడ తన పనులు ఎలా చేసుకుంటున్నాడట ? తనే చేసుకునే టట్టయితే ఇంతవరకూ చేసుకోగలిగీ నన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకున్నట్టేగా ? అసలు తన గురించి ఏమిటా అలుసు?
సమస్య మొదవటానికి ముందు దిలీప్ ఇంటికి రాయటం తగ్గించేసాడు. వచ్చినా పాటలు పాడేవాడు కాదు. నాన్న ఆరోగ్యం బాలేదు. ఏదో ఒకటి చెయ్యాలి అనేవాడు.
"దీనికింత ఆలోచన ఎందుకు? మంచి క్లినిక్ లో చేర్పిద్దాం. నా మనుషులకి చెప్తే అంతా ఏర్పాటు చేసేస్తారు." అంది సుందరి.
దిలీప్ తల అడ్డంగా ఊపుతూ "అదొక్కటే సమస్య కాదు సుందరీ! ఆయన్ని దగ్గరుండి ఎవరు చూస్తారు? నాకు కుదరదు" అన్నాడు.
ఎప్పుడూ తనకి విషయాలు వదిలేసి నిశ్చింతగా ఉండే మనిషి ఇలా మాట్లాడుతున్నాడేమిటి అని అనుమానం కూడా లేకుండా "దాందేముంది ? మంచి నర్సు ని పెడదాం. నేను చూసుకుంటానుగా " అంది.
"అవును" అని తనలోనే గొణుక్కున్నాడు. తర్వాత కూ కూడా ఏదో ధ్యాసలో ఉన్నాడు. కాసేపు అలాగే కూర్చుని "వస్తాను" అని అతను వెళ్ళిపోతే ఆమె ఆశ్చర్యపోయింది. అతనికి ప్రాణమైన సంగీతం గురించి కనీసం చర్చించుకోకుండా అతను వెళ్ళిపోవటం అదే మొదటిసారి. తర్వాత కొన్నాళ్ళు అతను రానేలేదు. ఆమె కూడా తన కంపెనీ పనులలో కొంచెం పని ఒత్తిడి పెరగటం వలన అంత గా పట్టించుకోలేదు. దిలీప్ ఏం చేసినా దిలీప్ తన మనిషేనని ఖచ్చితమైన నమ్మకం.
అతను ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతున్నాడని స్నేహితులు చూచాయగా చెప్పినపుడు సుందరి నమ్మలేదు. అతని వ్యవహారంలో ఒక్కటి కూడా తన సహాయం లేకుండా చేసుకోలేని వాడు తనని తీసుకునైనా వెళ్ళాలి లేదా అసలు వెళ్ళకూడదు అని నమ్మకంగా అనుకుంది. అలా అనే అందరితో ధీమాగా "అతను ఎట్టి పరిస్థితులలోనూ నేను లేకుండా వెళ్ళడు" అని చెప్పింది. ఒక్క రాత్రి ప్రయాణం లో చేరుకోగలిగే బెంగుళూరుకి వెళ్ళటానికే ఇష్టపడని వాడు దూర ప్రదేశాలకి ఎందుకు వెళ్లాలనుకుంటాడు?పైగా నాతొ చెప్పకుండా అంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడా?
కానీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ దిలీప్ తాను దూరప్రదేశానికి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించాడు. అతను ఎలా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియకపోయినా అతను ఖఛ్చితంగా సుందరి తో బంధాన్ని స్పష్టంగా నిర్థారించి ఆమెని తనతో తీసుకుపోతాడని అందరూ సీమతో సహా అనుకున్నారు. పైగా అతని మాటల్లో అతను సుందరి తో ఏవో ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాడని కూడా తెలిసాక అతను చెప్పబోయేది ఏమిటో అందరూ ఊహించుకున్నారు.
సుందరిని కలవగానే తన శైలిలోనే "సుందరీ. దురదృష్టవశాత్తూ ఇక్కడ నా కథ ముగిసింది. నేను దూరప్రదేశానికి వెళ్తున్నాను. కానీ అక్కడ అంతా మన మంచికే అవుతుందని నమ్మకంతో ఉన్నాను" అన్నాడు. అతను తర్వాత చెప్పబోయే విషయం కోసం ఎంతో ఆసక్తిగా సుందరి ఎదురు చూస్తుంటే దిలీప్ తన వేణువు ఆమెకి ఇచ్చాడు.
"బహుశా అక్కడ నాకు వేణువు ఊదటం కుదరకపోవచ్చు. ఇది నా ప్రాణం సుందరీ. నీకు తప్ప ఇంకెవరికీ ఇవ్వలేను" అన్నాడు. అప్పుడు సుందరికి మొదటి సారి అనుమానం వచ్చింది. తాను అతనితో వెళ్లిపోతుందనుకుంటుంటే అతను నాకు అప్పగింతలు చేస్తున్నదేమిటి? అనుకుంది. అయినా ఏదో నమ్మకం. ఆశ.
"ఇంకో విషయం సుందరీ. నాకు మరో దారి లేకపోవటం తో నాన్న ని ఓల్డేజ్ హోమ్ లో చేర్పించక తప్పదు. నువ్వు వెంటనే ఆయన్ని మంచి చోట చేర్పించెయ్యాలి. మనకి వారమే టైముంది" అన్నాడు.
బహుశా తన తండ్రి అక్కడ చేరి కొంచెం సెటిల్ అయ్యేవరకూ తనని ఇక్కడ ఉండమంటున్నాడేమో. అక్కడికి వెళ్లి కొన్నిరోజుల్లో ఇక్కడ అతని తండ్రి తాలూకు విషయంతో పాటు అన్ని వ్యవహారాలూ సద్దుమణిగాక తనని తీసుకువెళ్తానని చెప్తాడేమో అని సుందరి ఆశిస్తుంటే దిలీప్ అతని ఖాతాలన్నటినీ కూడా నిర్వహించమని అందుకు కావలసిన వివరాలూ హక్కుల తాలూకు పత్రాలు ఆమెకి ఇచ్చేసాడు.
ఇదంతా ఎలా చేసాడంటే చిన్నప్పుడు తనకి బళ్ళో పనులు ఎలా అప్పగించేవాడో అంత సులువుగా అంతే హక్కుతో అప్పగించేసాడు. తనని రమ్మని గానీ అక్కడికి వెళ్ళాక తను కూడా రావటానికి ఏర్పాటు చేస్తానని గానీ అనలేదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఆమె, ఆమె తో పాటు ఎందరో స్నేహితులు ఆశిస్తున్నట్టుగా ఎప్పటినుంచో చెప్తాడని ఎదురు చూసే ఆ ఒక్క మాట కూడా చెప్పకుండా అతను వెళ్ళిపోయాడు.
అతను అల్లా వెళ్ళిపోవటం వలన కలిగిన షాక్ కన్నా తనని వెర్రి దాన్ని చేసి ఇష్టం వచ్చినట్టు తన నుంచి మానసికంగా వ్యావహారికంగా కావలసిన సాయం తీసేసుకుని ఇప్పుడు తనని ఫూల్ ని చేసి అందరిముందూ అవమానం చేసాడని ఆమె ఎంతో కుమిలిపోయింది. మానవత్వంతో అతని తండ్రిని ఓల్డేజ్ హోమ్ లో చేర్పించింది. అతను ఏవేవో ఖాతాలు తెరిచి స్వచ్చంద సేవలకు కేటాయించిన వాటితో పాటు అన్నీ ఒక కొలిక్కి తీసుకొచ్చి వాటంతట అవే నడిచేలా ఏర్పాటు చేసింది. అతను చేసిన గాయం మాత్రం ఆమె మనసులో ఉండిపోయింది.
సీమ కి ఆమె అంటే ఎంతో సానుభూతి ఉంది. కానీ తనే సుందరి స్థానంలో ఉంటే "పద అక్కడికి ఇద్దరం వెళదాం." అని తనే మొదటి అడుగు వేసి విషయాన్ని తేల్చేసేది అనుకుంది సీమ. కానీ సుందరి తో ఆ విషయం చర్చించే సమయం కాదనుకుని ఊరుకుంటోంది.
ఎవరి అవసరమూ లేదన్నట్టు వెళ్ళిపోయిన వాడు ఏమీ జరగనట్టు ఇమెయిల్ లో పెద్ద పెద్ద ఉత్తరాలు వ్రాస్తాడు. వాటిలో కూడా పనికొచ్చే విషయం ఒక్కటి కూడా ఉండదు. అతను అక్కడ చేస్తున్న పని గురించి గానీ అక్కడ ఉన్న అవకాశాలు లాంటి విషయాలు ఏమీ ఉండవు. అతను వంద మంది వికలాంగులకు ఎలా సహాయం చేసాడో ఉంటుంది. అతను భారతదేశంలో ఆర్ధిక కారణాల వలనో మరే కారణం వల్లనో వెనక పడిన వారికి ఎలా తర్ఫీదు ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాడో చెప్తాడు. కొత్తగా వస్తున్న సంగీత ఒరవళ్ల గురించి వ్రాస్తాడు. ఇవన్నీ ఇక్కడ కూడా చేసేవాడు.సుందరీ దిలీప్ ఇద్దరూ మాట్లాడుకుని ఎన్నో మంచి పనులు చేశారు.
కానీ దూరంగా వెళ్లిన తర్వాత కూడా తమ జీవితాలకి సంబందించిన అసలు విషయం ఎందుకు ప్రస్తావించడు? అని సుందరి రగిలిపోతూ ఉండేది.
తమ బంధానికి తలిదండ్రులు కూడా అడ్డు చెప్పరని స్పష్టంగా తెలిసినపుడు నాకు విషయం చెప్పటానికి అతనికి ఏమిటి అడ్డు? ఒక ఆడదానిగా మొదటి అడుగు తను ఎలా వేస్తుంది? అక్కడ ఒంటరిగా ఉండి, ప్రతిరోజూ నన్ను చూడకుండా నన్నెంత కోల్పోతున్నాడో ఒక్కసారి కూడా చెప్పలేదు. అసలు తన రోజువారీ పనులు ఎలా నడుపుకుంటున్నాడో వ్రాయడు. "ఇంకెవరో" చేస్తున్నారా అని అనుమానం కూడా సుందరికి ఉంది. ఇదంతా కాక అతను వెళ్లేముందు అందరి ముందూ తను తల దించుకునేలా చేసిన అవమానం తలుచుకుంటే అతన్ని ముక్కలు ముక్కలు గా నరికేయాలనిపిస్తుంది. "ఇంతకింతా ప్రతీకారం తీర్చుకోవాలి." అనుకుంటుంటుంది సుందరి.
***
దిలీప్ ఈరోజు వస్తున్నానని రాసాడు గానీ వస్తున్నది ఏవిమానంలోనో తెలియదు కనుక ఎవరూ విమానాశ్రయానికి వెళ్ళలేదు. అందువల్ల సుందరి అసహనం ఇంకా ఎక్కువయింది. సుందరి మనోభావాలని గమనిస్తూనే ఉన్న సీమ కావాలనే అతని మాట ఎత్తకుండా కంపెనీ విషయాలని అవసరానికి మించి చర్చిస్తూ సుందరి ఆ వ్యవహారాలలో అసలు విషయం మరిచిపోయేలా ఈ ప్రక్రియలోనే తను వేళకి భోజనం చేసేలా నిద్రపోయేలా చూసుకుంది. మధ్యాహ్నం వేళకి దిలీప్ సుందరి పని చేసుకునే గదికే వచ్చేసాడు.
కొంచెం సన్నబడి ప్రయాణం బడలికతో అలసటగా వచ్చిన అతన్ని చూడగానే ఎంత వద్దనుకున్నా ఒక్క క్షణం తన మనసులో కలిగిన చిత్రమైన స్పందనని బలవంతంగా అణుచుకుంటూ "ఓహ్ వచ్చేసావా! ఈరొజేనా నువ్వు రావలసింది?" అంది సుందరి చాలా నిర్లిప్తంగా కనపడాలని ప్రయత్నిస్తూ.
దిలీప్ తన వెలిగిపోతున్న ముఖంతో సుందరి వైపు చూస్తూ "అవును సుందరీ. అక్కడ నా కథ ముగిసింది. ఇంకా అక్కడ ఉండటం వలన ఏమీ ప్రయోజనం లేదు. అయినా నేను ఉత్తరం వ్రాసాను కదా! ముందు మన ఇంటికెళ్లాను. బహదూర్ నువ్విక్కడున్నావని చెప్తే అలాగే వచ్చేసాను " అన్నాడు.
"అయినా ఇమెయిల్ లో కూడా చేత్తో వ్రాసిన ఉత్తరాలు పెట్టి పంపించటమేమిటి ఈరోజుల్లో కూడా? మేమెప్పుడో మానేసాం" అతని ఉత్తరాలేమంత ముఖ్యమైన వేమీ కాదు అని ధ్వనించేలా అంది సుందరి. ఎలాగోలా అతన్ని హర్ట్ చెయ్యాలనే కోరిక అణుచుకోలేకపోతోంది.
దిలీప్ ఎప్పటిలాగే నవ్వేసి "నాకెందుకో ఉత్తరాలే వ్రాయాలనిపించింది. కానీ ఇది కంప్యూటర్ యుగం కదా అందుకని ఆ ఉత్తరాలనే ఇమెయిల్ లో పెట్టి పంపించాను" అన్నాడు.
అతనితో మరేమీ మాట్లాడకుండా నిరాసక్తంగా తన పని లో మునిగిన సుందరి తో "సుందరీ. నేనిక్కడ నెల రోజులు ఉంటాను. మనింట్లోనే ఉంటాను. కొన్ని నెలలు నేను మరిచిపోయిన "పాటు జీవితం గడపాలనుంది." అన్నాడు దిలీప్.
"ఇప్పుడు నీ లొల్లాయి పదాలెవడు వింటాడు?" అని అతన్ని గాయపరచాలని అనబోయిన సుందరి ఒక్క క్షణం ఆగి "ఏదైనా పోటీలో పాడతావా?" అని అడిగింది.
"అబ్బే అటువంటిదేమీ వద్దు" అన్నాడు దిలీప్.
"సంగీతకారుల మధ్య ఒక టీవీ ఛానెల్ లో పోటీ జరుగుతోంది. ఆ పోటీలో నువ్వు పాల్గొనేటట్టయితే మేము వాడుకునే మ్యూజిక్ రూమ్ ఆ పోటీ రోజుల్లో కేటాయిస్తాను. అక్కడ వీడియో ఎదురుగా అన్ని పరికరాలతో పాటు పాట పాడే ఏర్పాట్లుంటాయి" అంది. అతనికి సంగీతం మీద ఉండే ప్రేమ గుర్తొచ్చాక ఆమె మనసులో ఒక ఆలోచన రూపు దిద్దుకుంటోంది.
దిలీప్ సిగ్గుతో తల వంచుకుని "పోటీలవీ ఎందుకులెద్దూ.సరదాగా కొన్ని పాటలు నీతో పాటు పాడుకుంటాను. మనం సాయంత్రాలు హాయిగా అప్పటిలాగా పాడుకుందాం." అన్నాడు.
సుందరి వెంటనే "అదేమిటి? నువ్వెంత బాగా పాడేవాడివో మాకందరికీ తెలుసు కదా! నీ గానం మేమే కాకుండా అందరూ వినాలి. నీ కో గుర్తింపు రావాలి" అంది.
దిలీప్ ఇంకా తల దించుకునే "ఇప్పుడివన్నీ అవసరమా అనిపిస్తోంది సుందరీ. ఈకాసిని రోజుల్లో ఎక్కడెక్కడో ఏంతిరుగుతాం ?" అన్నాడు.
"ఎక్కడికీ తిరగాల్సిన అవసరం లేదు. చెప్పానుగా. నువ్వు మా స్టూడియో నుంచే పాడచ్చు. ప్రస్తుత పరిస్థితులలో పోటీదారులు ఎక్కడినుంచయినా పోటీలో పాల్గొనటానికి నిర్వాహకులు ఇలాంటి ఏర్పాటు చేశారు. నేను చూసుకుంటానుగా" అంది సుందరి ఉత్సాహంగా.
ఎప్పటిలాగే ఆమె కి అన్నీ వదిలేసే దిలీప్ "సరే. అదంతా నువ్వు చూసుకుంటావు కదా. పద ఇంటికి వెళదాం" అన్నాడు.
"నిన్ను మా డ్రైవర్ దింపేస్తాడులే. నాకింకా ఇక్కడ పనుంది పైగా నీ పోటీకి కూడా ఏర్పాట్లు చెయ్యాలి కదా!" అంది సుందరి.
సుందరి అన్నిపనులూ చూసుకుని ఇంటికి వచ్చి తన ఇంట్లోకి వెళ్లకుండా దిలీప్ కి ఏర్పాటు చేసిన అవుట్ హౌస్ వైపు వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి ఇంట్లో దిలీప్ మరొక అమ్మాయితో కూర్చుని ఆ అమ్మాయి తన టాబ్ లో చూసి చెప్తుంటే తను పాడాలనుకునే పాటలకి సాహిత్యం వ్రాసుకుంటున్నాడు.
సుందరిని చూడగానే "పని అయిపోయిందా ? బాగా అలసిపోయినట్టున్నావ్? నేను పల్లవితో పాటు సాధన చేస్తున్నాను"
"ఎవరీవిడ ?" అంది సుందరి దిలీప్ ప్రశ్న కి సమాధానం చెప్పకుండా.
"ఈ అమ్మాయి అక్కడ నాతో పని చేసింది. ఇక్కడ కూడా కొన్ని పనులకి తను సహాయంగా ఉంటుందని తీసుకొచ్చాను" అన్నాడు దిలీప్.
"నేనుండగా నీకు వేరే వాళ్ళ సహాయాలెందుకు ?" అంది సుందరి కటువుగా.
దిలీప్ కొంచెం ఇబ్బందిగా "అది నిజమే గానీ ఇవి నువ్వు చేసేవి కాదు. కొన్ని పనులు తనేచెయ్యాలి సుందరీ. అప్పుడే రోజులో మిగతా టైమంతా మనం వేరే వత్తిడి లేకుండా గడపచ్చు" అన్నాడు.
"ఏమిటో ఆ పనులు?" అని వ్యంగ్యంగా అడుగుతుంటే పల్లవి కల్పించుకుని "ఉద్యోగపరంగా నేను చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయండీ. ఇక్కడికి వచ్చినా ఆ పనులు నేను చేసి పెడతాననే ఖచ్చితమైన ఒప్పందంతోనే ఆయన ఆ ప్రదేశం వదిలి ఇక్కడికి రాగలిగారు" అంది.
తమ సంభాషణలో పరాయి వాళ్ళు కలగజేసుకోవటం పైగా దిలీప్ తన సొత్తు అన్నట్టు అతని తరపున వాళ్ళు సమాధానాలు చెప్పటం చూసి కోపం అణుచుకోలేక సుందరి వడివడిగా వెళ్ళిపోయింది.
నిజం చెప్పాలంటే పల్లవి చూడటానికి కోతికి కొంచెం తక్కువగా ఉంది. ఆవిడ గొంతు దూరంనుంచి వింటే అమితాబ్ మాట్లాడుతున్నాడేమో అనుకుంటాం. ఇది ఇతనికెక్కడ దొరికింది? అది మాత్రమే చేయగలిగిన.... నాకు చెప్పలేనంత రహస్యమైన పనులేమిటి? సెలవులో వచ్చినవాడికి పనేమిటి? పోనీ అతని ఉద్యోగానికి సంబంధించిన పనులైనా అవేమిటో చెప్పకుండా నాదగ్గర కూడా దాచాలా? అని పళ్ళు కొరుక్కుంది.
ఒక గంట తర్వాత కోపం తగ్గి మళ్ళీ అవుట్ హౌస్ వెళ్తే ముందు గదిలో ఎవరూ లేరు. దిలీప్ పడకగది తలుపు మూసి ఉంది. లోపల కూడా ఏమీ శబ్దాలు వినపడటం లేదు. అప్పుడే కొంచెం కోపం తగ్గిన సుందరికి ఇదంతా చూసి మళ్ళీ వళ్లంతా భగభగా మండిపోయింది. తలుపులు బాది వాళ్ళని బైటికి పిలవాలనుకుంటుంటే పల్లవి తలుపులు తెరిచి బైటికొచ్చింది.
బైటే తాటకిలా నుంచున్న సుందరి ని చూసి "అరే సుందరిగారూ! ఎంతసేపయ్యింది వచ్చి?" అంది పల్లవి.
"మీరు ఒక ముఖ్యమైన పనిలో బాగా లీనమై ఉన్న 10 నిముషాల క్రిందట" వెటకారంగా అని "ఏంజరుగుతోంది లోపల?" అని అడిగింది సుందరి.
"అది దిలీప్ ఇక్కడ ఉన్నంత కాలం చెయ్యవలసిన పని. ఇప్పుడే పూర్తి చేసానండీ. రోజూ ఇలాంటివి ఒకటి రెండు ఉంటాయి" అంది పల్లవి.
"తలుపులు వేసుకునే చేయాలా ?" అని మళ్ళీ వ్యంగ్యంగా అంది సుందరి.
పల్లవి ఏమీ ఆశ్చర్యపోకుండా "అవునండీ. కానీ మరీ అంత రహస్యం కాదండీ. అందుకే ఇంటి తలుపులు తెరిచే ఉంచాం" అంది.
పల్లవి ఎంత వినయంగా చెప్పినా కొంచెం వెటకారంగా ధ్వనించిన ఆ మాటకి మరింత వళ్ళుమండిన సుందరి సరైన సమాధానం వెతుక్కుని చెప్పేలోపల దిలీప్ బైటికి వచ్చాడు. చాలా అలసటగా కనిపిస్తున్న దిలీప్ "సుందరీ వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నా. ఒక మంచి పాట సాధన చేస్తున్నాను. నీకు గుర్తుందా ? నీ పుట్టినరోజున నేను కొంచెం మన సంగీత ఛాయలని చేర్చి కూర్చిన ఆఫ్రికన్ పాట. ఇప్పుడు నువ్వొకసారి విని బావుందని చెప్తే నాకు తృప్తిగా ఉంటుంది" అన్నాడు.
అలసటగా ఉన్న అతని ముఖం చూడగానే తన అనుమానం ఇంకా పెరిగి కోపంగా చూస్తున్న సుందరి తో "సుందరీ! నువ్వు లేకుండా దూరంగా ఇన్నాళ్ల పోరాటం తర్వాత నేను సెలవు తీసుకుని వచ్చాను. నాకెంతో ఇష్టమైన జీవితం గడిపి కొన్ని మంచి జ్ఞాపకాలు సృష్టించుకుందామనే ఇక్కడికి వచ్చాను. కలవవలసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నా ఎక్కడికీ వెళ్లదలచుకోలేదు. ఈ నెల రోజులూ నువ్వు ఉద్యోగం పక్కన పెట్టి నాతోనే ఉండు" అన్నాడు దిలీప్.
ఏమాత్రం నాటకీయత లేకుండా నిజాయితీగా చెప్పిన అతని మాటలు వినగానే సుందరి కోపం చల్లారిపోయి "అల్లాగే" అంది. కానీ "తన దగ్గరే ఉండు" అని నన్ను ఆదేశించినట్టే చెప్తాడు గానీ ప్రేమగా అభ్యర్దించడేమిటి? నేనేదో అతని బానిసలాగా?" అని మనసులో బాధ పడింది. ఇతను నాకెప్పటికీ అర్ధం కాడు. అనుకుంది.
***
దిలీప్ పాటల సాధన ప్రారంభమయ్యింది. సుందరి కేవలం అతని పోటీకి కావలసిన ఏర్పాట్ల కోసం తప్ప మరే కారణం కోసమూ అతన్ని వదిలి వెళ్ళలేదు. కానీ ఆమె హృదయం కలుక్కుమనేలా పల్లవి దిలీప్ గదిలో తలుపులు వేసుకోవటం మాత్రం ఎంత సద్దుకుందామన్నా భరించలేక పోయింది. ఆ పని లేనప్పుడంతా ఆ రూమ్ కి తాళం వేసి ఉంచటం మరింత అవమానకరంగా అనిపించింది. కానీ ఖచ్చితమైన నిర్దారణ కి రాకుండా ఒక ప్రశ్నగా మిగిలిపోయిన తమ అనుబంధం అతన్ని నిలదీసి అడిగే హక్కు ఇవ్వకుండా ఆమెని ఆపుతుంటే సుందరి తన మనసులో రగిలిపోతూనే ఉంది.
ఆమె అంతర్మథనం గమనిస్తున్న సీమ ఒకే ఒక్కసారి "నువ్వు ఒక్క సారి అతన్ని లాలించి విషయమేమిటని అడగచ్చుకదా" అంది. అప్పటికే ఉక్రోషంతో రగిలిపోతున్న సుందరి సీమ చెంప బద్దలయ్యేలా చాచి కొట్టింది.
"నీక్కూడా నేనే ఒక బుద్ధిలేని మనిషిలా కనిపిస్తున్నానా? ఒక్కరికి కూడా అతని ప్రవర్తన ఎంత అసహ్యంగా ఉందొ అని అనిపించటం లేదా!" అని అరిచింది.
సీమ మరి మాట్లాడలేదు. నిజానికి దిలీప్ ప్రవర్తన చాలా అన్యాయంగా ఉంది. అయినా అతన్ని చిన్నప్పటినుంచి ఎరిగి ఉండటం వలన సీమ కి ఇంకా కొంచెం సానుభూతి ఉంది. పేద కుటుంబం లోంచి పెరిగి ఎప్పుడూ బెరుకుగా ఉండే దిలీప్ ధైర్యంగా తన మనసు చెప్పలేకపోతున్నా ప్రతీ పనిలోనూ ఆమె తన ప్రాణం అన్నట్టు ప్రవర్తించే దిలీప్ ని ఇంకొంచెం మెత్తగా లాలించి విషయం అర్ధం చేసుకోవాలని సీమ అభిప్రాయం.
ఈ మానసిక సంఘర్షణలతోనే దిలీప్ పాటల పోటీ ప్రారంభమయ్యింది.
దిలీప్ అక్కడ అమర్చిన పరికరాల సహాయంతో తన వంతు వచ్చినపుడు పాడుతుంటే ముగ్గురు న్యాయ నిర్ణేతలు వీడియో ద్వారా అతని పాట విన్నారు. సుందరి తమ స్నేహితులు కొంత మందిని వినటానికి పిలిచింది. వారంతా న్యాయ నిర్ణేతలకి కనపడకుండా తెరవెనక కూర్చున్నారు. పాట పూర్తి కాగానే ఫలితాలు స్టూడియో లో ఉన్న తెరమీద ప్రత్యక్షమవుతాయి. "మీ పాట అద్భుతం" అని ఒక్కరూ "అసలు పాట కన్నా కూడా మీ పాటే బావుంది" అని ఇంకొకరూ పోటీలు పడి దిలీప్ ని మెచ్చుకున్నారు. దిలీప్ కి ఒక్కొక్క కి నిర్ణేత నుంచి పది కి పది మార్కులు వచ్చాయని ప్రకటించగానే అంతవరకూ నిశ్శబ్దంగా అక్కడ కూర్చున్న శ్రోతలు గదంతా మారుమోగిపోయేలా చప్పట్లు చరిచారు.
నూటికి నూరు మార్కులు వచ్చిన బడి పిల్లాడిలా దిలీప్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. సుందరి చెయ్యి పట్టుకుని గట్టిగా నొక్కి "ముగ్గురూ పది మార్కులేశారంటే తర్వాత రౌండ్ కి వెళ్ళిపోతానా సుందరీ ?" అన్నాడు అమాయకంగా.
"అందులో అనుమానమేముంది?" అంది సుందరి.
ఒక చిన్న పిల్లాడికి బహుమతి వచ్చినట్టు పొంగిపోయిన దిలీప్ ఇనుమడించిన ఉత్సాహంతో సాధన కొనసాగించాడు. అతను సుందరితో పాటు పాట సాధన చేస్తున్నా పాడుతున్నా అతని ముఖంలో ఒక చెప్పలేని వెలుగుని సుందరి చూస్తూనే ఉంది. పాత రోజులు జ్ఞాపకమొచ్చేలా దిలీప్ ఎన్నో సాయంత్రాలు తన మధురమైన పాటలతో వేణు గానంతో అలరించాడు.
"ఈ వెలుగు అతనికి ఉద్యోగం వచ్చినపుడు గానీ విదేశాలకి వెళ్తున్నపుడు గానీ లేనే లేదు" అంది సుందరి పక్కనే ఉన్న సీమతో.
గంటగంటకీ మారిపోతున్న సుందరి ఆకారవికారాలతో తికమకపడుతున్న సీమ తన చెంప క్షేమం కోసం మరేం మాటాడకుండా తలాడించి ఊరుకుంది.
దిలీప్ కి ప్రతి పోటీలోనూ పదికి పది మార్కులు వచ్చి పోటీలో ముందుకు సాగుతున్నాడు.
ఎంత సాధన చేసినా తను ఎంత బాగా పాడినా మొదటి ప్రయత్నంలోనే ఇంత గొప్ప విజయాలతో ఎలా ముందంజ వేస్తున్నానని దిలీప్ కూడా ఆశ్చర్యపోతుంటే సుందరి అతని భుజం మీద కొట్టి "దిలీప్ ఒక విషయం గమనించావా? ఈ పోటీ ఫైనల్ నీ పుట్టినరోజునే జరుగుతోంది" అంది.
దిలీప్ "ఓహ్. నిజమే. నేను గమనించలేదు" అన్నాడు.
"ఆ రోజు నీకొక ప్రత్యేకమైన రోజు కావాలి. నాక్కూడా. " అంది సుందరి.
ఆమె పక్కనే ఉన్న సీమ ఆ మాటలు విని ఆశ్చర్యంతో ఒక్క సారి తలెత్తి సుందరి వైపు చూసింది.
"ఎంత విశాల హృదయం దీనిది? మనసులో ఇంత సంఘర్షణ ఉన్నా దిలీప్ సంతోషం కోసమే తాపత్రయ పడుతోంది. దిలీప్ చాలా అదృష్టవంతుడు. కానీ ఇంకా ఆలస్యం చేస్తే అతను అన్నీ కోల్పోతాడు" అనుకుంది.
ఆ పోటీ పూర్తి కాగానే తనే చొరవ తీసుకుని ఈ సమస్యని ఒక కొలిక్కి తీసుకురావాలి అనుకుంది సీమ.
పోటీ ఫైనల్ కి దిలీప్ స్నేహితులందరూ వచ్చారు. వాళ్ళ ఇళ్ళకి దిలీప్ వెళ్లకపోయినా వారంతా వేరేవిధంగా అతన్ని కలుసుకుంటూనే ఉన్నారు.
క్లిష్టమైన ఈ పోటీ కి మరింత శ్రద్దగా ప్రాక్టీస్ చేసిన దిలీప్ తన వంతు రాగానే పాటమొదలు పెట్టాడు. హఠాత్తుగా అతని ముందున్న మైక్ పని చేయటం మానేసింది. అతని పాట వినపడకపోవటం వలన న్యాయ నిర్ణేతలు ఏదో అంటున్నారు కానీ దిలీప్ కి వినబడటం లేదు. ఆ పరిస్థితిలో ఏంచెయ్యాలో అర్ధంగాక దిలీప్ సుందరి వైపు చూసి ఆమె తన స్టూడియో ఉద్యోగుల్ని పిలిచి ఏదో ఒక పరిష్కారం చేస్తుందని నమ్మకంగా చూస్తూ పాట కొనసాగించాడు. అతను తన పాట ఆపి నిర్ణేతల అనుమతితో మైక్ సరి చేసుకోవచ్చేమో గానీ వారు చెప్తున్న మాటలు కూడా వినపడక పోవటంతో అతనికి అలా చేయచ్చో లేదో కూడా తెలియదు. ఇలాగే పాడుతూ పోతే పోటీ ఏమవుతుందో అనే ఆదుర్దాతోనే అతను పాట కొనసాగిస్తుంటే సుందరి అక్కడే తన కుర్చీలో కూర్చుని నింపాదిగా చూస్తోంది. మిగతా వారు నిశ్శబ్దంగా ఉండాలి కనుక వాళ్ళు కూడా కదలకుండా ఆమె ఏదోఒకటి చేస్తుందని ఉత్కంఠ గా ఆమె వైపు చూస్తున్నారు తప్ప ఆమెతో మాటాడలేకపోయారు. దిలీప్ పాట అలాగే పూర్తయిపోయింది.
అంతవరకూ పని చేయని పరికరాలు అప్పుడు పనిచేయటంతో హఠాత్తుగా న్యాయ నిర్ణేతల మాటలు వినిపించాయి. "మీరు ఈ అంశం వరకూ అద్భుతంగా పాడాక ఈ ఆఖరి అంశంలో మీనుంచి మేమెంతో ఆశించాము. కానీ మీ పాట ఒక్క ముక్క కూడా మాకు వినిపించలేదు. మీ పరికరాలు సరిగా లేవని కొంత సమయం తీసుకుని సరి చేసుకోమని మేము చెప్తున్నా మీరు పాట ఆపకుండా కొనసాగించారు. క్షమించండి దిలీప్ గారూ! పోటీ నిబంధనల ప్రకారం మీకు సున్నా కంటే ఎక్కువ మార్కులు ఇవ్వలేము" అన్నాడు ముగ్గురిలో ముఖ్యమైన న్యాయ నిర్ణేత.
అంతవరకూ పనిచేయని పరికరాలు అతని పాట పూర్తి కాగానే ఎలా పనిచేసాయో అని సీమా మిగతా స్నేహితులూ ఆశ్చర్యంగా చూస్తుంటే సుందరి ముఖంలో అప్పుడు నెమ్మదిగా వికసించిన వికృతమైన చిరునవ్వు వారికి కనిపించింది.
"జన్మ దిన శుభాకాంక్షలు దిలీప్" అని పగలబడి నవ్వింది సుందరి.
ఎప్పుడూ చూడని ఆమె ముఖ కవళికలని నిర్ఘాంతపోయి చూస్తున్న దిలీప్ తో "పాటంటే నీకు ప్రాణమనీ అందులోనే నువ్వు అనిర్వచనీయమైన ఆనందం పొందుతావనీ నాకు తెలుసు. పోటీ మీద నీకు లేని ఆసక్తి ని నేనే కలిగించి ఇంత వరకూ వచ్చాక నీలాంటి వాడికి ఏం జరగాలో అదే చేసాను. ఇంతకాలం నాకు కలిగించిన క్షోభకి ఇది జవాబు. ఇక ఆనందంగా వెళ్ళు దిలీప్. నీకు నా శాశ్వతమైన వీడ్కోలు" అని సుందరి కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయింది.
ఆమె మాటలు విని అక్కడ ఉన్న శ్రోతలతో పాటు దిలీప్ నిశ్చేష్టుడయ్యాడు
"సుందరీ. నీకు నామీద కోపం రావటానికి ఎన్నో విలువైన కారణాలు ఉన్నాయని అర్ధమయ్యింది. కానీ అందుకోసం కొన్ని రోజుల ప్రణాళిక వేసుకుని ఎన్నో రకాల ఏర్పాట్లతో ఈరోజు నా మనసు గాయం చేసేటంత కక్ష కలిగేలా నేను నీకు ఏం అపకారం చేసానా అని నేను చాలా బాధపడుతున్నాను. ఏమైనా తప్పు నావైపే ఉన్నపుడు వీలైతే నన్ను క్షమించు" అని చెప్పి అతను కూడా స్టూడియో నుంచి నెమ్మదిగా నడిచాడు.
సీమతో పాటు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఒక్కసారిగా ఎన్నో ఏళ్ల వయసు వచ్చినట్టు కుంగిపోయిన దిలీప్ బలహీనంగా నడుస్తుంటే వెళ్తుంటే అతని జబ్బని పట్టుకుని అతని వెనకే నిశ్శబ్దంగా నడిచిన పల్లవిని ఎవరూ గమనించలేదు.
ప్రతీకారం తీర్చుకున్న విజయ గర్వంతో ఇంటికి వచ్చిన సుందరి ఇంట్లో అడుగు పెడుతూ అనుకోకుండా చూస్తే అవుట్ హౌస్ లో దీపాలు కనపడలేదు. దిలీప్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడని అర్ధం అయ్యింది. అనుకున్నట్టు ప్రతీకారం తీర్చుకున్నాననే సంతృప్తి తో ఉన్న ఆమెకి దిలీప్ అలా సులువుగా వెళ్ళిపోవటం నచ్చలేదు. "ఇక్కడ కూడా ఇంకాస్త దులిపేసి ఉంటె పూర్తిగా తిక్క కుదిరేది కదా! ఇప్పుడు కూడా అతనికి పొగరే అన్న మాట. అవునులే ఆ పల్లవి ఉందిగా అది చూసుకుంటుంది వాడిని" అని కోపంగా అనుకుంది.
ఎన్నో ఏళ్ల క్షోభ మొత్తం ఉపశమనం కలిగాక ఆమె నెమ్మదిగా దిలీప్ గురించి మర్చిపోయి తన దైనందిన చర్యలో మునిగిపోయింది. దిలీప్ స్నేహితులు ఎప్పటిలాగే సుందరిని కలుస్తున్నారు గానీ ఇంతకు ముందులా దిలీప్ ప్రస్తావన ఆమె ముందు తీసుకురావటం లేదు. రెండు రోజులలో ఆమె దాదాపు దిలీప్ ని మరిచిపోయి ఏదో బరువు తీరిపోయినట్టు సంతోషంగా ఉన్నపుడు ఆమె ఊహించని విధంగా సీమ తో పాటు పల్లవి సుందరి దగ్గరికి వచ్చింది.
పల్లవి కనబడగానే పాత కోపాలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. అయినా దిలీప్ ఎంత ఏడుస్తున్నాడో తెలుస్తుందేమో అని మనసులో కసిగా అనుకుని "ఏమిటిలా వచ్చావు? తలుపులు మూసుకుని పని చేసుకోవటానికి ఏమయినా గదులు కావాలా ?" అని వెటకారంగా అంది సుందరి.
పల్లవి కోపం తెచ్చుకోకుండా చిన్న నవ్వు నవ్వి "అతనికి ఏమి అవసరమో ఆ ఏర్పాట్లు ముందుగానే చేశామండీ. పోటీ ఆఖరు రోజున వెళ్ళిపోవటం కూడా మేము ముందుగా అనుకున్నదే" అంది.
"ఆంటే మీరిద్దరూ వేరే పనులు కూడా పెట్టుకుని మధ్యలో కొన్నాళ్ళకి నన్ను వాడుకున్నారా?" అని అరిచింది సుందరి.
పల్లవి తన సహనం కోల్పోకుండా రెండు పెట్టెలు ఆమె ముందు పెట్టి "వీటిని దిలీప్ మీకిమ్మన్నాడు" అంది.
తన ఆవేశం పట్టించుకోకుండా పెట్టేలిస్తుందేమిటని ఆశ్చర్యంగా చూస్తుంటే "మీ ఇద్దరి దృక్పధంలో ఎన్ని తేడాలున్నా ఇద్దరికీ సమానంగా ఇష్టమైనది సంగీతం. అందుకే మీకోసం సేకరించిన ఈ సంపదంతా దిలీప్ మీకిమ్మన్నాడు. మిమ్మల్ని కలవకుండా ఇచ్చి వెళ్లిపోదామనుకున్నాను కానీ సీమ అడిగే ప్రతి ప్రశ్నకీ వివరాలు ఇవ్వలేకపోవటం వలన నేను మీ దగ్గరికి రాక తప్పలేదు" అంది పల్లవి.
ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న సుందరి తేరుకునే లోపల "ఇక వస్తానండి"అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది.
సుందరి కోపంతో సీమవైపు తిరిగి "మా ఇద్దరి మధ్య ఏమిష్టాలు ఉన్నాయో ఏమి లేవో కూడా ఆ మహానుభావుడు ఈవిడ గారికి చెప్పేసాడన్న మాట. నన్నిలా బజారులో పెట్టి ఏం సాధిద్దామనుకున్నాడు ? " అంది.
సీమ మొదటి సారి ఆమె వంక అసహ్యంగా చూసి "ఇద్దరి మధ్య ఎంతో సన్నిహితంగా తేల్చుకోవాల్సిన విషయానికి ఎవరెవరినో పిలిచి వాళ్ళందరి ముందూ అతన్ని అవమానించే ప్రయత్నంలో మీ మధ్య సన్నిహితమైన విషయాలన్నీ బైట పెట్టుకున్నది నువ్వా అతనా?" అంది.
"ఏమన్నావ్?" అని ఆగ్రహంతో వణికిపోతున్న సుందరితో "నన్ను తిట్టటం, నన్ను ఉద్యోగం లోంచి తీసెయ్యటం తర్వాత చేసుకోవచ్చు గానీ అతని ఆఖరి దశలో చూడాలనుకుంటే నీకింకా అతి కొంచెం సమయం ఉంది" అంది.
పిడుగు పడినట్టు వినపడిన ఆ మాటలతో నిశ్చేష్టురాలయిన సుందరి మీద ఏమాత్రం జాలి చూపించకుండా "నీకంతా చెప్పలేను గానీ ఓపికుంటే ఏ కాస్తా విను. పల్లవి అతని వైద్యం కోసం నియమించబడిన మనిషి. అతను దూరప్రదేశమని చెప్పి వెళ్ళినది సిద్దవైద్యం కోసం కేరళకి. విదేశాలకి కాదు. ఆమెని ఇక్కడికి తెచ్చుకున్నది కూడా నీతో గడిపే ఆ కాసిని రోజులూ తన ఊపిరి నిలుపుకోవటానికే. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు కనుక అతని ఆఖరి దశ కొంచెం త్వరగానే వచ్చేసింది. నే చెప్పేది అర్ధమవుతోందనుకుంటా" అంది.
ఏమాత్రం హెచ్చరిక లేకుండా పిడుగు లాంటి నిజం వింటున్న సుందరితో "ఒక మనిషికి మానసికంగా పూర్తిగా దాసోహం కావటం కన్నా గొప్పగా ప్రేమని ప్రకటించే పద్దతి ఇంకొకటి నీకు తెలుసా సుందరీ? మోకాళ్ళ మీద కూర్చుని ఒక గులాబీ పువ్వు ఇచ్చి చవకబారుగా ఐ లవ్ యు అంటేనే ప్రేమా? తల్లి చనిపోతే అతనికి స్వాంతన నీ దగ్గరే కావాలి. తన చివరి రోజులు సంతోషంగా గడపాలనుకుంటే అతనికి గుర్తొచ్చింది నువ్వు. ఇన్ని రోజులు కేరళలో తన పనులు తాను ఏర్పాటు చేసుకోగలిగిన వాడు నీ దగ్గర మాత్రం అన్నీ నీకే వదిలేయటంలో అతను చూపించిన దగ్గరితనం నీకు తెలియలేదా? ఆ మూడు ముక్కల చవకబారు మాటల కోసం ఎదురు చూస్తూ ఆ మాట చెప్పలేదని అతని మీద పగ పెంచుకున్నావు. ఎంతో సున్నితమైన దశలో అతని తోడుగా ఉండవలసినది అతనిని పని కట్టుకుని గాయపరిచావు. ఎప్పుడైనా తన స్వంతమంటూ ఉంటె అది నువ్వే అనే నమ్మకం ఎప్పుడైతే పోయిందో దానితోపాటే అతనికి బతకాలనే కోరికా నశించింది. ఇంకొన్ని రోజులు నడవాల్సిన వైద్యం ఆగిపోయింది. ఇప్పుడు అతని జీవితం గంటల్లో ఉంది సుందరీ" అంది సీమ.
సుందరి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటే అతికష్టం మీద గొంతు పెకల్చుకుని "మనం ఎక్కడికి వెళ్ళాలి?" అంది.
....
వాళ్ళు వెళ్తున్న దారిలోనే సుందరి తన సిబ్బందికి ఫోన్ ఎన్నో సూచనలు ఇస్తూనే ఉంది.
వాళ్ళు ఆస్పత్రికి వెళ్ళేటప్పటికి వందలమంది అతని గది బైట నిల్చున్నారు. లోపల కూడా చాలా మంది ఉన్నారు. ఎప్పుడెప్పుడో అతనినుంచి సాయం పొందినవారితో పాటు అతని చిన్న నాటి స్నేహితులందరూ అక్కడే ఉన్నారు. తనే అందరికంటే ఆఖరు!
"ఇంత వరకూ తన లాంటి రోగులకు తన అనుభవంతో వారికి అనుకూలమైన సలహాలిస్తూ వారికి మానసికంగా కొంచెం తెరిపినిస్తూ గడుపుతున్నతను రోగం విషమించటం వలనఇప్పుడే వాలిపోయాడు. ఇంక నిముషాలలోనే ఉందట" అని ఎవరో అంటున్నారు.
సుందరి కన్నీళ్లతో వింటుండగా ఆమె సూచనలు తీసుకుని అక్కడ కి వచ్చిన ఆమె బృందం తమ వాయిద్యాలు తీసుకున్నారు. ఆమె సూచించిన విధంగా అనుపత్రి అనుమతితో వాళ్ళు దిలీప్ పాడిన పాటలనే మళ్ళీ వాయిద్యాల సహకారంతో వినిపిస్తున్నారు. అతనికి ఎంతో ఇష్టమైన దేశ దేశాల పాటలు ముఖ్యంగా బెంగాల్, ఆఫ్రికా, అరబిక్ సంగీతాలు కూడా మంద్రంగా వినిపిస్తున్నారు.
కళ్ళు మూసుకుని భారంగా ఊపిరి తీస్తున్న దిలీప్ కి ఇదంతా వినపడుతోందో లేదో సుందరికి తెలియటం లేదు. తన ఆర్ధిక పరిస్థితుల వలన సంగీతం పైన ప్రేమని మనసులోనే దాచుకుని కేవలం సుందరికి తప్ప చెప్పుకోని అతని అభిరుచులన్నిటికీ సరితూగేలా సేకరించిన సంగీతాన్ని అతనికి ఎలా అయినా వినిపించాలని ఆదుర్దా గా ఉన్న సుందరి అక్కడే ఉన్న పల్లవి వైపు దీనంగా చూస్తుంటే అర్ధం చేసుకున్న పల్లవి దిలీప్ చెవి వరకూ వెళ్లి నెమ్మదిగా ఏదో చెప్పింది. సుందరి అన్న మాట విని కాబోలు దిలీప్ భారంగా కళ్ళు తెరిచాడు. తన ఎదురుగా సుందరి ని బరువుగా మూసుకుపోతున్న కళ్ళతో చూసాడు. అనుకోకుండా ఆమె ని చూడగానే లోతుగా నీరసంగా సగం మూసుకుని ఉన్న అతని కళ్ళలో ఒక చిన్న మెరుపు లీలగా కనిపించింది. ముఖం లో మరేభావాలు తెలియకపోయినా గదిలో మంద్రంగా వినిపిస్తున్న సంగీతం అతను వింటున్నట్టు అనిపించింది. ఏమీ మాట్లాడలేని నిస్సహాయతతో పల్లవి వైపు తిరిగి చిన్నగా పెదవులు కదిపాడు. అంచెలంచెలుగా పోతున్న ఆఖరు ఊపిరితో శబ్దం బైటికి రాకుండా అతను చెప్పదలచిన విషయం సుందరికి మాత్రమే తెలిసింది.
"కథ ముగిసింది"
ఈసారి పూర్తిగా ముగిసిపోయింది.