సంక్రాంతి పండగ రోజులొచ్చాయి.అగ్రహారం గ్రామం పండగ వాతావరణంతో సందడిగా మారింది. ఇళ్లకు రంగులు సున్నాలు ముగ్గులతో ముస్తాబు చేసారు.బంధువులు కూతుళ్లు అల్లుళ్ల రాకతో ఇళ్లన్నీ కళకళ లాడుతున్నాయి. గ్రామంలో కోడి పందేలు పొట్టేళ్ల పందేలు ఎడ్ల బళ్ల పందేలు, పేకాటలు , హరిదాసులు, గంగిరెద్దుల వారి సన్నాయి వాయిద్యాలు, భోగి మంటలు ఇలా పండుగ వాతావరణంలో భోగి పండగ సంక్రాంతి పండగ అట్టహాసంగా జరిగాయి. గ్రామ సర్పంచి రామయ్య గారిల్లు కూడా బంధువుల రాకతో సంక్రాంతి పండగ సందడిగా గడిచింది. మర్నాడు కనుమ అంటే పశువుల పండుగ వచ్చింది. పాలేరు వెంకన్న దుక్కి దున్నే ఎడ్లతో పాటు పాడి గేదెను శుభ్రంగా నీళ్లతో కడిగి కత్తుల్లాంటి కొమ్ములకు రంగులు పూసి ఊలు పువ్వుల మద్య చిన్న మువ్వలతో అలంకరించి చెట్టు నీడన కట్టి వెళ్లాడు. ఎప్పటిలా పడుకుని మేతను నెమరు వేస్తున్న గేదె నెత్తి మీద కాకి వాలింది. ఐతే రోజూ ఆప్యాయంగా చెవులు ఆడించి చెవి లోని పేలని తినమని తలల ఊపే రెండు డొప్ప చెవులు నిశ్చలంగా కనబడ్డాయి. " ఏమైంది , మిత్రులారా! ఇద్దరూ ఉదాసీనంగా కనబడు తున్నారు. ఏం జరిగింది ఈ పండుగ వేళ ?" అడిగింది కాకి. " ఏం చెప్పమంటావు కాకి నేస్తమా!అందుకే అంటారేమో, ముందొచ్చిన మా చెవుల కన్న వెనకొచ్చిన ఆ కొమ్ములే వాడి అని. కాకపోతే ఏమిటి చెప్పు? ఈ రోజు కనుమ పండుగని ఆ రెండు కొమ్ముల్ని శుభ్రంగా కడిగి రంగులు పూసి కుచ్చు మువ్వలతో ఎంత అందంగా అలంకరించారో చూడు. పుట్టుకతో వచ్చిన మమ్మల్ని పట్టించుకునే నాథుడు లేడు. మాకూ చెవులు కుట్టించ వచ్చుగా" ఆవేదనతో తమ బాధను వెళ్ల గక్కాయి రెండు చెవులు. " మిత్రులారా, అదా మీ ఉదాసీనతకి కారణం? ఇది లోక సహజం! ప్రకృతిలో కొన్ని అంగాలు నామ మాత్రంగా ఉంటాయి. వాటి వినియోగం బయటకు కనిపించవు. ఈ చెట్టునే చూడు, విత్తనం నుంచి మొదట మొలకతో పాటు వేర్లు పుడతాయి. క్రమంగా మానుకట్టి చెట్టుగా ఎదిగితే ముందు వచ్చిన వేర్లు భూములో ఉంటే వెనక వచ్చిన కొమ్మలు ఆకులు పైన హాయిగా ఎండ గాలి అనుభవిస్తున్నాయి. ముందుగా వచ్చిన వేర్లు మట్టిలో చెమ్మలో కుంగుతున్నాయి. కనుక బాధ పడకండి. ఎవరి కర్తవ్యం వారు నిర్వర్తిస్తున్నారు. మీరిద్దరూ ఈగలు దోమలు రాకుండా కాపాడుతున్నారు.అలాగే ఆ రెండు కొమ్ములు గేదెకి రక్షణగా ఉంటున్నాయి." అని వివరంగా హితబోధ చేసింది కాకి. కాకి హితబోధ విన్న రెండు చెవులు మనశ్శాంతిగా ఉన్నాయి. నీతి : దేవుడు మనకిచ్చిన దానితో తృప్తి పడాలి * * *