మేటి దానం - డా. శ్రీదేవి శ్రీకాంత్

Meti daanam

సురేష్...తన భార్య మీనా, ముగ్గురు పిల్లలతో కలిసి సంక్రాంతి పండుగ జరుపు కోడానికి తన స్వస్థలమైన దేవనగరి అనే పల్లెటూరి లో అడుగు పెట్టాడు. ఆ పల్లె ప్రాంగణం లో వున్న చెఱువు నిండు గర్భిణిి లా వుంది. అంత నిండైన చెఱువు ను చూస్తే ఒక్కసారి ఎవరికైనా అక్కడ ఆగి కాసేపు గడపాలి అనిపిస్తుంది. చెఱువు లో అక్కడక్కడా పైకి ఎగిరి మళ్ళీ నీళ్ళల్లో కి వెళ్ళిపోతున్న చేపలు చూడ్డానికి ఆదృశ్యం ఎంతో ఆహ్లాదంగా ఉంది. కారులో కూర్చుని చెఱువు అందం చూస్తున్న పిల్లలు..."నాన్నా! కాసేపు కారు ఆపరూ!" అన్నారు. కారు ఆగింది. "చేపలు చూడండి....పైకి లేస్తూ... మన వూరు వచ్చావా? అని మిమ్మ ల్నే పలకరిస్తున్నాయి" అంది భర్త సురేష్ ను ఉద్దేశించి మీనా నవ్వుతూ. భార్య మీనా వైపు చూసి..."చిన్నప్పుడు ఈ చెఱువు లో ఈత కొట్టే వాడిని మీనూ" అప్పుడున్న చేపల పిల్లల పిల్లలు.. .. .. ఇప్పుడున్న చేపలు. ఎన్నో తరమో ఇప్పుడున్న చేపలది" అన్నాడు పెద్దగా నవ్వేస్తూ. పిల్లలు కారులో నుండి దిగుతూ..."అమ్మా! నువ్వూ దిగూ" అన్నారు. పల్లెటూరు వాతావరణం మీనాకు పెద్దగా నచ్చదు. పిల్లలు సరదా పడుతున్నారు అని దిగింది. "సుందర్ నా బ్యాగ్ లో కూలింగ్ గ్లాసెస్ వున్నాయి తీసుకురా" అంది. పెద్ద కొడుకు సుందర్ "అలాగే అమ్మా!" అంటూ కూలింగ్ గ్లాసులు తెచ్చి ఇచ్చాడు. "నాన్నా! నాకు ఇక్కడ డాన్స్ చెయ్యాలని ఉంది" అంటూ...వత్సల కాళ్లకు గజ్జెలు కట్టుకుట్టూ అంది. అరే శరత్ "నేను డాన్స్ చేసేప్పుడు నువ్వు ...వీడియో తియ్యరా! " అంది తమ్ముడ్ని ఉద్దేసించి. "ఇది నా ప్రియ నర్తన వేళ"...పాటకు తగ్గట్టు.. వత్సల ఆ చెఱువు గట్టున నృత్యం చేస్తూ ఉంది. చెఱువు ఒడ్డున ఉన్న గెరట మల్లె చెట్టు...మలయ మారుతం పలకరింపుతో... కొమ్మా కొమ్మా కూడ పలుక్కుని... గెరట మల్లె పూల... వానతో ఆమెను అభిషేకిస్తున్నాయి. పశువుల కాపరులు, పెరుగు, పాలు, నెయ్యి నెత్తిన పెట్టుకుని వెళుతున్న వారల్లా ఆగి తన్మయం తో వత్సల చేస్తున్న నృత్యాన్ని చూడసాగారు. "ఇక్కడ నీ తకధిములేమిటే?" అంది మీనా కూతురి తో అసహనంగా. మీనా మాటలు పట్టనట్లు...."వత్సలా! ఈ పల్లె ప్రేక్షకులు ....నీ నాట్య చాతుర్యానికి ముగ్ధులవు తున్నారు" అన్నాడు తండ్రి సురేష్ కూతురి నాట్యానికి తన్మయుడై. శరత్ వీడియో తీస్తున్నాడు. అటుగా సైకిలు మీద వెళుతున్న చిన్నబ్బాయ్.. సురేష్ ను చూసి...సైకిలు ఆపి వచ్చి "ఎప్పుడు వచ్చావురా!" అన్నాడు? ఆప్యాయత ఉట్టి పడే స్వరం తో. "ఇప్పుడే రావడం....ఈ చెఱువు తన అందం తో మా అందర్నీ కట్టి పడేసింది" అన్నాడు. చిన్నఅబ్బాయ్, సురేష్ చిన్నప్పుడు ఐదు వరకు అదే వూరిలో కలిసి చదువు కున్నారు. వత్సల నృత్యానికి వాళ్ళ మాటలు ఆగిపోయి...వారి కళ్లు వత్సల నృత్యం పై కేంద్రీకృత మైయ్యాయి. వత్సల నృత్యం చేస్తూ కళ్లు తిప్పుతుంటే చెరువులో చేపలు....ఆ కళ్లల్లో....తమ రూపాన్ని సరిపోల్చు కున్నట్టున్నాయి. అదే కొలనులో దూరంగా ఉన్న తామర పూల రెక్కలు ముసిముసిగా నవ్వుతూ కేరింతలు కొట్టసాగాయి. ఆ చెరువు పై నుండి వస్తున్న మలయ మారుత వీచికలు ఆమె ముంగురలతో సరస సల్లాపాలాడసాగాయి. వత్సల నృత్యం ఆపింది. "నాన్నగారు! నేను ఎన్నో చోట్ల ఇచ్చిన నాట్య ప్రదర్శనలలోని... అభినందనల కంటే అమాయక ఈ పల్లె జనం నా నాట్యానికి ముగ్ధులైన విధం నాకు ఎంతో తృప్తిని ఇచ్చింది. అందుకే ఇకపై పల్లె ప్రజలకోసం నృత్యం చేస్తాను" అంటున్న కూతురి వైపు చూస్తూ...."ఇంకా నయం ఇక్కడే ఉండి పోతాను అనలేదు సంతోషించాను" అంది మీనా. చిన్నబ్బాయ్ ఆ నృత్యం చూసి ముగ్ధుడై ఎంతగానో పొగుడుతూ.. "మన అంకమ్మ తల్లి గుడికాడ భోగిపండుగ రోజు....పిల్లలందరూ డాన్సులు కడతారు.. సురేషూ!....వత్సలతో డాన్సు కట్టించు" అన్నాడు. మీనాకు కోపం వచ్చింది.... "పాప అలా గుడుల ముందు డాన్స్ చెయ్యదు" అంది కాస్త కటువైన స్వరం తో.. సురేష్ వెంటనే అంది పుచ్చుకుని...."గుడి పవిత్ర స్థలం. డాన్స్ చేయడం లో తప్పేమిటి?" అని, చిన్నాబ్బాయ్ వైపు తిరిగి..."చూద్దాం లేరా!" అన్నాడు. "అది సర్లే" అని కాస్త ఆగి..."ఈ చెఱువు ఈ సంవత్సరం నేనే పాడాను రా. నేను ఒక గంటలో మీ ఇంటి కాడకి చేపలు అంపుతాను. బ్రతికున్న చేపల రుచేయేరు. పులుసు పెట్టించు. పెద్దమ్మ బాగానే ఎడద్దిలే... అదిసరే...పట్నం లో బతుకున్న సేదుపరిగెలు దొరకవుగా!....మా ఆవిడకి సెప్పి ఇగురేయించి అంపుతా... పిల్లలకి అరిసెలు, సున్నుండలు తెత్తాను. సాయింత్రం వత్తాలే" అంటూ....వెళ్ళబోతూ ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆగి... "కనుమరోజు మీరంతా మనింటికి తప్పక భోజనానికి రావాలి" అన్నాడు. "అలాగే రా! తప్పక వస్తాము" అన్నాడు సురేష్. మీనా మాత్రం ముభావంగా ఉంది. "మార్కెట్టుకు వెళుతున్నా" అంటూ వెళ్లిపోయాడు చిన్నబ్బాయ్. అతను వెళుతున్న వైపు చూస్తూ.... "ఇతనితో మీకు స్నేహం ఏమిటీ? మీ చదువెక్కడా? ఇతనెక్కడా?" అంది మీనా. "అమ్మా! ఆల్ ఆర్ ఈక్వల్ అని మా టీచరు చెప్పారు. మీకు స్కూల్ లో చిన్నప్పుడు చెప్పలేదా" అన్నాడు శరత్. "ఆ అంకుల్ మనల్ని వదలలేక వదిలి వెళ్ళాడు" అన్నాడు సుందర్. "అన్నయ్యా! అమ్మకు బాగా స్టైల్ గా ఉంటే నచ్చుతారు" అంది వత్సల. "అందరి శరీర భాగాలు ఒకేలా ఉంటాయి, రక్తం అందరికీ ఎరుపే....అమ్మా! ఆ అంకుల్ కి మన మంటే ఎంతో అఫెక్షన్" అన్నాడు సుందర్. మీనా పిల్లల వైపు అసహనంగా చూసింది. సురేష్, 'పిల్లల ముందు ఈ విషయమై చర్చ వద్దు' అని మనస్సుకు నచ్చచెప్పుకుని కారు స్టార్ట్ చేశాడు. *** సుబ్రహ్మణ్యం, శ్రీవల్లీ దంపతులు ...సంక్రాంతికి, కొడుకులు..సురేష్, రాజేష్, రమేష్, కోడళ్లు, కూతుర్లు, అల్లుళ్లు, మనవళ్ళు, మనవరాళ్ళ రాకతో చాలా ఆనందంగా ఉన్నారు. ఆ వయస్సు మళ్ళిన దంపతుల మనస్సుకు పిల్లల రాకే సంక్రాంతి. పిల్లల రాకతో..ఇల్లు కళ కళ లాడుతూ ఉంది. కుటుంబమంతా... సరదాగా సంక్రాంతికి ...ఒక డాక్యుమెంటరీ కుటుంబ సినిమా తీసుకున్నారు. ఇలాంటి వేడుకలు రేపటి తరానికి మన సంస్కృతిని అందించే అపురూప సంబరాలు. సంక్రాంతి కడువేడుకగా జరిగింది. చిన్నబ్బాయ్.. కనుమ పండగ రోజు సురేష్ కుటుంబం తమ ఇంటికి భోజనానికి వస్తుందని ఎంతో హడావుడి చేశాడు. మీనా కు వెళ్ళడం ఇష్టం లేదు. సురేష్, పిల్లలు బలవంతం చేయడం తో మీనా కు వెళ్ళడం తప్పింది కాదు. *** "మణీ.... ఆళ్ళచ్చారు ...బయటికి రా" అంటూ భార్యని పిలిచాడు చిన్నబ్బాయ్. "కాళ్లు కడుక్కోండి" అని బింది లో నుండి నీళ్లు లోటాలో వంపి మీనా కు ఇవ్వబోయాడు. క్యాట్వాక్ చెప్పుల వైపు ఆప్యాయంగా చూసుకుంటూ.......కాస్త వయ్యారంగా రాబోతున్న మీనాకి కాళ్లు కడుక్కోవడం ఇష్టం లేదు. "..........." "ఇంటి ముందు కారెక్కి ఇక్కడ దిగాము. కాళ్లు దుమ్ముగా లేవు" అంది మీనా. సురేష్, పిల్లలు కాళ్ళు కడుక్కున్నారు. "చిన్నోడా! తుండుగుడ్డ తేరా!" అంది మణి కొడుకుని ఉద్దశించి. కాస్త జంకుతూ....వచ్చాడు చిన్న. "అట్ట నిలబడతా వేరా తువ్వాలు ఇవ్వు" అంటూ చిన్నబ్బాయ్ చేస్తున్న హడావుడీ ...పిల్లలు చూస్తున్నారు. భోజనాలు వడ్డించారు. "ఇదుగో నేను ఈ స్టీలు పళ్లాలలో తినను అని తెలుసుగా? చూడండి...ఆ అన్నం వండిన గిన్నె మసితో ఎలా ఉందో? కూరలు జర్మన్ సిల్వర్ గిన్నెల్లో వండారు. వీటిలో వండినవి తింటే జబ్బులు చేస్తాయి" అంది భర్త తో గుస గుస గా.... "........" "మనకి పన్నెండు పాడి గేదలున్నాయి. .ఈ పెరుగు మీ పట్నం లో దొరకదు.. కమ్మగుంటది మీగడ పెరుగు" అంటూ...పెరుగు గిన్నె తెచ్చాడు చిన్నబ్బాయ్. సత్తు గిన్నెలో పెరుగు....మీనా కు చాలా కంపరంగా ఉంది. "ఈ తెల్ల గిన్నెల్లో పెరుగు,కూరలు చేసి నిలవ ఉంచి తినకూడదు" అని పైకి అనేసింది. "అయన్నీ... మా పల్లెటూరు వాళ్లకు పట్టదు. మాకు రాళ్లు తిన్నా కరిగి పోతాయి" అన్నాడు నవ్వుతూ..కల్లా కపటం తెలియని... చిన్నబ్బాయ్. సురేష్ వాళ్ళు బయలు దేర బోతుంటే బట్టలు పెట్టారు చిన్నబ్బాయ్ దంపతులు. *** సురేష్ హైదరాబాదు చేరు కున్నాడు..పిల్లలకు స్కూళ్ళు తెరిచారు. సురేష్ ఆఫీసు పనులలో చాలా బిజీగా ఉంటున్నాడు. "సంక్రాంతి పండగకు పుట్టింటికి వెళ్ళలేక పోయాను....నా ఆడబిడ్డలకు ఉన్న అదృష్టం నాకు లేదు" అంటూ అప్పుడప్పుడూ సురేష్ ను దెప్పుతూనే ఉంది మీనా. ఫోన్ లో తల్లితో రెండు గంటల పైన కబుర్లు చెబుతూ.... లాండ్ లైన్ లో ఫోన్ వచ్చినా...పూర్తిగా కబుర్లలో మునిగిన ఆమె కు ఫోన్ రింగవుతున్న శబ్ధం వినబడలేదు. పని అమ్మాయి పదిసార్లు చెప్పడం తో... పని అమ్మాయిని విసుక్కుని...ఫోన్ తీసుకుని మట్లాడింది. అంతా విని, బయలు దేరుతున్నాను అంటున్న మీనా కళ్లు... అప్రయత్నంగా వర్షిస్తున్నాయి. ఆమె గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తుంది. *** మోహన్ కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. సురేష్ ఆఫీసులో వాళ్లంతా అక్కడే ఉన్నారు. అప్పటికి సురేష్ ను ఆసుపత్రికి తీసుకొచ్చి మూడు గంటలయింది. "మీకు చాలా సార్లు ఫోన్ చేశాను మామ్".... అన్నాడు సురేష్ పర్సనల్ సెక్రటరీ... మీనాను ఉద్దేశించి. మీనా... మౌనంగా విన్నదే కానీ సమాధానం చెప్పలేదు. డాక్టర్లు మీనా ను ఉద్దేశించి. "సురేష్ గారికి గుండె లో ప్రాబ్లం వుంది" అన్నారు. ఆమాట విన్న మీనా గుండెలో దడ మొదలైంది. రాను రాను సురేష్ పరిస్థితి విషమించసాగింది. కృత్రిమ సాధనాల ద్వారా ప్రాణం నిలిచి ఉంది. "త్వరలో గుండె మార్పిడి చేయాలి" అని డాక్టర్లు చెప్పారు. . గుండెను దానం చేసే వారికోసం డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. *** మీనా మెదడు లో ఎన్నో ఆలోచనలు. గతం వైపు ఆలోచనలు వెళ్ళాయి. తనతో పాటు డిగ్రీ చదువుతున్న సురేష్ తో తన పరిచయమల్లా... ప్రేమగా రూపాన్ని దాల్చింది. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. " నువ్వు నా గుండెల్లో గిలిగింతలు పెడుతున్నావు. నా గుండె పానుపులో... శయనించి, ... నన్ను నేనే మరిచి పోయేట్లు చేసేశారు...అమ్మాయి గారు అంటూ... చూడు....నా గుండెలో నీ మల్లెల గుబాళింపులు" అన్న సురేష్ మాటలు మీనా కు పదే పదే గుర్తొచ్చాయి. మీనా ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. మీనా దగ్గరకు తోడికోడళ్ళు ఇద్దరూ వచ్చి... "ధైర్యంగా ఉండు మీనా... ఏ పుణ్యాత్ముడి గుండెనో త్వరలో ఆదేవుడు ప్రసాదిస్తాడు. అంతా సవ్యంగా జరుగుతుంది" అని ఓదార్చారు. *** "పెద్ద డాక్టరు గారు రమ్మంటున్నారు" అంటూ...నర్సు పిలవడంతో... మీనా డాక్టరు చాంబరుకు వెళ్ళింది. "మీనా గారు... గుండె డొనేట్ చేయడానికి ఒక కుటుంబం తమ సంసిద్ధతను తెలియ చేసింది" అని చెప్పారు డాక్టరు. "డాక్టర్ వారి ఔదార్యానికి నేను ఎంతో ఋణ పడి ఉంటాను" అంటున్న మీనా దుఃఖం వరదలైంది. *** ఎంతో మంది ఆసుపత్రి సిబ్బంది....దేహం లేని గుండెను ఐసు భద్రతా పెట్టెలో పెట్టి...అంబులెన్స్ లో పెట్టారు. నాగోల్ లో కాత్యాయని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నుండి అంబులెన్స్ రెండు నిమిషాలలో గుండె తో నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ చేరింది. ఆ గుండెను పదిలంగా మెట్రో రైలులో కి మార్చారు. అక్కడి నుండి యెనిమిది నిమిషాలలో ఇరవై కిలోమీటర్లు పయనించి...జూబ్లీహిల్స్ మెట్రో రైల్వే స్టేషన్ చేరింది. వెంటనే అక్కడ వేచి ఉన్న అంబులెన్స్ లో గుండెను జూబ్లీహిల్స్ లోని మోహన్ కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కి చేర్చారు. ఎంతో మంది వైద్య సిబ్బంది, సాంకేతిక పరిజ్ఞానం గల నిపుణులు... గుండెను జాగ్రత్తగా తీసుకు రావడం లో సహకరించారు. "మెట్రో రైలు లో దేహం లేని గుండె ప్రయాణం" అంటూ..టీవీల్లో వార్తలు. " నలభై ఐదు సంవత్సరాల పరమేష్ ప్రమాదానికి లోనవ్వగా... బ్రెయిన్ హెమరేజ్ అయ్యింది. మృత్యువు ఒడిలో ఒదగబోతున్న పరమేష్... యెనిమిది అవయవాలను దానం చేసి యెనిమిది మంది ప్రాణాలను కాపాడిన పరమేష్ కుటుంబం ఎందరికో మార్గదర్శo. దానాల్లో కెల్లా గొప్ప దానం అవయవ దానం. పరమేష్ కుటుంబ సభ్యుల ఔదార్యం గుణం శ్లాఘనీయం " అని వార్తలు... పదే పదే చూపిస్తున్నారు *** ఆపరేషన్ మొదలైంది. మీనా, పిల్లలు, బంధువులు ఆందోళనగా ఉన్నారు. మనస్సులో దైవ ప్రార్ధన చేస్తున్నారు. ఆరు గంటలు పట్టిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. డాక్టర్లు రోగికి మరో జన్మ ప్రసాదించాము అని సంబర పడుతున్నారు. "సురేష్ గారి ఆపరేషన్ సక్సెస్" మీనా అన్నాడు సర్జన్. మీనాకు, పిల్లలకు, సురేష్ బంధువర్గాల వారి ఆనందానికి అవధులు లేవు. గుండె దానం చేసి తన పసుపు కుంకుమలు నిలిపిన కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లిన మీనా... వాళ్ళ కుటుంబ సభ్యులను చూసి నిర్ఘాంత పోయింది. 'ఆ రోజు భోజనానికి రమ్మంటే.... ఈసడించు కున్నాను. సురేష్ తో చిన్నబ్బాయి గురించి చాలా తప్పుగా మాట్లాడాను' మీనా కు ఆమాటలు గుర్తొచ్చాయి. " మీ భర్త చిన్నబ్బాయే.. ఈ పరమేషా? నా భర్తకు ప్రాణదానం చేసిన పరమేశ్వరుడు". "దానాల్లో మేటి దానం అవయవ దానం" అంది చిన్నబ్బాయి భార్యను ఉద్దేశించి, మీనా. "........" మణి మీనా మాటలు వింది. సమాధానం ఇవ్వలేదు. "మీకు మేమున్నాము. మీ పిల్లలను చదివించే బాధ్యత మాది. మీ గొప్ప మనస్సుకు నేను ప్రత్యుపకారం యేమి చేసినా తక్కువే! నా భర్తకు ప్రాణ దానం చేసిన మీ గొప్పమనస్సును శ్లాఘిస్తున్నాను" అంది. పెద్దగా చదువుకోని చిన్నబ్బాయ్ భార్య... ఏదో చెప్పాలి అనుకున్నా... దుఃఖం ఆమె మాటలు మింగేసింది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు