మార్పు తెచ్చిన పుస్తకం - దార్ల బుజ్జిబాబు

Marpu techchina pustakam

బుజ్జిగాడు 9వ తరగతి పరీక్షలు రాయవలసి ఉంది. మరో నెలలో పరీక్షలు. ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేశారు. పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. రోజు పాఠశాలకు వెళుతూ తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఇంతలో పిలవని పేరంటంలా వచ్చింది కరోనా వైరస్. కోవిద్ 19 అనే వ్యాధిని తీసుకువచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మారణ హోమం సృష్టించింది. ఇది అంటువ్యాధి కావటంతో అందరూ అప్రమత్తమయ్యారు. పాఠశాలలకు సెలవు ఇచ్చారు. పరీక్షలు రాయకుండానే విద్యా సంవత్సరం పూర్తయింది. వేసవి సెలవలు అనంతరం పాఠశాలలు తెరుస్తాం అన్నారు. 5 నెలలు గడిచాయి. ఇప్పటిదాకా తెరవలేదు. ఒకవేళ తెరిచినా మిగిలిన ఈ 5 నెలల తక్కువ వ్యవధిలో పాఠాలు నేర్చుకోవడం కష్టమే. ఈ విద్య సంవత్సరం వృధాగా పోయినట్టే... ఆన్ లైన్ చదువులు అంటున్నారు గానీ అవి చాలా మందికి అందుబాటులో లేవు . ఈ లెక్కన ఈ యాడాది పిల్లల చదువు అటకెక్కినట్టే. బుజ్జిగాడు అసలు పేరు విజయ కుమార్. ఇంటి దగ్గర బుజ్జి అని పిలుస్తారు కాబట్టి బడిలో బుజ్జిగాడు అయిపోయాడు. బాగానే చదువుతాడు గానీ వాడికి బద్దకం ఎక్కువ. బుజ్జిగాడు వేసవి సెలవులు వృధాగా గడిపినా, పై తరగతి చదివిన ఓ విద్యార్థి వద్ద నుండి 10వ తరగతి పుస్తకాలు తెచ్చిపెట్టుకున్నాడు. వాటికి అట్టలు వేసి శుభ్రంగా ఉంచుకున్నాడు. పాఠశాల ఎప్పుడు తెరిస్తే అప్పుడు వెళ్ళటానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. బడులు తెరవలేదు కదా? ఇంటివద్ద ఏమి తోచటం లేదు. ఆటలకు పోదామన్నా తోటిపిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలను పంపటం లేదు. ఒంటరిగా టి.వి. చూడటం తప్ప వేరే వ్యాపకం లేదు. ఇలాంటి వేళలో ఓ స్వచ్చంధ సంస్థవారు ఖాళీగా ఉన్న పిల్లలను సమకూర్చారు. వారికి మంచి మంచి పుస్తకాలు ఉచితంగా ఇచ్చి "పిల్లలూ! ఈ లాక్ డౌన్ కాలంలో మీరెవరు బయట తిరగకుండా చక్కగా చదుకోవడానికి ఈ పుస్తకాలు ఇస్తున్నాం. ఇది ప్రమాద కరమైన అంటువ్యాధి . బయట తిరిగితే మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకుకూడా నష్టమే. కాబట్టి కాలం వృధాచేయకుండా ఈ కథల పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చదువుకోండి" అని చిన్న ఉపన్యాసం ఇచ్చారు. బుజ్జిగాడికి 'నేనే నెంబర్ వన్' అనే పుస్తకం ఇచ్చారు. అది వ్యక్తిత్వ వికాస పుస్తకం. స్వయం కృషితో ఎలా చదవోచ్చో అందులో ఉంది. చదువు పట్ల ఆసక్తి పెంచుకోవడం ఎలా? బద్దకం వదిలించుకోవడం ఎలా? అనే వాటికి ఆ పుస్తకంలో సమాధానం దొరుకుతుంది. ఆ పుస్తకం బుజ్జిగాడికి బాగా నచ్చింది. మొదలు నుండి చివరి వరకు చదివాడు. ఆ పుస్తకం చదివాక వాడిలో చాలా మార్పు వచ్చింది. తానేం కోల్పోయాడో తెలిసింది. ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకుని ముందే తెచ్చిపెట్టుకున్న 10వ తరగతి పుస్తకాలు ముందేసుకుని చడవటం ప్రారంభించాడు. గతంలో చదువు అంటే ఆషామాషాగా ఉండేది. ఇప్పుడు చదువు ఒక యజ్ఞం అని తెలుసుకున్నాడు. ఆసక్తిగా చదువుతూ ఉంటే చదువంత సులువు మరొకటి వుండదని అనుభవ పూర్వకంగా గ్రహించాడు. వేసవి సెలవలు అనంతరం ప్రారంభమైన వాడి చదువు యజ్ఞం దసరా పండుగ నాటికి పూర్తయింది. పొద్దస్తమానం చదువుతూ ఉండేవాడు. ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి అడిగి తెలుసుకుంటూ, అప్పటికే పది పూర్తిచేసిన వారి సహకారంతో, నిముష కాలం కూడా వృధా చేయకుండా చదివాడు. ఇప్పుడు పదో తరగతి పరీక్షలు పెట్టినా ఫస్టు క్లాసులో పాసయ్యేంత జ్ఞానం వచ్చేసింది వాడికి. తోటి విద్యార్థులు మాత్రం పదో తరగతి పుస్తకాలు మొఖం కూడా చూసి వుండరు. చూసారా పిల్లలు! పుస్తకం మనిషిని మారుస్తుంది అనటానికి బుజ్జిగాడే ఉదాహరణ. అందరూ కాలాన్ని కర్పూరంలా కరిగిస్తున్న సమయంలో ఒక పుస్తకం సాయంతో తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నాడు. తానేంటో తెలుసుకున్నాడు. తన ముందు ఉన్న సవాళ్లు గుర్తించాడు. తానొక ప్రత్యేకమైన వాడిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ పుస్తకమే దొరక్కుండా ఉంటే తాను కూడా అందరిలా మాములుగా ఉండేవాడు. అందుకే 'పుస్తకం ఒక నోరు విప్పని ఉపాధ్యాయుడు' అని, 'మార్గం చూపే దిక్చుచి' అని అంటారు. పుస్తకం ఇచ్చిన స్వచ్చంధ సంస్థ వారికి మనసులోనే కృతజ్ఞత తెలిపాడు బుజ్జిగాడు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు