యుద్ధం మూడవనాటికి చేరుకుంది. సూర్యుడు తూర్పు కొండల్లో ఉదయిస్తున్నాడు. రణభూమికి ఆకాశంలో దిద్దిన తిలకంలా వున్నాడు. నేను తలతిప్పి అన్నివైపులకీ చూసాను. కనుచూపుమేరలో అంగుళం భూమి కనపడట్లేదు. నేలను పరుచుకున్నట్లుగా ఉంది ఆ సేనా సముద్రం. కొన్ని కోట్ల మంది. ఎటుచూసినా ఆవేశంతో నిండిన మొఖాలే. ఎవ్వరి చూపుల్లో భయంలేదు. "వీలైనంత మంది శత్రువుల్ని చంపాలి" అన్న కసి, అసహనం తప్ప. ఇంతలో అందరి కళ్ళలో ఆనందం. మా నాయకుడు నీలుడి శంఖనాదం వల్ల వచ్చిందది. చిన్న కొండలాంటి ఎత్తైన ప్రదేశంలో నించొని వున్నాడతను. ఒకచేతిలో పెద్దకత్తి, ఇంకోచేతిలో శంఖం. దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు దక్షిణదిక్కుకి చూపిస్తూ "వీరులారా ఆక్రమించండి"..
ఆ క్షణం సముద్రం కదిలింది. చేతుల్లో కత్తులు, త్రిశూలాలు, గదలు, చెట్లు! ఏది దొరికితే అది తీస్కోని పరిగెడుతున్నాం. ఉవ్వెత్తున లేచిన కెరటాల్లా, వెనక్కిరాని కెరటాల్లా. దూరంనించి అదే వేగంతో వస్తోంది రాక్షససేన..
నేనొక వానరుడుని. నా పేరు సుమనుడు. కిష్కింధ పర్వతదిగువ ప్రాతంల్లో ఉన్న దట్టమైన అడవుల్లో నా నివాసం. నేను, మా అమ్మ. మా నాన్న నా చిన్నప్పుడే మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు. వేరే పర్వతానికి వెళ్లాడని కొందరంటారు. సరిగ్గా తెలియదు. నాకు మా అమ్మే లోకం. చిన్నప్పటినుంచి ఆంజనేయుడి వీరగాథలు చెప్తూ పెంచింది. అంత గొప్పవాడివి కావాలనేది. ఆంజనేయుడు నా ఆరాధ్యదైవం. నాకే కాదు. నా లాంటి చాలామంది వానరులకి. మేము మామూలు వానరులం కాదు. మాది విశిష్టమైన జాతి.ఒక్కక్కరం కనీసం ఎనిమిదడుగుల ఎత్తుంటాం, నల్లటి వెంట్రుకలతో కప్పబడిన శరీరాలతో. పెద్ద చెట్లని వేర్లతో సహా పీకివెయ్యగల బలం. సైనికులం, వీరులం. చిన్నప్పటినుంచి పర్వతరక్షణే ధ్యేయంగా అన్ని యుద్ధవిద్యల్లో శిక్షణ తీస్కుంటాం. మా రాజు సుగ్రీవుడి సైన్యంలో నేనొక సైనికుడిని.
"నరకండి!" ఆలోచనల్ని చీలుస్తూ వచ్చిందా అరుపు. రాక్షసులు దగ్గరగా వచ్చేసారు. రకరకాలుగా వున్నాయి వాళ్ళ శరీరాలు. ఒక కన్ను, రెండు మొండాలూ, నాలుగుకాళ్ళూ ఇలా విచిత్రంగా, అసహ్యంగా వున్నాయి. రాక్షసులంటే వీళ్ళే, ప్రకృతికి విరుద్ధంగా పుట్టి, బతికేవాళ్ళు. శారీరకంగా, మానసికంగా. ఒక రెండు తలల రాక్షసుడు పెద్ద బరిశతో నా మీదికొచ్చాడు. నా ఆరడుగుల త్రిశూలంతో దానికి అడ్డుపెట్టి, రెండో చేతిలో వున్న కత్తితో వాడి మెడ నరికేసాను. పెద్దగా అరుస్తూ, రక్తం చిమ్ముతూ కుప్పకూలిపొయ్యాడు. చుట్టు పక్కల వున్న సైనికులు ఒక్కక్షణం మెచ్చుకోలు చూపుచూసి మళ్ళీ యుద్ధంలో మునిగారు. మొదటి విజయం. వెంటనే నా దగ్గరికే రాక్షసుడూ వచ్చే ధైర్యం చెయ్యలేదు.
దగ్గరిలో వున్న ఒక విరిగిపడున్న రథం మీదకెక్కి చూసాను. రాక్షససైన్యంలో వేల ఏనుగులు, గుర్రాలు, చెట్టంత ఎత్తున్న రాక్షసులూ. మా సైన్యంలో కోతులూ, ఎలుగుబంట్లూ. ఆయుధాల శబ్దాలు, వీరుల అరుపులు, గాయపడిన వారి ఆర్తనాదాలతో నిండిపోయిందా ప్రాంతం.
దగ్గరలో ఒక రాక్షస గుంపు, మధ్యలో మా నాయకుడు నీలుడు. పదడుగుల ఆజానుబాహుడు, రాగి రంగు తోకతో, రెండుచేతులలో కత్తులతో ప్రళయకారుడిలా వున్నాడు. రాక్షసుల చేతులూ, తలలూ తెగనరుకుతున్నాడు. ఆంజనేయుడంతటి వాడిని కాలేకపోయినా, నీలుడి అనుచరుడినవ్వాలని నా కల. అతనికి సహాయం చెయ్యటానికి దగ్గరకి వెళ్ళసాగాను..
************************************
మూడునెలల క్రితం మా అరణ్యంలో పెద్ద సమావేశం. అందరం పర్వతంకింద ఉన్న మైదానంలో నిల్చొనివున్నాం. ఎత్తుగా ఉన్న ఒక గుహ అంచు మీద నుంచొని వున్నాడొక యువకుడు. గోధుమరంగు ఒళ్ళు, ఎర్రటితోక, తలమీద కిరీటం. "ఎవరు?" అనుమానంగా అడిగాను. "అంగదుడు. మన యువరాజు", చెప్పాడు పక్కనున్న కోతి. రాజంటే అలా ఉండాలి. ఎంత హుందాగా ఉన్నాడతను. అంగదుడు గంభీరంగా చెప్తున్నాడు, "మిత్రులారా! మన జీవితాలు ధన్యమయ్యే రోజులు దగ్గర్లోనే వున్నాయి. రాముడు ఒక గొప్ప రాజు, వీరుడు. అతను కొన్నికారణలవల్ల అడవుల్లో గడపాల్సి వచ్చింది. అప్పుడే తన భార్య సీతను ఆ రాక్షసుడు రావణుడు అపహరించాడు. రాముడు సీతని వెతుకుతూ మనకి అతిధిగా వచ్చాడు. దుష్ట వాలిని చంపి.." అనిచెప్పి ఆగాడు. మౌనం. "వాలి అంగదుడి తండ్రే!" ఎక్కడ్నించో చిన్నగా వినపడింది. నా మనస్సు బరువెక్కింది "ఎంత కష్టం ఇతనికి". అంగదుడు మళ్ళీ తేరుకుని "రాముడు మన రాజు సుగ్రీవునికెంతో మేలు చేసాడు. అటువంటి మహానుభావుడి కోసం మనం లంకకి వెళ్ళాలి,యుద్ధం చెయ్యాలి, రావణుడిని చంపాలి, సీతారాముల్ని కలపాలి. దానికి మీరందరి సహాయం కావాలి" నిర్ధిష్టమైన స్వరంతో చెప్పాడు. గొప్ప ఆలోచన. ఉన్నతమైన ఆలోచనలే మహానుభావులని మామూలు వాళ్ళనించి వేరుచెయ్యగలవు. పదవులూ, సంపదలూ కావని అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
ఉత్సాహంగా బయల్దేరింది లంకకి మా వానరసేన. చాలాదూరం ప్రయాణించాం. మధ్యలో అరణ్యాలూ, గ్రామాలూ దాటాం. దారిపొడుగునా మనుషులు మాకు హారతులిచ్చారు, తిలకాలు దిద్దారు. "రావణున్ని చంపికానీ తిరిగిరావద్దని" ప్రార్ధించారు, ఆదేశించారు. రావణుడు ఎంతటి దుష్టుడో వాళ్ళ దీనమైన చూపుల్లో స్పష్టంగా కనపడింది. కొంతమంది తమ తమ ఆయుధాలూ, కత్తులూ ఇచ్చి పంపారు. మార్గంలో సముద్రం అడ్డం వచ్చింది. వారథి కట్టాం, దాన్ని దాటాం. లంకకి చేరాం.
"సుమనా!" మా నాయకుడి అరుపు. వాయువేగంతో పరుగెడుతున్నాడు. ఆశ్చర్యపోయాను. "ఆ వచ్చే రథాన్ని ఆపాలి. దాన్లో ప్రహస్తుడనే రాక్షసుడున్నాడు. నాతో రా!" అన్నాడు. చాలా మంది పరిగెడుతున్నాం అతని వెనక. దారిలో వచ్చే రాక్షసుల్ని చంపుతూ, తోస్తూ, తొక్కుతూ. వాడి రథానికెదురుగా వచ్చాం. నీలుడు పెద్దచెట్టు విసిరాడు ఆ రథం మీదకి. రథసారథి చాకచక్యంగా తప్పించాడు. నేను రెండు గంతుల్లో ఆ రథాన్ని చేరుకొని, ఆ సారథిమీదకి దూకి వాడ్ని కిందకి విసిరేసాను. అప్పుడు చూసాను ప్రహస్తుడిని. ఒకచిన్న పర్వతంలా ఉన్నాడు. కోపంతో రగిలిపోతున్నాడు. వెంటనే మా నాయకుడికి సైగచేసాను. నీలుడు ఇంకో పెద్ద సాలచెట్టు రథంపైకి విసిరాడు. రథం ముక్కలైంది. ప్రహస్తుడు నేలమీద పడ్డాడు. భయంకరమైన యుద్ధం వారిమధ్య. కత్తులూ, చెట్లూ, బల్లాలు అన్నిటితో తలపడ్డారు.ఒకరు సింహమైతే మరొకరు పులి. చివరికి నీలుడు విసిరిన పెద్దకొండతో తలపగిలి చచ్చాడు ప్రహస్తుడు. రాక్షసుల్లో మొదటిసారి భయం కనపడింది.
రావణుడు మనుషులతో, వానరులతో కాకుండా ఎవ్వరివల్లా చావకూడాదనే వరం పొందాడని విన్నాను. అంత చులకన మేమంటే! మనుషుల సంగతి నాకు తెలీదు కానీ ఇలాంటి వానరులుంటారని వాడికి తెలిసుండదు. తెలిస్తే ఏ గాడిదల్నుంచో, గొర్రెలనుంచో మరణం రాకూడదని వరం కోరేవాడు. పాపం సీతాదేవిని తీసుకొచ్చాడు. నాన్నకి దూరంగా మా అమ్మ చాలా కష్టాలు పడింది. ఎవరికీ అలాంటి కష్టాలు రాకూడదు. సీతాదేవికి అసలు రాకూడదు. రావణుడిని చంపాలి. నాలో ఉద్వేగం. "కానీ ఎలా?"
ప్రహస్తుడు పోయాడని తెలిసాక రావణుడు స్వయంగా వచ్చాడని, దారిలో కోట్లమంది మా కోతుల్ని చంపాడనీ చెప్పారు మిగిలిన సేనా నాయకులు.
************************************
ఉన్నట్టుండి దూరంగా ఒకచోట పెద్దసుడిగాలి కనబడింది. భయంకరమైన శబ్దాలూ, మెరుపులూ. "రావణుడక్కడే ఉన్నాడు" - ఇంకో ఆలోచన లేకుండా మా నాయకుడితో పాటు ఆ వైపుగా దూకుతూ, గెంతుతూ వెళ్ళ్తున్నాను. దారిలో ఎర్రటి శవాల గుట్టలు. నేలంతా రక్తం పారుతోంది. మనస్సు చివుక్కుమంది. "ఎవరికోసం ఇదంతా? ఎందుకింత ప్రాణత్యాగం?". మథనం. "ఇది ఒక వ్యక్తి కోసం కాదు. థర్మం కోసం" అంతరాత్మ నుంచి తడుముకోకుండా వచ్చింది సమాథానం.
యుద్ధకేంద్రానికి వచ్చేసాం. రోమాలన్నీ నిక్కబొడుచుకుననే దృశ్యం ఎదురుగా. వజ్రకాయంతో, తెల్లటి తోకతో మెరుస్తున్న వానరుడు. ఒక చేత్తో గద, ఇంకోచేత్తో గొడ్డలి. "ఆంజనేయుడు!" తెలియకుండానే నరాల్లో ఉత్సాహం, ఉద్రేకం.. ఇలాంటి వీరులున్న యుద్ధం ఎక్కడా జరగలేదు, ఇక జరగబోదు. భీకరమైన శబ్దంచేస్తూ ఒక బాణం దూసుకొచ్చి ఆంజనేయుడి రొమ్ములో దిగింది. ఎగిరి పడ్డాడు దూరంలో. బాణం వచ్చినదిక్కుకి చూసి ఒక్క క్షణం స్తంభించాను.ఒక బంగారు రథంపై ఇరవై అడుగుల ఎత్తుతో, బలిష్టంగా, క్రూరంగా కనిపిస్తున్నాడు రావణుడు. కోపంతో తాండవం చేస్తున్న రుద్రుడిలా, అన్నివైపులకీ తిరుగుతూ వేల బాణాలు వేస్తున్నాడు.
హనుమంతుడిని గాయపరిచాడని తెలిసినవెంటనే రావణుడిమీద కోపం ఉవ్వెత్తున లేచింది మా అందరికీ. "చంపండి ఆ రావణుడిని" అంతటా అరుపులు. మా నాయకుడు నీలుడు ప్రచండవేగంతో దూసుకెళ్ళాడు రథం ముందుకి. నాయకుడంటే అదే. అందరికన్నా ముందుండాలి. దారిచూపాలి. నడిపించాలి.
పెద్ద పెద్ద చెట్లు విసురుతున్నాడు, రావణుడి బాణాలకి అవి తునకలౌతున్నాయి. నేను నా ధనుస్సుతో రావణుడి చుట్టుపక్కలున్న రాక్షసులని చంపుతున్నాను. ఆంజనేయుడు లేచాడు. అంత దగ్గరిగా నా దైవాన్ని చూస్తూ మైమరచిపొయ్యాను. కళ్ళుమూసుకున్నాను. తెరిచేసరికి కాంతిపుంజాల్లా ఇద్దరు యువకులు. ఆంజనేయుడు వాళ్ళకి నమస్కరిస్తున్నాడు. గంభీరమైన వదనాలు, దివ్యతేజస్సు. ఇద్దరూ ధనుర్ధారులే. నారవస్త్రాలు. వీళ్ళే రామలక్ష్మణులు. నా జన్మధన్యం. కళ్ళలో నీళ్ళు.
అకస్మాత్తుగా అక్కడున్నవారంతా పైకి చూశారు. రామలక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు. నేనూ పైకి చూసాను. నీలుడు గాల్లోకి ఎగిరాడు. హఠాత్తుగా సూక్ష్మంగా మారిపోయాడు. రావణుడి ధనుస్సుమీదకి, తర్వాత కిరీటం మీదకి దూకాడు. నీలుడికి మాయలు వచ్చా? తను సాక్షాత్తూ అగ్నిదేవుడి కొడుకని చెప్పింది మా అమ్మ. నేను నమ్మలేదు. రావణుడికి కోపంపెరిగి నీలుడితో "ఓ మాయ కోతీ! చాలించు నీ చేష్టలు, నా ఆగ్నేయాస్త్రంతో నిన్నిప్పుడే భస్మంచేస్తాను" అని పెద్దగా అరిచి బాణాన్ని వదిలాడు. సూర్యుడిలాంటి కాంతితో వచ్చిందా బాణం. నీలుడి దేహంలోకి చొచ్చుకు పోయింది. పెద్ద ఎత్తున మంటలు. నీలుడు కాలిపోతున్నాడు. అప్రయత్నంగా నా నోటినుంచి పెద్ద ఆర్తనాదం. కాదు వందల ఆర్తనాదాలు. కన్నీళ్ళ ధారలు. మా నాయకుడు ఇకలేడా? కుప్పకూలి పొయ్యామందరం.మా దీనావస్థని చూస్తున్న రాక్షసులు కూడా మా దగ్గరికి రాలేదు. చంపలేదు. కరుణ.
అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ ఒక్కసారిగా మంటలు తగ్గిపోయాయి. నీలుడు మామూలుగా అయ్యాడు కానీ బలహీనుడయ్యాడు. అమ్మచెప్పింది నిజమే. అతను అగ్నిసమానుడు. నేను పరిగెత్తుకువేళ్ళి తనని నా భుజాలమీద వేసుకుని వెనక్కి తెచ్చాను. మా నాయకుడిని, నా ఆరాధ్యదైవాన్నీ దెబ్బ తీసిన రావణున్ని చంపాలి. ఇంతకన్నా ప్రాణత్యాగం చెయ్యటానికి వీరుడికి మంచి అవకాశం రాదు. ధనుస్సు తీసుకొని రావణుడి రథానికడ్డంగా నిలబడ్డాను. మూర్ఖత్వం అని కొందరనచ్చు, కానీ నాకది వీరత్వం. బాణాలు వెయ్యటం మొదలుపెట్టాను. రావణుడినవి తాకలేకపోతున్నాయి. ఒకేసారి ఏడుబాణాలు వదిలాను. ఒకటి కిరీటానికి తగిలింది. ఇంకో సారి ఎక్కుపెట్టాను. ఎక్కడ్నించో రివ్వున వచ్చిందో శూలం. నా రొమ్ములో గుచ్చుకుంది. దానితో పాటుగా ఇంకో రెండు బాణాలు నా భుజాలని చీల్చాయి. ఆ తాకిడికి దూరంగా పడ్డాను. కళ్ళు మూతపడుతున్నాయి. చివరి క్షణంలో చూసాను..రాముడు. యముడిలాగా కనిపిస్తున్నాడు. తన ధనుస్సునుంచి వర్షంలా వెళ్తున్నాయి బాణాలు రావణుడి వైపు.
నాలో చిరునవ్వు. రావణుడు చస్తాడు. రాముడు తప్పక గెలుస్తాడు. విజయం మనదే. ఇదే ఆ క్షణం.నా జన్మకో సార్థకత. ధైర్యంగా కళ్ళుమూసాను.
"క్షణమైనా చాలు జ్వలిస్తూ బతుకు"..