రామాపురంలో సీతయ్య ఒక చుక్కల ఆవును పెంచుకుంటున్నాడు. ఆ ఆవు పూటకు ఐదు లీటర్ల చొప్పున రెండు పూటలా కలిపి పది లీటర్ల పాలిస్తుంది. అతని భార్య రామమ్మ, వారికి ఒక్కతే కూతురు లక్షి. ప్రతి రోజు రెండు పూటలా పితికిన పాలను ఇంట్లోకి కావలసినవి వాడుకొని మిగతావి సంతలో అమ్ముతాడు సీతయ్య. వారానికొకసారి వెన్నను కూడా అమ్ముతాడు. వారి జీవనాధారం రెండేకరాల భూమి ఆ చుక్కల ఆవు.
లక్షి ఆ ఆవుకు ముద్దుగా పార్వతి అని దూడకు అమ్ములు అని పేరు పెట్టుకుంది. ప్రతి శుక్రవారం ఆ అవుకు ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేస్తుంది.
ఒక సారి రుద్రవరంలో ఉండే సింహాచలం,సీతయ్య ఇంటికి వచ్చాడు.
సీతయ్య, సింహాచలం ఇద్దరు మంచి స్నేహితులు. కుశల ప్రశ్నలు అయ్యాక జీవనం ఎలా గడుస్తుంది అని అడిగాడు. పెరటిలోకి వెళ్లి చుక్కల ఆవును చూపించి రెండు పూటలా కలిపి పది లీటర్ల పాలిస్తుందని ఈ ఆవుతో పాటూ రెండు ఎకరాల భూమి మా జీవనాధారం అని చెప్పాడు.
ఆ ఆవును సింహాచలం ప్రేమగా నిమిరాడు ఆ ఆవు కూడా సంతోషంతో తలను ఊపగానే మెడలోని గంటలు గణగణమని మ్రోగాయి.
“మా ఆవు అంతేరా! మన ఇంటికి వచ్చిన వాళ్లను ఎంతో ప్రేమతో స్నేహం చేస్తుంది” అన్నాడు సీతయ్య.
“నేనూ ఒక ఆవును కొనాలనుకుంటున్నాను మా ఊరికి దగ్గర్లో ఉన్న కొండాపురంలో నెలకొక సారి సంత జరుగుతుంది చాలా ప్రాంతాల నుండి ఆవులు,గేదెలు,మేకలను తెచ్చి అమ్ముతుంటారు” అన్నాడు సింహాచలం. తరువాత భోజనం సమయమయ్యిందని సీతయ్యతో కలిసి భోజనం చేశాక, వెళ్ళి వస్తానని చెప్పి తన ఊరికి బయలుదేరాడు సింహాచలం.
సరిగ్గా ఒక వారానికి సీతయ్య వాళ్ల ఆవు పార్వతిని ఎవరో దొంగగా తోలుకెళ్లారు.ఇంకొకరి ఆవు కూడా కనిపించడంలేదని ఆ ఊరి వారు అనుకోవడం సీతయ్య చెవిన పడింది, వెంటనే ఈ విషయాన్ని తెలిసిన వాళ్ళతో పాటు సింహాచలానికి కూడా తెలియపరిచాడు.
తల్లి కోసం పరితపిస్తున్న దూడ అమ్ములును చూసి లక్ష్మి కన్నీరు మున్నీరయ్యింది. ఆవు దొరుకుతుందని లక్ష్మికి ధైర్యం చెప్పాడు సీతయ్య.
కొండాపురంలో పశువుల సంత పెట్టారని తెలిసి సింహాచలం ఆవును కొనడానికి వెళ్ళాడు. ఆవులను అమ్మే చోట నచ్చిన ఆవుకోసం వెతకసాగాడు. అలా ఒక చోట ఆవులను చూస్తుండగా “అంబా... అంబా” అన్న అరుపుతో పాటూ మెడలో గంటల సవ్వడి వినిపించింది.
ఆ అరుపు గంటల సవ్వడి విన్నట్టుందే అని... అటువైపు చూస్తే అది సీతయ్య ఆవు పార్వతిలా అనిపించింది. సింహాచలం మెల్లగా ఆ ఆవు దగ్గరకు వెళ్ళాడు సందేహంలేదు ఆ చుక్కల ఆవు సీతయ్యదే. అని ఆవు తలను నిమిరాడు అది సంతోషంగా తల ఊపింది.
అమ్మేవాడు అక్కడకు వచ్చి “ఆవు నచ్చిందా? పూటకు ఆరు లీటర్ల పాలిస్తుంది” అన్నాడు.
“అవును ఆవు నచ్చింది... ఖరీదు ఎంత అన్నాడు” సింహాచలం.
“పదివేలు అవుతుంది” అన్నాడు అమ్మేవాడు.
అమ్మేవాడు కచ్చితంగా దొంగిలించిన ఆవులను అమ్ముతున్నాడని సీతయ్య పసిగట్టాడు.
“లేదు ఎనిమిదివేలు చేసుకో” అన్నాడు సింహాచలం.
“సరే ఎనిమిది వేలకే తీసుకో” అన్నాడు వాడు.
“ఒక్క నిముషం నా దగ్గర అంత డబ్బు లేదు సంతలో మరో మిత్రుడు ఉన్నాడు అతని వద్ద నుండి తక్కువైన సొమ్మును తెచ్చి ఈ ఆవును కొంటాను...ఈ ఆవును ఎవ్వరికీ అమ్మకు అన్నాడు సింహాచలం.
“ఓ అలాగే త్వరగా డబ్బు తీసుకురా... ఈ ఆవును వేరే వాళ్ళు కొంటే నీకు కష్టం”
సింహాచలం పక్కకు వెళ్ళి సంతలోని అధికారికి విషయమంతా చెప్పాడు. సింహాచలంతో పాటు అధికారి ఆ ఆవులు అమ్మే దగ్గరకు వచ్చాడు.
అధికారిని చూడగానే ఆవులు అమ్మే అతను కంగారు పడ్డాడు.
“నిజం చెప్పు ఈ ఆవు నీ సొంతమా? ఇది రామాపురం నుండి దొంగతనంగా తోలుకొచ్చింది అవునా... కాదా?” అన్నాడు సింహాచలం.
“నిజం చెబుతావా.. లేక నాలుగు తగిలించమంటావా!” అన్నాడు అధికారి.
“నిజమే ఈ ఆవు అక్కడనుండి తెచ్చిందే” అన్నాడు ఆవులు అమ్మే వాడు.
“ఇంకా ఎన్ని దొంగగా తోలుకొచ్చావో చెప్పు?” అన్నాడు అధికారి.
“రామపురం నుండి ఈ ఆవుతో పాటు మరో ఆవును తెచ్చాను... నావి సొంతంగా నాలుగు ఆవులు ఉన్నాయి.. మిగతా పది దొంగగా తోలుకొచ్చినవే” అని నిజం చెప్పాడు ఆవులను అమ్మేవాడు.
“నీ సొంత ఖర్చుతో ఎవరి ఆవులను వారి గ్రామాలకు పంపు... తరువాత నీకు తగిన మర్యాదలు నా పై అధికారికి చెప్పి చేయిస్తాను” అన్నాడు అధికారి.
సింహాచలం ఆవుతో పాటు అదే గ్రామానికి చెందిన మరొకరి ఆవు కూడా దొరికిన విషయం ఒక మనిషి ద్వారా సీతయ్యకు సమాచారం పంపి ఆవులను దొంగిలించిన వాడే రెండు ఆవులను రామపురానికి చేరుస్తాడని చెప్పించాడు.
సరిగ్గా శుక్రవారం రోజున పార్వతి రామయ్య ఇంటికి చేరింది.
లక్ష్మి ఆనందానికి అంతు లేకుండా పోయింది. పార్వతి ప్రేమగా నాలుకతో అమ్ములును నాకింది. అమ్ములు తల్లి పాలను తనివి తీరా తాగింది.
లక్ష్మి,పార్వతికి స్నానం చేయించి నుదిటి మీద పసుపు, కుంకుమలు రాసి మెడలో పూల దండ వేసి కొబ్బరికాయ కొట్టి ఎంతో మురిసిపోయింది.
ఆ ముచ్చట చూసి సీతయ్య, రామమ్మ ఎంతో సంతోషించారు.