పూర్వం నెమలికన్ను రాజ్యాన్ని కాశీనాధం రాజు పరిపాలించే వాడు. అతని పాలనలో ప్రజలు సుఖ శాంతులతో జీవించసాగారు.
కాశీనాధం పరిపాలనాదక్షత సహించక పోయేవాడు అతని బావమర్ధి సర్పకేతు. రాజ్యాన్ని ఎలాగైనా కబళించుకోవాలని కలలుగనే వాడు. అందుకోసం తాను రచించుకున్న పథకాలలో భాగంగా రాజవైద్యుణ్ణి లోబర్చుకున్నాడు. కాశీనాధం దంపతులకు సంతానం కోసం అన్నట్టుగా నమ్మబలికించి, వారికి సంతానం కలుగకుండా కాషాయాలు తాగించాడు. కాని ‘తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలుచును’ అన్నట్టు వారికి ఆనతి కాలంలోనే పండంటి కుమారుడు జన్మించాడు. విజయుడు అని నామకరణం చేశారు.
సర్పకేతు రాజవైద్యున్ని నిలదీస్తాడు. తనవల్ల తప్పిదం జరుగ లేదని.. ప్రమాణం చేస్తాడు. అయినా ‘ఇల్లు అలుకగానే పండుగ కాదు’ ఇప్పటికీ మించి పోయినదేమీ లేదు. ఎలాగూ రాజదంపతులకు నామీద గురి కుదిరింది గనుక విజయునికి మరి కొన్ని రసాయనాలు తాగిస్తాను. దాని ఫలితాన్ని సర్పకేతు చెవిలో రహస్యంగా చెప్పాడు. సర్పకేతు ముఖం వెలిగి పోయింది. తన మెడలోని రత్నాల హారాన్ని బహుమతిగా ఇచ్చి పని పూర్తికాగానే మరిన్ని వరహాలిస్తానని ఆశ చూపాడు.
ఆరోజు రాజవైద్యుడు, సర్పకేతు తమ పని ప్రారంభిద్దామని రాజసౌధం ప్రవేశించే సరికి రాజు గారితో సంభాషిస్తున్న రమణ మహర్షిని చూసి కంగుతిన్నారు. వారి సంభాషణను రహస్యంగా వినసాగారు.
“ఇది అత్యంత రహస్యం మహారాజా.. మీరు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నారు. అది చూసి ఓర్వలేక కొందరు మీకు సంతానం కలుగకుండా ప్రయత్నాలు చేశారు. కాని మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది. భగవంతుని దయవల్ల యువరాజు జన్మించాడు. అతణ్ణి నిర్వీర్యం చెయ్యాలని కొన్ని దుష్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి నుండి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. నేను మీకొక మాయాఉంగరాన్ని ఇస్తాను. అది చాలా మహిమ కలిగినది. కోరుకున్నది ప్రసాదిస్తుంది కాని దానికి ప్రతిఫలంగా మరేదైనా సంగ్రహిస్తుంది. ప్రజాసంక్షేమ కోసం వినియోగిస్తేనే సత్ఫలితాలనిస్తుంది. స్వప్రయోజనాలకు ఉపయోగిస్తే దుష్ఫలితాలనిస్తుంది. మీరు తప్ప మరెవ్వరూ ప్రజాసంక్షేమం కోసం వాడరని గ్రహించి తెచ్చాను” అంటూ మాయాఉంగరాన్ని కాశీనాధ మహారాజుకు ఇవ్వబోయాడు.
“మునివర్యా.. నాకు ఈ మాయాఉంగరంతో పని లేదు. స్వశక్తి మీద నమ్మకముండాలి గాని ఇలాంటి మాయామర్మాలతో ప్రజలను పాలించడం సముచితము కాదని నా అభిప్రాయం. నా కుమారుడు సైతం నా అడుగుజాడల్లో నడిచేలా తీర్చిదిద్దుతాను. విజయునికి పట్టాభిషేకం చేసి మేము వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాము. నన్ను మన్నించండి” అంటూ సున్నితంగా తిరస్కరించి.. రెండు చేతులా నమస్కరించాడు కాశీనాధం.
“భేష్ మహారాజా!.. నా పరీక్షలో విజయం సాధించావు. అత్యాశాలకు పోయి ఆపదలపాలయ్యే కంటే.. మనస్సాక్షిని నమ్ముకొని మంచి ఆశయాలతో ముందుకు సాగుతూ.. మన లక్ష్యాన్ని సాధించడమే ఉత్తముల లక్షణం.. శుభమగుగాక” అంటూ దీవించి సెలవు తీసుకున్నాడు రమణ మహర్షి.
‘వెదుక పోయిన తీగ కాలికి తగిలినట్టు’ సంబరపడి పోయాడు సర్పకేతు. అనవసరంగా వ్యయప్రయాసాల కంటే.. సునాయాసంగా సింహాసనం చేజిక్కించుకునే ఉపాయం తట్టింది. రాజవైద్యున్ని తిరిగి వెళ్లిపొమ్మన్నాడు. తను మారు వేషంలో రహస్యంగా రమణ మహర్షిని అనుసరించాడు.
రమణ మహర్షి అడవి ప్రాంతం గుండా తన ఆశ్రమానికి వెళ్తుంటే.. హఠాత్తుగా పైన పడి మాయాఉంగరాన్ని సంగ్రహిస్తాడు సర్పకేతు. రమణ మహర్షి సర్పకేతును గుర్తిస్తాడు. లోలోన నవ్వుకుంటూ.. ఆశ్రమానికి దారి తీస్తాడు.
సర్పకేతు చేతివేలికి మాయాఉంగరాన్ని ధరించగానే.. అతని మనసులో ఉన్న కోరికలన్నీ గుర్రాలై దౌడుతీయసాగాయి. ‘వినాశకాలే విపరీత బుద్ది’ అన్నట్టు.. ఆనందంలో అన్నీ మర్చిపోయి, తనకు అప్సరసలాంటి కన్య కావాలని మాయాఉంగరాన్ని కోరుకుంటాడు. వెంటనే దేవకన్యలాంటి కన్య ప్రత్యక్షమవుతుంది. కాని మాయాఉంగరం నియమం ప్రకారం సర్పకేతు నుండి పురుష లక్షణాలను లాగేసుకుంటుంది. దాంతో అతని ముఖ కవళికలు మారిపోయి బృహన్నలగా మారిపోతాడు.
ఊహించని పరిణామానికి సర్పకేతు బిత్తరపోతాడు. తన మీద తనకే అసహ్యమేస్తుంది. చిత్తచాపల్యంతో.. తాను దేశంలో కెల్ల మహా సంపన్నుడిని కావాలని ఉంగరాన్ని కోరుకుంటాడు. మరో క్షణంలో వజ్రవైఢుర్యాలు పొదిగిన భవంతి వెలుస్తుంది. అత్యంత సంబరంతో తన వేషధారణను చూసుకుందామని హాల్లోని నిలువుటెత్తు బంగారు వర్ణపు నగిషీలు కలిగిన అద్దం వద్దకు వెళ్తాడు. అందులో తన ప్రతిబింబాన్ని చూసి కెవ్వుమని కుప్పలా కూలిపోతాడు. మాయాఉంగరం సర్పకేతు అందాన్ని లాక్కొని కురూపిగా మారుస్తుంది.
“అయ్యయ్యో..! ఎంత పనయ్యింది. ఉంగరం ఎదో ఒకటి తీసుకుంటుందంటే అర్థం చెసుకోలేక పోయాను” అని విలపిస్తాడు. మతి మందగించినట్టు.. “నాకు ఏ సంపదా వద్దు” అని మాయాఉంగరాన్ని కోరుకుంటాడు. సంపద సాంతం మటుమాయమవుతుంది. పూర్వస్థితి రావాలని కోరుకోలేదు కనుక కురూపిగానే ఉండి పోతాడు. సర్పకేతు కోరికకు బదులుగా మాయాఉంగరం అతని ఆరోగ్యాన్ని లాక్కుంటుంది. దాంతో సర్పకేతు చిక్కి శల్యమై సరిగ్గా నడువలేక పోతాడు. ‘ఆరోగ్యమే మహా భాగ్యము’ అనే సూక్తి జ్ఞప్తికి వస్తుంది. ఆరోగ్యాన్ని కోరుకోవాలను కుంటాదు. నిలబడే శక్తి లేక ప్రక్కనే ఉన్న బండరాయి మీద చేతులు ఆన్చి కూర్చోబోతాడు. వేలికున్న మాయాఉంగరం కాస్తా జారి బండ ప్రక్కనే ఉన్న పుట్టలో పడుతుంది. పుట్టలో నుండి త్రాచు పాము కోపంగా బయటకు వచ్చి సర్పకేతును కాటేస్తుంది. నోటి నుండి నురగ.. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.. లీలగా రమణ మహర్షి కనబడ్డాడు. రెండు చేతులు జోడించి నమస్కరించడానికి సర్పకేతులో సత్తువ లేకుండా పోయింది.
“సర్పకేతూ.. నీ అత్యాశనే నిన్ను బలితీసుకుంటోంది. విశ్వనాధం మహారాజుకు నువ్వు తలపెట్టబోయే ద్రోహాన్ని పసిగట్టాను. నా పథకం ప్రకారం మాయాఉంగరం వలలో నిన్ను పడవేశాను. దేశానికి కావాల్సింది ప్రజల మేలు కోరే వారు కాని నీలాంటి స్వార్థపరులు కాదు. కోరికలనే గుర్రాలకు కళ్ళెం వేయలేని వారికి నీ చావుతో కనువిప్పు కావాలి. ఈ విషయం లోకానికంతా చాటి చెబుతాను” అంటూ నెమలికన్ను రాజ్యం వైపు దారి తీశాడు రమణ మహర్షి. *