వంశీకి నచ్చిన కథ - నాన్నంటే - ఎ.ఎన్. జగన్నాథ శర్మ

naannamte telugu story

నాన్నంటే ముద్దు! నాన్నంటే మెరుపు! నాన్నంటే స్పర్శ! నాన్నంటే సువాసన!

నాన్నని గురించి నాకంతే తెలుసు. నాకు ఏడెనిమిదేళ్ళ వయసున్నప్పుడు, నాన్న వయసెంతన్నదీ నాకు తెలియదు గాని, నాన్న పొట్టిగా ఉండేవారు. గుమ్మడి గింజలా పచ్చగా ఉండేవారు గావంచాను చుట్టుకొని, పైన లాల్చీ ధరించేవారు.

వేడి శరీరమట! యవ్వనం నాటికే నాన్న తల నెరిసిపోయిందట! అమ్మ చెప్పింది. ఫలితంగా శిరసు మీద మేఘ శకలాల్ని ఉంచుకున్నట్టుగా తెల్ల తెల్లని పొడుగాటి శిరోజాలతో చూడ ముచ్చటనిపించే వారాయన.

నాన్న పుట్టి, కను విప్పి, నాన్నమ్మను చూడనే లేదట! నాన్నమ్మ కనుమూసిందట! తాతయ్య నాన్నను పెంచి, పెద్ద చేశారని అంటుందమ్మ. అమ్మను, నాన్నకి ముడివేసి, తాతయ్య స్వర్గస్తులయ్యారనీ చెప్పింది.

పెళ్లయిన మూడేళ్లకి అక్క పుట్టింది. తరువాత నేను పుట్టాను. నేను పుట్టిన మూడేళ్ల వరకు నాన్న మంచిగా ఉండేవారట! దగ్గరుండి, వ్యవసాయాన్ని చూసుకునేవారట! ఇంటి పట్టునుండే వారట! పెరట్లో పొట్లపాదును వేసేవారట! మల్లె మొక్కలను నాటేవారట! ముద్దబంతి పూల నడుమ, వొద్దికగా నిలిచేవారట!

తరువాత ఏమయిందని అంటే అమ్మ అక్కుళ్ళు బుక్కుళ్ళుగా రోదించడమే గాని, ఏమీ చెప్పేది కాదు. రెట్టించి అడిగితే 'కథ ఏమిటి' అని విసుక్కునేది. నాన్నంటే కథని అమ్మకి తెలియదు పాపం!

వ్యవసాయంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్న వ్యాపారం చేసేవారట! కొండ కోనల్లో నివసించే కోయదొరల నుంచి కరక్కాయలు, ఇండుపిక్కలు, వనమూలికలు, తేనె కొనుగోలు చేసి, ఇక్కడ మా ఊరిలో వాటిని అమ్మజూపేవారట! లాభం సంగతలా ఉంచితే, ఆ వ్యాపార వ్యవహారం వల్ల నాన్ననే, అమ్మ నష్టపోవాల్సి వచ్చిందంటుంది.

నాకు నాలుగేళ్ళు వయసున్నప్పుడు, మా ఇంటి మీదకి ఖాకీ కాకులు దాడి చేశాయట! నాన్నని ప్రశ్నలతో పొడుచుకు పొడుచుకు తిన్నాయట! నాన్న పుస్తకాల్ని ముక్కున కరచి పట్టుకు పోవడమే గాక, నాన్నని చుట్టుముట్టి లాక్కుపోయాయట!

'ఎందుకు లాక్కుపోయాయవి' అనడిగితే కారణాలు చెప్పదమ్మ కన్నీళ్లెడుతుంది.

'పురాణమా! ఏమిటి' అంటుంది.

నాన్నంటే పురాణమని పిచ్చి తల్లికి తెలియదు!

ఆస్తినంతటినీ అమ్మి, కాకుల బారి నుంచి నాన్నని రక్షించుకుందామనుకుందట. అయినా వాళ్ళని సంప్రదించిందట కూడా! కానీ వీలు పడనీయక, కాకి గూడు లోంచి తప్పించుకొని కొండల్లోనికి నాన్న పారిపోయారట! ఓ సంవత్సరకాలం కన్పించనే లేదట! నాకప్పటికీ అయిదేళ్ల వయసట!

బళ్లో వేశారు నన్ను. 'న' కు దీర్ఘమిస్తే 'నా' 'న' కింద 'న' రాస్తే 'న్న' 'నాన్న' అని రాత్రి వేళల అక్క నాకు పాఠాలు చెబుతూంటే ముక్కెగ బీలుస్తూ మవునంగా కరిగిపోయేది.

'అదేం పాఠమే' అనేది.

నాన్నంటే పాఠమని తెలుసుకోలేని వెర్రి బాగుల్దమ్మ!

ఒకానొక రాత్రి నా బుగ్గల మీద పెదవులూనిన స్పర్శ కలిగింది. మరుక్షణంలో గరుకుతనం తగిలి గిలిగింతలొచ్చాయి. కను విప్పి చూద్దునో! అమ్మ హరికేన్ లాంతరు ఎత్తి పట్టి నిలచి కన్పించింది. ఓ పక్క అమ్మ అలా నిలిచి ఉంటే, మరో పక్క పొట్టిగా గుమ్మడి గింజలా పచ్చగా, గావంచాను చుట్టుకుని ఉన్న వేరెవరో నిలిచి ఉన్నారు. నిద్ర చెదిరిపోయింది. లేచి మంచమ్మీద కూర్చున్నాను.

'ఎవరమ్మా' అడిగాను. జవాబు చెప్పలేదమ్మ. చిరునవ్వు నవ్వింది. నన్ను తన వొడిలో కూర్చోబెట్టుకున్నారాయన. 'ఏం చదువుతున్నావు' అనడిగారు.

'ఒకటో తరగతి' అని చెప్పాను.

'వాడికి వారాల పేర్లన్నీవచ్చు' అన్నదక్క.

'నిజమా' ఆశ్చర్యపోయారాయన. కళ్ళు పెద్దవి చేసి, నన్ను మెచ్చుకోలుగా చూశారు.

'చెప్పనా' అడిగాను. ఆయన చెప్పమన్నట్టు తలూపారు.

'ఆదివారమొకటి, సోమవారం రెండు, మంగళవారం మూడు, బుధవారం నాలుగు, గురువారం అయిదు, శుక్రవారం ఆరు, శనివారం ఏడు. ఈ ఏడున్నూ వారముల పేర్లు' వల్లించాను. సంబరపడ్డారాయన. సందిట మరింతగా నన్ను బిగించారు. ముద్దులాడారు. ఆయన పెదవులు గమ్మత్తయిన వాసన వేశాయి. మళ్ళీ మళ్ళీ బుగ్గన ముద్దులిడితే బాగుణ్ణనిపించింది.

అమ్మ వేరుశెనగకాయలు వేచి తెచ్చింది. చేటలో పోసి ఉంచింది. ఇంత బెల్లమ్ముక్కను కూడా చెంతనుంచింది. 'తింటావా' అడిగారాయన.

'అపరాత్రి వేళ తిన్నది, ఆరగించుకోలేడు! వాడికొద్దులెండి' అన్నదమ్మ. వొలిచి, వేరుశెనగ పలుకులు గుప్పిళ్ళుగా ఆయనకి అందించసాగింది. ఓ చేత్తో నా తల నిమురుతూ కూర్చున్నారాయన. నిద్ర కమ్ముకొస్తుంటే ఆయన గుండెలపై వొరిగి వెచ్చ వెచ్చగా నిద్రపోయాను. తెల్లారి లేచి చూసే సరికి ఆయన వల్లో లేను నేను. యథాప్రకారం మంచమ్మీద ఉన్నాను.

'రాత్రి వచ్చిందెవరే' అడిగానమ్మను.

'ఎవరొచ్చారు? ఎవరూ లేదే' అన్నదమ్మ చల్ల చిలికే కవ్వం కోసం వెతుకులాట ప్రారంభించింది.

'పొట్టిగా ఉన్నారు చూడు! నన్నాయన ముద్దు పెట్టుకున్నారు చూడు! నేనాయన వల్లో పడుకున్నాను చూడు, ఆయనొచ్చారు కదే' అంటే...

'కలగని ఉంటావు' అన్నదమ్మ.

'బలే కల' అన్నాన్నేను.

నాన్నంటే కలని అమ్మకి తెలియదు గాక తెలియదు!

ఆ రోజు నన్ను బడికి పంపలేదు. వెళ్తానంటే వద్దంది. వెన్నంటి నన్ను తిప్పుకుంది.

చాలా రోజుల తర్వాత ఓ వర్షారాత్రి వేళ మెలకువ వచ్చి చూద్దునో! గుమ్మడి గింజలా పచ్చగా, గావంచాను చుట్టుకుని ఉన్న ఆయనే నన్ను ముద్దాడుతూ మళ్ళీ కనిపించారు. తన గరుకు గడ్డం బుగ్గలకు, నా బుగ్గలనదుముకుంటూ కన్పించారు. హరికెన్ లాంతరు వెలుగు ఆయన ముక్కు మీద ప్రతిఫలిస్తోంది. తేరిపార చూశాను. అమ్మ దీపం వొత్తిని తగ్గించేసిందెందుకో! వెలుగుల్ని కుదించి కళ్లల్లో దాచేసుకుంది.

'బుజ్జిగాడు! బాగున్నాడా' అడిగారాయన.

'వాడికేం? బాగున్నాడు! నిద్రపోమ్మా! నిద్రపో' అందమ్మ నన్ను నిద్ర బుచ్చనారంభించింది. కన్ను తెరచి చూస్తున్నానంతా. ఆయన చుట్ట ముట్టించారు, ఆయన పెదాల వాసన ఒక్కలా ఉన్నాయనిపించింది. ఊపిరి గట్టిగా పీల్చి ఆ వాసనని గుండెల్లో పట్టి ఉంచుకొని నిద్రలోనికి జారిపోయాను.

వేకువున వర్షం వెలిసింది. నాకు మెలకువ వచ్చింది. ఆయన లేరు. పాలు పితికేందుకు చెంబునుంచికుని పెరట్లోని ఆవు దగ్గరకు వెళ్ళనున్నదమ్మ.

'అమ్మా! రాత్రి బలే కలొచ్చిందే' అన్నాను.

'ఏం కలరా' అనడిగింది.

'పొట్టిగా ఉన్నారు చూడూ, నన్నాయన ముద్దు పెట్టుకున్నారు చూడు...' అని చెప్పుకొచ్చాను.

'కలా పాడా! పిచ్చి పాటా నువ్వూను' అన్నదమ్మ.

నాన్నంటే పాటని అమ్మ ఊహకందలేదు!

శీతాకాలం.

దీపావళి పండగతో చలి దివ్వెల దగ్గర కొచ్చింది. ఆ రోజుల్లో ట్రంకు పెట్టెలో దాచి ఉంచిన రగ్గును తీసి వెచ్చగా ఉంటుందని చెప్పి, కప్పుకుని నిద్రించమని దానిని అమ్మ నాకందించింది. వెల్లకిలా పడుకుని ఆ రగ్గును మీదికి లాక్కున్నాను. తల నిండుగా ముసుగేసుకున్నాను. అప్పుడు రాత్రివేళలొచ్చే గుమ్మడి గింజలా పచ్చగా, గవాంచాను చుట్టుకొని ఉన్న ఆయనే నా దేహాన్నంతా స్పృశిస్తున్నట్టనిపించింది. రగ్గు నీడ ఆయన గూడనిపించింది. ఆ గూడంతా ఆయన పరిమళంతో నిండి ఉన్నట్టనిపించింది. ఉచ్ఛ్వాస నిశ్వాసలను హెచ్చు చేసి సరదా పడ్డానానాడు. అమ్మను పిలిచి 'పొట్టిగా ఉన్నారు చూడూ నన్నాయన ముద్దు పెట్టుకున్నారు చూడు... ఈ రగ్గంతా ఆయన వాసనేస్తోంది' అని చెప్పాను. అమ్మ పక్కన అక్క కూడా నిలిచి ఉన్నదప్పుడు.

'ఆయన ఎవరనుకున్నావు' అన్నదక్క.

'ఎవరే' అడిగాను. ఆత్రంగా లేచి కూర్చున్నాను. చెప్పేందుకు అక్క నోరు తెరిచిందోలేదో... అమ్మ, అక్క ప్రయత్నాన్ని నివారించింది.

'ఎవరయితే నీకెందుకురా! పడుకో! పడుకో' అంది. 'వెధవకి అన్నీ కావాలి' అంది. 'అన్నీ అక్కర్లేదే! నాన్నొక్కరే కావాలి' అందామనుకున్నాను. అమ్మ కోపగించుకుంటుందని మిన్నకున్నాను.

మర్నాడు -

వరండాలో కూర్చుని, ఎండని కాగుతూ అక్క స్వట్టర్ అల్లుతోంది. సూదుల్ని చిత్రాతి చిత్రంగా తిప్పుతోంది. అటలా ఉందది!

'నాకా' అడిగానక్కని.

'కాదు. నాన్నకి' అన్నది.

'నాన్నెక్కడున్నారే చెప్పవూ' ప్రాధేయపడ్డాను.

దూరంగా కొండల్ని చూపించింది. కొండల్లోంచి ఎగసి వస్తోన్న సూర్యుణ్ణి చూపించింది. చూపించి 'అక్కడ ఉన్నారు' అని నవ్వింది నన్నాట పట్టిస్తూందనుకున్నాను. ఉక్రోషంగా దాని వీపున దబా దబా బాది చేతికందక వీదిలోనికి పరుగెత్తి పోయాను.

తర్వాత్తర్వాత అక్క అల్లుతోన్న స్వెటర్ పూర్తి కావస్తూంటే, అది నాన్న కోసమని తెలిసి తెలిసీ దాన్ని చేతుల్ని నా మెడ చుట్టూ వేసుకునే వాణ్ణి. వదులు వదులుగా స్వెట్టర్ చేతులు నా మెడనంటి ఉంటుంటే నన్నెవరో అక్కున చేర్చుకున్నట్టనిపించేది.

నాన్న ఇలా ఉంటారని, అనుకునేందుకు నాన్న ఫోటో కూడా ఇంట్లో లేదు. ఆయనేనాడూ ఫోటో తీసుకోలేదట! తాతయ్య తైలవర్ణ చిత్రం ఉంది. దానిని చూపించి 'అచ్చం ఇలానే ఉంటారు' అన్నదక్క ఓసారి. నాటి నుంచి నాన్నని చూడాలనిపించి నప్పుడల్లా తాతయ్య తైల వర్ణ చిత్రం చూసి మురిసిపోయేవాడిని.

అక్క నాన్న కోసం అల్లుతోన్న స్వెట్టర్ పూర్తయింది. ఆనాడు అక్క సంతోషం అంతా ఇంతా కాదు స్వెట్టర్ని భుజాల దగ్గర పట్టి నిలిపి, దానిని నిండుగా చూసుకుంది. అమ్మను కేకేసి చూపించింది.

'తీసుకెళ్లి నాన్నకెప్పుడిస్తావు' అడిగాను అక్కని.

'నాన్నే వచ్చి తీసుకుంటారు' అన్నదక్క.

'ఎప్పుడొస్తారే' ఉత్సాహంగా అడిగాను.

'ఎప్పుడో ఒకప్పుడొస్తారు! రాకపోతే రారు! దేవుడా ఏం' అన్నదమ్మ.

నాన్నంటే దేవుడని అమ్మ గుర్తించలేకపోతోంది!

ఓ చలి రాత్రి ఎవరో వచ్చిన అలికిడి. సోకీ సోకని వాసన. నా దగ్గరకి నడిచి వస్తూన్న సుగంధాన్ని అమ్మ అడ్డగించింది.

'పలకరిస్తే చాలు! పసిగడుతున్నాడు వెధవ' అన్నది. స్పష్టా స్పష్టంగా వినవచ్చాయా మాటలు. తర్వాత మరేమీ వినరాలేదు. నిద్రలో నిండుగా కూరుకుపోయాను.

ఆరోజు బాగా జ్ఞాపకం ఉంది. చీకటి చిక్కబడుతోంది. అమ్మ హరికేన్ లాంతరు చిమ్మీన ముగ్గుతో శుభ్రం చేస్తోంది ముగ్గురు వ్యక్తులు, మా ముంగిటకు వచ్చారు. రక్తసిక్తమయిన గావంచానూ, లాల్చీని, స్వెట్టర్ను అందజేసి చెప్పరాని మాటచెప్పినట్టున్నారు. 'గొల్లు' మందమ్మ. గుండెల్ని బాదుకుంది. నెత్తి మొత్తుకుంది. అక్కను వాటేసుకుని ఏకధారగా ఏడ్చింది. ఆ దృశ్యాన్ని చూసి భయపడి నేనూ ఏడ్చాను. అక్క నన్ను దగ్గరికి తీసుకుంది. ఓదార్చచూసింది.

వచ్చిన ముగ్గురూ వెళ్లిపోయారు. ఊరిలోని వాళ్ళు ఒక్కక్కరుగా రాసాగారు. అమ్మను అనునయించజూశారు.

'ఊహించిందే! బాధపడి ప్రయోజనం లేదు' అన్నారు. ఏం జరిగిందేం జరిగిందంటే -

మీ నాన్న చనిపోయాడన్నారు. తుపాకీ తూటాకి కూలిపోయాడన్నారు. స్వెట్టర్ మడత విప్పి చూసి -

'జల్లెడలా ఉంది! ఎన్ని గుళ్ళు పోయాయో' అని దుఃఖించారు. అక్క అల్లిన స్వెట్టర్ అది! ఎరుపు రంగుది! మరింత ఎర్రెర్రగా కానవచ్చింది.

'నాన్నెవరే! ఎప్పుడొచ్చారే' అడిగానక్కని.

'పొట్టిగా ఉన్నారు చూడూ, నిన్నాయన ముద్దు పెట్టుకున్నారు చూడు ఆయనే! ఆయనే మన నాన్న! మొన్నొచ్చారు' అన్నదక్క. అని నన్ను గట్టిగా పట్టుకుని మరింత గట్టిగా ఏడ్చింది.

అక్క పట్టు నుంచి తొలిగి, నాన్న స్వెట్టర్ని చేతుల్లోకి తీసుకున్నాను. ముఖాన్ని అందులో ఉంచి ఇట్నుంచటూ అట్నుంచిటూ రుద్దాను. గరకు గడ్డం బుగ్గలకు, నా బుగ్గల నదిమిన స్పర్శ కలిగింది. నాకిష్టమయిన వాసన వేసింది. నాన్న వాసన, నాన్న స్పర్శ నన్నంటి ఉన్నాయనిపించింది. ఏడవాలనిపించలేదు. ఏడేడులోకాల్లోనున్న నాన్నని వెతికి పట్టుకోవాలనిపించింది. ఆ మాటంటే -

'పారేసుకున్న వస్తువా ఏం! వెతికితే దొరకడానికి' అని అమ్మ అనవచ్చు. శోకించవచ్చు. అయితే అమ్మకి ఈ నాటికీ తెలియదు. నాన్నంటే నిత్యావసర వస్తువని!

----

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు