నేను వృత్తి రీత్యా బాంక్ రీజినల్ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యాను. క్లర్క్ గా చేరిన నేను క్రమంగా పరీక్షలన్నీ రాసి ప్రోమోషన్లతో మేనేజర్ అయ్యాను. నా పెర్ఫార్మెన్స్ బాగుంది అని మొదటి నుంచి అందరూ మెచ్చుకునేవారు. ఏ పని చేసినా శ్రద్ధగా చెయ్యాలి అని అనుకునే వాడిని. డిగ్రీ పాస్ అవ్వగానే బాంక్ పరీక్షలు రాయటంమొదలు పెట్టాను. రెండేళ్లకు బాంక్ ఉద్యోగం దొరికింది. ఇక ఇంట్లో ఎవరి సంతోషానికి అవధులు లేవు.
చెప్పాలంటే నాన్నది ప్రభుత్వ ఉద్యోగమే అయినా బతకలేక బడి పంతులు అనుకునే రోజులు అవి. నలుగురు ఆడపిల్లల తర్వాత నేను, అక్కలు అందరినీ డిగ్రీ చదివించేసరికి ఉన్న ఆస్తులు అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది, కానీ ఆడపిల్లకు చదువు ముఖ్యం అనుకున్నాడు నాన్న. అమ్మ పోయాక, నా బాంక్ ఉద్యోగం తో కష్టాలు తీరిపోతాయి అనుకున్నాం. అప్పటికి ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. కానీ నాన్నపై అప్పుల భారం పెరిగిపోయింది. సమయానికి చేతిన అందివచ్చానని ఎంతో సంతోషించారు. అలా నా ఉద్యోగం ప్రమోషన్లతో మా స్థితి మారింది. నెమ్మదిగా మంచి స్థాయికి వచ్చాం. తాతల కాలం నాటి పెంకుటిల్లు పాలరాతి భవనంగా మారింది. ఇంటి ముందు ఖాళీ స్థలంలో రిటైర్ అయ్యాక, నాన్న మొక్కలు పెంచేవారు. బయట నుంచి చూడటానికి ఇంద్రభవనంలా ఉంటుంది మా ఇల్లు.
మా ఇంటికి ఎదురుగా రమణాచారి గారి ఇల్లు. రమణాచారి వేణుగోపాల స్వామి వారి ఆలయంలో అర్చకులు. ఆయన కొడుకు రామానుజం (రామూ) నా తోటి వాడే, కుల వృత్తి పరంగా వాడి చదువు కాగానే అదే ఆలయంలో చేర్పించేశారు. వాళ్ళది పాత కాలపు మండువా ఇల్లు. రామూ ఎప్పుడూ ఆదరంగా పలకరించేవాడు. వాళ్ళ ఇంటి ముందు కూడా ఉన్న ఖాళీ స్థలం నిండా కూరగాయల మొక్కలు, పూల మొక్కలు ఉండేవి. అవే పూలతో స్వామి వారిని అలంకరించేవారు. వాళ్ళు కూడా ఆరుగురు సంతానం కావటంతో ఎంతో కష్టపడాల్సి వచ్చేది. అందుకే వాళ్ళ ఇంట్లో కాసిన కూరలతోనే ఎక్కువ కాలం గడిపే వారు. ఏ మాట కామాట స్వామి వారిని అందంగా అలంకరించటంలో రామూని మించిన వారులేరు. రామూ అందరిలో పెద్దవాడు కావటంతో ఇంటి భారం సగం తనపై పడింది. కానీ తను ఎప్పుడూ అదొక భారం అనుకోలేదు, ఎంతో బాధ్యత గా ఉండేవాడు.
కొన్నాళ్ళకు ట్రాన్స్ఫర్ పై వేరే రాష్ట్రం వెళ్ళాల్సి వచ్చింది నాకు. మా ఇద్దరి స్నేహం బాగానే కొనసాగింది నేను ఆ ఊరి నుండి వెళ్ళేవరకు. కానీ ఆ తర్వాత మళ్ళీ నేను అటువైపు చూడలేదు. మాకు ప్రభుత్వం క్వార్టర్స్ ఇచ్చింది. నాన్న పోయాక ఇక ఆ ఇల్లు అలా వదిలేసాను. నా పిల్లలిద్దరూ విదేశాలలో స్థిరపడి పోయారు ఇప్పుడు. రిటైర్ అయిన తర్వాత జీవనం ఎంతో వెలితిగా అనిపించేది. నాకు బీపీ, సుగర్, ఆస్తమా అన్నీ వచ్చాయి. నా భార్య రత్నకు అనారోగ్యంగా ఉంటోంది అని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే డాక్టర్ డిస్క్ ప్రాబ్లెమ్ అని చెప్పింది. తను అన్ని పనులు చేసుకోలేదు. ఇక్కడ ఎవరి పనులు వారివే, పక్కవారి గురించి ఆలోచించే తీరికా, సమయం ఎవరికి లేవు. అదే సొంత ఊరిలో ఉంటే పుట్టి పెరిగిన ఊర్లో అందరూ తెలిసిన వారు ఉంటారని, అవసరానికి చేదోడుగా ఎవరైనా ఉంటారని అనిపించింది.
ఉన్న ఊరిని, పిల్లలని వదిలి ఎక్కడో ఉండటం సరి కాదు అనిపించి, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు గుర్తు వచ్చి మా ఊరికి వచ్చేసాం. కానీ అప్పటి ఇల్లు అంత అందంగా లేదు, బూజు పట్టిన బూత్బంగ్లా లాగా తయారయ్యింది, శుభ్రం చేయించేసరికి రెండ్రోజుల పైనే పట్టింది. రత్నకి పనికి సాయంగా రంగిని పనిలో పెట్టుకున్నాం. రంగి మా చిన్నప్పటి నుంచీ మా ఇంట్లో పనిచేసేది. ఇప్పటికీ అలాగే ఓపిక ఉన్నంత వరకూ ఏదొక ఇంట్లో పని చేస్తోంది. తన ఓపికకి మెచ్చుకోవాల్సిందే. మాకు కాస్త తోడుగా రోజూ వచ్చి ఏదొక కబుర్లు, ఊరి విషయాలు చెప్తూ ఉంటుంది.
నాన్న వేసిన పూల మొక్కలు అన్నీ పోయాయి. ఇంటి కళ తగ్గిపోయింది. మా ఇంటి ఎదురుగా రామూ వాళ్ళ ఇల్లు మాత్రం అలాగే ఉంది, అదే పాత కాలపు మండువా ఇల్లు. రామూ, తమ్ముళ్లూను, చెల్లెళ్ళు, ఇద్దరు కొడుకులు కోడళ్ళు అందరూ కలిసే ఉంటున్నారు. రామూ వాళ్ళ నాన్న గారు వయసైపోయినా ఎంతో చురుగ్గా పనిచేసుకుంటూ ఉన్నారు. ఇన్నేళ్ళు అయినా ఆయనే ఆ ఇంటిపెద్ద. ఆయన మాటే వింటారు అందరూ. వాళ్ళ ఇంటి ఎదురుగా రకరకాల పూల చెట్లు, కూరగాయల మొక్కలు అలాగే ఉన్నాయి. ఆ ఇల్లు చూడగానే పిల్లా పాపలతో, పచ్చదనంతో కళకళలాడుతూ కనిపిస్తుంది ఇప్పటికీ.
ఖరీదైన ప్లాస్టిక్ పూల చెట్లు, పాలరాతి భవనం అయిన నా ఇల్లు కూడా ఆ ఇంటి ముందు వెలవెల పోతోంది. ఇంత ఆస్తి సంపాదించినా చివరికి ఏముంది? అనుభవించడానికి నా పిల్లలు నాతో లేరు. నాకు అనుభవించే అవకాశం కూడా లేదు. అనారోగ్యంతో ఉదయం నుంచీ మందులు మింగటమే సరిపోతుంది. రిటైర్ అయ్యి ప్రశాంతంగా మనవలు, మనవరాళ్ళతో సంతోషంగా ఉండాల్సిన వయసులో రోగాలతో ఇద్దరం సహజీవనం చేస్తూ ఉన్నాం. పిల్లలు మా దగ్గరకి రాము అనీ, కావాలంటే మరొక పని మనిషిని పెట్టుకోమని, వీలైతే మమ్మల్నే అక్కడకి రమ్మని అన్నారు. ఇవేమీ మాకు నచ్చలేదు.
మేము వచ్చిన వెంటనే, రామూ, వాళ్ళ ఆవిడా ఇద్దరూ వచ్చి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఎంతో ఆనందించింది రత్న. నేను ఇల్లు కట్టిన కొత్తలో నా ఇంటి ఎదురుగా రామూ వాళ్ళ పెంకుటిల్లు నా ఇంటి అందాన్ని తగ్గించేస్తుంది అనుకున్నాను. నాకు ప్రమోషన్ రావటంతో వాళ్ళని తక్కువ చేసి చూసాను. కానీ ఇప్పుడు వాళ్ళని చూసి అసూయ పడుతున్నాను. నా కన్నా రామూ నే సంతోషంగా ఉన్నాడు, ఉన్న వాటితో సంతృప్తి చెందుతూ.
"*ఇప్పుడు ఎవరు గొప్పా? డబ్బు సంపాదించిన నేనా? పిల్లలతో సంతోషంగా ఉంటున్న రామూనా?"* అనిపించింది.
అందుకని ఏది ఏమైనా ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాం. రంగి మనవరాలు డాక్టర్ చదువుకోవాలి అనుకుంది, కానీ చదివించే స్థోమత రంగికి లేదు. తనని మాతో ఉండమని, నేను చదివిస్తా అని చెప్పాను. రంగి సంతోషానికి హద్దులు లేవు. తన మనవరాలు నా కాళ్ళకి నమస్కరించింది. తన కళ్ళలో వెలుగు చూసి ఎంతో ఆనందంగా అనిపించింది. ఇన్నేళ్ళుగా ఎప్పుడూ లేని సంతృప్తి నాలో కలిగింది. మనసుకు భారం దిగిపోయినట్టు అయ్యింది.
********