మానవసేవ - పాణిని జన్నాభట్ల

Manava seva

శారద కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "అదేమీ‌ లేదండీ" అని‌ తన కళ్ళు ఎవరికీ కనపడకుండా ఇంటికైతే చేరింది కానీ గుళ్ళో‌ జరిగిన సంఘటన తనని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. "ఎందుకీ పరిస్థితి?" ఆలోచనల అలలు హృదయతీరాన్ని గట్టిగా తడుతున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఆలోచనా ఒక జ్ఞాపకాన్ని మోసుకొస్తుంటే మెల్లగా గతంలోకి జారుకుంది తను.

మంగళగిరికొండ కింది నరసింహస్వామి గుడివీధిలో వాళ్ళిల్లు. భర్త సుదర్శనం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైరయ్యాడు. బాగా సోషలిస్ట్ భావాలున్న మనిషి. గుడి పక్కనే వున్నా తనకు తానుగా ఎప్పుడూ వెళ్ళింది లేదు. దేవుడంటే ద్వేషం లేదు అలాగని భక్తీ లేదు. శారద పోరు పెడితే అప్పుడప్పుడు పూజలకీ వాటికీ కూర్చుంటాడు. ఎప్పుడూ పుస్తకాలూ, రాతలూ. వాళ్ళ ఒక్కగానొక్క కూతురు రాజ్యలక్ష్మి. అమ్మవారి పేరు పెట్టిందని శారద సంతోషమే తప్ప తను మాత్రం "రాజీ" అని మార్చేసుకుంది పేరు పాతగా ఉందనిపించి. పెళ్ళయ్యాక రెండేళ్ళ నుంచి బెంగుళూరులోనే ఉండటం.

కూతురు వెళ్ళాక ఏదో ఒంటరితనం తనకి. జీవితమంతా పిల్లల గురించే తపనపడి, కష్టపడి పెంచి, వాళ్ళ సంతోషమే తమదిగా భావించే ఎంతో మంది తల్లిదండ్రులు చివరికి పిల్లలు ఉద్యోగాలో, పెళ్ళిళ్ళో అయ్యి వెళ్ళిపోయాక ఒక్కసారిగా లక్ష్యాన్ని కోల్పోతారు, ఒంటరివాళ్ళౌతారు, ఏంజరిగిందో తెలిసేలోపు అంతా జరిగిపోతుంది. "ఎందుకీ జీవితం" అనేంత వైరాగ్యం.

అంతా బానే ఉంటుంది కానీ‌ ఏదీ బాగా ఉండదు.

సుదర్శనం స్థానికంగా ఉన్న బాలల‌ అనాథశరణాలయంలో రోజూ పిల్లలకి ఇంగ్లీష్ పాఠాలు చెప్తూ‌ ఉండేవాడు. రిటైరయ్యాక అదో కాలక్షేపం తనకి. శారద పరిస్థితి చూసి ఆమెను కూడా తీస్కెళ్ళటం మొదలుపెట్టాడు కొంచెం ఊరటగా ఉంటుందని. ఇద్దరూ రోజూ రెండు మూడు గంటలు అక్కడే పిల్లలతో గడిపి ఇంటికి వచ్చేవారు. మెల్లగా అక్కడ పనిచేస్తున్న మిగతా టీచర్లతో పరిచయాలు పెరిగాయి. చుట్టుపక్కల వీధుల్లో‌ ఏమైనా ఫంక్షన్లుంటే శారదని పిలవటం, తనకి తెలిసినవి‌ అక్కడా ఇక్కడా చెప్పటంతో చాలామందికి సుపరిచితురాలైంది ఆమె‌ కొద్దికాలంలోనే. ఆ‌ విషయాలపై ఇంటికి‌ వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది.

"ఏమైంది?" అడిగాడు సుదర్శనం లోపలికి వస్తూ.

"ఎమీ లేదండీ" తను ఆలోచనల్లో ఉన్నానని స్పష్టంగా తెలుస్తోంది.

"గుడికెళ్ళావా సాయంత్రం?" అదేదో "మళ్ళీ తప్పుచేసావా" అన్నట్టు అడిగాడు.

"వెళ్ళాను. అదేం పాపం‌ కాదు"

"కాకపోవచ్చు, కానీ వెళ్ళొచ్చి బాధపడేకంటే.." ఆగాడు. అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. తనేమీ‌ మాట్లాడలేదు. ఆ‌ రోజు శనివారం, ఉపవాసం అవ్వడంతో, ఎక్కువ సంభాషణ జరగలేదు. అతను పడుకున్నాక తను కూడా ప్రయత్నించింది కానీ నిద్ర పట్టలేదు. ఎవరైనా అవసరం లేని జ్ఞాపకాలని మర్చిపోయే మందు కనిపెడితే బావుండు. అంత అదృష్టం లేదనిపించింది తనకి.

ఆ రోజు సాయంత్రం గుడిలో తెలిసిన వాళ్ళు కలిసారు, ప్రపంచంలో ఒకే‌ ఒక్క విషయమున్నట్లు అందరూ పిల్లల గురించి మాట్లాడుకున్నారు. అంత వరకూ అంతా బానే‌ ఉంది. వెనక్కి‌ వచ్చేటప్పుడు వనజ ఎదురు పడింది. తనని‌ చూసాక పక్కకి తిరిగి‌ వచ్చేద్దామకుంది కానీ పిరికితనమనిపించి‌ "బావున్నారా" అని పలకరించింది. వనజ ఇంకో ముగ్గుర్ని వెంటేసుకొని‌ వెళ్తూ ఆగి "ఆ బానే ఉన్నాం" అంటూ దగ్గరికొచ్చింది. అవీ ఇవీ‌ మాట్లాడుతూ హఠాత్తుగా "మన వాళ్ళని కూడా కొంచెం కలుపుకోమ్మా, బొత్తిగా వేరేవాళ్ళంటేనే ప్రేమ‌ నీకు‌" అంటూ తనని చూపిస్తూ పక్కకి తిరిగి "సర్వమానవధర్మం అంతా శారదది" అంటూ కిసుక్కున నవ్వింది. చుట్టుపక్కల వాళ్ళూ తనకి వంత పాడారు. శారద అక్కడినించి బయటపడింది కానీ, ఆ బాధ నుంచి‌ కాదు.

నాలుగేళ్ల క్రితం గుళ్ళోని రాజ్యలక్ష్మి అమ్మవారికి విశిష్టమైన రోజుల్లో భజనలు, పూజలు చేయాలని దగ్గర్లో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. మొదట్లో అందర్నీ కలుపుకున్నా, రాను రానూ కొంతమంది అతిసాంప్రదాయవాదులు‌ చేరడంతో, అంతా ఏకపక్షంగా మారింది. కానీ ప్రతి పండక్కీ ఆ బృందం ఏదో ఒక విశేషమైన కార్యక్రమం చేస్తుండటంతో, జనాలు బాగా ఆదరించారు. అనాధ శరణాలయం పనులు ఎక్కువైనప్పటి నుండీ శారదని అన్ని విషయాల్లో పక్కకి పెట్టడం మొదలు పెట్టారు ఏవో కారణాలు‌ చెప్తూ. తనకే ఆలస్యంగా అర్థమైంది ఇదంతా దాని వల్లనే‌ అని.

ఆ రాత్రి నిద్రపోకుండా ఆలోచించి‌ ఒక‌ నిర్ణయానికి వచ్చింది.

పొద్దున్నే‌ లేచింది.‌ పేపరు చదువుతున్న భర్తకి టీ‌ ఇచ్చి ఎదురుగా కూర్చుంది. ఎర్రగా ఉన్న తన కళ్ళని‌ చూసి సుదర్శనం "నిద్ర పట్టలేదా" అన్నాడు, పేపర్ పక్కన పెడుతూ.

దానిని పట్టించుకోకుండా "నేను ఇవాల్టినుంచి ఆ పిల్లల‌కి క్లాసులూ అవీ‌‌ చెప్పను. వాళ్ళనెవర్నీ ఇంటికి తీసుకురాకండి" అంది నీరసంగా. తనకెంతో ఇష్టమైన విషయం. అలా‌ అంటున్నందుకు తనే ఆశ్చర్యపోయింది. మనసుని కుదిపే భావాలు పెద్దగా వినిపిస్తే తట్టుకోలేడు మనిషి‌.

నవ్వుతూ ఉండే పిల్లల‌ మొహాలు గుర్తొచ్చాయి. "వదిలి ఉండగలదా?"

సుదర్శనం ఆమెని‌ చూస్తూ - "ఇప్పుడేమైంది? పిల్లలూ, టీచర్లు అంతా బానే వున్నారు కదా నీతో, నువ్వంటే అభిమానం‌ కూడా అందరికీ. గుడిలో‌ వాళ్ళగురించి పెద్దగా ఆలోచించకు" అన్నాడు.

"ఎంత తేలిక" తనకిలా చెప్పటానికి అనుకుంది మనసులో. భర్తకి దేవుడంటే పట్టదు. లోకంలో‌ ఉన్న అన్నివిషయాలూ మాట్లాడతాడు అది తప్ప. తన‌ ప్రపంచం‌ చిన్నది. అమ్మవారు, తన ఇల్లు, కూతురు, శరణాలయం పిల్లలు. కానీ అమ్మవారి కార్యక్రమాల్లో‌ పాల్గొనలేకపొతున్నాననే‌ బాధ బాగా ఎక్కువైంది‌ ఈ మధ్య‌. పైగా అప్పుడప్పుడు ఈ వనజ లాంటి వాళ్ళ దెప్పి పొడుపులు. వాళ్ళే కులాన్ని ఉద్ధరిస్తున్నట్లు నటన. వాళ్ళంటే అసహ్యం తనకి కానీ బృందంలో‌ ఉండటమొక్కటే మార్గం తను దగ్గరగా పూజలు నిర్వహించాలంటే.

"లేదు. నేను నిర్ణయించుకున్నాను. ఇకనుంచి స్కూలుకి రాను. పిలిచినా ఫంక్షన్లకి వెళ్ళను. నాకు గుడి, ఆ‌‌ బృందమే ముఖ్యం" అని గట్టిగా చెప్పేసి, సుదర్శనం ఏదో అనేంతలోపే లోపలికెళ్ళిపోయింది. గుండెల్లోంచి పెద్ద భారం దిగింది తనకి. మనిషి దుర్మార్గుడు.‌ తన బాధల్ని‌ ఎదుటివాడి మీద రుద్ది ప్రశాంతంగా తన పని‌ చేసుకుపోతుంటాడు. ఎదుటివాడేమైతే తనకే?

సుదర్శనం ఒక్కనిమిషం అవాక్కయి మళ్లీ తేరుకుని "కొంతకాలానికి‌ తనే తెలుసుకుంటుంది. ఆ పిల్లలకేదో సర్దిచెప్పాలి కొన్నాళ్ళు" అనుకున్నాడు.‌

దసరాలు‌ పదిరోజుల్లో వున్నాయి.‌‌ పదోరోజు అమ్మవారికి పెద్దపూజ, స్తోత్రాలూ, ఊరేగింపూ ఉంటాయి. సుదర్శనంతో అయితే గట్టిగా చెప్పింది కానీ ఎప్పుడూ స్కూలు, పిల్లలు అవే జ్ఞాపకాలు. వాళ్ళని కాదని, కనపడని దేవుడి కోసం ఎందుకీ ఆరాటం. వెంటనే లెంపలేసుకుని “నాక్కూడా మా ఆయన బుద్ధులొచ్చాయి” అని తిట్టుకుంది తనలో తను. ఇంక తను ఎక్కడికీ వెళ్ళట్లేదు కనక తనని‌కూడా కలుపుకుంటారు‌ బృందం వాళ్ళు అని శారద ఆలోచన. ఈ‌ మధ్యలోనే ఒకరిద్దరి దగ్గరికెళ్ళి అంది‌ కూడా "ఆయన వల్ల అక్కడికీ ఇక్కడికీ వెళ్లవలసి వస్తోంది కానీ, నాకస్సలు ఇష్టం లేదు వదినా" అని. "చీ నువ్వేనా ఇలాంటి‌ మాటలంటోంది‌" అని నిలదీస్తున్న మనసుని‌ అణిచేసి.

చివరికి దసరా పండుగ రానే వచ్చింది. ఎప్పుడూ రాని ఒక‌ బృంద సభ్యురాలు ఒకామె ఇంటికి‌ వచ్చి మరీ "వస్తున్నారు కదా" అని‌పిలిచేసరికి ఉబ్బితబ్బిబ్బయ్యింది తను. భర్తకి ముందు‌రోజే చెప్పి‌ ఉంచింది. తనతో కచ్చితంగా ఆ‌ రోజు గుడికి రావాలి అని. అర్థాంగీకారం గానే తలూపాడు సుదర్శనం. కానీ మళ్ళీ‌ ఏం‌ జరుగుతుందో అన్న అనుమానమైతే ఉంది ఇద్దరి మనసుల్లో‌ ఎక్కడో.

గుడి ఆవరణంతా కోలాహలంగా ఉంది.‌ పిల్లల‌ ఆటలు, ఆడవాళ్ళ ముచ్చట్లు, వాళ్ళతో వచ్చిన మగవాళ్ళ కబుర్లతో. బృందసభ్యులంతా హడావిడిగా తిరుగుతున్నారు.‌ కొంతమంది శారదని చూసి చీర‌బాగుందని సైగ చేసారు. తను సుదర్శనం కళ్ళల్లోకి చూసింది "నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే" అని చెప్తున్నాయవి. తనొక‌ అర్థంకాని నవ్వు నవ్వాడు. "నువ్వు వీళ్ళతో ఉంటావుగా ,నేను మగవాళ్ళ లైన్ లో కూర్చుంటాను" అని ఒక చివర కూర్చున్నాడు వెళ్ళి.

శారద మెల్లగా పనిచేస్తున్న‌ సభ్యులతో మాట్లాడుతూ‌ అటూ ఇటూ సహాయం చెయ్యటం మొదలుపెట్టింది. ఇంక నేను అమ్మవారికి దగ్గరగా ఉండచ్చు అని‌ మనసులో అనుకునేంతలో వనజ‌ వచ్చి "అక్కడ బైట రథం అలంకరించటానికి ఎవరూ లేరు. అందరూ ఇక్కడే ఉంటే ఎలా, నువ్వు అక్కడికెళ్ళు వదినా ఇక్కడివి మేము చూస్కుంటాంలే" అంది.

తనని తప్పించాలనే వనజ అలా అంటోందనీ, అక్కడికెళ్తే మళ్ళీ ఇక్కడికి రావడం కుదరదని తెలిసి తనవైపు నిస్సహాయంగా చూసింది శారద. "ఇక్కడ నాదే రాజ్యం" అన్నట్టు చూసింది వనజ. ఇంకేం‌ చెయ్యలేక బైటకొచ్చింది శారద.

దారిలో "బావున్నారామ్మా" అంటూ నమస్కరిస్తూ పలకరించాడు‌ ఆ గుడి ధర్మకర్త మహదేవరెడ్ది. ఆయనకి అరవై ఏళ్ళు. ఆరడుగుల‌ మనిషి. భారీదేహం, పెద్ద మీసాలు. చాలా పాల ఫ్యాక్టరీలకి‌ ఓనరు. మంగళగిరిలో పేరున్న మనిషి. దేవుడికి సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ కుటుంబం తరతరాలుగా ధర్మకర్తలుగా ఉంటున్నారు.

"ఆ బావున్నామండీ" చిన్నగా అంది‌ నమస్కరిస్తూ.

"మీరు చాలా మంచిపని‌ చేస్తున్నారమ్మా పిల్లలకి చదువు చెప్తూ. వింటున్నాను మీ గురించి అక్కడా ఇక్కడా. ఆ సేవే రక్షిస్తుంది మిమ్మల్ని‌" అన్నాడు.

ఒకటి‌ రెండు‌ బైట జరిగిన ఫంక్షన్లలో ఇంతకుముందే కలుసుకున్నారు‌ వాళ్ళు.

"అయ్యో అంత పెద్దమాటెందుకండీ, తెలిసింది‌ చెప్తున్నాం" అంది, ఇప్పుడా విషయం చర్చించడం ఇష్టం లేక.

"అది మీ గొప్పతనం, సాధారణంగా ప్రవర్తించడం. చాలా మంది అన్నీ ఉన్నా ఎదుటి వాళ్ళకి ఏమీ చెయ్యరు. ఇంకొంత మంది గోరంత చేసి కొండంత పేరు కావాలనుకుంటారు" అన్నాడు నవ్వుతూ.

"మంచిదండీ, రథం దగ్గర అలంకరణ.." అంటూ అటు‌‌ చూసింది.

"అవునవును వెళ్ళండమ్మా, నాకూ మండపం దగ్గర పనుంది" అని వెళ్ళిపోయాడు. శారద అలంకరణ పూర్తి చేసి గంట తర్వాత వచ్చింది లోపలికి.

అప్పటికే అమ్మవారు అందంగా అలంకరించబడింది. అంతటా దీపాలు, మాలలతో వెలిగిపోతోంది మండపం. జనాలు కిటకిటలాడుతున్నారు. ఎక్కడా స్థలం‌ లేదు. వెనకాలెక్కడో కుర్చుంది. తన పిచ్చి గానీ తనకంత అదృష్టం లేదు అనుకుంది. ఇంతలో అక్కడంతా గుసగుసలు "విశాలాక్షి గారు రావట్లేదట, ఇంట్లో ఏదో అత్యవసర పరిస్థితిట".

మహదేవరెడ్డిగారు మైకు ముందుకొచ్చారు. "భక్తులారా, అమ్మ‌వారి పూజకి వచ్చిన మీ‌ అందరికీ స్వాగతం. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి దగ్గరుండి పూజ జరిపే దంపతులు విశాలాక్షి, పరమేశ్వర రావు గార్లు ఇవాళ అకస్మాత్తుగా ఇంట్లో జరిగిన ఒక‌ విషాదం వల్ల‌ రాలేక పోతున్నారు. అమ్మవారు వాళ్ళనీ ఆపదనుండి రక్షించాలని ప్రార్థిద్దాం" అంటూ కళ్ళు మూసుకున్నాడు ఒక్క నిమిషం. అందరూ ఒక్క నిమిషం బాధపడి వెంటనే ఆలోచనలో పడ్డారు "ఇప్పుడు పూజ ఎలా? ఎవరు చేయాలి?". "ఇంకెవరు వనజే చెయ్యాలి" పక్కనే ఉన్నామె అంటుంటే తల సగం ఊపుతూ ఉంది శారద.

ఆయన మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు "ఇక్కడ అన్ని సామాజిక‌వర్గాలకి, తరగతులకీ చెందిన భక్తులున్నారు. అమ్మవారికి అందరూ సమానమే. అలాగే మనలో అందరికీ సాయం చేస్తూ అన్ని వర్గాలతో మమేకమవ్వగలిగిన భక్తులు పూజ చేయిస్తే అందరికీ శుభం‌ అని నా అభిప్రాయం. అదృష్టవశాత్తూ అలాంటి భక్తురాలు మన మధ్యే ఉన్నారు. మన శారద గారు” అని చెప్పారు తనవైపు చెయ్యి చూపించి. ఉన్నట్టుండి వందల మోహాలు తనవైపు తిరిగాయి. నమ్మలేక పోయింది శారద. తను విన్నది నిజమేనా, ఇన్ని మొహాల్లో కొట్టొచ్చినట్టు కనపడుతున్న ఆశ్చర్యం, బృంద సభ్యుల నుంచి బాధతో వస్తున్న నిట్టూర్పులు నిజమే అని ధ్రువీకరిస్తున్నాయి. మగాళ్ళలో భర్త కోసం వెతికాయి తన కళ్ళు. అనుమతి కోసం కాదు నమ్మకం కలగడం కోసం. ఒక మూలగా గోధుమరంగు ఖద్దరు షర్టులో చిన్నగా నవ్వుతున్న మొహంతో కనపడ్డాడు తను. "వెళ్ళు" అని చేత్తో సైగచేసాడు. "శారద గారూ, రావాలి" ధర్మకర్త గారి‌ పిలుపు. అప్రయత్నంగా లేచింది, నడుస్తోంది అటువైపు. ఆనందం, ఆశ్చర్యంతో తన మొహం‌ ఎర్రగా మారింది. అదొక‌ కొత్త అనుభూతి. అందరూ చప్పట్లు కొడుతున్నారు.

సుదర్శనమూ వచ్చాడు పూజకి. భాగస్వామి ఆనందమే తనదీ. ఆ రోజు కార్యక్రమమంతా నిర్విఘ్నంగా చేసారు‌‌ దంపతులిద్దరూ. సంతృప్తిగా ఇంటికి బయల్దేరారు. వస్తూ వెనక్కి తిరిగిచూసింది శారద అమ్మవారివైపు. "ఆ పిల్లలే నీ దేవుళ్ళు" అని అమ్మ అన్నట్లు తోచింది తనకి. "అవును తల్లీ, తగిన పాఠం చెప్పావు" దణ్ణం పెట్టుకొని కదిలింది.

దారిలో ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదు. సుదర్శనం తన వంక చూసాడు "ఎవరి నిర్ణయం కరెక్టంటావ్?" అన్న ప్రశ్న చూపుల్లో. "మీదే మహానుభావా!"

మానవసేవే మాధవసేవ..

మరిన్ని కథలు

Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు