గాడిద కొడుకు - కందర్ప మూర్తి

Gadida koduku

మారుమూల వెనకబడిన గిరిజన ప్రాంతం బీమా తండా. సరైన రోడ్డు, మంచి నీటి వసతి లేదు. నిరక్షరాస్యత , మూఢ నమ్మకాలు, అపరి శుభ్రత , కట్టుబాట్లు , బీదరికం ఎక్కువ. ఆర్థిక పరిస్థితుల కారణంగా పిల్లల్ని పోషించలేక అంగడి వస్తువుల్లా అమ్ముకుంటున్నారు. వయసొచ్చిన ఆడపిల్లల్ని వ్యభిచారంలోకి నెట్టు తున్నారు. బీమా తండాలో చంద్రా నాయక్ , సోము నాయక్ అన్నదమ్ములు. తండా చుట్టు ప్రాంతాల్లో కూలి పనులు , మట్టి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి వద్ద రెండు మగ , మూడు ఆడ గాడిద లున్నాయి.మగ వాటికి వీరూ, దీరూ అని ఆడ గాడిదలకు రంగి , మంగి , గంగ అని పేర్లు పెట్టి పిలుస్తారు. వాటితో మట్టి పనులు, సీజనులో తండా గుట్టల్లో లభించే సీతా ఫలాలు , రేగుపళ్లు , మక్క బుట్టలు సేకరించి పట్నంలో అమ్ము కుంటారు. పట్నంలో పెద్ద భవంతుల నిర్మాణ పనులప్పుడు అన్నదమ్ము లిద్దరూ గాడిదల్ని తీసుకుని గుడిసెలు వేసుకుని అక్కడే నివాశ ముంటారు. గర్భంతో ఉన్న ఆడ గాడిదల్ని తండాలో గుడిసెల వద్ద ఉంచుతారు. చంద్రా నాయక్ కి ఒకే ఒక బుడతడు పదేళ్ల బూక్యా నాయక్. చురుకైనోడు.ఎప్పుడూ ఏవో చిలిపి పనులు చేస్తూంటాడు. తండాలో కొండముచ్చు కోతుల బెడద ఎక్కువ. పండిన సీతాఫలాలు, మక్క బుట్టలు తినేస్తాయి. గుంపులుగా వచ్చి గుడిసల్లోని వస్తువులు ఎత్తుకు పోతాయి. కోళ్ల గుడ్లు ఉండనివ్వవు.మేకల పాలు తాగేస్తాయి. పొడవైన తోకల్ని కుచ్చులుగా చుట్టి విసిరి ఎగిరి చెట్ల కొమ్మలు., గుడిసెల మీద స్త్వైర విహారం చేస్తూంటాయి. వాటిని పరుగెత్తించి తోలడంతోనే బుడతడి రోజు గడిచిపోతుంది. దూరం నుంచే కేటిల్ బార్లో గుండు రాళ్లు పెట్టి గురి చూసి కోతుల్ని కొడతాడు. రాతి దెబ్బ తగిలిన కోతి తడుముకుంటూ పారిపోతుంది. తండ్రి పట్నానికి పోయినప్పుడు తండాలో గుడిసె దగ్గర కోళ్లు , మేకలు, చూలు కట్టిన ఆడ గాడిదల పోషణ భాధ్యత బూక్యా మీద పడుతుంది. గాడిద ప్రసవించి చిన్న పిల్లను కనగా దట్టమైన బొచ్చుతో ముద్దుగా అందంగా పరుగు లెడుతుంటుంది. బూక్యా దానితో పరుగులెడుతు ఆటలాడుతాడు. చిన్నప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండే అదే గాడిద పిల్ల పెరిగి పెద్దదై మొద్దుగా మారి బరువులు మోస్తుంది. చూలు కట్టిన ఆడ గాడిద పేరు, పుట్టిన పిల్ల ఆడదో మగదో బూక్యా గుర్తుపడతాడు. మగ గాడిదకు సంతల్లో గిరాకీ ఉన్నందున అమ్మితే మస్తుగా పైసలు (డబ్బు ) వస్తాయి కనక మగ గాడిద పిల్ల పుట్టిందంటే సంతోషమే. చూలు కట్టిన ఆడగాడిదకు పుట్టిన పిల్ల మగదైతే కొడుకు అనీ ఆడదైతే బిడ్డ అనీ తండ్రి పిలవడం బూక్యా వింటూంటాడు. అది పెరిగి పెద్దదయే వరకు దాని భాధ్యత బూక్యా చూస్తూంటాడు. పట్నంలో ఉన్న చంద్రానాయక్ తన దగ్గరున్న మంగీ ఆడగాడిద చూలు కట్టినందున తండాకు తీసుకు వచ్చి దాని భాధ్యత కొడుకు బూక్యాకు అప్పగించి వెళ్లాడు. హోళీ పండగ ముందు రోజున చూలు కట్టిన మంగీ మగ గాడిద పిల్లను ప్రసవించింది. బుడతడు బూక్యా ఆనందానికి హద్దు లేక పోయింది. తండాలో హోళీ పండగ బాగా జరుపుకుంటారు.అందువల్ల అంతటా కోలాహలం మొదలైంది. వారం రోజుల ముందు నుంచే తండాలోజనం గుడుంబా వేడుకల్లో మునిగి తేలుతున్నారు. హోళీ పండగ కోసం తండాకు తిరిగి వచ్చిన తండ్రి చంద్రా నాయక్ ను చూసిన బూక్యా పరుగున ఎదురెళ్లి " అయ్యా ! మన మంగీకి కొడుకు పుట్టిండు " అంటూ అరవసాగాడు. బుల్లి మగ గాడిద పిల్లను రంగులతో నింపేసాడు. మంగీకీ మగ పిల్లాడు పుట్టాడనీ తెలిసి తండాలో ఘనంగా హోళీ గుడుంబా వేడుకలు జరిపించాడు చంద్రా నాయక్. * * *

మరిన్ని కథలు

Nee jeevitam nee chetallo
నీ జీవితం నీ చేతల్లో
- జి.ఆర్.భాస్కర బాబు
Aseerwada mahima
ఆశీర్వాద మహిమ
- ambadipudi syamasundar rao.
Okati tliste marokataindi
ఒకటి తలుస్తే మరొకటైంది
- మద్దూరి నరసింహమూర్తి
Swargalokam vardhillali
స్వర్గలోకం వర్ధిల్లాలి
- సదాశివుని లక్ష్మణరావు విశాఖపట్నం
Dongalu baboy
దొంగలు బాబోయ్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Lokam teeru
లోకం తీరు
- టి. వి. యెల్. గాయత్రి.
Navyapatham
నవ్య పధం
- కొడవంటి ఉషా కుమారి
Gamyam teliyani gamanam
గమ్యం తెలియని గమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు