అది ఒక చిట్టడవి అక్కడ కొన్ని సాధుజంతువులు ఉంటున్నాయి.ఒక పెద్ద చెరువులో మాత్రం రెండు మొసళ్ళు ఉన్నాయి. ఒక సారి ఒక కోతి భార్యకు బాగా జ్వరం వచ్చింది. అది తగ్గడానికి ఒక రకం ఆకు పసరు కావాలి అడవి చుట్టూ తిరిగి వెళితే ఎంతో ప్రయాస అదే చెరువు దాటి వెళితే చాలా సునాయాసంగా చేరుకోవచ్చు. కానీ వెళ్ళడం ఎలా అని మగ కోతి బాగా ఆలోచించించి చెరువు దగ్గరకు వచ్చింది కొద్ది దూరంలో మొసలి కనిపించింది. కోతి ఆ మొసలిని రమ్మని పిలిచింది.
“ఎందుకు పిలిచావు” అని అడిగింది మొసలి. “ఏమీ లేదు నా భార్యకు ఆరోగ్యం బాగులేదు. ఒడ్డు అవతల కొన్ని మొక్కల ఆకులు కావాలి. వాటి పసరుతో ఆరోగ్యం బాగవుతుంది...అందుకు నీ సాయం కావాలి అందుకే పిలిచాను” చెప్పింది కోతి.
“అందుకు నేనేం చేయాలి” అంది మొసలి.”నేను నీ వీపు మీద కూర్చుంటాను అవతల ఒడ్డుకు చేరిస్తే నేను వెళ్ళి మొక్కల ఆకు కొమ్మలు తీసుకుని వచ్చాక. నన్ను మళ్లీ ఈ ఒడ్డుకు చేర్చు” చెప్పింది కోతి.
“అందుకు నాకేంటి లాభం?” అంది మొసలి. “నీకేం కావాలో చెప్పు తీర్చగలిగేది అయితే తప్పకుండ తీరుస్తా” అంది కోతి.
“ఏమీ లేదు... ఒక సారి మా తాతయ్య ఇలాగే నీలాంటి కోతికి సాయం చేశాక మా అమ్మమ కోసం కోతి గుండెకాయ కావాలంటే అది ఇంట్లో పెట్టి వచ్చాను అని చెప్పిందట” అంది మొసలి.
ఈ విషయం గురించి కోతికి కూడా తెలుసు...వెంటనే “అవును మా కోతుల ఆచారమది. బయటకు వచ్చేప్పుడు గుండె కాయను ఇంట్లో పెట్టి వస్తాము” అంది కోతి.
“నీకు నా సాయం కావాలంటే నీ గుండె కాయ కావాలి... దానిని నా భార్యకు కానుకగా ఇస్తాను” ఇందుకు సరేనంటే చెప్పు” అంది మొసలి.
“ఆ గుండెకాయ ఎలాఉంటుందో చూశావా?” అంది కోతి. “లేదు మా అమ్మమ్మ చెబితే విన్నాను” అంది మొసలి.
“నీకు మాట ఇస్తున్నాను నా భార్య ఆరోగ్యం బాగుపడగానే నా గుండెకాయను తెచ్చిస్తాను...ఇందుకు సాక్ష్యం అదిగో ఆ చెట్టుమీదున్న చిలుక” అని చిలుకను పిలిచింది కోతి.
చిలుక వీరున్న చోటికి వాలగానే కోతి విషయం చెప్పింది.”అవును నేను సాక్ష్యంగా ఉంటాను” అంది చిలుక.
“సరే నా వీపు మీద కూర్చో” అని కోతి కూర్చున్న తరువాత నీటిపైన ఈదుతూ అవతల ఒడ్డుకు చేర్చింది.కొద్ది సేపట్లో కొన్నిఆకు కొమ్మలతో తిరిగి వచ్చి కోతి,మొసలి వీపు మీద కూర్చుంది.ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగానే ఒడ్డు వచ్చింది.
“మొసలి బావ నీకు కృతజ్ఞతలు...నా భార్యకు జ్వరం తగ్గగానే నీకు నా గుండెకాయ తెచ్చి ఇస్తాను” అంది కోతి.
“మరిచిపోకూ సుమా!” అంది మొసలి.అలాగే అని గబగబా ఇంటికి వెళ్ళి పోయింది కోతి.
కోతి ఆకు పసరుతో తన భార్య జ్వరాన్ని తగ్గించగలిగింది.మొసలికి ఇచ్చిన వాగ్దానం గుర్తుకు వచ్చి చెట్టు పైన ఉన్న చిలుకను కిందికి రమ్మంది.చిలుక కిందకు వచ్చాక తన గుండెకాయ గురించి ముచ్చటించింది. అదే సమయానికి ఒక కుందేలు తెల్లగా ఉండే దుంపను నోటితో పట్టుకుని వీరున్న చోటికి వచ్చింది.
“ఏంటి ఇద్దరూ దేని గురించో ముచ్చటిస్తున్నారు” అంది కుందేలు.
“చూడు కుందేలు బావ... ఈ తెల్ల దుంపలుగానే ఎర్రగా ఉండే దుంపలున్నాయా? అని అడిగింది చిలుక.
“ఎందుకు లేవు... నాతో రండి” అని ఒక చోటుకు తీసుకెళ్లింది. అక్కడ కొన్ని మొక్కలను పైకి లాగగానే వేర్లకు దుంపలు కనిపించాయి వేర్ల నుండి రెండిటిని తెంపి కోతికి ఇచ్చి కొరక మంది కోతి కొరకాగానే రక్తం లాగా కారుతూ ఎర్రటి కండ కనిపించింది.(దానిని బీటు దుంప అంటారు మన బాషలో బీట్రూట్)
“చూడు కోతి బావ... మొసలికి నీ గుండెకాయ ఎలా ఉంటుందో తెలియదు..ఈ కాయ చాలు దీనిని తీసుకుని చెరువు వద్దకు వెళదాము పద” అంది చిలుక.
చెరువు వద్దకు వెళ్లి దూరంగా ఉన్న మొసలిని పిలువగానే ఒడ్డుకు చేరింది మొసలి. “ఇదుగో నా గుండె కాయ” అని రక్తంలా నీరు కారుతున్న ఆ దుంపను మొసలి నోటికి అందించింది కోతి.మొసలికి ఎంతో సంతోషమేసింది.
“మాట నిలబెట్టుకున్నావు.. .చాలా సంతోషం ఇప్పుడే తీసుకెళ్లి నా భార్యకు ఇస్తాను” అని ఒడ్డు నుండి నీళ్ళలోకి వెళ్లిపోయింది.
“హమ్మయ్య!... గండం గడిచింది” అంది చిలుక.”అవును నీవు గుండెకాయ ఎలావుంటుందో తెలియదు అని చెప్పడం ...సమయానికి కుందేలు బావ!రక్తం దుంపను ఇచ్చి నా గుండెకాయ సమస్యను సునాయాసంగా పరిష్కరించింది” అని కోతి,కుందేలుకు ధన్యవాదాలు చెప్పింది.అవును అని అంది చిలుక.
****