పశ్చాత్తప్తుడు - చెన్నూరి సుదర్శన్

Paschattaptudu

కోరికలే గుర్రాలైయితే..! అనర్థం తప్పదు” అంటూ తన అరవైయేండ్ల అనుభవాన్ని రంగరించి కథలు, కథలుగా చెప్పసాగాడు చర్చిఫాదర్ జోసెఫ్. అతనికెదురుగా కూర్చోని ప్రశాంతంగా వింటోంది మేరీ.

మేరీ వయసు దాదాపు మూడు పదులకు దగ్గరలో ఉంటుంది. జీసెస్ అంటే ప్రాణం. కన్నతల్లిదండ్రులెవరో తెలియని తను జోసెఫ్ బోధనలలో పెరిగింది. కృతజ్ఞతాభావంగా జోసెఫ్ కోరిక మేరకు ‘నన్’ గా జీవనం కొనసాగిస్తోంది. కానీ వయసుతో ముడి పడిన మనసుకు మాత్రం పగ్గాలు వేయలేక పోతోంది.. హాయిగా గగనంలో విహంగంలా బతకాలని కలలు కంటోంది. ఈ మధ్య మేరీ ప్రవర్తనలో మార్పులు గమనించి ఆమె కోరికల గుర్రాలకు కళ్ళెం వేయాలని తాపత్రయ పడ్తున్నాడు జోసెఫ్. కాని మరో వంక ఇది ఎంత వరకు సమంజసమని అతని మనసూ కొట్టుమిట్టాడుతోంది.

జోసెఫ్ కాసేపు దీర్ఘంగా ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా..

“చూడు మేరీ... నా నిజ జీవితగాధ నీకు ఎన్నాళ్ళుగానో చెప్పాలని.. సరియైన సమయం కోసం ఎదురి చూస్తున్నాను. ఇక చెప్పక తప్పదు..” అంటూ చెమ్మగిల్లిన తన కళ్ళను రెండు వేళ్ళతో ఒత్తుకుని తిరిగి చెప్పసాగాడు. మేరీ మోములో ఆందోళన.. విస్మయంగా వినసాగింది.

“నా పేరు నిత్యానందం. నేను నా తల్లిదండ్రులకు ఏకైక సంతానాన్ని. అతిగారాబంగా పెరిగాను. నా మీద ఆశలు పెట్టుకున్న అమ్మా, నాన్నలను మోసం చేసి ఆస్తి దండుకొని వారిని కాలదన్నాను. విచ్చల విడిగా బయట ప్రపంచంలో అచ్చోసిన ఆంబోతులా తిరుగుతూ నా పేరుకు తగ్గట్టు కోరికలను తీర్చుకున్నాను. దానికి ఫలితంగా రోగగ్రస్తుడనయ్యాను. కాసులతో నా ఆరోగ్యాన్ని కొనుక్కోలేక పోయాను. డబ్బుతో దరికి వచ్చిన మిత్రులు.. నా జబ్బుతో మటుమాయమయ్యారు.

నా దౌర్భాగ్యపు ముఖాన్ని ప్రపంచానికి చూప లేక ఆత్మహత్య చేసుకోబోయాను. అప్పుడు ఒక మహానుభావుడు ఈ చర్చికి తీసుకు వచ్చాడు. చర్చి ఫాదర్ నాకు ధైర్యం నూరి పోశాడు. అతని సూచన మేరకు నేను చేసిన అపరాధాలను జీసెస్ కు చెప్పుకుని క్షమించమని వేడుకున్నాను.

ఫాదర్ వైద్యంతో బాటు, తన ఆప్యాయతానురాగాలను పంచి నాకు ప్రాణదానం చేశాడు. అప్పుడు నాకు జ్ఞానోదయమయ్యింది. మనిషికి డబ్బు కంటే ప్రధానమైనది.. తోటి మనుషుల వాత్సల్యమేనని. ఫాదర్ ప్రేరణతో.. జీసెస్ ను ఆరాధిస్తూ అతని సన్నిధిలోనే సమయమంతా వెచ్చించే వాణ్ణి. నా భక్తి భావన చూసి ఫాదర్ తన వారసత్వాన్ని నాకు అందజేసి కన్ను మూశాడు.

నేను సర్వమతాలను గౌరవిస్తాను. మతాలకు ముందుగా మనం మనుషులం. ఏ మతమూ మరో మతాన్ని ద్వేషించమని చెప్పదు. అలాగే ఒక మనిషికి మరో మనిషిని ద్వేషించమనీ చెప్పదు.

మేరీ..! ఈ మధ్య నీ నడవడికను నిశితంగా గమనిస్తూ వస్తున్నాను. మన గౌతమబుద్ధుడు చెప్పినట్టు దురాశ దుఃఖానికి మూలం. కాని నీలో ఏ దురాశా కనబడ లేదు. ప్రాకృతిక.. అతిసహజమైన ఆశ మాత్రమే నీలో ఉంది. నీ మనసును చంపుకుని ‘నన్’ గా జీవించుమనడం నా ధర్మం కాదు. అలాంటి ఆంక్షలు పెట్టడం జీసెసూ.. మెచ్చడు. నీ ఇష్టానికే వదిలేస్తున్నాను.

అయితే నాదొక కోరిక కాదనకు మేరీ.. నీ వివాహం నా చేతుల మీదుగా.. నీకిష్టమైన వ్యక్తితో సంప్రదాయ పద్ధతిలో జరిపిస్తాను” అంటూ భరోసా కలిగిస్తుంటే.. జోసెఫ్ పాదాలపై పడిపోయింది మేరీ.

“నీ మనసులో ఎవరైనా ఉన్నారా మేరీ.. నిస్సంకోచంగా చెప్పు తల్లీ..” ఆప్యాయంగా అడిగాడు జోసెఫ్. ఆనందంలో ఆమె నోట మాటలు కరువయ్యాయి. తల అడ్డంగా ఊపింది మేరీ.

ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు జోసెఫ్. మేరీ తల నిమిరి ఆశీస్సులిస్తూ.. పైకి లేపి తన గుండెలకు గుండెలకు హత్తుకున్నాడు.

***

ఆరోజు ఆదివారం.

చర్చి నిండుగా ఆహ్లాదకరంగా ఉంది. భక్తి ప్రపత్తులతో ఏసు కీర్తనలు మిన్నంటాయి. మేరీ ముఖకవళికలలో ఆనందపు ఛాయలు చూసి జోసెఫ్ మురిసిపోసాగాడు. మరో ప్రక్క మాటి, మాటికి తనకు కావాల్సిన మనిషికోసం అతని కళ్ళు ప్రాంగణమంతా కలియ తిరుగుతున్నాయి. చటుక్కున జోసెఫ్ కళ్ళు తళుక్కున మెరిసాయి. మురళి కనిపించాడు. జోసెఫ్ పెదవులపై చిరునవ్వు మొలిచింది.

ఆనాటి ప్రార్థనా సమయం ముగియగానే.. చర్చి సహాయకున్ని పిలిచి.. మురళిని తీసుకు రమ్మంటూ చెప్పాడు జోసెఫ్.

మరో ఐదు నిముషాలలో ఖాళీ అయిన చర్చి హాల్లో కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు.

తన పథకం ప్రకారం ముందుగా పరిచయ వాక్యాలతో ప్రారంభించాడు జోసెఫ్.

“చూడు మేరీ.. ఇతను మురళి. నాకు బాగా తెలిసిన వాడు. మురళి బాల్యంలోనే తన కుటుంబాన్ని పోగొట్టుకుని అనాధగా మిగిలాడు. మార్గదర్శకమైన జీవతమంటే ఏమిటో తెలియక చిల్లరమల్లరగా తిరిగాడు. చేయని నేరానికి బాల నేరస్థుడుగా జైలు పాలయ్యాడు. జైలు నుండి పారిపోవడం.. తిరిగి పట్టుబడి జైలుకెళ్ళడం... అలా దాదాపు పాతిక సంవత్సరాలు జైల్లోనే గడిపాడు. అక్కడ తోటి ఖైదీల సహచర్యంతో అసలు జీవితమంటే ఏమిటో బోధ పడింది.

జైలు నుండి బయటికి వచ్చాక కారు మెకానిజం నేర్చుకున్నాడు. ఒక మెకానిక్ షెడ్డు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. మురళి జన్మతః హిందువు అయినప్పటికీ దేవాలయాలతో బాటుగా.. చర్చికి వస్తాడు. మసీదుకూ వెళ్తాడు. జైలు జీవితం అనుభవించాడని.. అతనికి పెళ్లి సంబంధాలు రావడం లేదు.

నీకు అన్ని విధాల సరియైన జోడని నా నమ్మకం. నేను ఇదివరకే నీగురించి మురళికి చెప్పాను. మురళి సుముఖత వ్యక్తపరిచాడు. ఇక నీ అభిమతమే కావాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ.. సుఖ జీవనం కొనసాగించాలన్నదే నా కోరిక“ అంటూ మేరీ వంక కరుణాపూరిత నయనాలతో చూశాడు జోసెఫ్.

మేరీ నిర్ఘాంత పోయింది. ఊహించని పారిణామానికి తబ్బిబ్బయ్యింది. అంగీకారం తెలుపుతున్నట్టుగా చటుక్కున లేచి జోసెఫ్ పాదాలను స్పృశించింది. మురళి మేరీని అనుసరించాడు.

మురళి ఎవరో కాదు.. జోసెఫ్ కొడుకు.

ఈమధ్య చర్చి కారు రిపేరుకై మురళి షెడ్డు కెళ్ళినప్పుడు.. మురళి తల్లి ఫోటో చూసి గుర్తుపట్టాడు జోసెఫ్.

నిత్యానందంగా జీవిస్తున్న కాలంలో తనచే వంచించబడిన ఒక అభాగ్యురాలికి పుట్టిన మురళిని జైలు పాలు చేసిందీ తనేనని కన్నీరుమున్నీరయ్యాడు.

దానికి ప్రాయశ్చిత్తంగా తిరిగి మురళికి సంఘంలో సముచిత స్థానం కల్పించాలనే తపనతో మేరీని మురళికిచ్చి వివాహం జరిపించాలనే తన ప్రయత్నం ఫలించినందుకు సంతోషించాడు.

ఇరువురిని మనఃస్ఫూర్తిగా దీవించి పైకి లేపి తన హృదయానికి హత్తుకున్నాడు. జీవిత చరమాంకంలో ఒక మంచి పని చేశాననే తృప్తితో.. అతని కళ్ళు వర్షించాయి. *

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.