ప్రేమపాశం - ఆదూరి హైమవతి

premapaasham

"హలోఆమ్మా! రిటైరయ్యాక ఎలా తోస్తున్నది? రోజంతా ఏం చేస్తున్నారు?" శనివారం ఉదయాన్నే ఫోన్లో మావాడు.

"ఏముందిరా? వంట, గుడి, న్యూస్ పేపర్స్, వార, మాసపత్రికలు, మెయిల్స్ చూట్టం, జవాబులివ్వటం. టీ.వీ.ఫోన్లూనూ..." గడగడా చెప్పేశాను.

"సరేకానీ ఈసమ్మర్కు మావద్దకు రాకూడదూ! "గోముగా అడిగాడు మావాడు. మామీదున్న ప్రేమంతా వాడిమాటల్లో ప్రవహిస్తున్నట్లు అనిపించి నాకళ్ళలో నీరు చిప్పిల్లింది.

"అమ్మో! అమేరికానా! వద్దు బాబూ వద్దు." గబుక్కుని అనేశాను.

"ఏం? ఇదేదో చెర్లపల్లి జైల్లా భయపడుతున్నావ్? ఏంనాన్నా! ఏంచేస్తారక్కడ? ఈసమ్మరుకు రండి ఆరునెలలూ హాయిగా గడపొచ్చు..." కాస్తంత కోపంగానే అన్నాడు వాడు.

"అంటే అదీ…" మావారు నాన్చడం విని...

"అదీలేదు ఇదీలేదు. వస్తున్నారంతే! ఉద్యోగంలో ఉన్నప్పుడంతా శలవుల్లేవనీ, ఆఫీస్ పననీ సాకులు చెప్పారాయె ఇద్దరికిద్దరూనూ! మీమనవళ్ళతో ఇంకెప్పుడు ఆడుకుంటారు చెప్పండి! నేనే టికెట్స్ బుక్ చేసి మైల్లో పంపుతాను. వచ్చేయండి"

"మరిఇల్లురా?..." ఏదో అడ్డంకి చెప్పి ఆపవచ్చని ఆయన ప్రయత్నం.

"అద్దె కిచ్చెయ్యండి."

"మళ్ళీ వచ్చాక ఎక్కడుంటాంరా? ఆర్నెల్లకు ఎవరొస్తారు అద్దెకు?"

"అసలు మీకు ఇద్దరికీ అంత ఇల్లేందుకూ? అమ్మకూ అంత ఇల్లు శుభ్రం చేయడం ఎంతకష్టం? నాల్గు గదుల ఇల్లుకదా! రెండు గదుల్లో మీసామానంతా సర్దుకుని, అద్దెకిచ్చి వచ్చెయ్యండి. భద్రతకు భద్రతా, అద్దెకు అద్దెవస్తాయి. రేపే టికెట్స్ బుక్ చేసి పంపుతాను సరా!"వాడి మాటలు ఆఙ్ఞలానే ఉన్నై.

***

"ఏమోయ్! భద్రా! నీకొడుకు టికెట్స్ పంపాడు. మే రెండోశనివారం మనం ఫ్లైట్ ఎక్కాలి. అక్కడికి అదేరోజు చేరుతామట! ఇక్కడికీ అక్కడికీ పది పన్నెండు గంటలు తేడాకదా!" మావారు పీ.సీలో మెయిల్ చదువుతూ చెప్పారు.

“ఇది మార్చి చివరివారం ఖచ్చితంగా ఆరువారాలు ఉంది సమయం. నేవెళ్ళి ఎవరైనా బ్రోకర్తో చెప్పివస్తాను మనిల్లు అద్దెకిస్తామని. ఏంటీ నేను మాట్లాడుతుంటే అలా మౌనంగా ఉండిపోయావ్? ఇష్టం లేకపోతే చెప్పేద్దాం భద్రా!"

"ఆవిషయం టికెట్స్ బుక్ చేయకముందే చెప్పాల్సింది. ఇప్పుడంతా అయ్యాక రామంటే వాడు బాధపడతాడేమోనండీ!"

"భద్రా! చూద్దాం! ఉండలేకపోతే వచ్చేద్దాం.సరా!" నాకు ధైర్యం చెప్పారాయన.

హడావిడిగా, మూడీ మూడీగానే రెండునెలల్లో పనులు పూర్తిచేసుకుని, ఇల్లు అద్దెకిచ్చి వారికి అన్నిజాగ్రత్తలూ చెప్పి, బయల్దేరాం, అమెరికాకి. అగ్రదేశం, సంపన్నదేశం అని ముద్రవేసుకున్న పరాయిదేశానికి.

భారతదేశంలోని ఎన్నో మధ్యతరగతి కుటుంబాలను పైకెత్తిన 'సాఫ్ట్ వేర్ దేవత!', కొందరికి వరాల జల్లు కురిపిస్తే, మరికొందరికి 'శాపాలవిల్లు' ప్రసాదించింది. వరాలూ, శాపాలూ ఒకే కుటుంబాలకు చెందడం విశేషం. వరాలు పొందిన విద్యావంతులైన పిల్లలు విదేశాలు పట్టుకుపోతే, శాపాలపాల బడ్డవారు(వరాలబిడ్డలతలిదండ్రులు) తమ జన్మభూమిలో వంటరి బ్రతుకే దిక్కై చావలేక బ్రతుకుతున్నవారు. ఎక్కడ చదివానో గుర్తులేదు కానీ ఒకరచయిత ప్రవచనం మాత్రం గుర్తుంది, నాకు బాగానచ్చింది కూడాను. 'ఐదురోజులు జైలు, రెండురోజులు బైలు.' - ప్రస్తుతం ఆశిక్ష మాకు మేమే విధించుకుని వచ్చాం కనుక ఎవ్వర్నీ నిందించే పనిలేదు.

ప్రాణాలు ఉండబట్టలేక గ్రాండ్ చిల్డ్రన్ ను చూసి హాయిగా ఆడుకొమ్మనే మావాడి మాటతో (ఏస్కాములూ, దోపిడీలు దొంగతనాలూ, చేయకుండానే మాకు మేమే శిక్షవిధించుకుని)వచ్చాం. వచ్చిన కొత్తలో అదోస్వర్గం. ఆతర్వాత ఇది ఖరీదైన జైలు. పిల్లలకు వర్కింగ్ డేస్ అన్నీ మాకు జైల్ డేస్, వారాంతంలో వాళ్ళు డ్రైవ్ చేసుకుని తీసుకెళ్తే బయటికి వెళ్ళడం. ఐనా, నో షాపింగ్, నో పేయింగ్ -- నో కుకింగ్, నో వాషింగ్! అన్నట్లు నాకో పెద్దసమస్య వచ్చిపడింది. చీరలు వాషింగ్ మిషన్లో వేస్తే ముడుచుకుపోడంవల్ల ఉతుక్కోడం, బేస్మెంట్లోనే ఆరేసుకోవల్సి వచ్చింది. బయట ఎంత ఎండ ఉన్నా బట్టలు ఆరేయకూడదు. వెళ్ళిన మరునాడు మాపిల్లలు ఆఫీస్ కెళ్ళాక డెక్పైన చీర వేలాడేశాను. మరునాడే మావాడికి నోటీస్ వచ్చింది, పది డాలర్స్ ఫైన్ అట! కట్టమని!. అందువల్ల బేస్మెంట్లో తాడుకట్టుకుని ఆరేసుకోడం మొదలెట్టాను. అదేదో రహస్య జీవితంలా.

శనివారంనాడు ఇండియన్ షాప్ కెళ్ళి కోడలు మమ్మల్నడిగి మాకు ఇష్టమైన కూరగాయలన్నీ తెచ్చి, ఐదురకాల కూరలూ, ఐదురకాల పప్పులూ చేసి ఫ్రిజ్లో ఉంచుతుంది. రాత్రి ఇంటికి రాగానే అన్నం, లేదా చపాతీ చేస్తుంది. డిన్నర్ తర్వాతే రేపటి లంచ్ బాక్స్లు కట్టుకుంటారు, ఉదయాన్నే తీసుకెళ్ళను. మేమూ మాకిష్టమైన కూరా, పప్పూ మైక్రోవేవ్లో వేడిచేసుకుని లంచ్ కానిస్తాం. రాత్రివి పగలూ, పగలువి రాత్రీ తినని మాకు వారపు తిండి ముంతల్లాంటి వాటిలో పెట్టి వేడిచేసుకుని తినడం కాస్తంత ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవమే ఐనా మరోమార్గంలేదు. నేనే "వంటచేస్తా"నంటే, మాకోడలు "రాకరాక వచ్చారు హాయిగా విశ్రాంతి పొందండి" అనేది. ఈ వ్యవహారమంతా కొత్తే! సాయంకాలం మూడున్నరకు, కమ్యూనిటీ బస్టాఫ్ కెళ్ళి మామనవలు బస్ దిగగానే తీసుకురావడం, వాళ్ళే పాలలో సీరియల్ వేసుకుని తిని హోంవర్క్ చేసుకుని, వేసవి గనుక బయట తోటిపిల్లలతో క్రికెట్, సైక్ లింగ్ వగైరా వగైరా ఆటల్లో ఉంటారు. మరి మాబాధేంటి అనుకుంటున్నారా? భాషా సమస్య పెద్దది.

వారికి తెలుగురాదు. మా మనవల అమెరికన్ ఇంగ్లీష్ మాకర్ధం కాదు. ఏదో బి.ఏ. చదివి ఉద్యోగాలు వెలగబెట్టి, రిటైరై ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్తో హాయిగా భారతంలో బ్రతుకుతున్న మాకు, మనవలతో మాట్లాడాను వారిస్పీడు, యాక్సెంట్ అర్ధం కాకపోడంతో వాళ్ళు “వాట్స్ మాం! గ్రాండ్ మా అండ్ గ్రాండ్ ఫా నాట్ ఎడ్యకేటెడ్! దే డోంట్ నో ఇంగ్లీష్!" అని అడగడం మేమెక్కడ వింటామోనని మాకోడలు "హూష్!" అనటమూ మాకు వినిపించినా, విననట్లే ఊరుకున్నాం. వారితో ఏదైనా మాట్లాడను,లేదా చెప్పనూ ప్రయత్నిస్తే, "ప్లీజ్ ఇన్ ఇంగ్లీష్... ఉయ్ డోంట్ అండర్ స్టాండ్!” అంటారు. మాకు మరీ ఇంగ్లీషు రాదనికాదు, ఆ యాస, స్పీడు రాదు ఆంధ్రదేశంలో ఆంధ్ర మాధ్యమంలో చదువు వెలగబెట్టి ఆంధ్రభాషలోనే అన్నిఅర్జీలూ, ఆఫీసు వ్యవహారాలూ చక్కబెట్టి వచ్చిన మాకు వారికి అర్ధమయ్యేలా మాట్లాట్టం రాదాయె! అందుకే మౌనవ్రతం. ఇంగ్లీష్ మీడియం ఆవస్యకత అర్ధమైంది. నిజానికి ఇదేకర్మ భూమేమో! మాట్లాడను ఎవ్వరూ పగలంతా ఉండరు గనుక మౌనవ్రతంతో, ధ్యానంలో గడపను ఎట్టి ఆటంకాలూ లేవు. ఒకరెదురుగా ఒకళ్ళం కూర్చుని ఎంతసేపని మాట్లాడుకుంటాం?

***

"బాబూ! ఇహ వెళతాంరా!" అన్నాను రెండునెలలు కాగానే.

"అదేంటీ! ఇంకా నాల్గునెలలు ఉందిగా వీసాకి? ఏదైనా ఇబ్బందా! రాధీ ఇటురా! అమ్మ వెళతామంటున్నది! నీవేమైనా అన్నావా?" అన్నాడు కోపంగా.

"అబ్బెబ్బే అదేం లేదురా! నాకోడలు బంగారం. నాకే కాస్త జన్మభూమి మీద బెంగపట్టుకుంది." అన్నాను.

"బెంగా! బెండకాయా! హాయిగా రెస్ట్ తీసుకో! అక్కడికి వెళ్ళినప్పట్లుండీ అన్నీ తెచ్చుకోనూ వండుకోనూ... ఇదేగా! ఎందుకాశ్రమ!" అన్నాడు.

"అదే అలవాటైన మాకు ఊరికే కూర్చుని తినడం ఇబ్బందిగా ఉందిరా!" అన్నాను.

"ఔనురా! నాకూనూ! మాట్లాడను ఎవ్వరూ ఉండరు, మాకా ఈభాష రాదాయె! ఎవ్వరి ముఖాలూ చూడకూడదాయె!ఎంతని తలవంచుకు నడుస్తాం?" అన్నారు మావారూనూ, నామాటకు ఓటేస్తూ.(ఇక్కడ తలెత్తి ఎవర్నైనా చూస్తే మాట్లాడాలి. మాకు అమెరికన్ ఇంగ్లీషా రాదాయె! కనీసం 'హాయ్! హెలో' అనైనా అనాలి. తెలిసిన మనుషుల్ని చూసే తలతిప్పుకునే దేశంలో పుట్టిపెరిగి వచ్చామేమో, ఇక్కడ కొత్త మనుషులతో మాట్లాడను మొహమాటం.) సరిమరి ప్రస్తుతానికి వస్తాను. "మీరు అక్కడా మేం ఇక్కడా ఎందుకమ్మా! అందరం ఇక్కడే హాయిగా ఉందాం. ఈ సమ్మర్లో మీరుండటం వల్ల పిల్లలు డేకేర్ కెళ్ళకుండా ఇంట్లో హాయిగా ఉంటున్నారు. మీరిక్కడుంటే పిల్లలు స్కూల్ కాగానే ఇంటికొచ్చి హాయిగా ఇంట్లో ఉంటారు, ఇంట్లో పెద్దలు మీరుంటే మాకూ నిర్భయంగా ఉంటుంది. మీకు గ్రీన్కార్డుకు అప్లై చేస్తాను, ఇక్కడే ఉండిపొండి..." అన్నాడు మావాడు, బాంబు పేల్చినట్లు నాగుండె ఠారుమంది. "ఇక్కడా! పెర్మనెంట్గానా?" అనేశాను అనుకోకుండా. "ఏమ్మా! నీకొడుకు ఇంట్లో ఉండను బాధేంటీ!? మీరిక్కడుంటే మాకూ, మాపిల్లలకూ హాయి, లేకపోతే మేము ఎవరైనా 'నానీ'లను వెతుక్కోవాలి, వాళ్ళు పిల్లలను ఎలాచూస్తారో తెలీదుకదా! రిటైరైన పేరెంట్సంతా వచ్చి ఇక్కడ మనవలూ, మనవరాళ్ళకోసం ఉండిపోతుంటారు గ్రీన్కార్డుమీద." అన్నాడు. ఆ ప్రేమపాశం, రక్తపాశం, యమపాశంలా 'గ్రాండ్ పేరెంట్స్ ను గ్రాబ్' చేస్తేస్తుంది కదా!

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు