కొత్తపేట ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్బంగా ఆటలు, పాటలు,గేయాలు,పద్యపఠణం,కథారచనపోటీలు నిర్వహించాలని, కొందరికి దేశ నాయకుల వేషాలు వేయించి ఏకపాత్రాభినయాలు, నాటికలు చేయించాలనుకున్నారు.కానీ దేశ నాయకుల వేషధారణ విషయంలో సమస్య వచ్చింది.ప్రధానోపాధ్యాయులు మాధవరావు పిల్లలతో భరతమాత,స్వామివివేకానంద,మదర్ థెరీష,వీర పాండ్య కట్ట బ్రహ్మణ్ణ,అల్లూరి సీతారామరాజు,ఛత్రపతిశివాజి,మహాత్మాగాంధీ,చాచానెహ్రూ,డా.బి.ఆర్.అంబేద్కర్,సుభాష్ చంద్రబోష్,భగత్ సింగ్ మొదలగు వారి వేషధారణ మరియు ఏకపాత్రలు ఉంటాయని అందుకు ఎవరు ముందు కొస్తారో నిల్చోండి" అన్నారు. వెంటనే నేను నేనంటూ అనేక మంది లేచారు. ఉన్నవేమో కొన్ని పాత్రలు. అందరికీ వేషధారణ అంటే ఖర్చుతో, శ్రమతో కూడిన పని. ఏ కారణం లేకుండా కొందరిని తీసివేస్తే నొచ్చుకుంటారు.మరి ఏం చేయాలో, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ,అర్థం కాలేదు.మాధవరావుఉపాధ్యాయులందరితో చర్చించాడు.అందరూ ఆలోచనలో పడ్డారు. చివరకు తెలుగు ఉపాధ్యాయుడు చలపతి ఒక ఆలోచన చెప్పాడు. అందరికీ ఆ ఆలోచన నచ్చింది. ఎవరైతే వేషధారణ కోరుకుంటున్నారో,వారు నలుగురు దేశనాయకుల గురించి రాయాలి. చెప్పాలి.ఈ పోటీలో ఎక్కువ మార్కులు సాధించిన విజేతలకు వేషధారణకు అవకాశమిస్తామని ప్రకటించారు వెంటనే పోటీలు నిర్వహించారు.విజేతలైన వారిలో ఎవరు బాగా ఏకపాత్రాభినయ ప్రతిభను కనపరిచారో వారిని ఎన్నికచేశారు. ఆ ఎన్నిక సమంజసంగా అనిపించి, అందరికీ నచ్చడం వల్ల విద్యార్థులెవ్వరూ నొచ్చుకోలేదు. వారి తల్లిదండ్రుల నుండి కూడా ఏసమస్యా రాలేదు. సమస్య పరిష్కారమైనందుకు ఉపాధ్యాయులు సంతోషించారు.