నెమళ్ళపాళెంలో ఉన్నతపాఠశాల ఉంది. వేసవి శెలవుల తర్వాత పాఠశాల తెరిచారు. పాఠశాల గదులు, వరండా, బూజుతో దుమ్ము,ధూళితో నిండి ఉంది. బడి తోటలో కలుపు మొక్కలు చాలా పెరిగి ఉన్నాయి. పదవతరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులు రాలేదు.తొమ్మిదవ తరగతి నుండి పదవతరగతికి వచ్చిన విద్యార్థులను పిలిచాడురఘురామయ్య.ఆయన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. మన పాఠశాల దుమ్ము, ధూళీతో ఉంది. బడి తోట నిండా కలుపు మొక్కలు పెరిగున్నాయి ఆట స్థలమంతటా ఆకులున్నాయి.ముందుగా వీటిని శుభ్రం చేసుకోవాలి.మీలో ఈ పనులు ఎవరు చేస్తారు" అన్నారు. అన్ని పనులు ఎలా చేయగలమని కొద్ది సేపు అందరూఉలుకూ పలుకు లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. తర్వాత మాతో కాదని చేతులెత్తేశారు. అంత వరకూ ఏదో ఆలోచిస్తున్న చక్రవర్తి ముందుకొచ్చి" నేను చేస్తానుసార్"అన్నాడు. 'ఇంతపని ఎలా చేస్తాడు? సాధ్యమేనా'!అని ఆ తరగతి పిల్లలు ఆశ్చర్యపోయారు. చక్రవర్తి పాఠశాలలోని పిల్లలందరినీ సమావేశ పరిచాడు. తరగతి గదుల్లో కూర్చోవాలన్నా, పాఠశాల నడవాలన్నా ముందుగా పరిసరాలు శుభ్రత చేసుకోవాలని వివరించాడు. పాఠశాల చివరి గదిలో శుభ్రతకు అవసరమైన చీపురులు,బిందెలు,బక్కెట్లు,మగ్గులు,చెత్తడబ్బాలు,పాతవస్త్రాలు ఉన్నాయని చెప్పాడు.బూజులు ఎవరు దులుపుతారు?. కసువు ఎవరు కొడతారు?. బిందెలతో నీళ్ళెవరు తెస్తారు? గదులు ఎవరు అలుకుతారు?ఆటస్థలం ఎవరు శుభ్రపరుస్తారు.?బడి తోటలో కలుపు ఎవరు తీస్తారు? చేతులెత్తండి" అన్నాడు.చాలా మంది పిల్లలు ఉత్సాహంగా చేతులెత్తారు. చక్రవర్తి అందరికీ ఎవరికిష్టమైనపని వారికి కేటాయించాడు.పిల్లలు ఉత్సాహంగా చేస్తుంటే ఉపాధ్యాయులు, చక్రవర్తి తిరుగుతూ సలహాలివ్వసాగారు. పదకొండు గంటలకు పనులన్నీ పూర్తయ్యాయి.ఫ్యాన్ గాలికి బండల తడి ఆరిపోయింది. అందరూ కాళ్ళు,చేతులు,ముఖం శుభ్రం చేసుకుని తరగతి గదుల్లోకెళ్ళి పోయారు. ప్రధానోపాధ్యాయుడు చక్రవర్తిని తన కార్యాలయంలోకి పిలిచి" పదవతరగతి పిల్లలు వెళ్ళిపోయారు. కాబట్టి మీలో ఒకరిని పాఠశాలకు నాయకుడిగా నియమించాలికదా!మీలో నాయకత్వ లక్షణాలు ఎవరికున్నాయో తెలుసుకోవడానికి ఈపనులు చూపెట్టి ఎవరు చేస్తారని అడిగాను. నువ్వు ధైర్యంగా ముందుకొచ్చి పిల్లలతో పనులు సులభంగా చేయించావు.వాళ్ళు పలకకుంటే ఏం చేసేవాడివి?"అన్నారు. పిల్లలకు ఆటలు, పాటలు, కథలంటే ఎంత ఇష్టమో పొరకలు ,చెత్తబుట్టలు ,చిన్న చిన్న బిందెలు, బక్కెట్లు మొదలగునవి పట్టుకొని పనులు చేయటమంటే చాలా ఇష్టం.పిల్లల ఉత్సాహం గురించి నాకు తెలుసు కాబట్టే బాధ్యత తీసుకున్నాను. ఉత్సాహం చూపని పనులను మాటలతో చైతన్య పరిచి చేయించుకుంటాను" అన్నాడు చక్రవర్తి. ప్రధానోపాధ్యాయులు రఘురామయ్యగారు "నీ సంకల్పం బలమైనది. సంకల్పం బలంగా ఉన్నవాళ్ళుఏదైనా సాధించగలరు" అని చక్రవర్తిని పాఠశాలకు నాయకుడిగా ప్రకటించారు.