స్వయంకృషి - కందర్ప మూర్తి

Swayamkrushi

అర్థరాత్రి పన్నెండు గంటలు దాటాయి. పోలిస్ జీపులో పెట్రోలింగ్ చేస్తున్న సబినస్పెక్టర్ గంగాధర్ బ్యాంక్ ఎటి ఎం వద్ద డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డు స్టూలు మీద కూర్చుని తదేకంగా ఏదో పుస్తకం చదువుతు కనిపించాడు. జీపు ముందుకు కదిలిపోయింది. ఎప్పటిలా రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ సబినస్పెక్టరు గంగాధర్ కి రోజూ బ్యాంక్ ఎటియం వద్ద శ్రద్ధగా పుస్తకం చదువుతు యూనిఫాంలో ఉన్న యువకుడు కనిపించాడు. మామూలుగా అర్థరాత్రి దాటిన తర్వాత డ్యూటీలో ఉండే సెక్యూరిటీ గార్డులు నిద్ర పోతూనో కునుకుపాట్లు పడుతు కనిపిస్తారు. పోలీసు జీపును ఆపి కానిస్టేబుల్ ను పంపి ఆ అబ్బాయిని దగ్గరకు పిలిపించాడు.సబినస్పెక్టరు పిలిచారనగానే భయపడుతు వచ్చి సెల్యూట్ చేసి నిలబడ్డాడు. సబినస్పెక్టరు ఆ అబ్బాయిని దగ్గరకు రమ్మని 'పేరేంటని' అడిగాడు. ఏం తప్పు జరిగిందోనని భయంగా ' వీరేశం ' అన్నాడు ' ఏ ఊరని ' అడిగాడు సబినస్పెక్టరు. ' పారుపల్లి ' జవాబిచ్చాడు వీరేశం. ' ఏ పారుపల్లి , గొప్పులదిబ్బ దగ్గర పారుపల్లి గ్రామమా? ' మళ్లీ ఉత్సుకతతో అడిగాడు ' ఔ నన్నాడు' వీరేశం. ఎవరబ్బాయివని అడగ్గా, బోడ వెంకటేశం కొడుకు నన్నాడు. ఆశ్చర్యం కనబరుస్తూ సబినస్పెక్టరు' నాదీ పారుపల్లే ! ఓరీ , నువ్వు వెంటేశం కొడుకువా? వాడు నా ఫ్రెండ్. నేను, మీ నాయన గవర్నమెంటు హైస్కూల్లో చదివినాము. టెన్తు పాసవగానె మీ నాయన ఐ.టి.ఐ లో చేరాడు. నేను పట్నం వచ్చి పార్టుటైము ఉధ్యోగం చేసుకుంటు డిగ్రీ పూర్తి చేసి పోలీసు సబినస్పెక్టరు సెలక్షన్ కోచింగు తీసుకున్నాను. సెలక్షన్ ఎగ్జామ్సులో పాసై సబినస్పెక్టరు ట్రైనింగు పూర్తయి ఇక్కడ పోలీసు స్టేషన్లో పోష్టింగు ఇచ్చారని చెబుతు, నీ సంగతేంటని వివరాలడిగాడు వీరేశాన్ని. " నాన్న ఐ.టి.ఐ ఫిట్టర్ ట్రైనింగు పూర్తి చేసి కొంతకాలం ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసి బ్రోకర్ ద్వారా దుబాయ్ వెళ్లాడు.అక్కడ కంపెనీ వాళ్లతో కొట్లాట జరిగి జైల్లో పెట్టినారట. ఆరు సంవత్సరాలైంది. నాన్న ఆచూకి తెలవక, ఇంటి అవసరాలకు డబ్బు లేక అమ్మ కూలి పనుల కెళ్లి నన్నూ చెల్లిని సాకుతోంది. నేను ఇంటర్ పూర్తి చేసి సిటీ కొచ్చి రాత్రి సమయంలో సెక్యూరిటీ డ్యూటీ చేస్తు గవర్నమెంటు కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. తర్వాత గ్రూప్సుకి ఎగ్జామ్సు రాస్తాను" తన దీనావస్థను చెప్పుకున్నాడు వీరేశం. " చాలా సంతోషంగా ఉంది వీరేశం, బాగా చదువు.నీకే సమస్య వచ్చినా స్టేషన్ కొచ్చి కలుసుకో. నువ్వు పెద్ద ఉద్యోగం సంపాదించి మన ఊరుకు పేరు తేవాలి." దైర్యం చెప్పాడు సబినస్పెక్టర్. " అలాగే సార్" వినయంగా సమాధాన మిచ్చాడు వీరేశం. సబినస్పెక్టరు గంగాధర్ ప్రోత్సాహంతో మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ స్టడీసెంటర్లో గ్రూప్సు కోచింగు క్లాసుల్లో తర్ఫీదు పొందాడు. సెలక్షన్ ఎగ్జామ్సులో మెరిట్ సంపాదించి రిజర్వేషన్ కోటాలో రెవెన్యూ ఇనస్పెక్టరు నుంచి మండల రెవెన్యూ ఆఫీసరు స్థాయికి చేరుకున్నాడు వీరేశం . పెళ్లి చేసుకున్నాడు. చెల్లికి ఘనంగా పెళ్ళి జరిపించి తల్లిని వెంట తెచ్చుకున్నాడు. ఆరోగ్యం చెడి జైల్లో ఉన్న తండ్రి ఆచూకీ తెలుసుకుని పోలీసు సబినస్పెక్టరు గంగాధర్ సాయంతో దుబాయ్ నుంచి ఇంటికి రప్పించి వైధ్యం చేయించాడు. తను తోడు లేకపోయినా స్వయంకృషితో కొడుకు ఇంత ఉన్నత స్థాయికి చేరడం చూసి మురిసిపోయాడు వెంకటేశం. బాల్య మిత్రుడు గంగాధరానికి కృతజ్ఞతలు తెలియ చేసుకున్నాడు. విధుల్లో నిజాయితీ, సత్ప్రవర్తన తో ఉద్యోగం చేస్తూ బడుగు వర్గాల్లో పేరుపొంది సర్కిల్ ఇనస్పెక్టరు గా పదోన్నతి పొందాడు గంగాధర్. మండల రెవెన్యూ ఆఫీసరు వీరేశం తన గ్రామం పారుపల్లికి నిధులు సమకూర్చి పక్కా రోడ్లు వేయించి రవాణా సదుపాయాలు కల్పించి వ్యవసాయ దారులకు , చేతి వృత్తులు ,కూలిజనాలకు అనేక వసతులు, పిల్లలకు విధ్య సౌకర్యాలు సమకూర్చి పుట్టిన ఊరి అభివృద్ధికి అన్ని విధాల కృషి చేసారు వీరేశం , గంగాధర్ వెనుకబడిన గ్రామప్రాంతాల్లో సరైన విద్యాసౌకర్యాలు, దిశా నిర్దేశం, శిక్షణ లేనందున అనేక మట్టిలో మాణిక్యాలు మరుగున పడిపోతున్నాయి. * * *

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు