ఏం పాపం చేసిందో, ఇలాంటి పుట్టుక దొరికింది నులక మంచం మీద పడుకున్న కన్న కూతుర్ని చూచి వాపోవడం ఉదయం నుండి పదోసారి. . ఏళ్ల తరబడి మనసులో బాధపడుతూనే ఉన్నా వేదన మాత్రం తగ్గలేదు.ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు మాత్రం ఎండిపోయింది. జీవితం ఎడారిలా మారింది.. గోడ గడియారం పదకొండు గంటలు కొట్టింది. .అదిగో అల్లుడొచ్చేస్తాడు. అల్లుడి భార్య ఆండాళ్ళు వాకిట్లో గేటువద్ద నిల్చుని ఎదురు చూస్తోంది .అదేంటి అల్లుడి భార్య ......... వెనకో కథ.
తాయారమ్మ తలితండ్రులకు ఒక్కగానొక్క కూతురు. బోలెడంత ఆస్తి. ముద్దుగా పెంచారు. పదిహేనేండ్లకు పెళ్ళై నెల తిరక్కుండా కొత్త మొగుడు పచ్చ కామెర్లతో మరణ శయ్య మీదున్నపుడు వయసు పంతొమ్మిది. తొమ్మిది నెలల గర్భం. కూతురి తలరాతకు కుమిలి ఏడ్చి మనోవేదనతో మరణించిన మొగుడికి ఫై లోకంలో పక్కబలంగా ఉండాలని దూలానికి తాడుకట్టి తనువు చాలించుకుంది తాయారమ్మ తల్లి. కన్నపసికందు ఆడపిల్లని తెలిసినా ధైర్యంగా నిలబడి పెంచాలనుకుని నిర్ణయం తీసుకుంది తాయారమ్మ.
రోజులు గడుస్తున్నాయి. పేరుకు తగ్గట్లు సరళ సరళంగాపెరగలేదు. ప్రకృతి రీతిగా శరీరంలో మార్పులు వచ్చినా మానసికంగా ఎదుగుదల లేదు .మాటలు రాలేదు రక రకాల శబ్దాలు మాత్రం తన భాషగా మారింది. తయారమ్మకు మెల్లగా అర్థమవసాగింది. తన పిచ్చితల్లి నిజంగా పిచ్చితల్లేనని. గుండె బద్దలయ్యింది. పసిపాపగా ఉన్నపుడే ప్రాణాలు తీసివుంటే........ ఆ ఆలోచనకే భయపడింది. అమ్మాయి చిరునవ్వు నవ్వింది.
అందము, ఆస్తి ఉన్నా అల్లుడు కావటానికి ఏ మగాడూ ముందుకు రాలేదు. మిత్రులు, చుట్టాలు, ఇరుగు పొరుగూ అందరూ గుసగుసలు పోవడమేగాని వరుణ్ణి మాత్రం వెతకలేదు. ఎలాగోలా చివరికి పది మైళ్ళ దూరంలో, పల్లెటూళ్ళో పనిలేని పాపయ్య రాజా దొరికాడు. భార్య బ్రతికేవుంది. నాలుగు పదులు దాటిన వయసు. నలుపు రంగు. అయినా మగాడు. కనికరించి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు.షరతులూ పెట్టాడు. అత్తరికం. తనతోనే తన భార్య ఉంటుంది. పిచ్చిదానికి కావలసినదంతా చూసిపెట్టి నెలనెలా జీతం పుచ్చుకుంటుంది .తన మొదటి భార్యతో జీవితం.. పిచ్చితల్లి పేరుకు మాత్రం భార్య. మరే దుర్గుణాలు లేని రాజాను అన్ని షరతులకూ అంగీకరించి ఇంటికి తీసుకొచ్చింది. కనీసం ఓ మగదిక్కు ఇంటికొచ్చింది. మరో ఆడదిక్కుని కూడదీసుకుని.
అమ్మాయి పరిస్థితి ఇలా.అల్లుడిమీదేమో నమ్మకం లేదు. ఇంట్లో ఉన్న బంగారు నగలు, వెండి గిన్నెలు భద్రత కావాలి. ఎక్కడ ? ఎక్కడ? ఆలోచించగా చివరకు సమాధానం దొరికింది.... కమలమ్మ. అంతకన్నా ఆప్తురాలు ఎవరున్నారు? ఆత్మాభిమానానికి మారు పేరు. ఎంత కష్టపడుతున్నా చేయి సాచి ఎవరి సహాయం కోరింది లేదు. తాను సాయం చేయబోయినా చిరునవ్వుతో నిరాకరించేది. పోయిన జన్మలో తాను చేసిన పాపం తనను వెంటాడుతోంది. మంచివాళ్లకు చేసే చిరు సహాయమయినా కొంతలో కొంతలో పునీయం ఇస్తుంది కదా... అని తనకో పేరాశ. కానీ సహాయ నిరాకరణ చూపే కమలమ్మ వలన అది దొరికేలా లేదు.
పూజారి శంకరయ్య గారి కుటుంబమంటే అంత మర్యాద. చనిపోయి చాలా సంవత్సరాలయినా ఆయన కీర్తి మాత్రం ఆ ఊర్లో వెలుగు తగ్గకుండా ఉంది. పరిస్థితి బీదదయినా భర్త పేరు చెడకుండా గుట్టుగా పరువుగా సంసారం నెట్టుకొస్తోంది కమలమ్మ. ఒక్కగానొక్క కూతురు. పేరు మీనాక్షి. కాలేజీకెడుతోంది. వంటిల్లు సర్ది పడకున్నదన్న మాటేగాని కమలమ్మకు కునుకు రాలేదు...... సరిగ్గా ఇదే సమయం....... నిన్న రాత్రి జరిగిన సంఘటన కనుల ముందు కదలుతోంది .
సంవత్సరాల తరబడి నిద్రలేమి. నిన్న మాత్రం కొత్తా .... కళ్ళు మూసుకుని పడుకున్నా , ఎక్కడో చిన్న చప్పుడు. కళ్ళు మాత్రం తెరచుకున్నాయి. గదంతా చీకటి. చప్పుడయిన దిశకు చూపులు వెళ్లాయి. అడుగులో అడుగు వేస్తూ కూతురు ఇంట్లో ఉన్న ఒకే ఒక పెట్టె మూత తెరిచింది. అట్టడుగున వెతికింది. దొరికిన చిన్న గుడ్డ సంచీనుండి. ఒక చిన్న వస్తువుని తీసుకుని సంచిని తీరుగా ముడి వేసి , అడుగున పెట్టి, పెట్టె మూసి గది బయటకు వెళ్ళింది , మధ్య మధ్యలో తనను గమనిస్తూ.
మరుసటి రోజు కాలేజీ వెళ్లివచ్చిన కూతుర్ని, ఆలస్యానికి కారణం అడిగింది. నిజం చెప్పింది అమ్మాయి. పరీక్షకు ఫీజు కట్టాలి. నీ దగ్గరేమో లేవు. నీ స్నేహితురాలు చీర కొంగు దాపున తెచ్చి, నీకిచ్చి దాచమన్నది గమనించాను.నేను చేసింది తాత్కాలిక నేరం. పరీక్ష పాసవడం, మరో పరీక్షలో బ్యాంకు ఉద్యోగం రావడం ఖాయం. ఆ నమ్మకం నీకూ ఉంది. మొదటి నెల జీతం డబ్బు కుదువ పెట్టిన బంగారు గాజును విడిపిస్తుంది. నేరానికి జరీమానా లేదు. ప్రాయశ్చితం మాత్రమే. న్యాయాన్యాయాలు అవసరానికి తగినట్లు మారుతాయమ్మా .ఆ మాటలు విని మాటలు రాక నిస్చేష్టురాలయింది కమలమ్మ.
భయపడ్డంతా అయింది. నాలుగు రోజుల్లోనే తాయారమ్మ వచ్చింది, కాసేపు కబుర్లాడి తానిచ్చిన గుడ్డ సంచి ఇమ్మంది. ఇదివరకు ఎన్నడూ లేని వణుకు కమలమ్మ చేతులలో, తాయారమ్మ గమనించింది. మూట విప్పింది.మనసులో వేసుకున్న లెక్క పెదవులపై కదిలింది కానీ మాట మాత్రం బయటికి రాలేదు. కనులతో కమలమ్మ కనులు కలిసి కిందికి దిగాయి.. ' వస్తానమ్మా నీకూ తీరికున్నట్లు లేదు' బయలుదేరింది తాయారమ్మ. పలుసార్లు ఇలా మూటల మార్పిడీ జరిగినా ఇదివరకెన్నడూ ఇలా మూట విప్పదీసి చూసింది లేదు. చూపిందీ లేదు.కమలమ్మకు ఎదలో ఏ మూలో ముళ్ళు గుచ్చుకొన్నట్లు, తాను బభూమిలో కుంగిపోతున్నట్లు బాధ. అయినా తాయారమ్మ మాత్రం ఏమీ జరగనట్లు వెళ్ళిపోయింది. తనకు తెలిసిపోయిందా? తెలిసీ తెలియనట్లు ఉండిపోయిందా? భగవంతుడా! ఏమిటీ విషమ పరీక్ష. కుంగి పోయింది ఆమె మనసు.
సరిగ్గా చూసుకుందా? లేక భ్రమా? తల కొట్టుకోవటం దేనికి? ఏం జరిగిందో ఎలా జరిగిందో తనకు బాగా తెలుసు. పరీక్షకు ఫీజు కట్టవలసిరావడం, అమ్మకు తెలిసో తెలియకో, కూతురు మూట విప్పి ఒకే ఒక ఉరుపడి మాత్రం తీసుకుని కుదువ కొట్టుకు రావటం, ఆ శేఠ్జీ తన దగ్గరకు వచ్చి రెండో కుదువ పెట్టి డబ్బు తీసుకుంటున్నప్పుడు, పూర్తి కథ అర్థమయ్యింది. విచిత్రంగా మనసులో సంతోషం, సంతృప్తి తయారమ్మకు. ఎదో విధంగా తన సొత్తు ఓ మంచి కార్యానికి ఉపయోగపడింది. తన జీవిత ఖాతాలోకొంచెం పుణ్యం చేరింది.
పుణ్యం దొరికిందన్న తృప్తి తయారమ్మకు.
పాపం చేసామన్న భయం కమలమ్మకు
తనకేమో అన్నీ తెలుసునని పెదవులపై చిరునవ్వుతో ' పిచ్చితల్లి '