అంతే...! - అనిల్ ప్రసాద్ లింగం

Ante

విజయవాడ బస్టాండులో వాళ్ళూరికెళ్ళే నాన్ స్టాప్కి టిక్కెట్టులిచ్చే చోటుకి, ఎప్పట్లానే చూసొద్దామని వెళ్లిన నాకు మతి పోయినంతపనయ్యింది.
ఆడోళ్ళవరసలో ఐదో వ్యక్తి.... ఆమే... !
పులకరించిపోయిన మనస్సు అటేపు తీసుకుపోయింది.
ఆమేనా ? చిన్న శంఖ. కాస్త లావయ్యింది. ఆమే కదూ... నేను కనిపెట్టలేనా?
"ఏమండీ.. నాకూ ఓ టిక్కెట్టు..?" అంతా ఏదో మైకంలోనే - వెళ్లడం, జేబులోనుంచి డబ్బుతీసి - అడిగెయ్యడం.
"మేమే నాలుగురుమున్నామండీ - పిల్లలూ, నేనూ ఆయన. ఇంకెవరినన్నా అడగండి" అంటూ చెయ్యెత్తి బస్సు దగ్గరున్నవాళ్ళని చూపించింది.
వయసుతో గొంతులోకొచ్చిన గాంభీర్యం - అయినా అదే తియ్యందనం. సందేహం లేదు తనే. తాను కాదంటే మాత్రం ఇంకొకర్ని అడగెయ్యడమే? కాలు వెనుక్కి అడుగేసి మగాళ్ళ వరుసలో చివర్న నిలబెట్టింది.
నన్ను గుర్తుపట్టలేదా? లేక పక్కనాయనున్నాడని అలా చెప్పిందా? మరి తిరిగి చూడదే? పరిపరి విధాల ఆలోచనలు.
తానింతలో తనవాళ్ళతో బస్సెక్కింది. ఇప్పుడూ చూడదేంటి?
అడుగు కౌంటరు వైపు పడుతున్నా, కళ్ళు మాత్రం ఆమె కూర్చున్నా కిటికికేసే చూస్తున్నాయి. అవును తనే. మరి నన్ను అప్పుడే మర్చిపోయిందా? చూసి కూడా గుర్తించలేనంతగా మారిపోయానా? నాలో నేనే మదనపడుతున్నా. ఎదలో ఏదోలాగుంది.
బస్సు నిండిందనుకుంటా డ్రైవర్ ఎక్కేసాడు. ఇంతలో వరసలోనివారెవరో తుమ్మారు, అందరం ముఖాలకున్నా మాస్కులు సరిచేసుకున్నాం. అప్పుడనిపించింది బహుశా దీనివల్లే తాను నన్ను సరిగా చూడలేక పోయిందేమోనని. చేతులు ముక్కు మీదకున్నా మాస్కుని తొలగిస్తుండగా కాళ్ళు మళ్ళీ తమంతట తామే వెనక్కెళ్లుతున్న బస్సు వైపు కదిలాయి, తానెటో చూస్తుంది. నే చెయ్యెత్తాను, బస్సు కొంత మేర వెన్నకెళ్ళి, మలుపు తిరిగి, ముందుకు సాగిపోయింది.
'మొఖం చూడలేదు, లేకపోతే గుర్తుపట్టేదే' అంతా ఈ మాస్కువల్లేనని తిట్టుకుంటూ దాన్ని మళ్ళీ ముతిమీదకి ఎక్కించి మా ఊరి బస్సులాగే చోటికి నడిచాను.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు