భూమండలం మీదుండే గార్దభం మనసు ఆవేదనలో పడింది. మానవాళి భూమ్మీదుండే నాలుగు కాళ్ళ జంతువుల్లో మమ్మల్ని (గాడిదల్ని) చాలా అపహాస్యంగా చూస్తున్నారు. మా పుట్టుకలో ఎంత ముద్దుగా ఉంటామో వయసు పెరిగే కొద్దీ బానపొట్ట , చీపురు తోక , వికార ముఖం , అరటి డొప్పల చెవులు , ఏ జాతికి చెందని కాళ్ల గిట్టలు , భయంకర గొంతుక , పారపళ్లతో ఎబ్బెట్టుగా కనబడతాము.సృష్టిలో అటు అశ్వజాతికీ ఇటు జీరల గుర్రపు వర్గానికి కాకుండా చూసేవారికి నవ్వు కలిగించేలా జన్మ నిచ్చాడు విశ్వకర్మ బ్రహ్మ. మానవాళి మా చేత బరువులు మోయిస్తూ బండచాకిరి చేయించు కుంటారు కాని కడుపు నిండా పట్టెడు మెతుకులు పెట్టరు. అర్దాకలితో మాడ పెడతారు. సృష్టి కర్త బ్రహ్మ దేవుల వారు మా జాతి పట్ల అన్యాయం చేసారు. ప్రాణికోటిలో ప్రతి పక్షి , జంతువు ఏదో ఒక దేవతా వాహనంగా వినియో గించి గౌరవం , ఆదరణ కలగ చేసారు. మమ్మల్ని ఏ దేవుడు దేవతా తమ వాహనంగా పెట్టుకోరు. వికారంగా ఉండే మా కంఠం వింటే అందరూ నవ్వుకుంటారు. తన మనో వ్యథను సృష్టి కర్త బ్రహ్మ దేవునికి విన్నవించుకోడానికి బయలు దేరింది గార్దభం. మార్గమద్యలో నారదుల వారు ఎదురు పడి " ఎక్కడికి బయలు దేరావు గానగంధర్వ గార్దభ రాజా ! " అని పలక రించాడు. గార్దభం తన గోడు చెప్పుకుంది. నారదుల వారు విశ్వకర్మ ఉనికిని తెలియ చేసారు. బ్రహ్మ గారు వేద పారాయణం చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. గార్దభం అక్కడికి చేరుకుని వినమ్రంగా ప్రణామం చేసి తన మనోవ్యథ చెప్పుకుంది. గార్దభ గోడు విన్న సృష్టి కర్త తను ప్రకృతిలో జీవకోటికి తలరాతలు రాస్తున్నప్పుడు మీ గార్దభ జాతి వంతు రాగా మీ పూర్వీకులు నా నాలుగు తలలకున్న గెడ్డాల వెంట్రుకలు చిందర వందరగా ఉంటే నోట్లోని పారపళ్లు బయటకు పెట్టి పక్కున నవ్వి అపహాస్యం చేసారు. అప్పుడు నాకు క్రోధం కలిగి మీ జాతి జంతువులు మానవాళిలో వికటంగా అసహ్యంగా ఉంటారని శాపమిచ్చాను. అప్పటి నుంచి భూమ్మీద మీ గార్దభ జాతి అలాగే మనుగడ సాగిస్తోంది. నా శాపానికీ నుదుట వ్రాతకీ తిరుగులేదు. ఈ జన్మలో మంచి కర్మ చేసుకుంటే వచ్చే జన్మలో మంచి జీవిగా పుడతారని తరుణోపాయం చెప్పి వెనక్కి పంపాడు బ్రహ్మ దేవుడు. * * *