నేను పంతులమ్మగా పని చేస్తున్న కాన్వెంటులో, నా తరగతిలో తరణ్ చక్రవర్తి మూడవ తరగతి చదువుకొంటున్నాడు.మంచి పిల్లాడు. బుద్ధిమంతుడు.వాడిలో దయ,జాలి,కరుణ గుణాలతో పాటు భక్తిశ్రద్ధలు మెండుగా వున్నాయి.అంటే వాడి తల్లితండ్రులు వాడ్ని చాలా క్రమశిక్షణతో,పద్ధతిగా పెంచుతున్నారని తెలుస్తుంది.
ఓ రోజు ప్రైమరీ క్లాసు పిల్లలందరూ బడి ఆవరణలో వున్న చెట్ల క్రింద కూర్చొని కబుర్లు చెప్పుకొంటూ భోంచేస్తున్నారు. పిల్లలు సక్రమంగా భోంచేస్తున్నారా లేదా అని నేను పర్యవేక్షిస్తున్న సమయంలో అంతమంది పిల్లల్లో తరణ్ చక్రవర్తి కనబడలేదు. ఉదయం క్లాసులో వున్నవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు అన్న సందేహం రాగా క్లాసు పిల్లలను అడిగాను. వాళ్ళు 'మేం!వాడు వారం నుండి మాఅందరితో కలిసి లంఛ్ తినటం లేదు. ,ఒక్కడే విడిగాఎక్కడో కూర్చొని తింటున్నాడు'అని చెప్పారు.పిల్లలతోకలసి భోంచేయకుండా ఎందుకలా చేస్తున్నాడో తెలుసుకోవాలని తరగతి గదివేపు నడుస్తుండగా అనుకోని విధంగా నా కళ్ళు గేటువేపు చూశాయి. అక్కడ వాడు బిక్షాటన చేసుకునే ఓ ముసలావిడతో ఏదో మాట్లాడుతూ తన టిఫన్ బాక్సులోని కొంత భాగం అన్నం,పప్పు, దుంప వేపుడిని ఆవిడ ప్లేటులో పెట్టాడు. అది తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. తరువాత తరణ్ వరాండాలోకి వెళ్ళి చిన్న టవల్ను నేలమీద పరుచుకొని బాక్సులోని అన్నం భోంచేసి బాక్సుకడుక్కొని వచ్చి బ్యాగులో పెట్టుకొని తరగతి గదికి వెళ్ళి సీటులో కూర్చొన్నాడు.అదంతా దూరంగా నిలబడి చూసిన నేను విషయం తెలుసుకోవాలన్న వుద్దేశ్యంతో వాడి దగ్గరకు వెళ్ళి ప్రక్కన కూర్చొని"ఎంట్రా తరణ్ !ఆ ముసలా విడకు భోజనం పెట్టావా? అని అడిగాను.
"అవును మేం!ఆమెను కొడుకులు ఇంటినుంచి తరిమేశాడట.మా వూరిలోనే వీధి,వీధి తిరుగుతూ అన్నం అడుక్కు తింటుంది.మీరేకదా 'ఆకలి'అన్నవారికి అన్నం పెట్టాలన్నారు.మా అమ్మకూడా మీలాగే చెప్పింది.అందుకే అమ్మతో చెప్పి నా బాక్సులో వున్న రెండు అరలలో అవ్వకోసం ఓ అరలో అన్నం తీసుకువస్తున్నాను. అవ్వ ఖచ్చితంగా లంఛ్ సమయానికి ఇక్కడికొచ్చినేను అన్నం పెడితే తీసుకువెళ్ళి తింటుంది. ఒకవేళ అప్పటికే అవ్వ పొట్ట నిండి పోయుంటే ఆమెకు మిగిలి వున్న అన్నాన్ని తనవెంటే తిరిగే కుక్కపిల్లకు పెడుతోంది" అని సావదానంగా వివరణ ఇచ్చాడు. నేను ఆశ్చర్యానికి గురైయ్యాను.వాడిలోని దయాగుణాన్ని మనసులోనే హర్షించుకున్నాను. వాడు చెప్పిన తీరు నా మనసును హత్తుకొంది.వెంటనే ప్రేమతో వాడి బుగ్గను చిదిమి ముద్దు పెట్టుకొని "తరణ్ ! నీ మనసు మంచిదిరా!నీ తల్లిదండ్రులు నిన్ను చాలా పద్ధతిగా పెంచుతున్నారు. అవును .రోజూ నీ భోజనంలో కాస్త అవ్వకు పెట్టి ఆమె ఆకలిని తీరుస్తున్నావ్.ఇక నేనూ నీలా రేపటినుంచి నావంతుగా అవ్వకు కాస్త అన్నం పెడతాను.ఓకే!" అన్నాను.
"అలాగే మేం !"అన్నాడు వాడు.అప్పుడు వాడిముఖంలోఎనలేని సంతోషాన్నిచూశాను నేను.