నా సంపాదన నాతోనే..! - చెన్నూరి సుదర్శన్

Naa sampadana naathone

ఆరోజు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ‘ప్రశ్నావళి’ కార్యక్రమం..

ఆ వారంలో శ్రీహరి తాతయ్య చెప్పిన కథల్లో నుండి ఒక పిల్లవాడు ప్రశ్న సంధిస్తే.. మరెవ్వరైనా జవాబు చెప్పవచ్చు. పిల్లలెవరికీ జవాబు తెలియకుంటే.. తాతయ్య జవాబు చెబుతాడు. అలా ప్రతీ ఆదివారం పిల్లల్లో నూతనోత్సాహం పెల్లుబుకుతుంది. పిల్లలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురి చూస్తుంటారు.

శ్రీహరి తాతయ్య హాల్లోకి రాగానే పిల్లల గుస, గుసలన్నీ ఆగిపోయాయి.

“తాతయ్యా.. నేను ముందుగా ఒక ప్రశ్న అడుగుతాను” అంటూ చెయ్యెత్తాడు మురహరి. అడుగమన్నట్టుగా అనుమతిచ్చాడు తాతయ్య.

మురహరి లేచి నిలబడి చేతులు కట్టుకున్నాడు.

“గురువారం రోజు మీరు ఒక పిసినారి పాపయ్య కథ చెప్పారు. తన సంపాదన తనతో బాటు తీసుకెళ్ళాలని రహస్యంగా బొంతలో దాచిపెట్టుకున్న నోట్ల కట్టలపై పడుకొని కన్ను మూస్తాడు. అది గమనించకుండా.. అతణ్ణి అదే బొంతతో బాటు కాష్టంలో పెట్టి దహనంచేస్తారు కొడుకులు. ఆడబ్బును పాపయ్య తీసుకువెళ్ళినట్టేనా తాతయ్యా?” అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు.

తాతయ్య పిల్లల వంక కలియ జూశాడు సమాధానం కోసం.

నరహరి అనే పిల్ల వాడు లేచి “పాపయ్యతో బాటే డబ్బుగూడా కాలిపోయింది కనుక డబ్బు పాపయ్య పైలోకానికి తీసుకెళ్ళినట్టే” అన్నాడు. తన సమాధానం సరియైనదే కదా! అన్నట్టు తాతయ్య వంక చూశాడు.

తాతయ్య చిరునవ్వు నవ్వుతూ.. “పాపయ్య డబ్బు తీసుకు పోలేదు” అన్నాడు.

నరహరికి పౌరుషం పొంగుకు వచ్చింది. “అలాంటప్పుడు తమ వెంట తీసుకు పోలేని డబ్బు సంపాదన ఎందుకు? పాపయ్య బుద్ధిహీనుడా?” అంటూ తాతయ్యను చూసే ధైర్యం చాలక మురహరి వంక చూశాడు.. నీ అనుమానం నిజమే అన్నట్టు.

“పాపయ్య నిజంగా బుద్ధిహీనుడే.. నేనైతే నా సంపాదన నాతో బాటుగా తీసుకు వెళ్తాను” అన్నాడు తాతయ్య ప్రశాంతంగా. పిల్లలంతా విస్మయానికి గురయ్యారు ‘ఎలా అన్నట్టుగా..!’ గుస, గుసలు మొదలయ్యాయి.

నరహరి, మురహరి ఒకరి వంక మరొకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ ఆ చూపులను తాతయ్య దిక్కు మళ్ళించారు.

“మీరైతే ఎలా తీసుకు వెళ్తారు తాతయ్యా..” అంటూ ఇద్దరూ ఒకేసారి యుగళ గీతంలా అడిగారు.

పిల్లలలో ఉత్కంఠ పెరిగింది. తాతయ్య గొంతు సర్దుకునే సరికి హాలంతా సద్దుమణిగింది. మురహరిని, నరహరిని కూర్చోమన్నట్లు చేతితో సంజ్ఞ చేసి.. చెప్పసాగాడు శ్రీహరి తాతయ్య.

“మనం విదేశాలకు వెళ్ళినప్పుడు మన డబ్బు అక్కడ చెల్లుబాటు కాదు కదా..!” అనగానే పిల్లలంతా ముక్తకంఠంగా “అవును తాతయ్యా..” అన్నారు.

“అందుకని మనం డబ్బు మార్పిడి కేంద్రానికి వెళ్తాం, మనం ఏ దేశానికి వెళ్తామో చెబితే వాళ్ళు ఆ దేశపు డబ్బు విలువ లెక్క గట్టి చెబుతారు. ఉదాహరణకు .. మనం అమెరికా వెళ్ళాలనుకుందాం”

“అమెరికాలో డబ్బును డాలరు అంటారు తాతయ్యా” అంటూ చటుక్కున లేచి చెప్పింది సుమేధ.

“తనకే తెలుసన్నట్లు పెద్ద బడాయి.. కూర్చో! తాతయ్యను చెప్పనివ్వు” అంటూ తన చెల్లెలిని కసురుకున్నాడు నరహరి.

‘వ్వె.. వ్వె,, వ్వె..’ రూపంలో పెదవులను మడిచి వెక్కిరిస్తూ కూర్చుంది సుమేధ. నరహరీ ఊర్కో లేదు.. బయటికి వెళ్ళాక చూపిస్తా నాతడాఖా..’ అన్నట్టు చూపుడు వేలుతో బెదిరించాడు.

“తాతయ్యను చెప్పినిస్తారా లేదా?” అంటూ మురహరి ఇద్దరి వంక కొర, కొరా చూశాడు.

శ్రీహరి తాతయ్యకు వారిని చూస్తుంటే ముచ్చటేసింది. ఆ వయసులో దొర్లు మురిపాల దొంతరలవి. పిల్లలంతా తన సమాధానం కోసం తహ, తహ లాడ్డమే.. ఆ తగువుకు కారణమని చిరునవ్వు నవ్వుతూ.. తిరిగి చెప్పసాగాడు.

“సుమేధ డాలర్లని సరిగ్గానే చెప్పింది. ఈ రోజు దాదాపు మన డెబ్బది రూపాయలు ఒక డాలరుతో సమానం. ఇది స్థిరంగా ఉంటుందనే నమ్మకం లేదు. తరుచూ మారుతూ ఉండవచ్చు. మనకు ఎన్ని డాలర్లు అవసరమో.. వాటికీ సరిపడా.. డబ్బులిచ్చి డాలర్లు తీసుకుంటాం. మనం అమెరికాలో ఖర్చు చేయగా మిగిలిన డాలర్లను రూపాయలలోకి మార్చుకుని తెచ్చుకుంటాం.

అదే విధంగా నేను పై లోకానికి వెళ్ళినప్పుడు అక్కడి డబ్బు నాకు అవసరం కదా!.

నేను పైలోకానికి వెళ్ళక ఎలాగూ తప్పదు. అది నా చేతిలో లేని ప్రయాణం. అయితే ముందుగానే నా సంపాదనంతా పైలోకంలో చెల్లుబాటయ్యే పైకంగా మార్పిడి చేసుకుంటాను. దానికి డబ్బు మార్పిడి కేంద్రం నా వద్దనే.. నా చేతుల్లోనే ఉంది. ఆ పైకానికి పేరే పుణ్యం.

పాపయ్య తన డబ్బును పుణ్యంగా మార్పిడి చేసుకో లేదు. అందుకే అతనితో బాటు అతని డబ్బు వెళ్ళ లేదు.

నా సంపాదన రవంతైనా దాచుకోకుండా.. బీదవారికి, ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ ఉన్నాను. అదంతా పుణ్యంగా మారిపోతుంది. అలా పుణ్యమంతా మూటగట్టుకుని నాతో బాటుగా పై లోకానికి తీసుకు వెళ్తాను” అనగానే పిల్లల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. తాతయ్యా.. మమ్మల్ని వదలి పోవద్దు అన్నట్లుగా..

అది అర్థం చేసుకున్న శ్రీహరి తాతయ్య భారమైన గుండెలో నుండి చిరునవ్వు చిందిస్తూ.. “మీరంతా ఎదో రకంగా వీలున్నప్పుడల్లా ఒకరికి సాయ చేస్తుండండి. కాని ద్రోహం మాత్రం చేయకండి. అప్పుడు నేనెక్కడున్నా.. మీ వెంటే నా

ఆశీర్వాదాలు ఉంటాయి” అనగానే పిల్లలంతా..లేచి నిలబడి..

“దేవుడా.. మేము ఒకరికి వీలైతే సాయం చేస్తాం. కాని ద్రోహం మాత్రం చేయము” అంటూ ప్రమాణం చేయసాగారు.

తన మనసెరిగి ప్రమాణం చేస్తున్న పిల్లలను చూస్తుంటే.. శ్రీహరి తాతయ్య కళ్ళల్లో ఆనంద భాష్పాలు దొర్లాయి.*

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు