సరదాల సంక్రాంతి - కమల\'శ్రీ\'

Saradala sankranthi

ఈ సంక్రాంతి కి మనం మన ఊరు వెళ్లాలి. ఇందాక వాకింగ్ కి వెళ్లినప్పుడు నాన్న ఫోన్ చేశారు.” అన్నాడు రాజేష్ వాకింగ్ నుంచి వస్తూనే. “అదేంటండి మనం మా ఊరు వెళదామని అనుకున్నాం గా. మనం వస్తాము అన్నామనే మా చెల్లి కూడా వాళ్ల అత్తగారింటికి వెళ్లకుండా అమ్మ వాళ్లింటికి వస్తుంది. మానస్ కి కూడా అక్కడ కంఫర్ట్ గా ఉండదండి. ఆ పల్లెటూర్లో కనీసం చిన్న రెస్టారెంట్ కానీ, సినిమా హాల్ కానీ లేవు. చాలా బోర్ ఫీల్ అవుతాడు.”అంది శ్రావణి... కొడుకు పేరు వంక మాత్రమే , ఆమెకే ఇష్టం లేదు వెళ్లడం. “ఈ సారి ఎలాగైనా వెళ్లాలి శ్రావణి.నాన్న గారు మరీ, మరీ అడుగుతున్నారు. అమ్మ కూడా మానస్ ని చూడాలని అంటుంది. పోయిన సారి పండక్కి కూడా వెళ్లలేదు మనం.ప్రతీసారీ ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకోవడం బాగోడు. మీ అమ్మవాళ్ళింటికి కావాలంటే సమ్మర్ హాలిడేస్ టైమ్ లో వెళ్లవచ్చును.”అని ఆఫీస్ కి వెళ్లిపోయాడు రాజేష్. “ఇప్పుడు ఆ పల్లెటూరికి వెళ్లాలా. ఈ విషయం మానస్ కి చెప్తే ఏమంటాడో?.” అనుకుంటూ అప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి వచ్చిన మానస్ కి విషయం చెప్పింది. “వాట్.. మనం అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లడం లేదా. తాతయ్య నాకు ఈ సారి బ్రాండెడ్ షూస్, న్యూ మోడల్ వాచ్ కొంటానని చెప్పారు. ఇంకా పిన్ని తమ్ముడు వస్తారు వాళ్ళతో జాలీ గా సిటీ మొత్తం తిరగొచ్చు అనుకున్నా.” అన్నాడు మానస్ కోపంగానే. “నేనూ అదే చెప్పాను నాన్నా, కానీ మీ నాన్న నా మాట వినడం లేదు. ఇన్నిసార్లు తప్పించుకున్నాము కానీ ఈసారి వెళ్లక తప్పేలాలేదు. కావాలంటే సమ్మర్ హాలిడేస్ లో వెళ్దాం. డాడీ తో ఆర్గ్యూ చెయ్యకు ఓకే నా.” అని తన పనుల్లో మునిపోయింది శ్రావణి. “సరేలే.” అని ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వడానికి తన రూమ్ కి వెళ్ళాడు. వారం రోజుల తర్వాత రాజేష్ ఫ్యామిలీ తన నాన్న గారైన సుందరయ్య గారి ఊరు బయలుదేరారు. అది ఓ పల్లెటూరు. వారు బస్ దిగే సరికే ఆటో లో వీరికోసం ఎదురు చూస్తున్న సుందరయ్య ఇంట్లోని పనివాడు రంగా “రాజేష్ బాబూ.. ఇటు ఇటు రండి.”అంటూ పిలిచాడు. రాజేష్ వాళ్లు ఆటో ఎక్కి ఇంటికి చేరుకున్నారు. దారిపొడుగునా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఆ ఊరు.వారిని చూడగానే పరుగున వచ్చారు సుందరయ్య గారు. "ఏరా బాగున్నావా?.ఏమ్మా ఎలా ఉన్నావు? మనవడా బాగా చిక్కినట్టు ఉన్నావు సరిగ్గా తినడం లేదా ఏంటీ?." అంటూ వాకిలిలో నే పరామర్శలు మొదలుపెట్టారు. "బాగున్నాం నాన్నా.మీరెలా ఉన్నారు. అమ్మెక్కడ ఉంది?."అన్నాడు రాజేష్. "వంట గదిలో ఉందిరా. మీరొస్తున్నారని‌ తెలిసి అరిసెలూ ,పొంగడాలూ, జంతికలు, కజ్జికాయలు అబ్బో ఒక్కటేమిటీ ఎన్నో రకాల పిండివంటలు వండుతోంది." అంటూ వారిని గదిలోకి తీసుకుని వెళ్లి "మీరు స్నానాలు చేసి విశ్రాంతి తీసుకోండి."అని వంట గదిలోకి వెళ్లిన సుందరయ్య, "ఓయ్ సుందరమ్మా వంటలు ఎక్కడివరకూ వచ్చాయీ. నీ కొడుకూ కోడలూ వచ్చింది కూడా పట్టించుకోనంతగా లీనమైపోయావు." అంటూ వెనుక నుంచి ఆమెని పట్టుకున్న సుందరయ్య ఆమె సమాధానం చెప్పకుండా ఉండటం తో "ఏంటి సుందరీ ఏమయ్యింది?"అన్నారు. దానికి ఆమె చీరతో కళ్లొత్తుకోవడం కనపడి "ఏంటి సుందరీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏమయ్యిందే? నువ్వు కోరుకున్నట్టే సంక్రాంతి కి కొడుకూ, కోడలూ మనవడితో పాటు వచ్చారుగా. మరెందుకు బాధపడుతున్నావు?."అన్నారు ఆమె పక్కనే ఓ పీట వేసుకొని కూర్చుంటూ. "వచ్చారయ్యా కానీ ఎన్ని రోజులు ఉంటారు? ఓ వారం రోజులు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత వెళ్లిపోతారు. నాకేమో కొడుక్కి కావాల్సినవి వండిపెట్టాలనీ,కోడలికి నచ్చిన నగలూ , చీరలూ పెట్టాలనీ, మనవడికి మంచి మంచి కథలు చెప్పాలనీ వాడితో పాటూ మన పొలాల్లో తిరుగాడాలనీ ఉంటుంది. కానీ వాళ్లు ఉండేది తక్కువ రోజులే. నా ముచ్చట్లేవీ తీరకుండానే వెళ్లిపోతారు. మళ్లీ సంవత్సరానికో రెండేళ్లకో వస్తారు. మరెప్పుడండీ వాళ్లతో సంతోషంగా గడిపేది." అంది. "నీ బాధ నాకు అర్థమౌతుంది సుందరీ. కానీ వాడు ఉద్యోగరీత్యా పట్నంలోనే ఉండాలి. కోడలేమో పట్నం లోనే పుట్టిపెరిగిన పిల్ల. ఇంక మన మనవడు అయితే ఈ పల్లెటూరి పోకడలకు అస్సలు ఇమడలేడు. మనమే అర్థం చేసుకుని సర్థుకుపోవాలి.పోనీ వాళ్లతో కొన్ని రోజులు వెళ్లి ఉండరాదూ?." సుందరయ్య ఓదార్పు. "సరిపోయింది సంబడం. తమరిని వొదిలి వేరే ఊరు వెళ్లడమే. మీరు నేను లేకపోతే సిన్న పని కూడా చేసుకోలేరు. పొరపాటున నేనేదైనా ఊరెళితే ఆ రోజు సరిగ్గా తిననే తినరు. ఇంక పట్నం లో అన్ని రోజులుండిపోతే మీ పని..?" అంది వేగిన జంతిక ను నూనెలో నుండి తీస్తూ. "వాళ్లు వెళ్లిపోతారని బాధపడతావు. వాళ్లతో వెళ్లమంటే వెళ్లనంటావు. ఎట్టా ఏగేదే నీతో.‌అయినా ఆడు మరీ చిన్నపిల్లాడా ఏంటీ.. పాలు తాగే పిల్లాడిలా వాడితోనే ఉంటానంటే ఎట్టాగే సుందరీ." "వాడు నా పాలు తాగి పెరగలేదనే కదా ఇలా అంటున్నారు" అంది సుందరమ్మ.. కళ్లవెంట కన్నీరు వస్తుండగా. "అయ్యో సుందరీ అట్లా ఎందుకంటానే వాడు నీ పాలు తాగలేదు కానీ నీవు అందించిన మురిపాలతో పెరిగాడు. నీ ఆత్మీయతా అనురాగాలలో తడిసి ముద్దైనాడు. నీ కడుపున పుట్టకపోయినా వాడు నీ బిడ్డే. కాదని ఎవరినన్నా అనమను." అన్నారు సుందరయ్య ఓ జంతికని నోట్లో పెట్టుకుని. ఎవరన్నా రండీ వాడు నా బిడ్డ కాదని. పేగుతెంచుకుని పుట్టకపోయినా వాడు నా బిడ్డ. పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్తే బాధపడుతున్న నాకు అమ్మవారి గుడిమెట్ల మీద దొరికిన బంగారు తండ్రి వాడు. ఎంత ముద్దుగా పెంచుకున్నానో వాడినీ. వాడు చేసే ప్రతీ పనీ నాకు సంతోషమే. వాడు చదువులో ఫస్ట్ వస్తే నాకు సంబరం. వాడికి జ్వరం వస్తే నా బాధ చెప్పనలివి కాదు. మిమ్మల్ని మాటిమాటికీ డాక్టర్ దగ్గరకు పంపించి మీ బుర్ర తినేసేదాన్ని. పై చదువుల కోసం వాడు పట్నం వెళితే నా గుండె ఆగిపోయినట్టు, పెళ్లి చేసుకుని పట్నం లోనే ఉద్యోగ నిమిత్తం స్థిరపడిపోతే నా ప్రాణం గాలిలో కలిసిపోయినట్టూ ఉండేది. కానీ ఏనాడూ ఆ బాధ వారికి తెలియనివ్వలేదు. కానీ ముసలి దాన్ని అయిపోతున్నాను కదండీ వారితోనే ప్రతీ నిమిషం గడపాలని ఉంటుంది. వారికి నచ్చినవి చేసిపెట్టి వారు తింటుంటే చూసి తరాంచాలని ఉంటుంది. కానీ అది కుదరదు కదా. కోడలికి ఈ పల్లెటూరికి రావడం ఇష్టం ఉండదు. మనవడికి మనతో మాట్లాడటమే నచ్చదు. ఇంక మన రాజేష్ కి ఊపిరి సలపని ఉద్యోగ బాధ్యతలు. అందుకే వారిని ఏనాడూ ఇక్కడికి రండి అనీ పదే పదే అడిగి విసిగించలేదు. వాడే వచ్చి ఈ పిచ్చి తల్లి తో కొన్ని రోజులు గడిపి వెళ్ళాడని ఎన్ని రోజులు ఎదురుచూశానో. కానీ నా బాధ వాడికి తెలియడానికి వాడేమన్న నా ప్రేగు తెంచుకుని పుట్టాడా ఏంటి. ఇక్కడ తల్లి ఏడిస్తే వాడికి పొలమారడానికి." అంది బాధగా. "అంటే నేను నీ కొడుకుని కాదా అమ్మా?."అన్న మాటలు వినపడి ఇద్దరూ వెనుతిరిగి చూశారు. కన్నీరు నిండిన కళ్లతో ఉన్న రాజేష్ అతని పక్కనే ఏడుస్తూ శ్రావణి, మానస్ లు. అలా ఎవరన్నారు నాయనా. నేను కనుంటే ఆ బాధ నీకు తెలిసేదేమో అన్నానే కానీ. నువ్వు నా బిడ్డ కాదని ఎవరన్నారు. మరి నువ్వు అన్నావు గా. అయినా ఇంకా ఎన్నాళ్లు దాస్తారు. నాకంతా మన ఊరి రామయ్య తాత మొన్న పట్నం వచ్చినప్పుడు చెప్పాడు. ఓ అనాధని కన్నబిడ్డ అని పెంచుకుంటే నేను మిమ్మల్ని అనాధల్లా వదిలేసి పట్నానికి ఎగిరిపోయాను. నన్ను మన్నించండి. ఇక నుంచీ నేను మీతోనే ఉంటాను. బాబుకి ఆన్లైన్ క్లాస్ లే కదా.. ఇక్కడే ఉండి చదువుకుంటాడు. శ్రావణి నీకు తోడుగా ఉంటుంది. నేను ఆఫీస్ కి వెళ్లి వస్తుంటా. ఇక నువ్వు బాధపడాల్సిన పని లేదు నేను వెళ్లిపోతానని." అన్నాడు రాజేష్ ఏడుస్తూ. అందరూ నవ్వుతూ ఆ రాత్రి గడిపారు. మరునాడు కుటుంబ మంతా సరికొత్త సంక్రాంతిని జరుపుకున్నారు.. ఈ సంక్రాంతి వారికి సరదాలను తెచ్చింది...

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు