చందనుడి కొడుకు చంద్రం గురుకుల పాఠశాల నుండి శిక్షణన పూర్తి చేసుకుని వచ్చాడు. అమ్మ పార్వతి “నలుగురు దొంగలు మీ నాన్నాను వంచించి కుక్కను తీసుకెళుతున్నావేంటని మేకను ఎత్తుకెళ్లారు” అని చంద్రానికి జరిగింది చెప్పింది. చంద్రం కోపంతో ఊగిపోయాడు.
ముల్లును ముల్లుతోనే తీయాలని తండ్రి నుండి పూర్తి వివరాలు తెలుసుకుని, తన మిత్రుడు శంకరంతో మారువేషాలలో, ఒక కుక్కను తీసుకుని మేకను ఎత్తుకెళ్లిన ప్రాంతం వైపు వెళ్లసాగారు.కాసేపటికి ఒక దొంగ ఎదురుగా వచ్చేది చూసి శంకరాన్ని కాస్త ఎడంగా రామన్నాడు చంద్రం.
“రండి బాబు రండి... బాగా బలిష్టంగా ఉన్న ఈ మేకను మూడువేలకే అమ్ముతున్నాను” అంటూ ముందుకు వెళ్ల సాగాడు.
ఆ దొంగ “అరే ఏంటయ్యా! నీకు గాని మతి పోలేదు కదా... కుక్కను పట్టుకుని మేక అని అంటున్నావు ఏంటీ?” అన్నాడు. అప్పుడే శంకరం అక్కడు వచ్చాడు.
ఆ దొంగ “చూడండి ఇతను కుక్కను పట్టుకుని మేక అంటూ అమ్ముతున్ననాడు” అని అన్నాడు.
“అయ్యో! ఎంటయ్యా లక్షణంగా మేకను పట్టుకుని కుక్క అంటున్నావు... నీకు చూపు సరిగ్గా లేదా ఏంటీ” అన్నాడు శంకరం.
”సరే గాని ఆయనతో నాకేంటి నువ్వు కొంటావా? ఈ మేక సంతలో అయితే ఐదు వేలకు పోతుంది... నీకయితే మూడువేలకు ఇస్తాను” అన్నాడు చంద్రం.
“నిజమే అనుకో మేకను చూస్తే చాలా బలిష్టంగా ఉంది కానీ నా వద్ద అంతా ధనం లేదు. రేడువేల రూపాయలే ఉన్నాయి, ఇష్టమయితే అమ్ము” అన్నాడు శంకరం.
”లేదు మూడువేలకు తక్కువ అమ్మను” అన్నాడు చంద్రం.
ఆ దొంగ చంద్రాన్ని అడ్డగించి “మరి నాకు నీ చేతిలో ఉన్నది కుక్కగానే అనిపిస్తోంది ఎందుకు?” అన్నాడు.
“నువ్వు ఇంతకు ముందు ఎవరినైనా మోసం చేసి ఉంటే ఈ మేక నీకు కుక్కలాగే కనిపిస్తుంది” అన్నాడు చంద్రం. అవును నేను చాలమందినే మోసం చేశాను..అందుకే ఈ మేక కుక్కలా కనబడుతోంది, అని తన మనసులో అనుకున్నాడు ఆ దొంగ.
చంద్రం కుక్కను తీసుకుని ముందుకు వెళ్ళాడు. “మళ్ళీ ఆ రండి బాబు రండి బలిష్టమైన మేక పిల్ల మూడువేలకే కొనండి” అన్నాడు.
రెండవ దొంగ ఎదురోచ్చి “అరె కుక్కను పట్టుకుని మేక అంటావెంటీ?” అన్నాడు. మొదటి దొంగ, రెండవ దొంగను పక్కకు తీసుకెళ్లి విషయం చెప్పాడు మనం ఎంతో మందిని మోసం చేశాము కాబట్టి ఆ మేక మనకు కుక్కల కనబడుతోంది అన్నాడు. అవునురా నిజమే కావచ్చు అన్నాడు రెండవ దొంగ.
చంద్రం మరికొంత ముందుకు వెళ్ళి” మేకను కొనండీ!” అంటూ అరుస్తుండగా మూడవ, నాలుగవ దొంగ కూడా ఎదురు పడి అడిగితే వారికీ అదే సమాధానం చెప్పాడు.
మొదటి,రెండవ దొంగ వారిదద్దరినీ పక్కకు తెసుకెళ్లి “మన లాంటి మోసగాళ్లకు ఆ మేక కుక్క లాగే కనబడుతుంది. సంతలో అయితే అయిదువేలకు అమ్మ వచ్చు... వాడిని మోసం చేసి మనం ఆ మేకను ఎత్తుకెళ్లలేము ఎందుకంటే వాడు బాగా బలిష్టంగా ఉన్నాడు” అని కూడా బలుక్కుని చంద్రానికి మూడువేల రూపాయలిచ్చి ఆ కుక్కను కొన్నారు.
“జాగ్రతగా తీసుకెళ్ళండి! మీరు మంచివారు కాక పోతే ఆ మేక “మే..మే” అన్నా మీకు “భౌ..భౌ” మన్నట్టు కూడా వినబడుతుంది” అన్నాడు చంద్రం.
“ఆ మాకు తెలుసు మేము ఎవ్వరినీ మోసం చేయలేదు” అని ఆ నలుగురు దొంగలు ఆ కుక్కను తీసుకుని వెళ్ళి పోయారు.
ఇదంతా గమనిస్తున్న శంకరం పరుగున చంద్రం వద్దకు వచ్చి “భలేగా నాటకం ఆడావు మిత్రమా!” అన్నాడు.
“నీ సహకారం కూడా నాకు ఉపయోగపడింది మిత్రమా!” అన్నాడు చంద్రం.
ఇద్దరూ చంద్రం ఇంటికి చేరాక మారు వేషాలు తీసివేశారు.“ఇదిగో నాన్నా! మనవి రెండువేలు పోతే వారి వద్ద నుండి మూడు వేలు వసూలు చేశాను” అని జరిగింది చెప్పాడు చంద్రం.
“అవును బాబాయి చంద్రం భలేగా నాటకమాడి ఆ దొంగలను భూరిడీ కొట్టించాడు” ఆన్నాడుశంకరం. కొడుకు తెలివి తేటలకు చందనుడు,పార్వతి తెగ మురిసి పోయారు.
అక్కడ సంతలో కుక్కను చూపి మేక అని అమ్ముతున్న ఆ నలుగురు దొంగలను జనాలు బాగా చితక బాదారు.
****