బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించే రోజులవి.ఒక ఆంగ్ల దొరకి మన్యం గిరిజనులు నివశించే ఏజన్సీ ప్రాంతంలో పర్యవేక్షణ కోసం డ్యూటీ పడింది.దొర గారికి సహాయకుడిగా ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాష తెల్సిన ఉధ్యోగిని నియమించారు ప్రభుత్వం. అడవి జంతువుల నుంచి రక్షణగా వారికి ఎత్తైన కొండ ప్రాంతంలో వసతి ఏర్పాటు చేసారు.రోజు వారీ విధులకు ఆహార సరుకులు గిరిజనులే వారి వసతి గృహానికి చేర్చేవారు. ఒకసారి భారీ వర్షాల కారణంగా దొరగారికి కింద వరకు జీపులో వచ్చిన ఆహార పదార్థాలు బిస్కెట్లు సిగరెట్లు చాయ్ పౌడరు వైన్ బాటిల్సుతో నిండిన అట్టపెట్టెలు గుట్ట మీదున్న దొర గారి కుటీరానికి చేర్చడం కష్టమైంది. దొర గారి సహాయకుడు ఏం చెయ్యాలో తెలియక కంగారు పడసాగాడు. ఇంతలో గిరిజన నాయకుడు గూడెంలో ఒకరి వద్ద మట్టిని మోసే గాడిద ఉందని దాని సాయంతో గుట్ట మీదకు దొర గారి వస్తువుల్ని చేరుద్దామనగానే ఆ గాడిదను దాని యజమానితో సహా రప్పించారు. దొర గారి వైన్ అట్టపెట్టెల్నీ మిగతా వస్తువులన్నీ గాడిద వీపు మీద రెండు వైపుల సర్ది జాగ్రత్తగా కుటిరానికి చేర్చేరు. భయంకర వర్షం క్లిష్ట పరిస్థితుల్లో భద్రంగా సామగ్రిని పైకి ఎలా చేర్చ గలిగారని ఆంగ్లదొర ఆశ్చర్య పోయి తన సహాయకుడిని ఆంగ్లంలో అడిగారు. సహాయకుడు గాడిదను చూపి ఈ జంతువు వల్లే సాద్యమైందని ఆంగ్లంలో జవాబు చెప్పాడు. ఆంగ్లదొర సంతోషించి గూడెం నాయకుడికి గాడిద యజమానికీ బహుమతులిచ్చి" దిస్ డాంకీ ఈజ్ గుడ్ " అన్నాడు ఆంగ్లంలో. దొరగారి భాష తెలియని గిరిజనులు సహాయకుడిని అడిగారు. ఆ ఉధ్యోగి దొరగారు' గాడిదను గుడ్ ' అన్నారు అని తెలుగులో చెప్పేడు. అప్పటి నుంచి గాడిద గుడ్ "గాడిద గుడ్డు " గా రూపాంతరం చెంది హాస్య పదమైంది. * * *