పరిపాలనా బాధ్యతలతో అలసిన భుగనగిరి మహారాజు తన మంత్రి సుబుద్దితో కలసి బాటసారుల వేషంలో బయలుదేరి రాజధాని కూడలిలోని ఆలయ కోనేటి మడపం వద్ద పలువురు యువకులు ఉండటం గమనించి ఇరువురు అక్కడకు చేరారు.
అప్పటివరకు అష్టాచెమ్మా ఆడుతున్నయువకులలో, చెవులు వినిపించని యువకుడు'ఓరే జాగ్రత్తగా వినండి చాలా దూరంగా గుంపుగా ఎవరో గుర్రలపై మనవైపే వస్తున్నారు బహుశా బందిపోటు దొంగలేమో'అన్నాడు.
'నిజమేరా వాళ్ళ గుర్రాలు లేపే మట్టి తెరలు తెరలుగా నాకు బాగా కనపడుతుంది'అన్నాడు కళ్ళులేని యువకుడు.
ఆదిశగా చూసిన రాజు మంత్రిగార్లకు ఏమి వినపడలేదు,కనపడలేదు,ఐనా ఆసక్తిగా ఆయువకుల మాటలను గమనించసాగారు.
'ఆబందిపోటు దొంగలను ఎదుర్కోని మనల్ని రక్షించే బాధ్యత మన రాజుగారిది. ఇక్కడ రాజభటులు ఎవరూ లేరు కనుక నేనే కత్తిదూసి వాళ్ళందరిని తరిమి కొడతాను'అన్నాడు రెండుచేతులు లేని యువకుడు.
'మీరు ఆగండి నాసింహానాధంతో వారిని అదరగొడతాను'అని మూగయువకుడు సైగలు చేసాడు.
'ఓరే నేను ఆబంధిపోటు దొంగలను యుధ్ధంలో జయిస్తే,రాజుగారికి అవకాశంలేకుండా పోతుందని ఆలోచిస్తున్నా లేకుంటేనా'అంటూ స్ధంబంచాటున దాగాడు ఆపిరికి యువకుడు.
'అంతగా పరిస్ధితులు అనుకూలించకపోతే నాటి పాండవులను లక్కయింటిలో భీముడు రక్షించిన విధంగా మీ అందరిని నేనే మోసుకు వెళతాలే'అన్నాడు బక్కపలుచని యువకుడు.
'ఓరేయ్ నా ఉంగరాలజుట్టు చెదిరిపోతుందని ఆలోచిస్తున్నా లేకుంటే చిటికెలో వారిని జయిస్తా'న్నాడు బోడిగుండు యువకుడు.
'ఈ గోలంతా ఎందుకురా వేగంగా పరిగెత్తిపోదాం' అన్నాడు రెండుకాళ్ళులేనియువకుడు.
'తొందరగా ఓనిర్ణయానిరండిరా.మీరు అంతాకలసి నిర్ణయం తీసుకునేలోపే వళ్ళువచ్చి నన్ను నిలువు దోపిడి చేసేలా ఉన్నారు'అన్నాడు శరీరంపై ఎటువంటి దుస్తులులేని గోచి ధరించినయువకుడు.
ఫక్కున నవ్విన రాజుగారు వారి హాస్యచెతురతకు. అంగవైకల్యం మనసుకే కాని మనిషికి ఉండకూడదు,కార్యసాధనకు ఆత్మవిశ్వాసం అవసరం అని నిరూపించిన ఆయువకులకు సముచితరీతిలో,వారుకోరుకున్న విధంగా జీవనాధారం కలిగించాడు.