దేశ రాజధాని డిల్లీ ప్రగతి మైదానంలో ' అఖిల భారత గార్దభ సమ్మేళనం' అత్యవసరంగా జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల గార్దభ సంక్షేమ సంఘాల ప్రతినిధులు హాజ రయాయి.యజమానుల వల్ల కలుగుతున్న కష్టాలు, ఆహార వసతి సదుపాయాలు ప్రాంతాల వారీగా చర్చకు వచ్చాయి. పనివేళలు కేటాయించే విశ్రాంతి సమయం చర్చించడమైంది. మానవ సమాజంలో కొంతమంది మిగతా జంతువులతో పోలుస్తూ గాడిద జాతిని అవహేళనగా చూపడం, మాట్లాడటం , ముఖ్యంగా బాల సాహిత్యంలో వ్యంగ్యంగా కథలు రాయడం, వ్యంగ్య చిత్రాలు గీయడం చేస్తున్నారనీ చాలా రాష్ట్రాల గార్దభ ప్రతినిధులు ప్రస్తావించడం జరిగింది. అంతర్జాల గూగుల్ ఫేస్బుక్ యుట్యూబ్ మాధ్యమాల ద్వారా సర్వే చేసి ఏఏ రాష్ట్రాల్లో గాడిదల పట్ల చిన్న చూపు చూస్తున్నదీ తెలుసు కోవడమైంది. జమ్ముకశ్మీర్ లోని ఉదంపూర్ వైష్ణవదేవి మందిరం వద్ద , బదరీనాథ్ మందిరం వద్ద, ఉత్తరఖండ్ చార్ ధామ్ యాత్రల సమయంలో కలుగు తున్న కష్టాలు, దక్షిణాదిన తమిళనాడులోని నీలగిరి, కర్ణాటక లో కూర్గు, తెలుగు రాష్ట్రాల రజక సంఘాల గాడిద ప్రతినిధులు నుంచి ప్రస్థావనలు వచ్చాయి. బీహార్ రాజస్థాన్ ఉత్తర ప్రదేశ్ గుజరాత్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మట్టి పనులు ఇటుక ఇసుక పనుల్లో యజమానుల శ్రమదోపిడి జరుగు తున్న దౌర్జన్యాలు సమావేశంలో ప్రస్తావించడమైంది. గూగుల్ మ్యాపుల్లో ఏఏ రాష్ట్రాల్లో ఏఏ పత్రికల్లో ఏఏ భాషల్లో ఏఏ రచయితల ద్వారా గాడిద జాతికి అప్రదిష్ట జరుగుతున్నదీ ప్రసార మాధ్య మాల ద్వారా అవగాహన కొచ్చింది.అందరూ ముక్త కంఠంలో ఆయా ప్రాంతాల కెళ్లి తమ మనోభావాల్ని వ్యక్తపరిచి నిరసనలు తెలియ చేయాలని నిశ్చయించాయి.. తేదీ , నెల , సమయం , ప్రాంతం వివరాలతో ఎజెండా తయారైంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి గుంపులు గుంపులుగా రంగుల గార్దభాలు దక్షిణాదికి బయలు దేరాయి.రోడ్ల పక్కన క్రమశిక్షణతో మందలుగా వస్తున్న గార్దభాలను చూసి జనం ఎవరో సంతలకీ లేబర్ పనులకు తీసుకెల్తున్నారను కున్నారు. గార్దభాలు కూడా ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా క్రమశిక్షణ తో తమ ప్రయాణం సాగిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల గార్దబాలు గూగుల్ మ్యాప్ సహాయంతో దారి తెలుసుకుంటూ దక్షణాది వైపు బయలు దేరాయి. తెలుగు రాష్ట్రం తెలంగాణ హైదరాబాదు రింగ్ రోడ్డు ద్వారా శంషాబాద్ విమానాశ్రయ మైదాన ప్రాంతానికి చేరుకున్నాయి. దక్షిణాది రాష్ట్ర గార్దభ ప్రతి నిధులు పరేడ్ మైదానంలో బైఠాయించాయి . హైదరాబాద్లో ఉంటున్న తెలుగు బాల సాహిత్య రచయిత కందర్ప మూర్తి గార్దభాల మీద తరచు వ్యంగ్య రచనలు చేసి పత్రికలకు పంపి అవహేళన చేస్తున్నాడనీ ఆయనకి తమ నిరసన తెలియచేయాలనీ బయలుదేరి రాగా ఆయన స్వగ్రామం అగ్రహారంలో ఉన్నట్టు తెల్సింది. భారత రక్షణ దళంలో పనిచేసి పదవీ విరమణ చేసిన మూర్తి పుట్టి పెరిగిన అగ్రహారం గ్రామంలో జన్మభూమి అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. హైదరాబాద్ చేరిన గార్దభ మందలు గూగుల్ మ్యాప్ సహాయంతో అగ్రహార గ్రామాన్ని చుట్టిముట్టి గార్దభ రాగాలాపనతో తమ నిరసన తెలియ చేస్తున్నాయి. గాడిదల అరుపుల గోలతో ఊరి ప్రజల చెవులు చిల్లులు పడు తున్నాయి. ఇన్ని రకాల గాడిదలు ఎలా ఎక్కడి నుంచి వచ్చాయో జనానికి అర్థం కాలేదు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని దక్షిణాది గాడిదలు ఉత్తరాది గాడిదలు తిరిగి గార్దభ రాగాలాపన మొదలవుతోంది. గ్రామ ప్రజలు విసుగెత్తి పోయారు. ఊరి సర్పంచి పోలీసులకు ఫిర్యాదు చేసారు.పోలీసులు వచ్చినా ఏమీ చేయలేక పోయారు. అఖిల భారత గాడిదల గోల గురించి తెలుగు బాల సాహిత్య రచయిత మూర్తి గారికి తెలిసి ప్రాంతీయ పశు వైధ్యాధికారికి సమాచారం అందించారు. పశువైధ్యాధికారికి అన్ని జంతువుల భాష మీద అవగాహన పరిజ్ఞానం ఉంది. ఆయన అగ్రహార గ్రామం చేరుకుని పరిస్థితిని అర్థం చేసుకుని గాడిద ల సమూహానికి నాయకత్వం వహించిన గధాసింగ్ తో వారి నిరసనకు కారణ మడిగారు. అన్ని జాతుల గాడిదలు ముక్త కంఠంతో మూర్తి గారు గాడిద జాతిని వాటి మనోభావాల్ని అవమాన పరిచే రచనలు చేస్తున్నారని, ఇకముందు అలా పిచ్చి రాతలు రాయకూడదనీ, తమందరికీ బహిరంగ క్షమాపణ చేప్పాలనీ డిమాండు చేసాయి. పరిస్థితులు చక్క పరచడానికి మూర్తి గాడిద సమూహానికి క్షమాపణ చెప్పగా అవి శాంతించి మరో ప్రాంతానికి కదిలిపోయాయి. గ్రామ ప్రజలు హాయిగా గాలి పీల్చుకున్నారు. * * *