తేల్ మాలీషా ! మజాకా!? - జి.యస్. కె. సాయిబాబా

Tel malisha majaka

అనకాపల్లి ఉడ్ పేట చదువుల వీధి అది. మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది. ఇంట్లో వంటరిగా లోకనాథానికి ఏమీ కాలక్షేపం అవడం లేదు. పగలే దొంగలు తాళాలు పగలకొట్టి ఇళ్లు దోచేస్తున్నారని వార్తలు వస్తూండటంతో ఇంటికి కాపలాగా లోకనాథం కాపలా ఉండి భార్యను పెళ్లికి పంపేడు. లోకనాథం ప్రైవేటు కంపెనీలో ఉధ్యోగం చేస్తూ వైధ్య పరంగా నిర్భంద పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. వీధి అరుగు మీద వాలు కుర్చీ వేసుకుని దీర్ఘంగా పేపరు చదువు తున్నాడు . ఇంతలో వీధీలో 'తేల్ మాలిష్ , బాడీ మాలీష్ ' అంటూ అత్తరు సాయిబు అరుచుకుంటూ వెల్తున్నాడు. ఆ అరుపులు విన్న లోకనాథం పేపరు పక్కన పెట్టి అత్తరు సాయిబు వైపు ఒక లుక్కేసాడు. ఆరడుగుల ఎత్తు కండలు తిరిగిన శరీరం నెత్తి మీద రూబీటోపీ పొడవు చేతుల సిల్క్ చొక్కా మీద నిలువు గీతలు పైన బూడిద రంగు వేస్టుకోటు కింద మలేషియా పువ్వుల లుంగీతో చేతిలో పొడవైన రంగుల సిల్క్ తాళ్లతో వివిధ ఆకారాల సీసాలలో సుగంధ అత్తర్లు , నూనెలు వేలాడుతు మనిషి మంచి బందోబస్తుగా కనబడు తున్నాడు. ఎప్పటినుంచో ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్న లోక నాధానికి అత్తరు సాయిబును చూడగానే అవన్నీ బయట పడ్డాయి. " ఓ అత్తరు సాయిబూ, ఇటురా" అని పిలిచాడు. "ఏం సారూ , కాళీగా కూసున్నారు. మాలీష్ చెయ్యాలా? " అన్నాడు. " ఆ చెయ్యాలి సాయిబూ! బాగా చేస్తావా?"అడిగాడు లోకనాథం. " ఒక్కసారి నా చేత బాడీ మాలిష్ చేయించుకుంటే మళ్లీ మళ్లీ చేయించుకుంటారు."గేస్ కొట్టాడు సాయిబు. " దొరా ! దుబాయ్, ఇరాన్ , హైదరాబాద్ మాలీష్ లన్నీ వచ్చు. మీ ఒంటికి హైదరాబాద్ మాలీష్ చక్కగా ఉంటాది." " ఎంత తీసుకుంటావేమిటి?"అడిగాడు. " పనితనానికి ధర ఏమిటి దొరా! మామూలుగా నా రేటు ముప్పై. చేసాక నా పనితనం చూసి యాబై ఇచ్చిన వారున్నారు.ఇంకా పెద్ద మారాజులు వంద ఇచ్చిన వారున్నారు దొరా! ముందు బోణీ బేరం మీదే."అంటూ భుజాన వేలాడుతున్న నూని సీసాలు పక్కన పెట్టాడు. " ఆగాగు సాయిబూ, ఇక్కడ కాదు. ఇంట్లో చేద్దువుకాని" అని వీధి తలుపులు దగ్గరగా వేసి హాల్లో బనీను విప్పి లుంగీ మడిచి సోఫాకుర్చీలో కూర్చున్నాడు లోకనాథం. అసలే బట్టతల , దాని మీద సాయిబు తల నూని చేతిలో పోసుకుని నడి నెత్తి మీద మద్దెల వాయించినట్టు తప్ తప్ మంటూ చేతి వేళ్లకు పని చెబుతున్నాడు. అలా నూని మర్థన చేస్తుంటే లోకనాథానికి స్వర్గం కనబడుతోంది. అత్తరు సాయిబు తన పనితనం చూబెడుతూ నూనితో నుదుడు, కొత్తెం, చెవుపైన చెంపలు , మెడ అలా భుజాలు నడుం, వీపు తొడలు కాలి పిక్కలు నూనితో మాలీష్ చేస్తుంటే లోకనాథం అదో రకమైన మైకంలో తేలిపోతున్నాడు. బాడీ మాలిష్ చేస్తూనే అత్తరు సాయిబు ఇల్లంతా పరిశీలనగా గమనించ సాగేడు.ఇంట్లో ఇంకెవరు లేనట్టు నిశ్శబ్దంగా కనిపించింది. " ఏంటి సార్! ఇంట్లో ఒక్కరే కానొస్తున్నారు. అమ్మ గారు ఊరెళ్లారా?" మరొకసారి నెత్తి మీద చేతి వేళ్ల పనితనం కనబరిచాడు సాయిబు. " మా ఆవిడ పిల్లలు కశింకోట పెళ్లి కెళ్లారయ్యా! ఈమధ్య పగలే దొంగతనాలు జరుగుతున్నాయని నేను ఇంటి కాపలాగ ఉండిపోయాను"మగతగా చెప్పేడు. " సారూ,తల దిమ్ము తగ్గిందా?ఒంటి నెప్పులు సర్దుకున్నాయా" అని సాయిబు అడుగుతూంటే " సాయిబూ , నిజంగా కళ్ల ముందు స్వర్గం చూపెడు తున్నావయ్యా " అంటూనే సోఫా కుర్చీ వెనక తల వాల్చి మగతలో పడ్డాడు. "సారూ , సారూ "అని తట్టిలేపాడు లోకనాథాన్ని. ఇంకెక్కడి లోకనాథం , ఈ లోకాన్ని వదిలి స్వర్గలోకంలో విహరిస్తున్నాడు. మాలిష్ వాలా రూపంలో ఉన్న పగటిదొంగ తన కోటులో దాచిన తాళాల గుత్తి తాళంతో బెడ్ రూంలో ఉన్న బీరువా తెరవగా సాయిబు కళ్లు జిగేలు మన్నాయి.. వెయ్యి రూపాయల నోటు కట్టలు కనబడ్డాయి. పక్క సీక్రేట్ అరలో బంగారు వస్తువులు ధగధగ మంటున్నాయి. "ఇంకెందుకు ఆలశ్యం! భలే చాన్సులే "అంటూ అక్కడే అందుబాటులో ఉన్న చేతి సంచీలో నోట్ల కట్టలు , బంగారు వస్తువులు చక్కగా సర్ది "ఆయ్ అల్లా! ఈదుకా సమయంలో పెద్ద తోఫా ఇచ్చినావు" అని హాల్లోంచి బయటపడి వీధి తలుపులు దగ్గరిగా లాగి ఉడాయించాడు అత్తరు సాయిబు. మధ్యాహ్నం మూడైంది. లోకనాధం భార్య పెళ్లి చూసుకుని విందుభోజనం పూర్తి చేసి కూతురుతో ఇంటి ముందు రిక్షా దిగింది. మెట్లెక్కి తలుపు తట్టకుండానే తెరుచుకున్నాయి. ఏమిటీ మనిషి? వీధి తలుపులు వేసుకోకుండా లోపల ఏం చేస్తున్నారను కుంటు హాల్లో కాలు పెట్టింది. హాయిగా సోఫా కుర్చీలో గుర్రు పెడుతూ నిద్రపోతు కనిపించాడు లోకనాథం. 'ఏమండీ' అని పిలిచినా లేవకపోయే సరికి వంట గదిలోంచి చల్లటి నీళ్లు తెచ్చి మొహం మీద జల్లే సరికి స్వర్గం నుంచి భూలోకాని కొచ్చిన లోకనాథం " భలేగా చేసావయ్య తేల్ మాలిష్! మజా వచ్చింది " అంటూ కళ్లు తెరిచాడు. ఎదురుగా భార్య మంగతాయారు చండిలా ఉగ్ర రూపంతో పళ్లు కొరుకుతు కనబడింది. " మీరెప్పుడొచ్చారు?" అంటూ కళ్లు నులుముకుంటు"తేల్ మాలీష్ వాలా ఏడీ? సాయిబు చేతిలో ఏం మాయ ఉందో కానీ భలేగా తల మర్ధన చేసాడు. అరె 'ఏడీ' డబ్బులు తీసుకో కుండా వెళ్లి పోయాడా? " అంటున్నాడు. విషయం తెల్సిన మంగతాయారు కంగారుగా బెడ్రూమ్ కెళ్లి చూస్తే కొంప కొల్లేరైంది. " మీ తేల్ మాలిష్ మండా! వాడు తేల్ మాలిష్ వాడు కాదు. పగలు ఇళ్ల తాళాలు పగలకొట్టే గజదొంగ. బెడ్రూమ్ బీరువా మారు తాళాలతో తెరిచి నా బంగారం నగలు, ఆఫీసులో ఒక పార్టీ ఇచ్చిన యాబై వేలు రేపు బ్యాంక్ లో వేద్దామని బీరువాలో ఉంచాను.. అంతా దోచేసాడు దొంగ వెధవ "అని బావురుమంది మంగతాయారు. " పోలిసులకు ఫోన్ చెయ్యి .వెంటనే రీపోర్టిద్దాం. ఈమధ్య పోలీసులు చాలా బాగా రియాక్టు అవుతున్నారు. వాడు పొలిమేరలు దాటకుండా పట్టుకుంటారు" అమాయకంగా ఉచిత సలహా లిస్తున్నాడు లోకనాథం. రెవిన్యూ ఆఫీసులో సీనియర్ సూపరిండెంటుగా బాగా లంచాలు మరిగి డబ్బు సంపాదించిన మంగతాయారు మండిపడుతూ పోలీసు కంప్లైంటు ఇస్తే నేను, మీరూ జైల్లో ఉంటాం.ఇన్ కం టాక్స్ రైడింగ్ జరిగితే ఇంత డబ్బు బంగారం ఎక్కడినుంచి వచ్చాయని నిలదీస్తే జైలే గతి. తేలు కుట్టిన దొంగలా పడుండాల్సిందే అనుకున్నారు. మొత్తానికి తేల్ మాలిష్ వాలా బాగా తలకి క్షవరం చేసాడు. ** ** **

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు