“నీకెం పని…? ఈరోజు ఉండి… రేపు పోయేదానివి… మనసు మంచిగా పెట్టుకుంటే… పిల్లోడు బాగా పుడతాడు అంటూ… రెండో పెద్దమ్మ షరీఫా కళ్ళు ఉరుముతూ అరిచింది.” బయటకు మందలించినట్టే ఉన్నా… తన మాటకు ఎదురు ఉండదన్నట్టు… మాటే శాసనం అన్నట్టుగా… తాను చెప్పింది వినకపోతే… మంచి మనసున్న పిల్లోడు పుట్టడు అన్నట్టుగా. నచ్చచెప్పి ఉంటే బాగుండేది… ప్రేమగా చెప్పి ఉంటే… అరీఫా సంతోషపడేది.
“ఆడపిల్లవి… ఆడపిల్ల మాదిరి ఉండు… పుట్టింటితో నీకు ఏం సంబంధం? పెళ్లి అయినా తర్వాత… ఇది నీ ఇల్లు ఎలా అవుతుందని? పెద్ద పెద్దమ్మ మాబున్ని పెదవి విరిచింది.” అదే ఇంట్లో అరిఫా కూడా పుట్టిందని మరిచింది. అరీఫా, ఫారుక్, మున్ని ఒకే తల్లి బిడ్డలన్న విషయాన్ని విస్మరించి… పుట్టింటిలో ఉన్న సమస్యలకు… ఆడపిల్లలకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు ఖరాఖండీగా తేల్చింది. అదే నిజమని… నమ్మింది… అందరూ అదే నమ్మాలని కేకే వేసింది.
“రెండు సార్లు పొయ్యిందే… ఇంకా సిగ్గు లేదా…? ఇంత తిని… పడుకోకుండా… నీకెందుకు అంట…? బోడి పెత్తనం. తిన్నది అరగకపోతే ఎగురు… అంతే కాని… ఇంట్లో పుల్లలు పెట్టి నీ అన్న సంసారాన్ని… వీధికి లాగకని అరీఫా వాళ్ల నాని (అవ్వ) ఇంతెత్తు ఎగిరింది.
పురుడు కోసం వచ్చింది… పురుడు పోసుకొని వెళ్ళిపోవాలని కానీ… అవసరం లేని దాంట్లోకి తల దూర్చడం ఎందుకు? అంటూ పెద్ద బజారు పెద్దమ్మ, ఆయమ్మి ముందు నుండి అంతే… గోటితో పోయేదాన్ని గొడ్డలితో నరకాలని చూస్తుంది అంటూ పెద్దమ్మ కొడుకు… ఇలా తలొక మాట అని… అరీఫా నోరు మూయించే ప్రయత్నం చేశారు.
అరీఫా… ఏం తక్కువ తినలేదు… అందరికీ సమాధానం ఇస్తూనే ఉంది… అరీఫా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయినప్పుడు… తాను గర్భవతిననే విషయాన్ని గుర్తు చేస్తున్నారు, రెండు సార్లు అబార్షన్ అయ్యింది… మళ్ళీ అవుతుందని పరోక్షంగా బెదిరిస్తున్నారు… బిడ్డ పుట్టినా… మంచి మనసు ఉన్నవాడు పుట్టడని… శపిస్తున్నారు. ఆ మాటలు విన్నప్పుడు అరీఫా బిగుసుకుపోతోంది…భయపడిపోతోంది… ఈసారి తల్లి కాకపోతే… గొడ్రాలు అనే మాటలు పడాల్సి వస్తుంది. తోడి కోడలు ఇప్పటికే ముగ్గురిని కనింది… తనకు ఒక్క సంతానం కూడా కలగలేదు. అత్త కసురుతోంది… ఇలాంటి ఆయమ్మిని ఊరికే చేసుకున్నామే అని… అరీఫా ముందే వదురుతుంది… మరోసారి అబార్షన్ అయితే… తన పరిస్థితి ఏమిటో?! తనకే అర్థం కావడం లేదు.
***
నా పేరు అరీఫా… డిగ్రీ చదువుతూ ఉండగా… పెళ్లి చేశారు. చదువు అంతటితో ఆగిపోయింది. మా ఆయన పేరు మహబూబ్… పెళ్లి అయినా తర్వాత చదువుకుందాం అనుకున్నా కానీ… పెళ్ళైన రెండు నెలలకే దుబాయ్ వెళ్ళిపోయాము. ఆ తర్వాత వరసగా రెండు సార్లు గర్భవతిని కావడం… ఆరో నెలలో ఉమ్మనీరు పడిపోయి… బిడ్డ కడుపులోనే చనిపోవడం జరిగింది. పెళ్లి జరిగి మూడు సంవత్సరాలు అయ్యింది… మూడవ సారి గర్భవతిని అయ్యాను… ఇదైనా నిలబడాలని… తిరగని ఆసుపత్రి లేదు… వెళ్ళని దర్గా లేదు…
రెండు సార్లు బిడ్డను పోగొట్టుకున్నానని… ఈసారి గర్భవతిని అయినా వెంటనే… మహబూబ్ నన్ను మా ఇంట్లోనే విడిచి… దుబాయ్ కి వెళ్ళిపోయాడు. మహబూబ్ చాలా మంచి వాడు. నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. మా అత్త… వాళ్లు బాగా ఉన్న వాల్లే… అయినా మా అమ్మ… నాకు ఏది తక్కువ చేయలేదు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసింది. యాభై తులాల బంగారు ఇచ్చింది. నా పేరు మీద ముద్దనూరు రోడ్డుకు ఉన్న జాగా కూడా రాసిచ్చింది. “అన్నీ బాగా ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లుగా” నాకు పిల్లలు కావడం లేదు.
మా అన్న పేరు ఫారుక్… డిప్లొమా చదువుకున్నాడు. డిప్లొమా మూడవ సంవత్సరంలో నాలుగు పేపర్లు తప్పితే… డిప్లొమా వదిలేసి… డా. బి. ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి డిగ్రీలో చేరాడు… రెండు సంవత్సరాలు చదివి… అదీ వద్దు అని… తిరుపతిలో… హోటల్ మేనేజ్‌మెంట్ జాయిన్ అయ్యాడు… ఆరు నెలల తర్వాత దాన్ని కూడా వదిలేశాడు. ఆ తర్వాత చదువు అబ్బడం లేదని… సౌదీలో మా చిన్నాయన దగ్గరికి వెళ్ళిపోయాడు. సౌదీలో మా చిన్నాయనకు… రెండు బట్టల దుకాణాలు ఉన్నాయి. అందులో పని చేయడానికే వెళ్ళాడు. వెళ్ళిన సంవత్సరానికే అక్కడ కూడా ఉండలేక తిరిగి వచ్చేశాడు. ఇలా అయితే కుదరదని… పెళ్లి చేస్తే… గాడిలో పడతాడని బద్వేల్ లో… అమ్మాయిని చూసి నిశ్చితార్థం కూడా చేశాము. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత… ఆ అమ్మాయి… నాకు వద్దు… అందంగా లేదని గొడవ చేశాడు. చేసేది లేక… ఆ నిశ్చితార్థం రద్దు చేసుకొని… తాను కోరుకున్న చోటే పెళ్లి చేశాము. మా నాన్న బంగారు వ్యాపారం చేస్తాడు… బంగారు వ్యాపారం అంటే… ఏదో పెద్ద అంగడి ఏం కాదు… చిన్న అంగడి. నాన్నతో పాటే… అంగట్లోకే ఫారుక్ అన్న కూడా పోతున్నాడు.
ఆ అంగడి సరిగా జరగడం లేదు… నువ్వు ఏదైనా అంగడి పెట్టుకో అని అమ్మ, నాన్న ఎంత చెప్పినా వినడం లేదు. నాన్న ఆరోగ్యం బాగాలేదు… మొన్నే గుండె ఆపరేషన్ అయ్యింది. “నాన్న ఒక్కడే… అంగడిని చూసుకోలేడని… వేరుగా ఇంకో అంగడి పెట్టుకోను అంటున్నాడు.” వచ్చిన చిక్కు ఏంటంటే? ఫారుక్ అన్న అంగట్లో కూర్చోవడం లేదు… ఊళ్లు పట్టి తిరగడం, తినడం, పడుకోవడం తప్ప… నాన్నకు పెద్దగా సహాయపడటం లేదు. నాన్న ఎంత పని అని చేస్తాడు…? గుండె ఆపరేషన్ అయ్యింది… కళ్ళు సరిగా కనపడటం లేదు… చక్కర వ్యాధి కూడా వచ్చి చచ్చింది. ఇన్ని ఆరోగ్య సమస్యలతో పాటు… ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టాయి. నాన్నకు గుండె ఆపరేషన్ అయినప్పటి నుండి… అప్పుల వాళ్లు డబ్బు కోసం నాన్న పీకల మీద కూర్చుంటున్నారు.
ఇవన్నీ వాడికి పట్టవు… సరే పోనీలే… ఎలాగో సాగుతోంది అంటే… ఇంట్లో తెలియకుండా వదిన కోసం అమెజాన్ లో… వేలకు వేలు ఖర్చు పెట్టి బట్టలు కొంటాడు… వాడు సంపాదించే డబ్బుతో కొంటె పర్వాలేదు కానీ… అమెజాన్ లో క్యాష్ ఆన్ డెలివరీ చేస్తాడు. డెలివరి అబ్బాయి ఇంటికి వచ్చే వరకు… చెప్పడు. అప్పటికప్పుడు వదిన ముందే “నాన్న… నాకు అంత కావాలి.. ఇంత కావాలి అంటాడు.” నాన్న ఏం మాట్లాడకుండా డబ్బులు… ఇచ్చేస్తాడు… ఇలా ఎంతకాలం? తన బాధ్యతను ఎవరో ఒకరు గుర్తు చేయాలి కదా…! అందుకే తిడుతున్నాను. అలా తిట్టకూడదు అంటా… పుట్టింటిలో జరిగే విషయాలకు… నాకు సంబంధం లేదంటా. అది వాళ్ల గొడవ… నీకెందుకు అంటున్నారు? మా అమ్మ, నాన్న బాధపడుతుంటే… నాకు నిద్ర ఎలా వస్తుంది? ఎవరో ఒకరు చెప్పకపోతే… ఎలా తెలుసుకుంటాడు? నేను అన్నను తిడుతున్నాను అని… వదిన నా మీద లేచి కూర్చింది. తాను కూడా గర్భవతే… తనకు ఏడో నెల… నాకు ఐదో నెల.
పెళ్లి అయినా తర్వాత అన్నను అరిచే అధికారం కోల్పోయినట్లేనా? నా ఇంట్లో సమస్యలు నావి కాకుండా ఎలా అవుతాయి? నా ఇంటిని చక్కదిద్దే బాధ్యత నాకు లేదా? నేను పరాయి దాన్ని అయిపోయానా? నా ప్రశ్నలకు సమాధానాలు ఎవరూ చెప్పడం లేదు… కానీ నన్ను మాత్రం నోరు తెరవద్దు, కాళ్లు కదపద్దు అంటున్నారు. ఇంటికి వచ్చినప్పటి నుండి ఒకటే ఆలోచన… నిద్ర రావడం లేదు… అన్నం సహించడం లేదు. అమ్మ ఏమో… నా మీదే కేకలు వేస్తుంది. నీ ఆరోగ్యం సరిగా చూసుకో… నీకు బిడ్డలు అయితే అదే చాలు… ఇవన్నీ ఆలోచించి… నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే…! జరగరానిది ఏదైనా జరిగితే….! కుటుంబం వేలెత్తి చూపుతుంది… సమాజం గొడ్రాలు అని నిందిస్తుంది, వేధిస్తుంది.
అన్న, వదిన… నాపై ద్వేషం పెంచుకున్నారు. ఇది ఇంట్లో ఉంటే… మాకు… మాకు గొడవలు పెడుతుంది, మమ్మల్ని వేరు చేస్తుంది… అని సరిగా మాట్లాడటం కూడా మానేశారు. మా వదిన వాళ్ల అమ్మ… మా ఇంటికి వచ్చి… నానా మాటలు అని వెళ్ళింది. ఇవన్నీ మహబూబ్ కి తెలియదు. మా అమ్మ తరుపువాళ్లు, మా నాన్న తరుపువాళ్లు అందరూ నాదే తప్పు అంటున్నారు. నేనేం తప్పు చేశానో…! అర్థం కావడం లేదు.
***
సాయంత్రం నుండి కడుపులో కుట్టు పట్టినట్టు ఉంది. ఏదో జరగరానిది జరుగుతుందని అనుమానం వేసింది. ఇక భరించలేక… అమ్మ కడుపులో తిప్పినట్లు ఉందని చెప్పేశాను. వెంటనే ఆసుపత్రికి వెళ్దాం అని చెప్పి బాత్ రూమ్ లోకి వెళ్ళాను.
రక్తం… రక్తం… రక్తం
అది రక్తం అనుకున్నాను… రక్తం కాదు…
నీళ్ళు… నీళ్ళు… నీళ్ళు
ఉమ్మనీరు… నా నుండి కదిలిపోయింది… కరిగిపోయింది… విరిగిపోయింది…
ఉమ్మినీరుతో పాటు…
నా బిడ్డ…
ఆరు నెలలు గర్భంలో దాచుకున్న బిడ్డ…
అమ్మా… అని పిలుస్తాడని కలలు కన్నా బిడ్డ…
గొడ్రాలు అనే పేరును లేకుండా చేస్తాడనుకున్న బిడ్డ…
కళ్ళు బైర్లు కమ్మాయి… గట్టిగా కేక వేశాను… అమ్మ చూసింది… ఏడ్చింది… కూలబడింది… మళ్ళీ నిలబడింది… వెంటనే ఆసుపత్రికి వెళ్ళాము.
గర్భసంచిలో ఏదో సమస్య ఉన్నట్లు ఉంది… డెలివరి అయ్యేలా అనిపిస్తోంది… కుట్లు వేస్తాను… వెంటనే బెంగళూరు వెళ్ళండి… అక్కడైతే రెయిన్ బో ఆసుపత్రిలో బాగా చూస్తారు… ఒక వేల డెలివరి అయినా… బిడ్డను కాపాడుతారు అన్నారు.
వెంటనే అంబులెన్స్ వేసుకొని బెంగళూరు బయలు చేరాము. రెయిన్ బో ఆసుపత్రిలో చేరాను. బిడ్డ దక్కడం కష్టం… ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నారు.
డెలివరి అయ్యాను… రక్తపు మడుగులో… నా బిడ్డ…
ఉమ్మనీటి నుండి మట్టిలోకి…
తల్లి గర్భం నుండి గుంతలోకి…
గర్భ పేగు తెంచుకొని… పుడమి నోట్లోకి…
ఆకులు కదలడం ఆగిపోయాయి… దీపం ఆరిపోయింది… ఊపిరి గడ్డ కట్టినట్లు…
ఉమ్మనీరు పోతున్నాయి… ఎవరైనా అడ్డు కట్ట వేయండి…
గాళ్లో ఉమ్మనీరు కలిసిపోయాయి… పుడమిలో ఇంకిపోయాయి…
గర్భం వట్టిపోతోంది… ఉమ్మనీరు కావాలి… ఉమ్మనీరు నిలబడాలి… ఉమ్మనీటిని పట్టుకోండి…
నా బిడ్డ… నా ఉమ్మనీరు…
నాకు ఉమ్మనీరు కావాలి… నా బిడ్డ… నాకు కావాలి..
మీ దగ్గర ఉమ్మనీరు ఉందా…? మీ దగ్గర నా బిడ్డ ఉన్నాడా…?
ఏదో అలికిడి… మరేదో వినికిడి…
బహుశ అది… నా బిడ్డదేనా? కడుపు మీద చేయి వేసి తిప్పాను…
భవిష్యత్ రెక్కలు కదిలినట్లు అనిపించింది.
***