జయ విజయులు శ్రీమహావిష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారపాలకులు.మునివర్యుల శాపకారణంగా 'హిరణ్యాక్ష'-హిరణ్యకసిపులుగా జన్మించి తమ తపస్సుచే బ్రహ్మ దేవుని మెప్పించి,అనేక వరాలు పొందారు.
హిరణ్యాక్షుని భార్య వృషద్బానువు.హిరణ్యకసిపుడి భార్య లీలావతి ఈమె గర్బవతిగా ఉన్నప్పుడు నిద్రపోతున్న సమయంలో నారదుడు గర్బ లోని శిశువుకు నారాయణ మంత్రం ఉపదేశంతో విష్ణుభక్తుడైన'ప్రహ్లాదుడు'జన్మించాడు.హిరణ్యకసిపుని మరోభార్య జంభాసురుడి కుమార్తె దత్త.ఈమెకు అను అహ్లాదుడు,సంహ్లాదుడు,హ్లాదుడు జన్మించారు.హ్లాదాను భార్య దమని,ఈమెకు వాతాపి,ఇల్వలుడు జన్మించారు.రాక్షసాంశతో పుట్టడంవలన పలుమాయ విద్యలతో పాటు,కామరూప విద్య తెలిసి ఉండటంతో పలు జంతురూపాలలో అడవులలో సంచరించేవారు ఈ అన్నదమ్ములు.
'ఇల్వల' అంటే తప్పుడు ఆలోచనలు చేసే మనసు అని అర్ధం.'వాతాపి'అంటే మరణం అని అర్ధం.వీరిద్దరూ విచిత్రమైన రూపంలో మనుషులను చంపి ఆరగించేవారు.అరణ్యమార్గన వెళ్ళేవారిని భోజనానికి ఆహ్వానించి వాతాపిని మేకగా మార్చి చంపి ఆమాంసంతో కూరవండి వచ్చిన అతిథికి భోజనం వడ్డించేవాడు ఇల్వలుడు.అతిథి భోజనానంతరం చేతులు సుభ్రపరుచుకుంటున్న సమయంలో -వాతాపి బయటకురా! అనిఇల్వలుడు పిలిచేవాడు.అతిథి కడుపులో మేకమాంసరూపంలో ఉన్న వాతాపి అతిథి పొట్ట చీల్చుకుని వెలుపలకు వచ్చేవాడు.అలాచనిపోయిన అతిధిని అన్నదమ్ములు ఇరువురు ఆనందంగా భుజించేవారు.
అలా చాలా కాలంగా జరుగుతున్న విషయం అగస్త్యమహర్షికి తెలిసి మారువేషంలో అరణ్యంలో ప్రవేసించాడు. అతన్ని చూసిన ఇల్వలుడు యథాప్రకారం మనిషి రూపంలో వెళ్ళి 'అయ్యా ఈరోజు మాపిత్రుదేవుళ్ళకు ప్రసాదం పెడుతున్నాం తమరు మాఇంటికి అతిథిగా వచ్చి మేకమాంస భోజనం చేసి వెళ్ళాలి 'అన్నాడు.
సముద్రాన్నే కడుపులో దాచగలిగిన అగస్త్యుడు 'సరే'అని ఇల్వలుడు వడ్డించిన మేకమాంస భోజనం కడుపునిండుగా ఆరగించి చేతులు శుభ్రపరచుకుంటున్న సమయంలో ఇల్వలుడు'వాతాపి వెలుపలకురా!'అన్నాడు.'ఇంకెక్కడి వాతాపి.జీర్ణం జీర్ణం వాతాపిజీర్ణం'అన్నాడు.విషయం అర్ధమైన ఇల్వలుడు గజగజ వణుకుతూ అగస్త్యుని శరణువేడాడు. ఇప్పటికి బిడ్డకు పాలు పట్టిన తల్లులు'జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనిఅనడం మనకు తెలిసిందే!