యమలోక రాజదర్భారు సభా వేదిక మీద తన ఆసనంలో ఏకాంతంగా మృత్యులేఖిని ముందుంచుకుని చిత్రగుప్తుడు దీర్ఘంగా ఆలోచిస్తు కూర్చున్నాడు. " ఏమిటి, గుప్తాజీ! మా రాకని కూడా గమనించకుండా ఆలోచనలో పడ్డారు. ఏదైనా పెద్ద సమస్యా? చెప్పండి" యమరాజు ఆందోళనగా అడిగాడు. " పెద్ద సమస్యే , యమధర్మరాజా! మృత్యులేఖినిలో ఉన్న మృత్యుసమయానికి భూలోక ప్రాణి జీవిత కాలానికీ పొంతన కుదరడం లేదు. భూలోకంలో ప్రతి మానవుడి జీవన ప్రమాణం అస్థ వ్యస్థమై పోయింది. సృష్టి కర్త బ్రహ్మదేవుల వారిచ్చిన ఆయువు కంటే ఎక్కువ తక్కువ కాలం జీవిస్తున్నారు. భూలోక శాస్త్రవేత్తలు అన్ని రంగాల్లో పరిశోధనలు జరిపి మనిషిని పోలిన మనుషుల్ని సృష్టిస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సతో రూపాలే మార్చేస్తున్నారు.అందువల్ల పాపుల్ని గుర్తించడంలో మన సిబ్బంది పొరపాటు పడుతున్నారు. మరొక సమస్య ఏమిటంటే, భూలోకానికి డ్యూటీ మీద వెళ్లిన మన యమకింకరులు అక్కడ లబ్యమయే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఆ మత్తులో అసలు చనిపోయిన ప్రాణిని వదిలి పెట్టి ఏ పార్కులోనో , ఫుత్ పాత్ మీదో మాదక ద్రవ్యాలు సేవించి మైకంలో పడున్న జీవుల్ని చనిపోయారను కుని యమలోకానికి పట్టుకొస్తున్నారు.వారు తీసుకొచ్చే జీవులకు నా మృత్యులేఖిని లోని జీవికి సరి పోలడం లేదు. వాటిని సరిచెయ్యలేక నాకు శిరోవేధన కలుగుతోంది స్వామీ! ఈ మధ్య భూలోక భారతావనిలో నరేంద్ర గుప్తుడు అనే మేధావి ఆధార్ కార్డు అనే అస్త్రంతో అనేక అవినీతి అరాచకాల్ని అరికట్టి జనరంజక పాలన సాగిస్తున్నట్టు తెల్సింది. మీరు సృష్టికర్త బ్రహ్మదేవుల వారిని సంప్రదించి ఆధార్ కార్డు గుర్తింపు ప్రతి మానవ ప్రాణికి ఇచ్చి పాపం చేసిన ప్రాణికి, పుణ్యం చేసిన ప్రాణికీ వేరువేరు రంగుల గుర్తింపు కార్డులు లబ్యమైనచో ఇప్పుడు జరుగుతున్న తప్పిదాలకు అడ్డుకట్ట వేయ వచ్చు. వారి గుర్తింపు కార్డుల ననుసరించి జీవుల ఆత్మలను స్వర్గలోకానికో లేక నరకలోక ద్వారానికో పంపవచ్చు. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరికి నాకు మనశ్శాంతి లభిస్తుంది. భూలోకంలో మాధక ద్రవ్యాలు సేవించి విధుల్లో నిర్లక్ష్యం చేసే ఉధ్యోగులకు ,వాహనాలు నడిపే వాహన చోదకులకు అనేకమైన పరీక్షా విధానాలున్నాయట. కనుక భూలోకానికి పనుల మీద వెళ్లిన మన యమకింకరు లకు కూడా అటువంటి పరీక్షా విధానం ప్రవేశపెట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పరిస్థితి అదుపులో కొస్తుంది. గోరుచుట్టు మీద రాయి దెబ్బలా గత శార్వరి సంవత్సరం నుంచి భూ ప్రపంచం మీద కరోనా అనే మహామ్మారి చైనా అనే దేశంలో పుట్టి నెలల్లో ప్రపంచ దేశాల్ని చుట్టుముట్టి ముసలివార్ని రోగిష్టుల్నీ రోజుల్లో మృత్యు ముఖానికి చేరుస్తోంది ఆ వైరస్. ఆ వత్తిడి మన నరకలోకం మీద పడింది.సిబ్బంది తక్కువ, పని వత్తిడి ఎక్కువ అవుతోంది. భూలోకం నుంచి వచ్చే జీవుల పాప పుణ్యాలు మృత్యులేఖిని లో వెతకలేక తల పగిలిపోతోంది.మన యమకింకరులు నోటికి మూతికి గుడ్డ (మాస్క్) లేందే పంపాలంటే భయంగా ఉంది. భూ ప్రపంచం మీద ప్రబలిన ఆ కరోనా వైరస్ కి కోవిడ్19 అని పేరు పెట్టారట.ముఖ్యంగా అది నోటిమాటలు , ముక్కుతో వచ్చే తుమ్ములు , చేతి కరచాలనంతో ఒకరినుంచి మరొకరికి వ్యాపి స్తుందట. భూలోక ప్రపంచ దేశాలన్నీ దీని ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులతో తిండి లేక చావులు వస్తున్నాయి.భూలోక శాస్త్ర జ్ఞులు ఈ వైరస్ నిరోధక ఇంజక్షన్ కోసం రాత్రింబవళ్లు శ్రమ పడుతున్నారట. పూర్తిగా అరికట్టే ఔషధం కోసం తెగ కృషి జరుగుతోంది. కొంత వరకూ సత్పలితాలు వస్తున్నాయట. మన యమలోక భటులు తరచు భూలోకానికి జీవుల కోసం వెళ్ల వలసి వస్తోంది. వాళ్లకి తగిన రక్షణ కవచాలు మాస్కులు అందించక పోతే ఆ కరోనా వైరస్ నరకలోకానికి వ్యాపించే అవకాశం ఉంది. అలాగే జీవుల్ని సానిటైజర్ అనే ద్రావంతో శుభ్ర పరిచికాని నరకలోక ద్వారాల్లోకి అనుమతించ వద్దు. కొద్ది నెలల నుంచి ఆ వైరస్ ప్రభావం తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభించిందట.భూలోక ప్రజలకు యమలోకం కన్న కరోనా వైరస్ భయమే పట్టుకుందట." చిత్రగుప్తుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. " మీరు చెప్పిన విషయాలు విని నాకూ ఆందోళనగానే ఉంది గుప్తాజీ! తగిన చర్యలు తీసుకోక తప్పదు.నేను బ్రహ్మదేవుల వారి దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లి ఒక పరిష్కార మార్గం కనుగొందాం." దైర్యం చెప్పాడు యమధర్మరాజు. * * *