మందాకిని నదీ తీరంలో ఒక పెద్ద మామిడి వృక్షం మీద వానరం నివసిస్తోంది.చెట్టు కింద నదిలో ఒక మొసలి ఆవాశం ఉంటోంది. సీజనులో పండే మామిడి ఫలాలు తను తిని కొన్ని మొసలి కోసం నీటిలో పడవేసేది.అలా వారిద్దరికీ స్నేహం కుదిరింది. మామిడి పళ్లు పండని కాలంలో వానరం మొసలి వీపు మీద కూర్చుని నదికి అటువైపు ఉన్న అడవికి వెళ్లి నేరెడు రేగు ఉసిరి జామకాయలు తను తిని మిత్రుడు మొసలికి కొన్ని ఫలాలు తెచ్చి పెట్టేది. ఆ విధంగా వారి స్నేహబంధం బలపడింది. మామిడి వృక్షానికి కొద్ది దూరంలో ఉన్న బొరియలో ఒక నక్క ఉంటోంది. అది కోతి మొసళ్ల స్నేహబంధం చూసి ఈర్ష్య పడేది. ఎలాగైనా వాటి స్నేహాన్ని చెడగొట్టాలనుకుంది. కోతి లేనప్పుడు మామిడి చెట్టు దగ్గరకు వచ్చి మొసలికి నక్క సంగీతం వినిపిస్తు తొండలు ఉడతలు పిట్టల్ని తినడానికి కానుకలు తెచ్చేది. నక్క తెచ్చి పెట్టే కొత్త రుచులకు మొసలి ఆకర్షితురాలై దోస్తీ మొదలు పెట్టింది. రోజులు గడుస్తున్నాయి. కోతి మొసళ్ల అనుబంధం ఎలా విడ గొట్టాలని నక్క ఆలోచిస్తోంది. కోతి శాకాహారి కావడంతో నక్కతో దోస్తీ పొసగడం లేదు. నక్కకి ఒక ఆలోచన తట్టింది. శాకాహారి గుండెకాయ తింటే ఆయుః ప్రమాణం పెరుగుతుందని, శరీరానికి తేజస్సు వచ్చి కంటి చూపు పెరుగుతుందని మొసలికి నూరి పోసింది. కోతి శాకాహారి కనక నీకు అన్ని విధాల నప్పు తుందని చెప్పింది. నక్క తన మీద ఏదో గూడుపుఠాణి జరుపుతోందని అనుమానంగానే ఉంది కోతికి. ఒకరోజు నది దాటే క్రమంలో వీపు మీద కూర్చున్న కోతితో మొసలి " నేస్తమా, నా ఆరోగ్యం క్షీణిస్తోంది. అందువల్ల శాకాహారి గుండెకాయ భుజిస్తే నయమౌతుందని తెల్సింది. నువ్వే అసలైన శాకాహారి గుండె కలదానివి , కనక నీ గుండెకాయ నా కిచ్చెయ్ అంది. దాంతో కోతి అనుమానం నిజమైంది. ఇదంతా జుత్తులమారి నక్క పన్నాగమేనని గ్రహించింది. ఎలాగైనా ఈ ఆపద నుంచి బయటపడి ఆ జిత్తులమారిని ఇరికించాలనుకుంది. వెంటనే తేరుకుని సమయస్ఫూర్తితో " అయ్యో, మిత్రమా! ఎంత కష్టం వచ్చింది. నీ ఆరోగ్యం బాగు పడటమే నాకు కావల్సింది. ఈ విషయం ముందే చెప్పి ఉంటే నా గుండెకాయను వెంట తెచ్చుండే వాడిని. తిండికి బయలుదేరే ముందు మామిడి చెట్టు తొర్రలో దాచి పెట్టేను. రేపు వచ్చేటప్పుడు వెంట తెస్తాననగానే వెర్రిబాగుల మొసలి ' సరే' నని కోతిని ఒడ్డుకు చేర్చింది. ఒడ్డుకు చేరిన కోతి చెట్టు మీద కూర్చుని నక్కని ఇరికించడానికి ఒక ఉపాయం పన్నింది. మర్నాడు మామూలుగా మొసలి నేస్తాన్ని పలకరించి "మిత్రమా, చెట్టు తొర్రలో ఉంచిన నా గుండెకాయని తేనెటీగలు రంద్రాలు చేసి తేనెగూడు కట్టుకున్నాయి. కనుక అది పనికి రాదు. నీకు ఒక సలహా చెబుతాను నేస్తం, మన నక్క మిత్రుడి గుండెకాయ వాడుకో. అది మాంసాహారి కనుక దృఢంగా మంచి పోషక విలువలుంటాయి. నీ ఆరోగ్యం తొందరగా మెరుగవుతుందని చెప్పి , నక్కని తిన్నగా గుండెకాయ ఇవ్వమంటే ఇవ్వదు. కనుక విందు ఏర్పాటు చేసి నది నీటి ఒడ్డుకి రప్పించి గుండెకాయను తీసుకో " అంది. మొసలికి ఈ ఆలోచన నచ్చింది. ఒకరోజు నక్క మిత్రుడిని పిలిచి తన పుట్టినరోజు పండగ ఉందని ఆ రోజు తాబేలు మాంసం, పీతలు రొయ్యలు నత్తలతో విందు ఏర్పాటుకి రావల్సిందిగా కోరింది. ఎప్పటినుంచో తాబేలు మాంసం తినాలను కుంటున్న నక్కకి నోట్లో నీళ్లూరేయి. మొసలి చెప్పిన రోజున నక్క లొట్ట లేసుకుంటు నది నీటి ఒడ్డుకి చేరుకుంది. నక్కను చూసిన మొసలి "మిత్రమా, ఇంకొంచం ముందుకు రమ్మని చెప్పగా నక్క నీటిలోకి దిగగానే మొసలి దాని తల నోట్లోకి ఇరుకించుకుని నక్క పొట్టను చీల్చి గుండెకాయను మింగేసి మిగిలిన శరీరాన్ని గట్టున పడేసింది. ఇదంతా చెట్టు మీద నుంచి గమనిస్తున్న కోతికి తన పాచిక పారి నక్క పీడ వదిలినందుకు సంతోషించింది.మునుపటిలా మొసలితో స్నేహం కొనసాగించింది. నీతి : ఆపదలొచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి బయట పడాలి. * * *