వెండి బిందెలు - సౌదామిని

Vendi bindelu

హాల్లో మా వారితో కలిసి మా చిన్న అబ్బాయి కోసం కుదిర్చిన పెళ్లి సంబంధం వాళ్ళతో మాట్లాడుతున్నాను.

“కట్నం ఎంత అని మనం ఒక మాట అనుకుంటే బాగుంటుంది” అని చీర కొంగు ముందుకు లాక్కుంటూ అన్నాను.

“ఎంత అనుకుంటున్నారో చెప్పండి” అని అవతల నుండి వినయంగా సమాధానం.

“పది లక్షలు అనుకుంటున్నాం” అన్నాను కరాఖండిగా. మా వారు నా వైపు చూసి అంగీకారంగా తల తిప్పారు. “అంతేగా అంతేగా” అన్నట్టు. ఈయనతో వచ్చిన చిక్కే ఇది. అన్నీ నాతో చెప్పిస్తారు.

“అమ్మాయి కూడా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తోంది. పైగా దాని పేరున కూడా ఏవో చిన్న ఆస్తులు కూడా రాశాం. ఖచ్చితంగా అంత ఇవ్వాలంటారా?” అని అవతల నుండి ప్రశ్న.

నేను ఒకటి అనుకున్నాక తగ్గే ప్రశ్నే లేదు అని వాళ్ళకి తెలీదు ఏమో.

“ఆస్తులు ఎప్పుడో ఇస్తే ఏమి ప్రయోజనం? మా అబ్బాయి ఒక విల్లా కొన్నాడు. ఇక మీరు చూస్తూనే ఉన్నారుగా- మాది కూడా మంచి ఇల్లే. ఇవన్నీ వాళ్ళకేగా” అని గంభీరం గా చెప్పాను.

“సరే, అలాగే నండి. ఎలాగో ఏర్పాటు చేస్తాం. అంతే కదండీ, ఇంకా ఏమైనా మాట్లాడాల్సినవి ఉన్నాయా?” అని ఆయన పొరబాటున నాలుక జారాడు.

“ఓహ్! లాంఛనాలు అంటారా. ఏముందండి, పెద్ద ఏమీ అక్కర్లేదు. ఎలాగూ చెరొక పాతిక వేలు అత్తగారి లాంఛనాలు, ఆడపడుచు లాంఛనాలు క్రింద ఇస్తారు. అందరూ అలాగ ఇస్తూనే ఉన్నారు కదా. ఇక మీ అమ్మాయికి, మా అబ్బాయికి వెండి కంచం, గ్లాస్ మీరు ఎలాగూ ఇస్తారు. అన్నట్టు ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ ట - అందరూ ఆడపడుచుకి రెండు వెండి బిందెలు కూడా ఇస్తున్నారు. అంతే, నాకు అంత కంటే పెద్ద కోరికలు ఏమి లేవు“ అని ఆగాను. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ సమాధానం బట్టి తరువాత చిట్టా చదువుదాం, లేకుంటే మొదటికే మోసం వస్తుంది అనుకున్నాను.

కాసేపు నిశ్శబ్దం తరువాత “అంతే కదండీ” అని పెళ్లివారి సమాధానం.

“అంతే కదండీ” అన్నారంటే ఇంకా ఇచ్చే స్థోమత ఉన్నది అన్నమాట అని నాకు అర్థంఅయ్యింది. ఇప్పుడు ఈ అవకాశం పోగొట్టుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను.

“అంతే అంటే, మీరు అడిగారు కనుక చెప్తున్నాను. ఈ మధ్య రెండు మూడు పెళ్ళిళ్ళకి వెళ్ళాను లెండి. కార్యం సమయంలో ఆడపడుచుకి వెండి గ్లాస్, వెండి పళ్ళెం ఇస్తున్నారు. అలాగే మీ అమ్మాయి కాపురానికి వచ్చినప్పుడు పసుపు కుంకుమలతో ఒక వెండి చెంబు ఇచ్చి పంపించండి, అది కూడా ఆడపడుచుకే చెందుతుంది. ఇంకా... అన్నట్టు మరిచిపోయాను. అమ్మాయి కాపురానికి వచ్చినప్పుడు పసుపు కుంకుమ కింద కొన్ని వెండి కుంకుమ భరిణెలు కూడా ఇస్తే చుట్టు పక్కల అందరికీ పంచుకుంటాను, మీకే దర్జాగా ఉంటుంది..” హమ్మయ్య, నా మనసులో కోరిక లన్నీ చెప్పేసాను అని ఊపిరి పీల్చుకున్నాను.

వాళ్ళు కాసేపు మొహాలు చూసుకుని తలూపి వెళ్ళిపోయారు.

ఆడగందే అమ్మయినా పెట్టదు, మరి ఆడగకపోతే అమ్మాయి వాళ్ళు ఎలా పెడతారు అని నాకు నేను సర్ది చెప్పుకుంటూ లోపల గదిలో కూర్చున్న పెద్ద కోడలు దగ్గరకి వెళ్ళాను. ఆమె ను కూడా మాతో కూర్చోమంటే కట్నం మాటలంటే ఇష్టం లేదు అని లోపలి గది లో నుండి బయటకు రాలేదు.

“మాటలు అయిపోయాయి, బాగా ఘనంగానే ఇస్తున్నారు. రెండు వెండి బిందెలు కూడా అడిగాను. ఒకటి మా అమ్మాయికి, ఇంకొకటి నా మనవరాలికి” అని మనవరాలు తల నిమురుతూ గొప్పగా చెప్పాను.

“వాళ్ళు ఎవరో మా అమ్మాయికి ఇవ్వటం ఏమిటి అత్తయ్యా, నాకు అలా నచ్చదు. ఆ సొమ్ము మనకు వద్దు” అని విసురుగా అంది పెద్ద కోడలు.

ఆ పిల్ల బాధ ఏమిటో నాకు అర్థం కాదు. వాళ్ళ సొమ్ము ఇప్పిస్తానంటే ఈ అమ్మాయికి ఏంటి నొప్పి? అయినా నా మనవరాలికే గా నేను ఇప్పిచ్చుకునేది. ఇప్పుడు ఆమెతో వాదించే సమయం లేదు గానీ అనుకుంటూ ఆ గదిలో నుండి బయటకు వచ్చేశాను.

ఒక ప్రక్క నా మనసు ఆనందం తో ఉవ్విళ్లూరుతోంది. అయినా అసలు పెద్ద కొడుకు నా మాట విన్నాడా? సంబంధం ఖాయం చేసుకున్నాక కట్నం అడిగినందుకు పెద్ద కోడలు పెళ్లి రద్దు చేసుకుంటానని గొడవ చేసిందిట. మా వాడు అందుకని కట్నం అడిగినందుకు నా మీద అంత ఎత్తున లేచాడు.

అలాగని నేనేమైనా ఊరుకున్నానా? పెళ్లి ముందే ఆ అమ్మాయికి మన మీద గౌరవం లేకుండా ఉంటే రేపు మర్నాడు ఎలాగా అని అప్పుడు నేను గట్టిగానే అడిగాను.

“ఇప్పుడు తల్లిదండ్రుల మీద బాధ్యత తో ఉన్న ఆమె రేపు మర్నాడు మన పట్ల కూడా బాధ్యతగా ఉంటుంది. చిన్నప్పటి నుండి బాధ్యతగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తోంది. అయినా ఆ అమ్మాయి నా అంత చదువుకుని, నా కంటే మంచి ఉద్యోగం చేస్తుంటే ఇంకా కట్నం ఏంటి?” అని గొడవ పడ్డాడు.

అమ్మాయి ఎంత చదువుకుని ఉద్యోగం చేస్తే ఏమిటి? అమ్మాయి అబ్బాయి అయిపోతుందా? రేపు మర్నాడు మా అమ్మాయికి నేను కట్నం ఇచ్చుకోవద్దా? ఆదేమో అసలే రంగు తక్కువాయే, పైగా పెద్ద చదువు అబ్బ లేదు . నాకు అల్లుడు కట్నం తీసుకోకుండా ఊరికే వస్తాడా? నా బాధలు నావి.

వాళ్ళని పైసా కట్నం ఆడగద్దు, నీకు కావలసినవి నేనే ఇస్తాను అని పెళ్ళికి ముందు పెళ్లి ఖర్చుల కోసం ఆన్ సైటు వేయించుకుని వెళ్ళాడు.

వాడు ఆన్సైటు వెళ్ళాక పెద్ద కోడలు తల్లికి ఫోన్ చేసి లాంఛనాలుగా వెండి కంచాలు, వెండి బిందె అడిగాను అనుకోండి. ఏ కళనున్నారో గానీ అడిగినవన్నీ ఇచ్చారు. ఏ మాట కా మాట, గట్టిగా అడగటం వల్లనేమో గానీ పెళ్లి మాత్రం గ్రాండ్ గానే జరిపించారు.

పెద్ద కొడుకు, కోడలు కేమి తెలుసు ప్రపంచం? ఇలా అడిగితే ఇస్తారు గాని లేకపోతే ఆమె తల్లితండ్రులు ఈ అమ్మాయికి రేపు పొద్దున్న రూపాయి ముట్ట చెబుతారా ఏమిటి?

ఇప్పుడు చిన్నవాడు చెప్పిన మాట విన్నాడు కాబట్టి అన్నీ ఇస్తున్న సంబంధం కుదిరింది. కట్నం ఎక్కువ ఆడగచ్చు అనే కదా చిన్నోడికి లోను పెట్టి 30 లక్షల విల్లా కొనిపించాను. ఇక లోను పోగా వాడికి జీతం లో ఐదారు వేలే మిగులుతాయి అనుకొండి, అందుకే గా ఉద్యోగం ఉన్న కోడలిని చేసుకుంటోంది. పైగా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వాడి కాబోయే అత్తగారి మెడలో బంగారం చూసినప్పుడే అర్థం అయ్యింది, వాళ్ళు స్థితిమంతులు అని. అందుకే, వెంటనే ఈ సంబంధం ఖాయం చేసేశాను.

మొత్తానికి పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నేను చిన్న కోడలికి ఒక అరడజను సిల్కు చీరలు, రెండు తులాల నెక్లస్, ఒక తులం నల్ల పూసల గొలుసు కొనేశాను. నగలు పల్చగా ఉన్నాయని అమ్మాయి తరఫు వాళ్ళు ఏదో చిన్న గొడవ చేశారుట. తులం బంగారం అంటే మాటలా? ఆ మాత్రం దానికే అచ్చంగా రెండు లక్షలు ఖర్చు అయ్యాయి. నాకు డబ్బులు ఏమైనా ఊరికే వస్తున్నాయా?

ఎట్టకేలకు పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి ముహూర్తానికి ఊరేగింపుతో మండపం చేరుకున్నాం. హైదరాబాద్ శిల్ప కళావేదిక లో బాగా అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎదురుకోలు సన్నాహాలు, అలంకరణలు, ఏర్పాట్లు అన్నీ భారీగానే ఉన్నాయి. పానకాలు ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమం మొదలయ్యింది. పెళ్లి వారు నా చేతుల్లో రెండు బుడ్డి చెంబులు పెట్టారు. ఇంకా బిందెలు తెస్తారు అని ఎదురు చూశాను. అందులోనే పానకం పోసి తాగమన్నారు. నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది, పానకం గొంతు దిగలేదు. మా చూట్టాల ముందు నా తల కొట్టేసినట్టు అయ్యింది. బిందెలు అడిగితే, బుడ్డి చెంబులు ఇస్తారా? వీళ్ళ సంగతి పెళ్లి అయ్యాక చెప్పాలి అనుకుని పైకి మాత్రం సామరస్యంగా నటించాను.

పెళ్లి బ్రహ్మాండంగానే జరిగింది. నా కడుపు మాత్రం రగిలి పోతోంది. పెళ్లి, వ్రతం ఎలాగో అయ్యిందనిపించాను. వ్రతం అయిపోగానే ఆ రెండు బుడ్డి చెంబులు తీసి టేబల్ మీద పెట్టాను. చిన్న కోడలిని కడిగేయాలని కసిగా ఉంది.

ఇంతలో సూట్ కేసు తో మా చిన్న అబ్బాయి హాల్లో కి వచ్చాడు.

మూడు నిద్దరలకి అప్పుడే మా వాడికి తొందర ఏమొచ్చిందని?

“ఎక్కడికి?” అని అనుమానంగా అడిగాను.

“ఇంకా ఈ మూడు నిద్రలు, చాదస్తాలు ఏమిటి? డైరెక్ట్ గా హనీమూన్ కి సింగపుర్ ఫ్లయిట్ ఎక్కేస్తున్నాం” అన్నాడు నా చిన్న కొడుకు.

అదేమిటి, అమ్మాయికి కార్యానికి ఇవ్వవలసిన వెండి పళ్ళెం, గ్లాస్ రావా అని నాకు అనుమానం మొదలయ్యింది.

“మళ్ళీ ఎప్పుడు రా వెనక్కి వచ్చేది?” అని గట్టిగా అడిగాను.

“ఎప్పుడైనా చూడటానికి వస్తాం లే అమ్మా” అని విసురుగా అన్నాడు.

“చూడటానికి రావటం ఏమిట్రా?” అని నేను విస్తుపోయాను.

“అంటే హానీమూన్ అయ్యాక వేరే ఫ్లాట్ తీసుకున్నాం, అక్కడే ఉంటాం. అన్నట్టు పెళ్లి ఖర్చులు పోగా మిగిలిన కట్నం డబ్బులతోనే ఈ సింగపూర్ ట్రిప్, ఫ్లాట్ లో సామాను అన్నీ కొనేశాను” అనేసరికి నేను అవాక్కు అయ్యాను.

“నాకు చెప్పకుండా ఇదంతా ఏమిట్రా?” అని నిలదీశాను.

కొడుకు నా పక్కకు వచ్చి కూర్చుని “చూడమ్మా, అసలు విషయం చెబుతాను. నా జీతం లో మిగిలే ఐదారు వేలతో సంసారాన్ని ఎలా పోషించను? వేరే ఉంటేనే తను జీతం డబ్బులు ఇస్తానంది. అందుకే ఒప్పుకున్నాను” అని తెల్ల మొహం వేశాడు.

నేను కొంచెం ఆవేశం తగ్గించుకుని “సరే, ఎలాగూ వేరే ఉందాం అనుకున్నప్పుడు పోనీ నువ్వు కొనుక్కున్న ఆ విల్లా లోనే ఉండచ్చు కదరా. మేము కూడా వచ్చి పోవటానికి వీలుగా ఉంటుంది” అన్నాను.

“తనకి ఆ విల్లా నచ్చలేదుట. రోడ్డు మీదకి లేదు, ఎక్కడో లోపలకి ఉంది అంటోంది” అని చిన్న కొడుకు నెమ్మదిగా చెప్పాడు.

“ఆ విల్లాకి ఏమయ్యింది రా? అంత మంచి విల్లాకే వంకలా?” అని నోరు వెళ్లబెట్టాను.

“సిల్లీగా మాట్లాడకు అమ్మా, వాళ్ళ లెవెల్ చూసావు కదా పెళ్లి ఎంత గ్రాండ్ గా చేశారో? అసలే నువ్వు పెట్టిన నగలు, చీరలు చూసి వాళ్ళ బంధువుల వెక్కిరింపులకి వాళ్ళ పరువు పోయింది. అయినా నిజం మనకి తెలీదా? తక్కువకి వస్తోందని విల్లా ఎక్కడో ఊరు అవతల కొన్నాం. అక్కడ ఎలా ఉంటాం అసలు? పైగా ఇప్పుడు దానికి అద్దె లేదు, అమ్ముదామన్నా అమ్ముడు పోవట్లేదు” చిన్న కొడుకు కొంచెం స్వరం పెంచాడు.

“నా చీరలకి, నగలకే వంక పెడతారా? నువ్వు వాళ్ళ తరఫున వకాల్తా తీసుకుని మాట్లాడుతున్నావే. ఏమిట్రా వాళ్ళ బోడి లెవెలు. మరి వాళ్ళు ఇచ్చినది ఏమిటి? బిందెలు అడిగితే బుడ్డి చెంబులు ఇచ్చారు.” అని చెంబులు చూపిస్తూ నా ఆక్రోశం గట్టిగా వెళ్లగక్కుకున్నాను.

అప్పటిదాకా చాటు నుండి వింటున్న చిన్న కోడలు హాల్లో కి వచ్చి “అత్తయ్య, మినియేచర్ కిచెన్ సెట్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. అందుకే మీ స్టేటస్ కి తలతూగుతాయని అలా కొన్నాం” అని కూల్ గా చెప్పింది.

“అన్నట్టు సింగపుర్ లో సిగ్నల్ అంత కలవదు ఏమో, ఫోన్ ట్రై చేయకు. వచ్చాక నేను చేస్తాలే” అంటూ సూట్ కేసు లు తీసుకుని చిన్న కొడుకు కోడలితో కలిసి విస విసా బయటకు నడిచాడు.

నా కళ్ళు బైర్లు కముతున్నాయి. ఆ రెండు వెండి చెంబులే నాకు వేల సంఖ్యలో కనిపిస్తున్నాయి.

లోపల పెద్ద కోడలు మాటలు లీలగా వినిపిస్తున్నాయి. “పాపా రామ్మా, నీకు బాతు, బంగారు గుడ్ల కథ చెప్పాలి”.. .

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు