తాళి..తీయక తప్పదా....? - రాము కోలా దెందుకూరు.

Taali teeyaka tappada

అ...వ్వావ్వా !ఇదెక్కడి చోద్యమే తల్లి " అంటూ ఊరు ఊరంతా ముక్కున వేలు వేసుకుంది.రామతులసి చేసిన పని చూస్తూ.. "పిదప కాలం పిదప బుద్ధులూను , రోజు రోజుకి మనుషులు ఇలా తయారవుతున్నారు ఏమిటో " నిష్టూరంగా అనేసి ముక్కు చీదేసింది నూకాలు. " తరతరాలుగా మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు ఉన్నాయి కదా! వాటిని మనం పాటించక తప్పదు. ఇప్పుడు వాటిని వదులుకోవాలంటే వీలౌతుందా?. కొద్దిగన్నా ఆలోచన లేకపోతే ఎట్టాగో" మాట కలిపింది పార్వతమ్మ..నలుగురు వైపు చూస్తూ.. "మనం చేయలేని తెగింపు తాను చేసింది. మనిషిలో మార్పు రావాలి. మూర్ఖత్వంతో పాటించే కొన్ని ఆచార వ్యవహారాలు ఎదో ఒక రోజు ప్రతిఘటించక తప్పదు." "అది ఎవ్వరో ఒకరితో ప్రారంభం కాకతప్పదు. అది మన రామతులసితోనే అనుకుందాం. ఇలా కించపరచడం .దూషించడం సరికాదు" అంటూ తన మనసులోని మాటను బయటకు తీసింది ఊర్మిల. "చాలు చాలు చాల్లే బాగానే చెప్పోచ్చావు నడమంత్రపు సిరి అంటే ఇదే, పట్నం చదువులు కోసం పంపించింది ఏదో నాలుగు ముక్కలు చదువుకుంటారని. కానీ ఇలా ఎదురు తిరిగి వాదనలు చేయడానికాదు.." అంటు చేతులు దులిపేసింది వర్దనమ్మ.. "చూడండి !తనకు నచ్చినట్లు ఉండే స్వేచ్చ,అర్హత తనకు ఉన్నాయ్. ఎవ్వరం కాదనలేం కూడా. కానీ మధ్యలో వచ్చిన కొన్ని అలంకరణలు , కొన్ని సందర్భాల్లో దూరం చేయకు తప్పదు. వీటికి రామతులసి ఒప్పుకోవడంలేదు. తన భర్త నుండి సంక్రమించినవి.. తన గుర్తుగా నా దగ్గర దాచుకునే అర్హత నాకుంది కదా "అంటుంది రామతులసి. అగ్నిసాక్షిగా వేదమంత్రాల సాక్షిగా పంచ భూతాలు సాక్షిగా. గ్రామపెద్దల సమక్షంలో తన భర్త తన మెడలో కట్టిన తాళి.ప్రతి క్షణం తనకు తానే తోడు అని తలుచుకుంటూ , ఎదపైన నిలుపుకుంటాను.అది తీసి తాను నాకు ప్రసాదించిన సౌభాగ్యం దూరం చేసుకోలేను" ఇది రామతులసి మాట." తరతరాలుగా వస్తున్న విధానంలో మార్పును కోరుతుంది. కాదనే హక్కు మనకు లేదు. తీసేస్తామని చెప్పగల సంస్కారం మనలో లేదు. భర్త కట్టిన తాళిని పవిత్రంగా భావించి తనతోనే ఉండనీయమంటుంది. మనం ఎలా కాదనగలం" ఊరిలో అభ్యుదయ భావాలు గల గ్రామ పెద్ద మాట అది. సమాజంలో విభిన్నకొణాలు ఫేస్ చేయవలసింది స్త్రీ మాత్రమే తనకు నచ్చినట్లుగా జీవించాలన్నా చుట్టూ ఉన్నా సమాజం అనుమతి కావాలేమో...??? కాదంటే నిందలూ నిష్టూరాలేనేమో.. తన భర్త వలన తనకు సంక్రమించిన పసుపుకుంకాలను భర్త కట్టిన తాళిని కన్నులకు అద్దుకుంటూ,తను దూరమైనా తనతో గడిపిన జ్ఞాపకాలను ఎదలో నిలుపుకుంటూ.. తన చంటి బిడ్డను సంకన వేసుకుని ముందుకు సాగుతుంది రామతులసి. గ్రామంలో కట్టుబాట్లకు దూరంగా కొత్త విధనంకు శ్రీకారం దిద్దుతూ.....

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు