ట్రెండ్ సెట్టింగ్ - శింగరాజు శ్రీనివాసరావు

Trend setting

మూడు అలకలు, ఆరు సాధింపులతో తను అనుకున్నది సాధించింది వనజాక్షి. పెళ్ళయిన ఆరేళ్ళ తరువాత పుట్టిన బిడ్డడికి సాదాసీదా పేరు పెట్టడానికి ససేమిరా ఒప్పుకోలేదు. తమ రెండు కుటుంబాలలో అటు మూడు, ఇటు మూడు తరాలలో వినిపించని సరికొత్త పేరు తన కొడుకుకు పెట్టి ట్రెండును సెట్ చేయాలని ఆరాటపడింది. సంప్రదాయ వంశమని ఏ చైనా పేరో, జపాను పేరో, అర్థంకాని ఏ దేవనాగరిక భాషలోనో పేరు పెట్టడానికి ససేమిరా అని పెద్ద తరాలన్నీ నెత్తి, నోరు బాదుకున్నా ఏమాత్రం వెనుకకు తగ్గకుండా సతపోరి తాను అనుకున్న పేరును కొడుకుకు పెట్టాలని నిర్ణయించుకుని పీటల మీద కూర్చుంది వనజాక్షి. ప్రపంచాన్ని జయించగల మనిషైనా సరే, అవసర వేళ ఆలిమాట వినవలసిందే నన్న ధర్మసూక్ష్మానికి కట్టుబడి వందనం భార్యకే ఓటువేసి పక్కన కూర్చున్నాడు. ఏ పేరు పెడుతుందో మహాతల్లి అని సణుగుకుంటూ ముందు తరాలన్నీ భయంతో వణికిపోతున్నాయి. ఏ పేరు పెట్టినా అందులో తమకు నచ్చిన అక్షరాలను ఏరుకుని, తమకు నచ్చిన రీతిలో పిలవాలని నిర్ఢయించుకున్నారు వారంతా. పంతులుగారి ఆగమనంతో కార్యక్రమం మొదలయింది. ఒక అరగంటసేపు రకరకాల అష్టోత్తరాలు వల్లించి బియ్యంలో పేరు వ్రాయడానికి ఉంగరాన్ని తెప్పించాడు పంతులు గారు. " నాయనా ఇప్పుడు మీరు అబ్బాయికి పెట్టాలనుకున్న పేరును పలికి, దానిని ఈ బియ్యంలో ఉంగరంతో వ్రాయండి" అని ఉంగరాన్ని వందనానికిచ్చాడు. బుద్ధిగా భార్యవైపు చూశాడు. " అక్షిద్ వర్యేన్" అని భర్తకు చెప్పి పలకండి అన్నది వనజాక్షి. " అషిత్ వరన్" అని చెప్పి వ్రాయబోయాడు వందనం. " ఆపండి. ఏమిటా పలకడం. మడతనాలుక మీరూను. ఏనాడైనా పురాణ, ఇతిహాసాలు చదివిన ముఖమైతే కదూ, నాలుక తిరగడానికి. ఆంగ్లమాధ్యమంలో చదివిన ఏడుపాయె. పలికింది చాలుగాని" అని ఓ చౌడప్పగారి తీరుగా తిట్ల దండకం చదివి, పంతులు గారి వైపు తిరిగి పేరు చెప్పింది. " బాగుందమ్మా. ఏదో పాతకాలపు వాడిని సహస్రనామాల పేర్లు తప్ప, ఇలాంటి అతుకుల నామాలు తెలియని వాడిని తల్లీ. తమరే పలికి తమరే వ్రాయండి. అమ్మా ఈ పేరుకు అర్థమంటూ ఏదయినా ఏడ్చిందా?" భయపడుతూనే అడిగాడు పంతులు గారు. " అదేంటి పంతులు గారు,మీకు తెలియదా. "అక్షి" అంటే కన్ను కదా, అక్షిద్ వర్యేన్ అంటే కంటికి వరంలాంటి వాడు అని. కంటిక వరం సూర్యుడు కదా అంటే ఇది సూర్యుని పేరన్న మాట. ఇదొక సరికొత్త ప్రయోగం" చెప్పి తన తెలివికి తానే మురిసిపోయింది వనజాక్షి. ' ఆహా వంకర పేరే కాదు. వక్రభాష్యం కూడ చెప్పావు కదా మహాతల్లి' అని మనసులో అనుకుని ఓ చిరునవ్వు పారేశాడు పంతులు గారు, అడ్డం చెబితే ఎక్కడ తన సంభావనకు చిల్లి పడుతుందోననే భయంతో. భర్త చేతిని చేతిలోకి తీసుకుని బియ్యంలో పేరును వ్రాయించింది. ఇప్పుడు ఆ పేరును పసివాడి చెవిలో చెప్పమన్నాడు పంతులుగారు. చెప్పారు దంపతులిద్దరూ. అంతే వాడు ఆ ధ్వనికి ఏడుపు లంఘించుకున్నాడు. ఎలాగోలా వాడిని ఓదార్చి ఆ పేరును పెద్దగా అందరికీ వినిపించేలా చెప్పింది. ఒకసారికి అర్ధం కాదేమోనని మూడు పర్యాయములు నొక్కి వక్కాణించింది. ఆ పేరును పదే పదే వల్లెవేసుకుంటున్నారు కొందరు. మరికొందరు వనజాక్షి చెప్పినపుడు సెల్ లో రికార్డు చేసుకుని స్వచ్ఛంగా పలకడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. కార్యక్రమం అయిపోగానే పెద్దల దీవెనల కోసం వచ్చారు వందనం, వనజాక్షి. " బామ్మా. నా కొడుకే వీడు. దీవించు" అని సూరమ్మ దగ్గరికి వచ్చాడు వందనం. " ఏంపేరే అమ్మాయి. ఇందాక సరిగా వినిపించలేదు" అనగానే చెప్పింది వనజాక్షి "అక్కితవరనమా. బాగుందమ్మా. అంతపెద్ద పేరు పిలవలేను గాని. 'అక్కిగా' అని పిలుస్తాలే" అని అక్షింతలు తీసుకుని "నూరేళ్ళు మీ ముత్తాత లాగ జీవించు నాయనా అక్కి" అని ముదిమనవడిని ముధ్దుపెట్టుకుంది సూరమ్మ. ఆమె పిలుపుకు చిర్రెత్తుకొచ్చింది వనజాక్షికి. బంగారమంటి పేరును భ్రష్టు పట్టించింది 'ఛీ' అని రుసరుసలాడింది. తరువాత వందనం అమ్మమ్మ దీవిస్తూ "అమ్మాయి మీవాడి పేరు కొత్తగా ఉంది గానీ పలకడం కష్టంగా ఉంది. అందుకని మీ వాడి పేరులోని రెండు ముక్కలలోని మొదటి అక్షరాలను తీసి 'అవ' అని పిలవాలనుంది. కానీ 'ఆవగా' అని పిలుస్తానే నీ కొడుకు చూపు ఆవాలంత ఘాటుగా అనిపిస్తోంది. పైగా ఆవపెట్టి ఏ కూర వండినా నా మనవడికి ఇష్టం. అందుకే వాడి కొడుకును ముద్దుగా 'ఆవగా' అని ముద్దుగా పిలుచుకుంటాను"అంటూ దీవించింది వంటలక్కగా పేరుగాంచిన వందనం అమ్మమ్మ పున్నమ్మ. కడుపు రగిలిపోతున్నది వనజాక్షికి. కానీ ఏమీ అనలేని దుస్థితి. ఇప్పుడు తాతల వంతు వచ్చింది. వారిద్దరూ జంటకవులలా తయారయి పిల్లవాడి పేరును "వరాలు" గా నికరం చేసుకున్నారు. ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడ వనజాక్షి పెట్టిన పేరును పలకలేదు. బంధువులంతా పై మూడు పేర్లనే మార్చి మార్చి పిలుస్తూ దీవించారే తప్ప, ఒక్కరూ "అక్షిద్ వర్యేన్" అని పిలవలేకపోయారు. మనసులో బాధ తన్నుకువస్తుంటే దీనంగా ముఖంపెట్టి కొడుకు వంక చూసింది. వాడు కోపంతో ఉరిమిచూసినట్టు అనిపించింది. అంతలోనే చేతిలోని కొడుకు కిందకు దిగి పెద్దవాడై నిలదీస్తున్నట్లు తోచింది. "చూడవే అమ్మా. నీ దిక్కుమాలిన ట్రెండుసెట్టింగు తగలెయ్యా. నా అసలు పేరు ఎవరూ పిలవడం లేదే. ఆవగాడని, అక్కిగాడని, వరంగాడని అందరూ తలా ఒకరకంగా పిలిచి మా ఫ్రెండ్సు ముందు నన్ను బకరాను చేశారే. ఇప్పుడు వాళ్ళంతా "ఇన్ని పేర్లతో మేములపిలవలేమురా. అన్నింటిని కలిపి ముద్దుగా "ఆవారగ" అని పిలుస్తామని" అలాగే పిలుస్తున్నారే. చివరకు నన్ను ఆవారాగాడిని చేశావుగదే" అని కడిగిపారేసినట్టుగా అనిపించి, ఒక్కసారి ఉలిక్కిపడింది. "నో.. వద్దు. ఆ పేరు వద్దు మార్చేస్తా.. మార్చేస్తా" అని పెద్దగానే అంటూ "ఏమండీ" అని పొలికేకపెట్టింది వనజాక్షి. ******** అదిరిపడి భార్య వైపు తిరిగి "వనజాక్షి.. ఏమయిందే నీకు" అంటూ నిద్రలో అరుస్తున్న బార్య వీపుమీద దబాదబా బాదాడు వందనం, భార్యను కొట్టే ఛాన్సు దొరికిందని ఆనందపడిపోతూ. కళ్ళు తెరిచింది వనజాక్షి. ఎదురుగా వందనం తప్ప ఎవరూ కనిపించలేదు. అంటే అదంతా కలా... అమ్మో అదే నిజమైతే...అమ్మో... ఉలిక్కిపడింది. "ఏమిటే.. ఏమయింది అలా అరిచావు" అనునయిస్తూ అడిగాడు వందనం. "ఏమండీ మనం మన అబ్బాయికి మీ తాతగారి పేరు రామచంద్రమూర్తి అనే పెడదామండి. కొత్తపేరు వద్దు. అదయితే రాము అనో, చంద్ర అనో, మూర్తి అనో ముచ్చటగా పిలుస్తారు. మీ మాటే నా మాట. నా సాధింపులన్నీ తూఛ్...." అన్న వనజాక్షి మాటలు అర్థంకాక అసలు విషయమేమిటని అడిగాడు వందనం. తనకు వచ్చిన కలను పూసగుచ్చినట్లు చెప్పింది. పగలబడి నవ్వాడు. " పోనీలే వనజా. నువ్వు ఎవరి మాట వినేరకం కాదని, ఆ రాముల వారే నీకు కలను సృష్టించి తనపేరును నీ బిడ్డకు పెట్టుకునేలా చేశాడు. అంతా మన మంచికే. ఇక ప్రశాంతంగా పడుకో" అంటూ భార్య భుజం మీద చేయివేసి ధైర్యం చెప్పాడు వందనం. 'ట్రెండుసెట్టింగుకు వెళితే కొత్త ఫిట్టింగులు వచ్చేలా ఉన్నాయి. ఏది ఏమైనా 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అనుకుంటూ భర్త గుండెల మీద చెయ్యివేసి నిద్రలోకి జారుకుంది వనజాక్షి. ****** అయిపోయింది ********

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు