అంగరక్షకుడు - శింగరాజు శ్రీనివాసరావు

Angarakshakudu

ఒంగోలు స్టేషనులో జనం చాలా పలుచగా ఉన్నారు. బహుశా కరోనా భయాలు ఇంకా జనాలలో వీడలేదేమో మరి. అప్పుడే ప్లాటుఫారం మీదకు అడుగుపెట్టింది రక్షిత. ఎంతో ఉత్సాహంగా వుంది. ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించింది. ఎప్పుడు చూసినా 'తోక వెంట నారాయణ' అన్నట్లు వెంటబడి వస్తుంటాడు బాడీగార్డులా నాన్న. ఎక్కడికీ ఒంటరిగా వెళ్ళనివ్వడు. అదేమంటే 'ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళకూడదమ్మా, అసలే రోజులు బాగోలేదు' అంటూ నిర్భయ నుంచి మొదలుపెట్టి గల్లీలో సిల్లి గొడవ దాక ఏకరువు పెడుతుంటాడు. పదిహేను సంవత్సరాలు వచ్చినా పసిపిల్లలాగ చూస్తుంటాడు. అసలు ప్రైవసీనే ఇవ్వడు. ఆలోచనలతో ఉన్న రక్షిత రైలు వస్తుందని మైకులో చెప్పడంతో మనలోకం లోకి వచ్చి లగేజి తీసుకుని నిలబడింది. ఇంతలో రానే వచ్చింది కృష్ణా ఎక్స్ ప్రెస్. గబగబ తన బోగిలోకి ఎక్కి రిజర్వు చేసుకున్న సీటులో కూర్చుంది. రద్దీ పెద్దగా లేదు ఎందుకనో మరి. తన బోగిలో గట్టిగా ఒక పాతికమంది ఉంటారేమో అనుకుంది. అందులో ఆడవాళ్ళు అయిదారుగురి కంటే ఎక్కువ లేరు. ఎదురుగా ఒక నలభై సంవత్సరాల వయసున్న ఆవిడ తప్ప తనకు దగ్గరలో మరో స్త్రీ కనిపించలేదు. అప్పటిదాక ధైర్యంగా ఉన్న రక్షితకు కొద్దిగా భయం అనిపించింది. వెంటనే తన వీపు తనే తట్టుకుంది. మొదటిసారి ఒంటరి ప్రయాణం కదా అలానే ఉంటుందిలే అని సర్దుకుంది. బయలుదేరే ముందు నాన్న ఇచ్చిన కవరును పెట్టికోటు మీద చేయిపెట్టి తడుముకుని ఊపిరి పీల్చుకుంది. ******** " అబ్బా ఈసారికి దాన్ని ఒక్కదాన్నే వెళ్ళనివ్వండి. అస్తమానం అది వద్దని నసపెట్టడం, మీరు వదిలేయకుండా వెంట వెళ్ళడం. రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్ళాలంటే ప్రతిసారీ మనకు కుదురుతుందా, ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటే కదా. నా మాట విని దాన్ని పోనివ్వండి" కూతురు వెనకేసుకు వచ్చింది సత్యవతి. " అదికాదు సత్యా. రోజులు ఎలావున్నాయి చెప్పు. అసలే ఆడపిల్ల. ఒక్కతే ఆ రైలు ప్రయాణం అంత మంచిదా చెప్పు. తిరుపతిలో రకరకాల మనుషులు ఉంటారు. ఆ స్టేషనులో మూడు దారుల నుంచి ఎటైనా బయటకు వెళ్ళవచ్చు. అయోమయంగా ఇది ఒకచోట నుంచి వచ్చి, దాని స్నేహితురాలు ఇంకోచోట వుంటే, రాత్రి పదిగంటలప్పుడు ఇదేం చేయగలదే ఒక్కటే అక్కడ" రమణ మనసులోని భయాన్ని బయటపెట్టాడు. ఇక లాభం లేదనుకుని పాశుపతాస్త్రాన్ని సంధించింది రక్షిత. ఆ రచ్చను, ఏడుపును భరించలేక సరేనన్నాడు రమణ. అలా తన అంగీకారాన్ని తెలిపాడో, లేదో ఎటు ఎగిరిపోయిందో ఆ ఏడుపు, తండ్రిని గట్టిగా చుట్టుకుని "థాంక్యూ డాడీ. ఐ లవ్ యూ" అంటూ గారాలు పోయింది రక్షిత. అంతా సిద్ధమయి బయలుదేరే ముందు రక్షితకు ఒక కవరులో ఏదో చిన్న బాక్సు పెట్టి ఇచ్చాడు రమణ. " చూడు రక్కీ. నీకు రైలులో భయమనిపిస్తే ఆ కవరులోని బాక్సు తీసి చూసి, అందులో ఎలావుంటే అలా చెయ్యి" అన్నాడు రమణ. " ఓకె డాడీ" అని చెప్పేసి హుషారుగా బయలుదేరింది రక్షిత. ****** అలా ఇంట్లో జరిగిన సంఘటన తలచుకుంటున్న రక్షిత ఒక్కసారి ఎవరో తట్టేసరికి ఉలిక్కిపడింది. "అమ్మాయ్ గూడురు వచ్చింది. మేమంతా దిగి వెళ్ళిపోతున్నాం. బోగీలో ఎవరో ఇద్దరు అబ్బాయిలు తప్ప ఎవరూ కనపడడం లేదు. ఎందుకైనా మంచిది జనాలున్న బోగి చూసుకుని వెళ్ళి కూర్చో. అసలే రోజులు బాగలేవు" అని దిగి వెళ్ళిపోయింది ఎదురుగా ఉన్న ఆవిడ. ఒక చిరునవ్వు పారేసి తలూపింది రక్షిత, ఏమిటో పిచ్చిది అని మనసులో అనుకుంటూ. రైలు కదిలింది. ఎవరో ఇద్దరు అబ్బాయిలు అటు ఇటు నాలుగుసార్లు తిరిగి వచ్చి రక్షిత ఎదురుగా కూర్చున్నారు. దిగినామె చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. అంటే బోగిలో మేము ముగ్గురమేనా. మనసులో భయం మొదలయింది రక్షితకు. "హాయ్ బ్యూటీ. ఎక్కడికి? తిరుపతికేనా. మేము అక్కడికే. ఒక్కదానివే వచ్చావేం. బాయ్ ఫ్రెండ్ రాలేదా?" అడిగాడొకడు. " ఇంకా అంత ముదిరినట్టు లేదురా పాప. మొదటిసారిలా వుంది ఆ బెరుకు చూస్తుంటే" అందుకున్నాడింకొకడు. " భయమెందుకు పాప. నీకు తోడుగా మేమున్నాంగా. అన్ని దర్శనాలూ చేయించి పంపుతాము. ఏరా" వాళ్ళ మాటలతో వణుకు ప్రారంభమయింది రక్షితలో. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి అనుకుని లేవబోయింది. " అరె. అప్పుడే ఎక్కడికి బుజ్జి. కొంచెం పిచ్చాపాటి మాట్లాడుకుందాం" అంటూ ఒకడు రక్షిత పక్కన కూర్చున్నాడు. రక్షిత అదిరిపడింది. " ప్లీజ్. నేను అర్జంటుగా రెస్టురూముకు వెళ్ళాలి. వచ్చాక మాట్లాడుకుందాం" అని లేచింది. " పాపకు టెన్షను మొదలయినట్టుంది. వెళ్ళి త్వరగా రామ్మా. ఆ సెల్ ఫోను నాకిచ్చి వెళ్ళు. నేను తోడుగా వచ్చి బయట నిలుచుంటానులే, నువ్వు భయపడకుండా" అంటూ రక్షిత చేతిలోని సెల్ ను లాక్కుని ఆమెను అనుసరించాడు పక్కన కూర్చున్నవాడు. ఏడుపు ముఖం వేసుకుని లేచింది. అంతలో తళుక్కున మెరిసింది మనసులో నాన్న చెప్పిన మాట. రెస్టురూములోకి వెళ్ళగానే తండ్రి ఇచ్చిన బాక్సును తెరిచింది. అందులో పాత మోడల్ సెల్ ఫోను, దానితో పాటు ఒక చీటి ఉంది. చదివింది. 'రక్కీ భయపడకు. ఈ సెల్ ఫోనులో ఒకటి నొక్కు. రింగు రాగానే ఆపివేసి కూర్చో" అది చదివి ఫోనులో ఒకటి నొక్కి, అది మ్రోగగానే దాన్ని ఆపి మరల బాక్సులో పెట్టి పెట్టికోటులో పెట్టుకుని బయటకు వచ్చింది. ఆమెను చూసి నవ్వి భుజం మీద చెయ్యి వేయబోయాడు వెంట వచ్చినవాడు. అతని చెయ్యి విసిరికొట్టి గబగబ వెళ్ళి తన సీటులో కూర్చోబోయింది. ఇంతలో అక్కడున్న కుర్రాడు ఆమెను లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మరోకడొచ్చి ఆమెకు ఇవతలవైపు చేరాడు. వణికిపోతున్నది రక్షిత. ఏడుపు తన్నుకువస్తుంటే వారికి చేతులు జోడించింది. " ప్లీజ్ నన్ను వదిలెయ్యండి మీకు దణ్ణం పెడతాను. వెళ్ళి అలా కూర్చోండి" అని ప్రాధేయపడింది. " అరెరె భయమెందుకు స్వీటీ, నిన్నేమీ చెయ్యము చెరొక ముద్దు అంతే" అని ముందుకు వచ్చారిద్దరూ. నెట్టుకుని వచ్చి ఎదురు సీట్లోకి వచ్చి కిటికీవైపుకు చేరింది రక్షిత. " చేప పిల్లలా జారుకుంటే ఎలా? ఈరోజు మా ముద్దు చెల్లించేవరకు నిన్ను వదిలేది లేదు" అంటూ లేచి రక్షిత వైపుకు చేరారు మరల. తలవంచుకుని తప్పిచుకుంటూ, వాళ్ళను నెట్టివేస్తూ " హెల్ప్..హెల్ప్" అని అరవసాగింది రక్షిత. ఇంతలో ధన్ మని శబ్ధం రావడం " అబ్బా" అనే శబ్ధం రావడం జరిగింది. తనను చుట్టుకుంటున్న చేతులు దూరం జరగడంతో తలపైకెత్తి చూసింది వణికిపోతూ. ఎదురుగా ఎవరో బలిష్టమైన వ్యక్తి, అతని పక్కనే తన తండ్రి. తనను ఏడిపిస్తున్న ఇద్దరినీ వంగదీసి పిడిగుద్దులు గుద్దుతున్నారు. ఒక్క ఉదుటున లేచి తండ్రిని చుట్టుకుంది. ఇంతలో టి.సి వచ్చాడు. విషయం తెలుసుకుని ఆ కుర్రాళ్ళిద్దరిని పోలీసులకు అప్పగిస్తానని లాక్కుని వెళ్ళాడు. " నాన్నా. మీ మాట వినకుండా ఒక్కదాన్నే వచ్చి పొరపాటు చేశాను. ఇప్పుడు మీరు రాకపోయి వుంటే.." అని తండ్రిని కావలించుకుని భోరుమన్నది. " ఏడవకమ్మా. నేను వచ్చేశాగా. నిన్ను ఒంటరిగా వదిలేసి నేను నిశ్చింతగా ఉండగలనా రక్కీ. నువ్వు నా ప్రాణం తల్లీ. నీమాట కాదనలేక వెళ్ళమన్నాను. కానీ లోకం చూస్తున్నవాడిని అందుకే నిన్ను వెన్నంటి నేనూ వచ్చాను. నీకు తెలిస్తే కోపగించుకుంటావని చెప్పలేదు. ముందు జాగ్రత్తగా నీకిచ్చిన సెల్ లో ఒకటవ నెంబరకు నా ఫోను నెంబరు లింక్ చేసి ఇచ్చి అత్యవసరంలో దానిని నొక్కమన్నాను. నేను నీతోపాటే ఇదే రైలు ఎక్కాను. రెండు బోగీల అవతల బోగీలోనే ఉన్నాను. అందుకే సమయానికి రాగలిగాను" " నువ్వు రాకపోయుంటే ఈరోజు నేనేమైపోయేదాన్నో. సారీ డాడీ. ఇంకెప్పుడు ఇలా ఒక్కదాన్నే రాను. నన్ను క్షమించండి" అంటూ తండ్రిని అల్లుకుపోయింది. 'కన్నబిడ్డలను అంగరక్షకుడై కాపాడడమే తండ్రి కర్తవ్యం తల్లీ. నా బొందిలో ప్రాణము ఉన్నంతవరకు నీకు అండగా నేనుంటాను' అని మనసులో అనుకుంటూ రక్షితను పొదివి పట్టుకున్నాడు రమణ. *****************

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు