మారిన మనిషి - కమలశ్రీ

Marina manishi

ఉదయం పది గంటలు. బిజీ గా ఉండే కూడలి దగ్గర సిగ్నల్స్ పడింది. ఓ చక్రాల కుర్చీలో ఉన్న వ్యక్తి , కాళ్లు, చేతులకు కట్లుకట్టి ముఖం అంతా మసిపూసినట్టు ఉన్న వ్యక్తులు,చిన్న పిల్లలను ఓ చంకన పెట్టుకున్న వారూ, అనాధ పిల్లలు, హిజ్రాలు ఇలా ఒక్కొక్కరూ ఒక్కో వెహికల్ దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి వారు ఇచ్చిన పైసలను పట్టుకుని ఇంకో వెహికల్ దగ్గరికి వెళుతున్నారు. ఆ వెహికల్స్ మధ్యలో ఓ విలాసవంతమైన కారు, అందులో బాక్ సీట్ లో కూర్చుని ఆ రోజు తన షెడ్యూల్ ని పరిశీలిస్తున్నాడు ఇంద్రజిత్ వర్మ. అతనో 50 ఏళ్ల కార్పొరేట్ దిగ్గజం. సిటీ లో పేరు మోసిన ఇంద్రజిత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత. ఇంతలో కార్ గ్లాస్ ని ఎవరో కొట్టినట్టు అయ్యి తలతిప్పి అటు చూశాడు. ఓ ముసలాయన మాసిన గెడ్డం, చిరిగిన బట్టలతో దుమ్ము పట్టిన దేహం తో ఉన్న అతన్ని చూడగానే ఇంద్రజిత్ ఏమీ పట్టని వాడిలా తన చేతిలో ఉన్న పేపర్లు చూస్తూ ఉండిపోయాడు. లోపల ఉన్న వారు కనిపించకపోయినా వాళ్లేదైనా ఇస్తే అది తన ముసలి భార్య కి ఓ రొట్టెముక్క అయినా వస్తదని ఆశగా ఆ గ్లాస్ వంకే చూస్తున్నాడు. గ్రీన్ సిగ్నల్స్ పడటం తో ఇంద్రజిత్ కారు దూసుకు పోయింది. పాపం ఆ ముసలాయన కళ్లమ్మట చిప్పిల్లుతున్న నీటిని తుడుచుకుని ఇంకో వైపు వెళ్లాడు. కారు సరాసరి ఓ ప్రదేశం లో ఆగింది.ఆయన రాగానే మీడియా వాళ్లు ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించడానికి ప్రయత్నించగా "మీ ప్రశ్నలకు కార్యక్రమం పూర్తి అయ్యాక సమాధానం ఇస్తాను. అంతవరకూ ప్లీజ్." అంటూ ముందుకు కదిలాడు ఇంద్రజిత్. దూరంగా కొంత మంది జనం నిలబడి ఉన్నారు ఆశగా. ఇన్నాళ్లూ గూడు లేని తమకు ఆ దేవుడే ఇంద్రజిత్ గారి రూపంలో వచ్చి తమకో నీడని ఇస్తున్నాడని. ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు మనసులో. ఇంతలో పోలీస్ సైరన్ తో ఓ కాన్వాయ్ ఆ ప్రాంగణానికి వచ్చి ఆగింది. అందులో నుంచి దిగారు మంత్రి. ఆయనకి ఎదురుగా వెళ్లి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు ఇంద్రజిత్, అతని పీ.ఎ. రఘు. పూజ మొదలైయ్యింది.‌ ఇంద్రజిత్ గారూ , మంత్రి గారూ కలిసి ఇటుకా, సిమెంట్ వేశారు. కొంత సేపటికి కార్యక్రమం పూర్తి అయ్యింది. కార్యక్రమం పూర్తి అయ్యిందని గమనించిన వెంటనే మీడియా వాళ్లు పరుగున వచ్చి మైక్ లు మంత్రి గారి ముందూ, ఇంద్రజిత్ ముందు పెట్టారు. "సర్ , మామూలుగా అయితే ప్రజలకోసం ఇల్ల స్థలాలు పంపిణీ చేస్తారు, లేదా సగం సొమ్ము గవర్నమెంట్ భరించి మిగతాది లబ్ధిదారులు భరించేలా ఉంటుంది హౌసింగ్ ప్రాజెక్టు. కానీ మీరు వినూత్న రీతిలో ఆలోచించి గవర్నమెంట్ ఇచ్చిన సగం మొత్తానికి మిగతా సగం మీరు సమకూర్చి పేదల కు ఇల్లు కట్టి ఇస్తున్నారు. దీనివెనుక ఆంతర్యం ఏమిటి సర్?." "చాలా సంపాదించాను. ఆ సంపాదించిన దానిలో కొంత పేదల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నదే నా తాపత్రయం." అని ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు ఇంద్రజిత్. ఇప్పుడు మీడియా వాళ్లు మంత్రి గారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. "సర్ ఇంత గొప్ప ప్రాజెక్టు ఈ ఎన్నికల సమయం ముందు మొదలుపెట్టడానికి కారణం ఓట్ల బ్యాంకు పెంచుకోడానికేనా?." అంటూ ఓ మీడియా మిత్రుని ప్రశ్న. ఆ ప్రశ్న కి కోపం సర్రున తన్నుకు వచ్చినా తమా యించుకుని "ఓట్ల కోసం మేమెప్పుడూ ప్రాకులాడే రకం కాదు. ఉండటానికి ఇల్లు లేని పేదవారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మామూలుగా అయితే సగం ప్రభుత్వం, సగం లబ్ధిదారులు భరించాలి. కానీ ఇంద్రజిత్ గారు పెద్ద మనసుతో ఆ మిగిలిన సగం తాను భరిస్తానని ముందుకు వచ్చారు. ఇలా పెద్దలు ముందుకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే మన రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు సాగిపోతుంది. సెలవు."అంటూ ముందుకు నడిచిన ఆయన్ని అనుసరించారు ఇంద్రజిత్ కూడా. "ఏంటయ్యా! ఇంద్రజిత్ ఉన్నట్టుండి ప్రజాసేవ పై దృష్టి పడింది తమరికి. ఇది మా సీట్ కి ఎసరు పెట్టేందుకు కాదు కదా?." మంత్రి చిన్నగా అన్నాడు. "అలాంటిదేం లేదు మంత్రి గారూ. ప్రజలకు సహాయం చేద్దామనే తపనతోనే ఈ ప్రాజెక్టు లో భాగస్వామి ని అయ్యాను. అంతకు మించి ఇంకేమి ఆలోచనా లేదు." మళ్లీ అదే సమాధానం. "నా దగ్గరెందుకయ్యా ఈ దాపరికాలు. ఏ మల్టీ మిలియనీర్ కావాలని కోట్లు ఊరికే ఖర్చు చెయ్యడు. దానివెనుక ఏదో మర్మం ఉంటుంది. అదేంటో సెప్పవయ్యా." "అదే ప్రైవేటు కంపెనీలో చాలా తతంగం ఉంటుంది. ఎస్టిమేట్ ఎమౌంట్ కంటే ఎక్కువే ఖర్చు అవుతుంది. అదే గవర్నమెంట్ వర్క్ అయితే ఖర్చు తక్కువ లాభం ఎక్కువ. అటు ప్రజల్లో గుర్తింపూ, ఇటు మన సొమ్ము ఖర్చు అవ్వకుండానే మనకి లాభం."అంటూ హోం మినిస్టర్ ని కార్ ఎక్కించాడు ఇంద్రజిత్. "మాకేమైనా ఉందా?." మంత్రి చూశాడు ఇంద్రజిత్ కళ్లలోకి. "ఉంటుంది సర్. సాయంత్రం కొంత,బిల్లు అయ్యాక కొంత." అన్నాడు ఇంద్రజిత్. "మరి ఇల్లు ?." "మొత్తం ఐదు వందలు. అందులో కేవలం వంద లోపలే అసలు పేదలకి.మిగతా.." "ఓ రెండు వందలు మాకు ..." " ఓ వంద. ఇప్పటికే ఈ ఏరియా నాయకులకు తలా కొంత..కొంత.." "ఎన్నో కొన్ని ." "ఓకే సర్." అని డోర్ క్లోజ్ చేశాడు. కాన్వాయ్ స్టార్ట్ అయ్యింది. 'హమ్మ ఇంద్రజిత్తూ ఎన్ని ఆలోచనలు ఉన్నాయయ్యా నీ బుర్రలో. అందుకే ఇంత పెద్ద బిజినెస్ మేన్ వి అయ్యావు. రాజకీయాల్లో ఘనాపాటి లు కూడా నీ ఎత్తుగడలకు సరితూగరు.' అనుకోకుండా ఉండలేకపోయాడు మంత్రి. మరునాడు అన్ని దినపత్రికల్లో ఒకటే న్యూస్. 'పేదల పాలిట పెన్నిధి. సంఘసంస్కర్త. బడుగు వర్గాల ఆశాజ్యోతి. పేదలకు ఇల్లను నిర్మించి ఇచ్చేందుకు తన వంతు సహాయం గా సగం సొమ్ము అందిస్తున్న గొప్ప హృదయం కలిగిన వ్యక్తి శ్రీ ఇంద్రజిత్ గారు.' చదివి ఓ చిరునవ్వు నవ్వుకుంటూ తన దినచర్యలో మునిగిపోయాడు ఇంద్రజిత్. రోజులు గడుస్తున్నాయి. పనులు జరుగుతున్నాయి అలా అలా. ఓ రోజు రాత్రి. ఆఫీస్ లో చాలా లేట్ అయ్యింది. బయటకు వచ్చి కార్ ఎక్కాడు. డ్రైవర్ ఆ రోజు ఒంట్లో బాలేదని రాలేనని చెప్పాడు. ఇంద్రజిత్ డ్రైవర్ లేకపోతే తనే డ్రైవ్ చేసుకుంటూ వెళతాడే కానీ క్రొత్త వారిని ఎవరినీ పిలవడు. తనే డ్రైవింగ్ చేసుకుంటూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి మొదలైంది. నొప్పి కొంచెం గా మొదలై ఎక్కువైపోయింది. ఛాతిపై చేయివేసి ఓ సైడ్ కి ఆపాలని అనుకున్నాడు కానీ అతని వల్ల కాలేదు. కారు వెళ్లి డివైడర్ ని ఢీకొట్టి,రెండు పల్టీలు కొట్టింది. శబ్ధం వినపడటం తో పక్కనే ఉన్న మురికి వాడలోని ప్రజలు పరుగున వచ్చారు. ఇంద్రజిత్ ఒళ్లంతా రక్తంతో స్టీరింగ్ పై తల వాల్చేసాడు. "రేయ్... మన బాబు గారురా. మనకి ఇల్లు కట్టిత్తున్న మారాజు. కారు బోల్తా పడినాది. అయ్యోరి వొళ్లంతా రగతం. బయిటికి తీయండ్రా... "అని మాటలు వినిపిస్తున్నాయి. కళ్లు మూతలు పడుతుండగా చూశాడు అతన్ని కొన్ని రోజుల క్రితం తన కారు గ్లాస్ డోర్ కొట్టిన బిచ్చగాడు. వారంతా శ్రమపడి ఇంద్రజిత్ ని బయటకు లాగారు. "ఒరేయ్ అంబెలెన్సు కి పోను సేసినా. ఈ దారంట ఏ అంబులెన్సు నేదంట. అయ్యోరు దేముడురా. మనమెలాగైనా కాపాడుకోవాలా. ఇట్టాంటి దేమునికి ఏటీ కాకుండా సూసుకోవాలా." అని ఇంకో ఇద్దరు అతన్ని ఓ ట్రాలీ బండిపై వేసి తోసుకుంటూ పయనమైనారు. వారి వెనకే మిగతా బిచ్చగాళ్లూ పరుగుతీసారు. అర కిలోమీటరు వెళ్లేసరికి అంబులెన్స్ వచ్చింది. ఆయన్ని అందులో ఎక్కించారు. అందులో ఆ ముసలి బిచ్చగాడు ఎక్కాడు. ఇంకో ఇద్దరు. కాసేపటికి హాస్పిటల్ కి చేరారు. అత్యవసర విభాగంలో ఎడ్మిట్ చేశారు. అప్పటికే అతని ఫ్యామిలీ కి ఇన్ఫామ్ చేశారు అతనెవరో వారికి తెలుసుకాబట్టి. ఓ వారం తరువాత ఇంద్రజిత్ మామూలు మనిషి అయ్యాడు. వర్క్ జరుగుతున్న స్థలానికి వెళ్లాడు ఓ నెల తర్వాత. అక్కడ సిమెంట్ తక్కువ ఇసుక ఎక్కువ కలుపుతూ, తుప్పు పట్టిన ఇనుము వాడుతున్నారు. అది చూసిన ఇంద్రజిత్ తన పీఏ రఘు ని పిలిచి రఘు ఈ పనికి రాని సరుకంతా రిటర్న్ చేసి, నంబర్ వన్ మెటీరియల్స్ తెప్పించు. పనుల్లో అలసత్వం ఉండకూడదు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వర్క్ చేపించు." అని ఆర్డర్ చేశాడు. "కానీ సర్ ఆల్రెడీ కొంత వర్క్ అయ్యింది. ఇప్పుడు...?." అంటుండగా, "డూ వాటైసే. పని ఫర్ఫెక్ట్ గా జరగాలి. ఆ బెనిఫీసియరీస్ లిస్ట్ కూడా మార్చు. ఆ మురికి వాడల్లో ఉండేవారిని చేర్చు. బయట వారు ఎవరూ ఉండకూడదు. పేదవానికే ఇల్లు అందాలి." అని చెప్పి కారు దగ్గరికి వెళ్తుండగా మినిష్టర్ ఫోన్..ఎలా ఉన్నారు అని పరామర్శ చేశాక తమ వారికి కొన్ని ఇల్లు...అని అర్థోక్తిగా అనగా... "నో సర్. అవి పేదలకోసం కడుతున్నవి. వారికే చెందుతాయి."అంటూ ఫోన్ కట్ చేశాడు ఇంద్రజిత్.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు