శ్రీపురం ఉన్నత పాఠశాలలో రాము 6వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి చదువుపై అసలే శ్రద్ధ లేదు అతనికి. ఎప్పుడూ స్నేహితుల బృందంతో ఆటలే ఆటలు. అందులో క్రికెట్ పిచ్చి మరీ ఎక్కువ. తల్లిదండ్రులు, గురువులు అతణ్ణి మంచి మార్గంలో పెట్టలేకపోయారు. ఇది ఇలా ఉండగా తన సైన్స్ టీచర్ చెప్పిన ఒకమాట రాము మనసులో నాటుకొని పోయింది. మనం తిన్న పళ్ళ యొక్క విత్తనాలను వృథాగా పారేసే బదులు ఖాళీ ప్రదేశాలలో పడవేస్తే అవి చెట్లుగా మొలిసే అవకాశం ఉందని, అది హాబీగా చేసుకోవాలని ఉపాధ్యాయులు చెప్పారు.
రాము వాళ్ళు అద్దె ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ ఇంటి వెనుక ఖాళీ స్థలం ఉంది. రాము తాను తిన్న పళ్ళ విత్తనాలు అన్నీ ఖాళీ స్థలంలో వేస్తున్నాడు. ఇంకా అనేక పెద్ద చెట్ల విత్తనాలనూ సేకరించి తన ఇంటి వెనుక ఖాళీ స్థలంలో వేస్తున్నాడు. కానీ ఎన్నాళ్ళు వేచి చూచినా ఒక్క విత్తనమూ నాటుకోలేదు. అయినా పట్టుదల వీడలేదు. రాము మరిన్ని విత్తనాలనూ ఖాళీ స్థలంలో వేస్తున్నాడు. అయినా ఫలితం శూన్యం. అటు ఆటలు కూడా మానేసి దిగులుగా కూర్చున్నాడు. తన కుమారుడు ఏమై పోతాడో అని తల్లిదండ్రులకు బెంగ పట్టుకుంది. ఉపాధ్యాయులకు సమస్యను చెప్పుకున్నారు.
సైన్స్ ఉపాధ్యాయుడు రామూను పిలిపించి ఇలా అన్నాడు. "ఎంతో కష్టపడి నువ్వు వేసిన విత్తనాలు నాటుకోలేదని దిగులుతో నీకు ఇష్టమైన ఆటలు కూడా మానేశావు. మరి తాము రెక్కలు ముక్కలు చేసుకొని ఎంతో కష్టపడి నిన్ను చదివిస్తున్నారు కదా! మరి ఆ విత్తనాలు నిన్ను నిరాశ పరిచినట్లే నువ్వూ నీ తల్లిదండ్రులను నిరాశ పరుస్తున్నావు. మరి వాళ్ళకు ఎంత దిగులు ఉందో ఆలోచించు." అన్నాడు. రాము ఆలోచనలో పడ్డాడు.
ఇంతలో రాము వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో వేరే ఊరికి మారవలసి వచ్చింది. రాము పాఠశాల కూడా మారింది. రాము మనసులో సైన్స్ ఉపాధ్యాయుడు చెప్పిన మాటలు నాటుకుపోయాయి. కష్టపడి చదవడం ప్రారంభించాడు. పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పి.జి.లను కూడా నిరాటంకంగా పూర్తి చేసి, మంచి ఉద్యోగం సాధించాడు.
శ్రీపురం ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళిన రాము తన పాత ఇంటికీ వెళ్ళాడు. ఇంటి వెనుక ఖాళీ స్థలంలో పెద్దగా పెరిగిన చెట్లను చూశాడు. ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. రాము మిత్రుడు వాసు రామూతో "అవి నువ్వు విసిరేసిన విత్తనాల నుంచి వచ్చిన చెట్లే. నువ్వు మంచి ప్రయోజకుడివి అయ్యి మీ తల్లిదండ్రులను సంతోషపెట్టావు. నువ్వు నాటిన విత్తనాలు చెట్లై నిన్ను సంతోషపెట్టినాయి." అని అన్నాడు. రాము ఆ చెట్లను తనివి తీరా చూసుకున్నాడు.