క్రిష్.. క్రిష్.. క్రిష్.. క్రిష్ అంటే నాకిష్టం.క్రిష్ నా ప్రాణం..నా ఊపిరి. క్రిష్ పక్కన ఆతన్ని తగులుతూ కూచోవాలనిపిస్తుంది.క్రిష్ మొహంలోకే చూడాలనిపిస్తుంది. చూస్తూ వుండాలనిపిస్తుంది.అతనేం మాట్లాడినా వినాలనిపిస్తుంది. అతను లేకుండా ఒక్క క్షణం కూడా వుండాలనిపించదు. ప్చ్.. ఆ మహానుభావుడు నా కోరిక తెలుసుకోగలుగుతున్నాడా. ఏమో దగ్గిరగా కూచుంటే తను పక్కకి జరుగుతాడు. నా వంక అసలు చూస్తున్నాడా. ఏమో అనుమానం.ప్రవరాఖ్యుడిలా వున్నాడు. కొత్తగా జడ వేసుకువెళ్లినా గమనించడు.కొత్త డ్రెస్ వేసుకు వెళ్లినా గమనించడు. తనే అడుగుతుంది బాగుందా అని.సింపుల్ గా బాగుంది అంటాడు.మెచ్చుకోడు. అతన్ని చూడాలనే తను వాళ్ళింటిలోకి వెళుతుంది. వాళ్ళ అమ్మగారితో కబుర్లు చెప్పటం ఒక వంకే. ఆ మహానుభావుడు మాత్రం గదిలోంచి బయటికి రాడు. తనే వెళ్లి పలుకరించినా, ప్చ్! పొడిపొడి మాటలే. నా స్నేహితురాళ్లందరూ నన్ను అందగత్తె అంటారు.తను చామన ఛాయాతో వున్నా తన కళ్ళు,ముక్కు ఆకర్షణగా వుంటాయంటారు. తన అవయవాలు పొందికగా ఉంటాయి.తనే అనుకుంటుంటుంది తను 'అందగత్తే' అని. అసలు అతన్ని చూసిన మొదటి రోజే తెగ నచ్చేసాడు. తమ పక్కింటి లోకి వాళ్ళు దిగిన రోజే అతన్ని చూసింది. అమ్మ, వాళ్ళు సామాను లోపల పెట్టుకున్నాక తనని తీసుకుని వాళ్ళింటిలోకి తీసుకు వెళ్ళింది. వాళ్ళ అమ్మగారిని 'వదినగారూ" అంటూ. మొదటి గదిలోనే క్రిష్ వున్నాడు. అతను ఏదో ఒక బాగు ఊడదీస్తున్నాడు. అమ్మ అడిగితే చెప్పాడు తన పేరు కృష్ణ అని,తాను ఎనిమిదో తరగతిలో చేరాలనీ. నాకు చాలా సంతోషం వేసింది నా క్లాసే అని. వంటింటిలో వాళ్ళ అమ్మగారు,నాన్న గారు గొనె సంచులని విప్పే ప్రయత్నంలో వున్నారు. అమ్మ అంది "మేము ఈ పక్క ఇంట్లోనే ఉంటాము.ఇపుడే కాఫీ తెస్తాను.ఒక పావుగంటలో ఇడ్లీ తెస్తాను.మధ్యాన్నం భోజనం మా ఇంట్లోనే చేద్దురుగాని. నెమ్మదిగా సర్దుకుని సాయంత్రం వంట ఏర్పాటు చేసుకోవచ్చు." వాళ్ళు మోహమాటంగా 'ఎందుకు మీకు ఇబ్బంది' అన్నారు. కానీ అమ్మ ఒప్పుకోలేదు. అలా ఆ పూట తమ ఆతిధ్యం తీసుకున్నారు. అతన్ని చూస్తే తెలివి గల వాడిగానే వున్నాడు. కానీ బిడియస్తుడనిపించాడు. కానీ ఎంత అందంగా ఉన్నాడో. మరునాడు అతను మా స్కూల్లోనే చేరాడు. మా క్లాస్ జరుగుతుంటే వచ్చాడు. మా టీచర్ ఏమిటి అని అడిగితే చెప్పాడు. "ఈ రోజే చేరాను. ఈ క్లాసులో కూచోమన్నారని." టీచర్ అతని చేతిలో రసీదు చూసి క్లాసులోకి రమ్మన్నారు.అతను చివరి బెంచీలో కూచున్నాడు. క్లాసు అయ్యాక టీచర్ అతన్ని వివరాలు అడిగింది. మధ్యాన్నం బయటికి వెళుతుంటే నేను అడిగాను కేరెజి తెచ్చుకున్నావా అని. లేదు ఇంటికి వెళ్లి అన్నం తిని పుస్తకాలు తెచ్చుకుంటాను అన్నాడు. "అంత సమయం ఉండదు. ఈ పూట నా కేరెజి ఇద్దరం సర్దుకుందాం. రేపటి నుంచి తెచ్చుకుందూ కానీ" అని. అతను మొహమాట పడినా బలవంతాన నా కేరేజీలో అతనికి పంచాను. ఆ తర్వాత నా స్నేహితులంతా నాతో అన్నారు " నీ బాయ్ ఫ్రెండ్ బాగున్నాడే" అని నాకు గొప్పగా అనిపించింది. "అదేం కాదు. మా పక్క ఇంట్లో కొత్తగా వచ్చారు.అంతే." అని చెప్పాను. అలా నాకు అతనంటే అభిమానం పెరిగింది. పాఠాల్లో సందేహాలంటూ తరచు అతని దగ్గిరకి వెళ్లే దాన్ని. అంతవరకు నాకు మొదటి రాంకు వచ్చేది. అతనొచ్చాక అతనికి మొదటి ర్యాంకు,నాకు రెండో ర్యాంకు వచ్చేది. అయినా నాకు బాగుండేది. పదో తరగతి,ఇంటర్ పరీక్షలలో మేము ఇద్దరం రాష్ట్రస్థాయిలో మొదటి పది ర్యాంకుల్లో ఉన్నాము. అప్పుడు ఊళ్ళో ఎన్నో సంస్థలు మమ్మల్ని సత్కరించాయి. మాతో పాటు ఇతర రాంకులు వచ్చిన వారు కూడా ఉండేవారు. అయితే మా ఇద్దరినీ పక్కపక్కనే నిలబెట్టేవారు ప్రతి చోట. అది నాకు బాగుండేది.జీవితమంతా ఇలాగే క్రిష్ తో ఉంటే బావుంటుంది అనిపించేది. డిగ్రీలో చేరాక మా అమ్మ,నాన్న పెళ్లి సంబంధాలు చూస్తామనే వారు.డిగ్రీ అయ్యి కొన్నాళ్ళు ఉద్యోగం చేసాక పెళ్లి చేసుకుంటానన్నాను. అమ్మైతే గోల పెట్టింది.ఉద్యోగం చేస్తే డబ్బు సంపాదనలో పడి పెళ్లికి ఇష్టపడనేమోనని ఆవిడ భయం. ఎలాగో అలా ఒప్పించాను. ఒకసారి క్రిష్ తో అన్నాను 'నాకు సంబంధాలు చూస్తున్నారని.' అతను నవ్వుతూ అభినందనలు చెప్పాడు. నాకు ఉడుకు మోత్తనం వచ్చింది. 'నీకేమి అనిపించడం లేదా?' అనడిగాను. అతను నవ్వుతూ 'నీకు పెళ్ళయితే నాకెందుకు?' అన్నాడు. అసలు నా పెళ్లి వాయిదా వేయటానికి కారణం క్రిష్ కి చదువై ఏదో ఉద్యోగం వస్తే అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాలని. ఈ మహానుభావుడేమో ఉలుకూ పలుకూ లేదు. ఎలాగైతేనేం డిగ్రీ తర్వాత ఊళ్ళోనే ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాను. క్రిష్ ఎమ్మెస్సీలో చేరాడు. అమ్మో ఇంకో రెండేళ్లు ఆగాలి అనిపించింది. నా స్నేహితురాళ్ళకి పెళ్లిళ్లు అయిపోతున్నాయి. వాళ్ళు సలహా ఇస్తున్నారు. క్రిష్ ని గట్టిగా అడగమని. తిన్నగా అడగక పోవటం వల్లేమో అతనూ నా మనసు తెలుసుకోలేకపోయాడేమో. కృష్ణ చెప్పింది.. సుప్రదని మొదట చూసినప్పుడే నేను ప్రేమలో పడ్డాను. మా నాన్నగారికి బదిలీ అవటంవల్ల ఈ ఊరు వచ్చాము. సుప్రద వాళ్ళ ఇంటి పక్క ఇంట్లోనే అద్దెకి వచ్చాము. మేము సామాను లోపల పెట్టగానే వాళ్ళ అమ్మగారు తనని తీసుకుని మా ఇంట్లోకి వచ్చారు. అలా ఆవిడ వెనకే వస్తూన్న తనని చూడగానే నేను ఇష్టపడ్డాను. తన కళ్ళూ,ముక్కూ ఎంతో బాగున్నాయి.వాళ్ళ అమ్మగారు అడిగారు నా పేరు,ఏం చదువుతున్నానని. నేను చెప్పాను. ఆవిడ అన్నారు ' మా సుప్రద కూడా ఎనిమిదో తరగతే.' ఆవిడ మా అమ్మగారిని 'వదిన గారూ' అంటూ లోపలికి వెళ్లారు. మరునాడు స్కూల్లో చేరి క్లాసుకు వెళ్ళాను. మధ్యాన్నం తన కేరేజీలోంచి నాకు సగం అన్నం పెట్టింది. నేను తినటం పూర్తి అయ్యాక తాను తింది. ఎందుకలా అంటే 'ఎంగిలి చేత్తో ఎలా పెడతాను' అంది. నాకు ఆ క్షణం శాశ్వతం అయితే బాగుండనిపించింది. రోజూ తను మా ఇంటికి వచ్చేది ఏదో వంకతో. నా కనిపించేది తను నా కోసమే వస్తోందని. ఒక్కోసారి అడిగేది తన జడల గురించో,దుస్తుల గురించో. నేను బిడియంతో బాగున్నాయి అని మాత్రమే అనే వాడిని. నిజానికి చాలా బాగున్నా. పెద్ద వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని. తనని చూస్తే అలాంటి భయం ఏమీ లేనట్టు ఉండేది. అప్పుడప్పుడూ లెక్కలు అర్ధం కాలేదని వచ్చేది. నేను చెప్తుంటే బాగా పక్కకి జరిగేది నాకు తాకేలా. నేను పక్కకి జరిగేవాడిని. నాకు తర్వాత అర్ధమయ్యింది తనకి లెక్కలు అర్ధం కాక కాదు కేవలం నాకు సమీపంలో కొంత సేపు వుండాలనుకుంటోంది అని. నాకూ లోపల సంతోషంగా ఉండేది. తనతో జీవితాంతం కలిసి ఉండాలని. కానీ ఆ విషయం బయటికి చెప్పే వయసు కాదు. ఒక్కోసారి తను, వాళ్ళ అమ్మగారు వంటింటి వేపు నిలబడి అమ్మతో మాట్లాడుతుంటారు. అప్పుడు నేను లోపల గదిలో తలుపు వెనక నుంచుని తనని చూస్తుండే వాడిని. ఒక్కోసారి మా అమ్మ గారు అడ్డు వచ్చేవారు. అప్పుడు తను నాకు కనపడేలా పక్కకి జరిగేది.నేను చూస్తున్నానని తనకి తెలుసేమో అనిపించేది. మాకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చి నప్పుడు సన్మానించిన సంస్థలు మమ్మల్ని పక్కపక్కనే నిలబెట్టేవి. అది నాకు బాగుండేది. నా స్నేహితులు కూడా 'ఎప్పుడూ హీరో హీరోయిన్లలా మీ ఇద్దరికే మొదటి ర్యాంకులు వస్తాయేంట్రా. కంబైన్డ్ స్టడీనా' అనేవాళ్ళు. ఇంకొందరు ఇంకా ఎక్కువ మాట్లాడేవారు. నాకు మనసులో బాగున్నా,పైకి కసిరే వాణ్ణి. తనకి డిగ్రీ మూడో ఏడాది నుంచీ సంబంధాలు చూస్తున్నారని అమ్మ చెప్పేది. నాకు భయం వేసేది తనకి పెళ్లై పోతుందేమోనని. కానీ నేను ప్రేమిస్తున్నాను అని తనకి కానీ,ఇంట్లో కానీ చెప్పటానికి జంకాను. కారణం సంపాదన లేకుండా పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పటం. ఏ తల్లి దండ్రులైనా ఉద్యోగం చేసే వాడికి పిల్లని ఇవ్వాలనుకుంటారు. ఒక సారి తను అడిగింది కూడా సంబంధాలు చూస్తున్నారు నీకేమి అనిపించడం లేదా అని. అప్పుడనిపించింది తను నన్ను ఇష్ట పడుతోందని. నా కోసమే పెళ్లి చేసుకోకుండా ఉద్యోగంలో చేరిందని అర్ధం అవుతోంది. నేను ఎమ్మెస్సీ చివరి సెమిస్టర్లో ఉండగా మా ప్రిన్సిపాల్ పిలిచి చెప్పారు "నీ డిగ్రీ అయ్యాక మన కాలేజీలోనే జూనియర్ లెక్చరర్ గా చేరు. నీకు పాతిక వేలు ఇస్తారు. ఇంతకన్నా మంచి ఉద్యోగం వస్తే వెళ్లిపోదు గానిలే." అని. నాకు ఎగిరి గంతేయాలనిపించింది. ఆ రోజు సాయంత్రం సుప్రద పని చేసే ఆఫీసుకి వెళ్ళాను. నన్ను చూసి ఆశ్చర్యపోయింది.కానీ తన కళ్ళల్లో సంతోషం తెలుస్తూనే ఉంది. ఇద్దరం కలిసి కాఫీ హోమ్ కి వెళ్ళాం. స్వీట్ ఆర్డర్ ఇచ్చాను. ఏమిటి విశేషం అనడిగింది. ఉద్యోగం వచ్చిందని చెప్పాను.ఆమె మనస్ఫూర్తిగా అభినందించింది. నేను ఆమె చేయి నా చేతుల్లోకి తీసుకున్నాను. తను అభ్యంతరం చెప్పలేదు. "మనం పెళ్లి చేసుకుందామా" అడిగాను ఆమె కళ్ళలోకి చూస్తూ.ఆమె కళ్ళల్లో సంతోషం మెరిసింది. వెంటనే నా భుజం మీద వాలింది.ఆమె కళ్ళల్లో నీళ్ళు.నెమ్మదిగా అంది,"ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను ఈ మాట కోసం." ఆమె భుజం మీద చేయి వేసి నొక్కాను. చాలా సేపటికి మామూలు స్థితికి వచ్చింది. "అయితే మన సంగతి మా ఇంట్లో చెప్తా." అందామె. కృష్ణ తలూపాడు. తొలిరేయి కృష్ణ మంచంమీద కూచున్నాడు. సుప్రద పాల గ్లాసుతో గదిలోకి వచ్చి అక్కడే నుంచుంది తలవంచుకుని.కృష్ణ ఒక క్షణం చూసి ఆమె దగ్గిరకి వెళ్లి భుజం చుట్టూ చేయి వేసి దగ్గిరకి లాక్కుని నెమ్మదిగా అన్నాడు "ఏంటి ఇదంతా సిగ్గే" సుప్రద చెప్పింది " పాలు తాగండి" "ఏంటీ మన్నన!" "మా బామ్మ చెప్పింది మొగుణ్ణి ఏమండీ అని పిలవాలనీ, సిగ్గు పడాలనీ." "మీ బామ్మ గారికి నే చెప్తాలే కానీ, నన్ను ఇదివరకులా 'క్రిష్' అనే పిలు." ఆమెని మంచం దగ్గిరకి తీసుకు వెళ్ళాడు. *** " నాకు బయటికి వెళ్లాలనిపించటం లేదు.రోజంతా ఇలాగే వుండాలనిపిస్తోంది." అంది సుప్రద అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని కావిలించుకుని పడుకుని. "అందరూ నవ్వుతారు మనల్ని చూసి. తొందరగా లేస్తే ఇద్దరం బయటికి వెళదాం. అదుగో ,తలుపు కొడుతున్నారెవరో.మనం రాత్రి తలుపుకి గడియ కూడా పెట్టుకోలేదు." "ఈ రోజు కోసం పదేళ్ల నించీ ఎదురు చూసాను బాబూ. ఇంత తొందరగా వెళ్లి పోమంటే ఎలా?" "నేనూ ఇలాగే ఎదురు చూసాను.కానీ కొన్ని నియమాలు పాటించాలిగా" "సరే, అన్నట్టు రాత్రి నీ మత్తులో పడి ఒక విషయం చెప్పటం మరిచాను.నిన్ను మా స్నేహితులంతా 'ముద్దపప్పు' అనే వాళ్ళు. కాదు 'హీరో' అని ఇప్పుడే అందరికీ మెసేజ్ పెడతాను. ఆమె లేచి తలుపు వేపు అడుగులు వేసింది*