"కమీషనర్ ఫోన్ చేశారు కదా!.. నేనే….అభినయ మూర్తిని."
ఓ..అలాగా.." తలుపుతూ, కూర్చోండి అన్నట్లుగా సంజ్ఞ చేస్తూ, సిగరెట్ వెలిగిస్తూ, మూర్తి వంక పరిశీలనగా చూసాడు పోలీసు ఇన్స్పెక్టర్.
"వ్యాపారం చాలా కాలం పాటు బాగానే సాగింది. స్నేహితుల మొహమాటం మీద వారిని కూడా భాగస్వాములుగా చేసుకొని, నిజాయితీగా వచ్చిన లాభాలను వారందరికిచ్చాను కూడా….."చరవాణిని ఎదురుగా వున్న బల్ల మీద త్రిప్పుతూ, అప్పడపుడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కేసి చూస్తూ మంద్ర స్థాయిలో మాట్లాడుతున్నాడు. అతని మాటల్లో బాధ ధ్వనిస్తోంది.అంతవరకు,
ఎదురుగా కుర్చీలో కనులు మూసుకొని, చెవులు రిక్కించి వింటున్న ఆ పోలీసుఇన్స్పెక్టర్, కళ్లు తెరిచి చూసాడు.'నిజాయితీగా,' అనే మాటని కాస్త ఒత్తి పలికినప్పుడు.
"గేట్ కి అడ్డంగా పార్కు చేసిన 0420 కారు మీదేనా" కానిస్టేబుల్ వచ్చి అడిగాడు. " ఆ.. ఆ..మనదే.."అంటూ కారు తాళం అతనికి యివ్వబోయాడు. కానిస్టేబుల్ కొంచెం కోపంగా చూసాడు. నువ్వు వెళ్ళు పోవచ్చన్నట్లుగా కానిస్టేబుల్ కేసి చూసాడు ఇన్స్పెక్టర్. "కరోనా కారణంగా వ్యాపారం బాగా దెబ్బతింది. నిజాయితీ గా లాభాలిచ్చినప్పుడు మెచ్చుకొన్న స్నేహితులే...ఇప్పడు.." పూర్తి కాకుండానే,
"తమ పెట్టుబడులు ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు."అన్నాడు ఇన్స్పెక్టర్. "అవును. సరిగ్గా చెప్పారు.నాకు తెలుసు వాళ్ల డిమాండ్ సమంజసమే. కానీ…" నసుగుతూ ఆ ఇన్స్పెక్టర్ స్పందన కోసం ఒక నిమిషం ఆగాడు అభినయ్. చేతి సంచి లోంచి ఏవో రసీదులు బయటకు తీసాడు.
"సరే డబ్బులు ముట్టినట్లు రసీదులవి, ఇంతకూ మీ ఫిర్యాదు ...'"అసహనంగా ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్.
గొంతు సవరించుకొంటూ, " నా భార్య రాజా బుక్ డిపోలో మేనేజర్ గా పనిచేస్తుంది. ఆవిడకి సహాయ కుడు రామచంద్ర. మధ్యతరగతి కుటుంబీకుడు. అవసరాల కోసం రామచంద్ర నా భార్య దగ్గర అప్పు చేయడం, తీర్చడం జరుగుతున్నదే. పిల్ల వాడిని ఇంజనీరింగ్ కళాశాలలో చేర్చేందుకు దఫ దఫాలుగా రెండు. లక్షలు అప్పుగా తీసుకొన్నాడతడు.ఆరు నెలలు దాటింది. ఎప్పుడు అడిగిన ఇచ్చేస్తానంటాడు. పోనీలే వడ్డీ వద్దు, అసలయినా కొంత తీర్చమని అడుగుతున్నా ఉలకడు, పలకడు.." చెప్పడం ఆపి ఇన్స్పెక్టర్ కేసి దిగాలుగా చూసాడు.
"అప్పు ఇచ్చినట్లు ఏమైనా ఆధారాలున్నాయా?" అడిగాడు ఇన్స్పెక్టర్. "కష్టాల్లో వున్నాడు. నిజాయితీపరుడని నమ్మి యిచ్చింది. ఇలా చేస్తాడని, ఊహించలేదు."
నిట్టూరుస్తూ సమాధానమిచ్చాడు
మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు." ఆమె మొన్న గట్టిగా నిలదీసి, పోలీసులకి ఫిర్యాదు చేస్తామని బెదిరించే సరికీ, రెండ్రోజులలో ఇచ్చేస్తానని చెప్పాడట." వెంటనే,
"ఇచ్చేస్తాడని మీరనుకొన్నారా" ఇన్స్పెక్టర్ అడిగాడు.
"ఎంతో కొంత యిస్తాడని..మేము భావించాము. కానీ అనుకొన్నది ఒక్కటి, జరిగింది ఒక్కటి...'" ఆతని గొంతు జీర బోయింది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. క్షణాల్లో తెప్పరిల్లి, " తను ఒంటరిగా వున్నప్పుడు చూసుకొని, ఇంటికి వచ్చాడు. హాలు లో వాడ్ని కూర్చోబెట్టి, మంచినీరిద్దామని వంటింట్లోకి వెళ్ళింది. నెమ్మదిగా వాడు వీధి తలుపులు మాసి, ఆమెను బెడ్రూంలోకి లాగి, మంచంపైకి త్రోసి, బట్టలు చింపి ,మానభంగం చేయడానికి ప్రయత్నించాడు..అదృష్టం బాగుండి, అదే సమయంలో నాకూతురు తలుపులు తట్టడంతో, వాడు డబ్బులు అడిగితే చంపేస్తానని కత్తితో బెదిరించి, తలుపులు తీసి, నా కూతుర్ని తోసేసి బయటకు పరిగెత్తుతూ పారిపోయాడట. మంచంపై స్పృహ తప్పి పడున్న తల్లిని చూసి, నా కూతురు ఏడుస్తూ ఫొన్ చేసింది. ఇంత ఘోరం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు.పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
చేస్తే,పరువు పోతుందని భావించా, కానీ నా పిరికితనానికి నా భార్య బలి కాకూడదని నిర్ణయించుకున్నా. ఇదుగో చూడండి నా ఫిర్యాదు." అతని మొహంలో, సిగ్గు,అవమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మగాడు ఇంతకంటే ఏమి చెప్పగలడు? పోలీసు అధికారి మౌనoగా ఆ ఫిర్యాదు తీసుకొని బల్ల మీద పెట్టి , " సరే మీరు వెళ్ళండి……" ఇంకా ఏదో చెప్పబోతున్నాడు.
ఇంతలో గభాలూన తలుపు తోసుకుంటూ రివ్వున దూసుకొచ్చింది ఒక యువతి. " కంప్లైంట్ ఇస్తే తీసుకోరా? ఆడదంటే మీకు అలుసా? మొగాడి చేతిలో మోసపోయిందని లోకువా? మీ అక్కకో, చెల్లికో జరిగితే ఇలాగే చోద్యం చూస్తూ కూర్చోంటారా? …." ఆవేశంతో ఆమె వూగిపోతోంది.
"ఆ దొంగ సచ్చినోడు అక్కడికి రమ్మనమని, ఇక్కడి కి రమ్మనమని… మోజు తీర్చుకొని, పెళ్ళి చేసుకొందామంటే మొఖం చాటేస్తున్నాడు. నాకొడుక్కొని వదిలి పెట్టేది లేనేలేదు. బొక్కలో తోయవలసిందే...బొక్కలిరగ కొట్టవలసిందే…" ఆమె అలాగే అరుస్తోంది.
ఆమె వాలకం చూస్తోంటే చదువుకొన్న, పాతికేళ్ళ సంపన్న కుటుంబానికి చెందిన దానిలా వుంది. పోలీసు ఇన్స్పెక్టర్ అమెను పరిశీలనగా చూస్తున్నాడు. "పోలీసు స్టేషన్లో న్యాయం జరగకపోతే ఏమి చేయాలో అదే చేస్తా…దేశంలో ఏ ఆడదానకీ నాలా అన్యాయం జరగకూడదు..…" అంటూ ఆమె తన హ్యాండ్ బ్యాగ్ తీసి, తెచ్చుకున్న సీసా మూత తీసి, " మీ ముందే ఈ పురుగుల మందు తాగి ఛస్తా.." అంటూ కానిస్టేబుల్ వారిస్తున్నా క్షణాల్లో తాగి క్రింద పడి గిలగిలా కొట్టుకోసాగింది.
మీడియా వాళ్లు ఎప్పుడొచ్చారో తెలియదు కాని ఈ తతంగమంతా రికార్డు చేస్తున్నారు. వెంటనే పోలీసు సిబ్బంది తేరుకొని అంబులెన్స్ మీద ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
💐💐💐
జరిగిన సంఘటనకు,రంగులేసి, ఆకట్టుకొనే కథనాలతో వార్తా చానల్స్ , ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడుతూ, తమ రేటింగ్స్ పెంచుకోవడానికి పోటీలు పడ్డాయి. అనాదిగా అబలలపై సాగుతున్న అకృత్యాలను ఎప్పటిలాగే ఖండిస్తూ, నిరసలను తెలియచేస్తూ కొన్ని సంఘాలు తమ ఉనికిని కాపాడుకొనే ప్రయత్నాలు చేశాయి.
పోలీసుశాఖ నిర్లక్ష్యం వల్లనే పోలీసు స్టేషన్లో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్ర హోమ్ మినిస్టర్ కూడ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేసి,విచారణకు ఆదేశించడం జరిగింది.
💐💐💐💐
కల్పనది ఒక్కప్పుడు సంపన్న కుటుంబమే. కానీ వ్యసనాలకు లోనైన ఆమె తండ్రి అప్పులు చేసి, ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తల్లిది న్యాయవాదివృత్తి . ఆడంబరంగా, జల్సాగా తిరగడం ఆమె ప్రవృత్తి. ఆ భార్యాభర్తల మధ్య అనుబంధం, అన్యోన్యత అంతంత మాత్రమే.అందంతోపాటు తెలివితేటలు, అలవోకగా అర డజను భాషల్లో మాట్లాడగలిగే నైపుణ్యం కల్పన సొంతం.
తన అవసరాలకు, ఆనందాలకు సులువుగా డబ్బులు సంపాదించడానికి కల్పన అలవాటు పడింది.ఇందుకు ఆమెను, తల్లి ప్రోత్సాహించడం దురదృష్టం. ఫేసుబుక్ వేదికగా, యువకుల వేట నడిచేది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా జల్సాగా తిరగడం,నటించి, నమ్మించి, డబ్బులు బాగా గుంజి, వారినుండి దూరంగా జరగడంలో పండిపోయింది కల్పన. పోలీసు కేసులు, చట్టాలు, వివిధ సెక్షన్ల కి సంబంధించిన పాండిత్యం సంపాదించి,డబ్బులు కోసం ఎవరైనా గట్టిగా అడిగితే " నిన్ను జైలులో పెట్టించి, నీ ఉద్యోగం పీకించి…..".ఇలా బెదిరించడం కూడ నేర్చింది.
ఐతే ఈసారి ఆమె పాచికలు పారలేదు. అవతల వాడు కూడా తాడో పేడో తేల్చాలని గట్టిగానే కల్పనకు వార్నింగిచ్చాడు. కొత్త నాటకానికి తెర ఎత్తింది కల్పన.పోలీసు స్టేషన్లో ఆత్మహత్య అందులో ప్రధాన భాగం. నిజానికి పురుగులు మందు సీసాలో వున్నది రెండు చుక్కల పురుగుల మందు మాత్రమే. పోలీసు స్టేషన్లో, పోలీసులడిగే ప్రశ్నలకి సామాధానాలివ్వకుండా, ఎదురుదాడి చేసి, తన ఫిర్యాదు తీసుకోవడం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు నాటక మాడింది. ఫిర్యాదుకు భయపడి, ఆ ప్రియుడు కాళ్ల బేరానికొస్తాడాని ఆశించింది. కానీ,ఆమె అంచనా తారుమారయ్యింది.
💐💐💐💐
ఆ సంఘటన జరిగిననాలుగు రోజుల తర్వాత,రామచంద్ర. పోలీసు ఇన్స్పెక్టర్ ముందు చేతులు కట్టుకొని గదిలో ఒక మూల నిలబడ్డాడు.ఇన్స్పెక్టర్ ని చూస్తుంటేనే సగం చచ్చి పోయాడు. "ఏంట్రా నీకంత నచ్చిందరా అది?" నవ్వుతూ అడిగాడు ఇన్స్పెక్టర్. "ఛీ.. నేను అలాంటి వాడ్ని కాదు సార్. నా బిడ్డల మీద ఒట్టు సార్…"ఇంకా ఎదో చెప్పబోతున్నాడు రామచంద్ర.
"ఇంటికి వెళ్లి, దాని బట్టలు వూడదీసి,చేసిందేమిట్రా? "ఇంకా కొంచెం గట్టిగా నవ్వాడు. "ఇంటికి వెళ్ళాను కానీ …" రామచంద్ర మాటలు పూర్తి కాలేదు. " ఛ.. మధ్యలొ దాని కూతురు వచ్చి, మంచి ఛాన్స్ పాడుచేసింది కదా. లేక పోతే…..అవునురా..అది మాంఛి దిట్టంగా ...పిట పిట లాడుతూ
బాగుంటుంది కదట్రా..మాంఛి చాన్స్ మిస్సయ్యావురా" నవ్వుతూ రామచంద్రకి దగ్గరగా వచ్చాడు. రామచంద్ర భయంతో వణికి పోతున్నాడు. ఏమి జరుగుతుందో తెలిసే లోపే
ఇన్స్పెక్టర్ కాలు పైకి లేవడం, కాలుకున్న బూటు బలంగా అతన్ని గుండెని తాకి ఫట్ మన్న శబ్దం రావడంతో, పక్క గదిలో నున్న హెడ్ కానిస్టేబుల్ పరుగున అక్కడకి వచ్చాడు.
"అప్పుతీసుకొన్నవాడివి తీర్చాలని తెలవదురా? లాఠీ క్రింద నుంచి పైకి దింపేస్తా…'' అంటూ లాఠీ చూపిస్తూ,మరోసారి తన్నపోయాడు. అప్పుడు గమనించాడు రామచంద్ర ఎడమ కాలుని. పోలియో వ్యాధికి గురై చచ్చుపడింది. గోడ పట్టుకొని నిలబడటానికి ప్రయత్నంచి, కాలు జారి పడ్డాడు. బలంగా తగిలిన తన్నుకి గోడకి గుద్దుకొని ముక్కులోంచి రక్తం వస్తోంది. పై పెదవి చిట్లి వాచింది. కళ్ల జోడు రెండు ముక్కలయ్యింది.
" సార్! వాడు కుంటోడు. సరిగ్గా నడవ లేడు.
దానికి తోడు గుండె జబ్బు, షుగర్ కూడా . ఇంకో తన్ను తన్నితే గుండె ఆగి ఇక్కడే ఛస్తాడు.ఇదిగో వాడి హెల్త్ ఫైల్ చూడండి" అన్నాడు హెడ్ కానిస్టేబుల్.
సిగరెట్ వెలిగించి, రెండు దమ్ములు లాగి, ఇన్స్పెక్టర్ అన్నాడు," వీడికి యింకో కోటింగిచ్చి ఎఫ్. ఐ. ఆర్ వ్రాసి, ఫార్మాలిటీస్ పూర్తి చేయి.అభినయ్ గాడ్ని డబ్బులు తీసుకుని అక్కడకి రమ్మని కబురు చేయి." హెడ్ కానిస్టేబుల్ సెల్యూట్ చేసి " అలాగే సార్." అన్నాడు.
💐💐💐💐
"కొత్తగా ఇంకో నాలుగు కంపెనీలు తీసుకొన్నారు. ఈయన మీద నమ్మకంతో, ఆయన స్నేహితులు వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు. బాంక్ లో దాచుకునే బదులు, మా వ్యాపారంలో పెట్టుబడి. పెట్టు. బ్యాంక్ కంటే ఇక్కడ లాభాలు ఎక్కువ. వద్దనుకుంటే నీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారాయన"అభినయ్ భార్య రామచంద్రతో ముచ్చటగా చెప్పింది. బ్యాంక్ కంటే ఎక్కువ వడ్డీ, అసలుకు ఢోకా లేదన్న పాయింట్ అతనికి బాగా నచ్చింది. మొత్తం మీద ఏమి చేసాడోగాని రామచంద్ర, రెండు లక్షలు ఆమె చేతిలో పోసాడు. దురాశ దుఃఖానికి చేటని సామెత. ఆరు నెలల బాటు లాభాలు వచ్చాయని బాగానే ముట్టచెప్పారు. ఆ తరువాత అసలు నాటకం మొదలయ్యింది. కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతింది.కధ అడ్డం తిరిగింది. పెట్టుబడి తిరిగి ఇమ్మని మని అడిగితే, నష్టం వచ్చి, వ్యాపారం మూసేసాం, మా దగ్గర ఏమీ డబ్బులు లేవని సమాదానం.
ఒకరోజు అభినయ్ మూర్తిని గట్టిగా అడగాలని రామచంద్ర నిర్ణయించుకొని వాళ్ళ ఇంటికి వెళ్లాడు.
ఆ సమయంలో అభినయ్ ఇంట్లోలేడు. " డబ్బులు ఇవ్వం, నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో "అని తిట్టి ముఖం మీద తలుపు లేసింది అభినయ్ భార్య. హెడ్ కానిస్టేబుల్ కి జరిగింది ఏడుస్తూ చెప్పాడు రామచంద్ర. "ఛీ.. డబ్బుల కోసం, పెళ్ళాన్ని మానభంగం చేసాడని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడా! ఎంత దారుణం!" హెడ్ కానిస్టేబుల్ ఎంతో నొచ్చుకొన్నాడు. కానీ ధనబలం ముందు సత్యం ఓడిపోయింది.ఎఫ్.ఐ. ఆర్. రెడీ అయ్యింది. మరునాడు రామచంద్రని కోర్టులో హాజరు పరచాలి.
💐💐💐💐
ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చబడిన కల్పన పరిస్థితి విషమంగా మారింది.పెద్దగా ఏడుస్తూ కూతుర్ని చూడటానికి వచ్చింది ఆమె తల్లి. వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేసారు. కల్పన దేర్యం గానే వుంది. కారణం, ఆమెకు తెలుసు పురుగులు మందు కేవలం రెండు చుక్కలేనని. తన నటనా చాతుర్యానికి మనసులో మురిసిపోయింది. రెండ్రోజులలో ఆమె శరీరంలో ఎంతో మార్పు వచ్చింది. అప్పుడు,
తన పథకం విఫలమైందని అనుమానం కలిగింది. మృత్యుభయం ముఖంలో గూడు కట్టింది. ఆసుపత్రిలో ఆమె పడుకున్న మంచానికి దగ్గరగా, గోడ మీద సాలెపురుగు. ఎంతో అందంగా సంతోషంగా, కష్టపడి కట్టుకొంటోంది తన గూడు. ఆ సాలెపురుగుకి తనకి తేడా ఏమిటో ఆలోచించసాగింది. గొంతులో భరించలేని మంట.
తల్లి చూడాలనిపించింది. గొంతు విప్పి ఏమీ చెప్పలేని పరిస్థితి. వాస్తవానికి, ఆమె ఇంకా
తన కల్పనా జగత్తులోనే వుంది. కల్పనకు తెలియకుండా పది చుక్కల పురుగుల మందు కలిపి, కూతురు చావు కబురు చల్లగా వినాలని తల్లి ఎదురు చూస్తోంది. లక్షల్లో వున్న కూతురు బ్యాంక్ అకౌంట్ కి నామినీ ఆ లాయర్. కూతురు, ఆ తల్లిలో 'న్యాయవాది' కోణాన్ని గమనించక పోవడం దురదృష్టం.
💐💐💐💐💐
కల్పన మరణ వార్త మరోసారి రాష్ట్ర ప్రజలకు చర్చనీయాంశంగా మారింది.
హెడ్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి నట్టు నిర్ధారణయినందున
అతడ్ని సస్పెండ్ చేసి పోలీసులు శాఖ చేతులు కడుక్కొంది.
💐💐💐💐
తన సస్పెన్షన్ కంటే రామచంద్రని కేసులో ఇరికించి ఎఫ్.ఐ. ఆర్. వ్రాయవలసి వచ్చినందుకు హెడ్ కానిస్టేబుల్ ఎంతో బాధ పడ్డాడు. నీరసంగా కాళ్లు ఈడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు అప్పటికే అర్ధ రాత్రి దాటింది. అధికార, ధన బలానికి, రాజకీయ నాయకుల ఒత్తిడికి దాసోహం చేస్తూ, ఆత్మవంచన చేసుకొంటూ, నిర్దోషిని, దోషిగా కోర్టులో నిలబెట్టి, వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నందుకు తనలో తానే కుమిలి పోయాడు. తన నిస్సాహయతకు, ఉక్రోషం వచ్చి, తన మీద తనకే అసహ్యం వేసింది. కానీ తన ఆవేదనను ఎవరు అర్ధం చేసుకోగలరు?. తన పాపాన్ని క్షమించమని భగవంతుని కన్నీటితో వేడుకొన్నాడు. మనస్సు కొంచెం తేలిక పడింది.ఎందుకో ఆ క్షణంలో, టీవీలో వార్తలు చూడాలని పించిందతనికి .టీవి రిమోట్ తీసాడు. అంతలోనే ఏదో నిర్వేదం. ఆ ప్రయత్నం విరమించాడు.
బహుశా, వార్తలు వింటే నిజంగా సంతోషించేవాడేమో!.
రాత్రి, సమయం: 2.30 నిమిషాలు.
తాజా వార్త: మితి మీరిన వేగం. ప్రాణం తీసిన వైనం. వేగ నియంత్రణ చేయలేక మెట్రో రైలు పిల్లరును ఢీ కొట్టిన కారు నంబర్ 0420. నుజ్జు నుజ్జయిన అభినయ్ మూర్తి శరీరం. ప్రారంభమయిన పోలీసుల దర్యాప్తు.
💐💐💐💐