మృత్యువు పిల్చింది - కందర్ప మూర్తి

Mrutyuvu pilchindi

కొన్ని విషాద సంఘటనలు జీవితంలో వెన్నంటి ఉంటాయి. నేను రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ లో ఆర్మీ మెడికల్ విభాగంలో సర్వీస్ చేస్తున్న రోజులవి. మా ఆర్మీకేంప్ టౌనుకి దూరంగా విశాలమైన ప్రాంతంలో ఉంది. వారాంతమైన ఆదివారం మాకు విశ్రాంతి దినం ఆ రోజు ఉదయం పూట అన్ని విభాగాలు మైంటినెన్సు చేసి లంచ్ తర్వాత ఎవరికి తోచిన విధంగా వారు రిలాక్స్ అవుతారు. కొంతమంది బేరక్సు( సైనికులు గ్రూపులుగా ఉండే విశ్రాంతి గృహం) లో ఉండి ప్లే కార్డులు ఆడుతూ , మేగజైన్సు చదువుతు , కేరమ్సు ఆడుతూ, ట్రాన్సిస్టర్లో వివిధ భారతి పాటలు వింటూ సాయంకాలం వరకు కాలక్షేపం చేస్తూంటారు. విశ్రాంతి సమయం కాబట్టి డ్రెస్ కోడ్ ఉండదు. లుంగీ - బనీను , పైజామా, ఎవరికి అనుకూలమైన బట్టలు వారు ధరిస్తూంటారు. ఎక్కువగా రవాణాతో బిజీగా ఉండే ట్రాన్సుపోర్టు విభాగం వారు ట్రక్కులు , జీపులు , అంబులెన్సులు , స్కూల్ బస్సులు, మోటర్ బైకులు రిపైర్ వాషింగ్ మైంటినెన్సు చేసి వరుసగా గేరేజిలో ఉంచుతారు. మా యూనిట్లో ముఖ్యమైన ప్రదేశాల్లో ఫైర్ ఇక్విప్ మెంట్లతో ఫైర్ పాయింట్లు ఎర్రని రంగు మార్కు చేసి ఉంచుతారు. అపుడపుడు ఫైర్ ఫైటింగ్ డెమో చేయిస్తూంటారు. దేశ సరిహద్దు రాష్ట్ర మైనందున ఎయిర్ ఫోర్స్ పైలట్లు రోజూ మిగ్ యుద్ధ విమానాలతో ప్రాక్టీస్ చేస్తూంటారు. అవి ఆకాశంలో ఎగిరేటపుడు పెద్ద శబ్దం చేసుకుంటూ వెల్తాయి. ఆ ఫైటర్ విమానాల శబ్దాలు రోజూ వింటు మాకు అలవాటై పోయింది. ఒక ఆదివారం మధ్యాహ్నం మా దినచర్య పూర్తి చేసి బేరక్సులో విశ్రాంతి తీసుకుంటున్నాము. మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో మా బేరక్ మీద ఒక్కసారిగా బాంబు పడినంత శబ్దమైంది.అందరం భయంతో బయటకు పరుగులు తీశాం. బయట ఆకాశం మీద నల్లటి దట్టమైన పొగతో మంటలు చిమ్ముతూ మిగ్ యుద్ధ విమానం భూమ్మీదకు వస్తోంది. ఫైటర్ విమానానికి యాక్సిడెంటైందని గ్రహించిన మేము ఎవరు ఏ స్థితిలో ఉన్న వాళ్లం అలాగే " ఫైర్ - ఫైర్ " అని అరుచుకుంటు ఫైర్ పాయింట్ నుంచి మంటలార్పే వస్తువులు తీసుకుని విమానం మంటలొస్తున్న వైపు సుమారు రెండు కిలోమీటర్లు పరుగెత్తగా జొన్న చేలలో ఫైటర్ విమానం మండుతూ కనబడింది. మొక్క జొన్న పొలంలో వంద మీటర్ల వరకు విమాన శకలాలు విరిగి పడి మంటలు వెదజల్లు తున్నాయి. మంటల వేడికి ఎవరం దగ్గరకు వెళ్లే అవకాశం లేకపోయింది. మిగ్ కాక్ పిట్లో సీనియర్ పైలట్ సజీవ దహనమై కనిపించాడు. ప్రమాదానికి కొద్ది దూరంలో కాలిబాట మీద మోటర్ బైక్ మీద కాళీ పాలకేన్లతో ఒక వ్యక్తి దగ్ధమై ఉన్నాడు. సమీప గ్రామ ప్రజలు పాలు , కూరగాయలు టౌనుకెళ్లి అమ్ముకుంటారు ఒక వ్యక్తి టౌన్లో పాలు పోసి ఊళ్లోకి పోతూ విమాన ప్రమాదం చూద్దామని మోటర్ బైక్ వెనక్కి తిప్పి వస్తూంటే మండుతున్న ఫైటర్ శకలం పడి సజీవ దహనమై పోయాడు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి , సివిల్ పోలీసులకు , ఫైర్ డిపార్ట్ మెంటుకి ఎవరో ఫోన్ చేసినందున కొద్ది సమయంలో వారు సంఘటన స్థలానికి చేరు కున్నారు. ఫైర్ డిపార్టు మెంటు వారు మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఎయిర్ ఫోర్సు పైలట్ తన ప్రాణాల్ని బలిపెట్టి మండుతున్న మిగ్ ఫైటర్ని జనావాసాలకు దూరంగా పొలాల వరకు తీసుకు వచ్చి మా ఆర్మీ కేంప్ లో ప్రాణ నష్టం , లక్షల రూపాయల ఆర్మీ ప్రోపర్టీ కాపాడినాడు ఫైటర్ కి సాంకేతిక లోపం తలెత్తగానే తన వెంట ఉన్న ట్రైనీ పైలట్ ని పేరాచ్యూట్ సహాయం తో జంప్ చేయించి తను మాత్రం ఆర్మీ ఏరియాకు నష్టం కలగకుండా ప్రాణాల్ని బలిచేసాడు. తర్వాత ఈ సంగతులు మాకు తెలిసి ఆ సీనియర్ ఎయిర్ ఫోర్స్ పైలట్ మమ్మల్ని కాపాడి తను బలైపోయి పోయినందుకు ఆయన ఆత్మశాంతికి ప్రార్దనలు చేసాము. పైలట్ సాహసానికి భారత ప్రభుత్వం శౌర్య చక్రంతో సన్మానించింది. * * *

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు