జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎప్పుడో ఒకప్పుడు గుర్తుకు వస్తూంటాయి. అవి విషాద సంఘటనలు కావచ్చు లేదా వినోద భరితమైనవి కావచ్చు. నేను రక్షణ రంగం , సివిల్ మెడికల్ విభాగాల్లో సుమారు నలబై సంవత్సరాల అనంతరం నగరంలో విశ్రాంత జీవితం గడుపుతున్నాను. వయసురీత్యా వృద్దాప్యంలో వచ్చే శరీర రుగ్మతల వల్ల కుడి చెయ్యి కుడి కాలు సమస్యల కారణంగా దైనందిన అవుసరాలకు హేండ్ స్టిక్ , స్కూటీ వాడవల్సి వస్తోంది. వార్దక్య జీవితంలో సహచర మిత్రులు , కుటుంబ సబ్యుల సహాయ సహకారాలు లభిస్తే సమయం ఆనందంగా ప్రశాంతంగా గడిచి పోతుంది. నా దైనందిన జీవితంలో రోజూ సాయంత్రం మా కాలనీ పార్కులో తోటి వయోవృద్ద మిత్రుల సమూహంలో కూర్చుని ఏడు గంటల వరకు వర్తమాన రాజకీయాలు , ఆరోగ్య , ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతు ముచ్చట్లు పెట్టుకుంటాము. నాలాంటి నడవలేని వారు లాన్సులో కూర్చుంటే మిగతా వారు వాకింగ్ ట్రాక్ మీద నడక సాగించి మాతో ముచ్చట్లకు దిగుతారు. మా సమూహ సబ్యుల్లో ఎవరి జన్మ దినమైనా, పండగ లప్పుడు, జాతీయ దినాలపుడు స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపు కుంటాము. ఎవరైనా అనారోగ్యరీత్యా హాస్పిటల్లో అడ్మిట్ అయితే అందరం వెళ్ళి పరామర్స చేసి మనోదైర్యం చెప్పి వస్తాము.విధి వశాత్తు ఎవరికైనా మరణం సంభవిస్తే దహన కర్మ క్రియల్లో పాల్గొని కుటుంబ సబ్యులకు సంతాపం తెలియచేసి వస్తాము. ఇలా మిత్రులతో రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. నా శరీర అవయవ సమస్య రీత్యా ఇంటి వద్దనుంచి స్కూటీ మీద పార్కు వరకూ వచ్చి పార్కింగ్ ఏరియాలో వెహికిల్ ఉంచి వాకింగ్ స్టిక్ సహాయంతో గేట్ నుంచి లోపలి కొస్తాను.సాయంత్రం ఏడు గంటలవ గానే ఎవరి ఇళ్లకు వారు బయలుదేరుతాము. ఎప్పటిలా ఒకరోజు ఏడవగానే నేను పార్కు గేటు దాటి స్కూటీ దగ్గరికొచ్చాను. నాకు అనుకూలంగా ఉంటుందని పార్కింగులో ఒక మూలన వెహికిల్ పెట్టుకుంటాను. స్కూటీ దగ్గరకు రాగా ఒక నడి వయసు వ్యక్తి రాయలసీమ వస్త్ర ధారణలో అంటే తెల్లని షర్టు , తెల్లని ధోతీలో స్కూటీ సీటు మీద కూర్చుని స్టైల్ గా సిగరెట్ తాగుతు పొగ వదులు తున్నాడు. నేను వాకర్ స్టిక్ తో నడుచుకుంటు స్కూటీ దగ్గరికొచ్చాను. నన్ను చూసి కూడా లేవకుండా "బండి మీదా " అన్నాడు. అవుననగానే పక్కన నిలబడి సిగరెట్ పొగ వదులుతున్నాడు. " బాబూ ఇలా సిగరెట్ తాగితే నీ ఆరోగ్యం పాడవుతుంది." అన్నాను. టక్కున " మీకేమైనా ఇబ్బందా ? " అన్నాడు. నాకు మనసు చివ్వు మంది. కనీసం వయసుకైన విలువ ఇవ్వకుండా అంత నిర్లక్ష్యంగా మాట్లాడినందుకు బాధ కలిగింది. వాకర్ స్టిక్ ఫోల్డు చేసి కాళ్ల దగ్గర ఉంచుకుని స్కూటీ స్టార్టు చేసి ఇంటికి చేరుకున్నాను. మర్నాడు సాయంకాలం ఎప్పటిలా ఐదు గంటలకు పార్కుకి చేరి మాటల సందర్భంలో ముందు రోజు జరిగిన సంఘటన చెప్పాను. నా మాటలు విని మిత్రులందరు నాకు చివాట్లు పెట్టారు. నా ఆప్త మిత్రుడు కలగచేసుకుని" నీకు నోటి దురద ఎక్కువ. ఎందుకు అతనితో అలా అన్నావు. ఎవరి ఆరోగ్యం వారికి తెలియదా" అన్నాడు. నేను వివరణ ఇస్తూ" ఆయన నా స్కూటీ మీద కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు. అక్కడ ఉన్న టూ వీలర్లన్నీ పెట్రోల్ తో నడిచేవి. అతని నిర్లక్ష్యం కారణంగా జరగరాని సంఘటన జరిగితే భారీ నష్టం జరగవచ్చు. అదీగాక నా శరీర స్థితి చూసి బండి మీద నుంచి లేవనందుకు బాధ కల్గింది. నేను నా గత ఉద్యోగ రీత్యా వైద్య రంగానికి చెందిన వాడిని కాబట్టి పొగ తాగడం వల్ల ఆరోగ్య సమస్యల గురించి చెప్పవలసి వచ్చింది." అన్నాను. అక్కడితో ఆ ప్రస్తావన ఆగిపోయింది. ఏడు గంటలవగానే ఎవరికి వారు ఇళ్లకు బయలు దేరాము. నేను నా స్కూటీ దగ్గరకు రాగానే ఎప్పటి నుంచి నా కోసం ఎదురు చూస్తున్నాడో నిన్నటి రాయలసీమ వ్యక్తి ఎదురొచ్చి నా చేతులు పట్టు కుని " ఏదో ఆవేశంలో మీతో అసందర్భంగా మాట్లాడాను. పెద్దవారు , మన్నించండి " అని చెప్పి వెళిపోయాడు. తన తప్పు తెలుసుకున్నందుకు ఆనందమైంది నాకు. * * *