గారడీ ఆట - కందర్ప మూర్తి

Garadee aata

పట్టణానికి దూరంగా ఉన్న అదొక పల్లెగ్రామం. వ్యవసాయం చేసుకునే రైతులు కూలీ జనం కుల వృత్తుల వారు నివశిస్తు ఉంటారు.పండగలప్పుడు పర్వదినాలప్పుడు కోలాటాలు, కోడి పందాలు , పేకాట లాంటి వేడుకలతో కాలక్షేపం చేస్తూంటారు. ఆ రోజు పనులు లేక కూలీజనం పంచాయతీ ఆఫీసు వద్ద చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఊరి పంచాయతీ ఆఫీసు ముందు విశాలమైన మైదానంలో ఒక పక్క పెంటకుప్పలు ,చెత్త చెదారం ,ముళ్ల తుప్పలు విస్తరించి ఉంటే కొంత భాగంలో వినోద కార్యక్రమాలు జరుగుతుంటాయి. మధ్యాహ్నం పన్నెండు దాటింది. రచ్చబండ చెట్టునీడలో సర్కస్ తాత భుజాని కున్న కావడి నుంచి సరంజామాని కిందకు దించి కోతి, పాము, ముంగీస జంతువులతో సర్కస్ ఆటకు సిద్ధమవు తున్నాడు. జనాల్ని గారడీ ఆటకు రప్పించడానికి తాత కొంతసేపు ఢోలు ,మరికొంత సేపు ఢమరుకం వాయిస్తూ కోతి చేత వివిధ విన్యాసాలు చేయిస్తున్నాడు. కోతి నిక్కరు కమీజు ధరించి నెత్తి మీద కుచ్చుటోపీ పెట్టు కుని తాత చిన్న కర్రతో తిప్పుతుంటే అలా కుప్పిగెంతులు వేస్తోంది. తాతకు కొద్ది దూరంలో వెదురుబుట్టలో పాము , గొలుసుతో కట్టి ముంగిస ఉన్నాయి. సర్కస్ తాత డప్పుల మోతకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విధ్యార్థులు గోల చేసుకుంటు తాత చుట్టూ గుమిగూడారు. మెల్లగా రచ్చబండ జనం, ఆడవాళ్లు వచ్చి చేరారు. జనం చుట్టూ చేరగానే తాత ఆట మొదలెట్టాడు. ముందుగా కోతి చేత ఆట ప్రారంభించాడు. కోతి కొద్ది సేపు కర్ర బండి నడిపింది. తర్వాత సైకిల్ రిమ్ముచక్రం చేత్తో పట్టుకుంటే అందులోంచి బయటకు గెంతులు వేసింది. కోతి చేతికి గాజులిచ్చి అలిగి పుట్టింటి కెళ్లిన పెళ్లాన్ని బతిమాలి తీసుకు రమ్మని చెప్పగా కొద్ది దూరమెళ్లి స్టూల్ మీద కూర్చుంది. కోతిని దగ్గరకు పిలిచి మనిషి చేతి ఎముక పట్టుకుని " అబ్రక తబ్ర"అంటూ నెత్తి మీద తిప్పగా పిచ్చిదానిలా గెంతులు, నేలమీద పొర్లడం మొదలెట్టింది. తర్వాత మధ్యలో ఉన్న రాట ఎక్కి విన్యాసాలు మొదలెట్టింది కోతి ఆటలు చూస్తున్న బడిపిల్లలు గోల చెయ్యసాగేరు. కోతికి విశ్రాంతి ఇచ్చి పక్కన కూర్చోబెట్టేడు తాత. కొద్ది సేపటి తర్వాత నాగస్వరం బూరా తీసుకుని నోటితో ఊదుతు పాముబుట్ట మూత తెరవగా కోరలు తీసి నడుం విరిచిన నాగుపాము బుస్సున పడగ విప్పింది. ముంగిస- నాగుపాము జగడం ఆట చూపిస్తానని జనాలకి చెప్పి నాగస్వరం బూర జోరుగా ఊదడం మొదలెట్టాడు. ఇంతట్లో పక్కనున్న పెంటకుప్పల మాటున ముళ్ల పొదల్లోంచి అసలైన నాగుపాము జోరుగా తాత ఊదుతున్న నాగస్వరం బూర ధ్వనికి వచ్చి పడగ విప్పి తల ఆడించసాగింది . నాగుపామును చూసిన జనం , పిల్లలు భయంతో పరుగులు పెడుతూ చెల్లాచెదురయారు.కోతి రాట ఎక్కి కూర్చుంది. గారడీ తాత ముందు అసలైన నాగుపాము పగడ విప్పి ఆడుతుంటే దిగ్బ్రాంతికి గురై ఏమి చెయ్యాలో తోచడం లేదు. కొద్ది దూరంలో గొలుసుతో కట్టబడిన ముంగిస కనబడింది. తాత ధైర్యం కూడగట్టుకుని మెల్లగా నాగస్వరం బూరా ఊదుకుంటు ముంగిస దగ్గర కెళ్లాడు. నాగుపాము నాగస్వరంలో లీనమై తాతతో పాటు ముంగిస దగ్గరకు వెళ్లగానే గబుక్కున పాము తలని పట్టుకుని కొరికేసింది. 'బ్రతుకుజీవుడా' అంటు ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు తాత. నాగస్వరానికి అసలు నాగుపాము వచ్చి తనకు రావల్సిన డబ్బులు రాక పోయాయని బాధ పడుతున్నాడు. ఇంతలో , సమాచారం అందుకున్న జీవకారుణ్య సమితి వాలంటీర్లు వచ్చి మూగజీవాలను బంధించి హింసిస్తున్నావని గారడి తాతను , అక్కడున్న మూగజీవాలను వ్యాన్లో తమ వెంట తీసుకుపోయారు. .* * *

మరిన్ని కథలు

Kotta konam
Kotta konam
- Prabhavathi pusapati
Sagatu manishi andolana & aswasana
సగటు మనిషి ఆందోళన & ఆశ్వాసన
- మద్దూరి నరసింహమూర్తి
Evarini Chesukovali
ఎవరిని చేసుకోవాలి?
- తాత మోహనకృష్ణ
Mana oudaryam
మన ఔదార్యం
- సిహెచ్. వెంకట సత్య సాయి పుల్లంరాజు
Swardha poorita pani
స్వార్ధపూరిత పని
- మద్దూరి నరసింహమూర్తి
Ratee manmadhulu
రతీ మన్మథులు
- కందుల నాగేశ్వరరావు