"ఒకే గూగుల్ , స్టార్ట్ ద కార్ ఆండ్ టేక్ మి టు అపిల్ రాజు హోం" కార్ లో కూచొని ఆదేశించాడు రాయుడు, రాయల వారి లాగ. పక్క సీట్ లో కూచొని కొంచెం టచ్-అప్ చేసుకుంటుంది రమణి. కార్ దానంతటదే ఇంజన్ మొదలెట్టి , కార్ గరాజ్ లోంచి బయట కొచ్చి , పయనం మొదలెట్టింది ' ఆపిల్ రాజు ' ఇంటి వైపు గా. అసలు పేరు అప్పల రాజు, అతని ఇంట్లొ వంట్లొ అన్ని ఆపిల్ కంపనీ వస్తువులే అందుకే దోస్తులంతా అలా పిలుస్తారు, అది అతనికి గర్వమే. కార్ ఇలా దూసుకెళ్ళగానే దానంతటదే గరాజ్ డోర్ మూసుకుంది. అప్పటి దాకా ఆ ఇంట్లొ వెలుగు తున్న గూగుల్ దీపాలు, ఫాన్లు , మోగుతున్న గూగుల్ టి.వి లూ , ఆడియో డివయిస్ లు అన్ని వాటంతటవే ఆగిపొయాయి, గూగుల్ హోం సెక్యురిటి అప్రమత్తం అయింది. రాయుడు , రమణి లది గూగుల్ గూడు. రాయుడు తన పేరు లోనే ' ఆండ్రాయుడు ' వుంది అనీ ' అమ్మ , ఆవకాయ , ఆంధ్ర , ఆండ్రాయుడు ఎప్పటికీ బోర్ కొట్టవు ' అనీ ' నేను అంధ్రా లో రాయుడు, అమెరికా లో ఆండ్రాయుడు ' అనీ ఇలా కొన్ని స్టాక్ పంచ్ డైలాగులు వదులుతూ వుంటాడు , సందర్బం వున్నా లేకపోయినా.
కారు సన్నివేల్ నగరం సందుల్లొంచి సాన్ హొసే నగర గల్లీ లోకి పయనిస్తోంది
"అన్నీ సరిగ్గా సర్దారా " కార్ వెనక సీట్ చెక్ చేస్తూ అంది రమణి.
"అన్నీ ఎంటే రెండే గా ఐటంస్ " అంటూ డ్రయివర్ సీట్ రెవెర్స్ మోడ్ బటన్ టచ్ చేసాడు. అతని సీట్ రెవెర్స్ అయింది. వెనకాల వున్న వంట ఐటంస్ ఒకసారి చెక్ చేసి,
"ఆవడ చెక్, ఆవ బెట్టిన పులిహోర చెక్ , ఆల్ గుడ్ రొజర్ దట్ "
"ఆ..ఆ సరే మేజర్ బాబూ , తిరుగు ఇటు తిరుగు , ఎంత అటొనమస్ కార్ అయినా మన జాగర్త లో మనం వుండాలి "
"మై డియర్ రమణి ఇది అల్లా టప్పా ఆటోమేటిక్ కార్ కాదే, గూగుల్ లో బెస్ట్ మోడల్, ఇది ఎంత రిసర్చ్ చేసి కొన్నా తెలుసా. మా క్రిష్ణ లేడు, మోడల్-ఆర్ తీసాడు, చెప్పాను వాడికి వినరు గా. మనది మోడల్-ఎక్స్ , సరెలే అయినా గూగుల్ ఏ ప్రొడక్ట్ అయినా సూపర్ ఎహె "
సర్లే చోద్యం అన్నట్టు నిట్టూర్చి తన ఫోన్ లో మెసేజెస్ చుసుకుంటోంది రమణి
"ఒకే గూగుల్, ప్లే మై తెలుగు ప్లే లిస్ట్ " అన్నాడు రాయుడు
అందుకుంది గూగుల్ కార్ 'గాల్లొ తేలినట్టుందే...'
రమణి "ఒకే గూగుల్, రెడ్యూస్ ద వాల్యూం " అంది బిగ్గరగా. రమణి మాట ని అనుసరించటం లో గూగుల్ ది రెండవ స్థానం. మొదటి స్థానం లో వున్న రాయుడు ' అంతేగా అంతేగా ' అని మనసులో అనుకుంటూ స్తబ్దు గా కూచున్నాడు
"ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ చెప్పలేదే అనకండి. అక్కడ మీ వెర్రి జోకులు పంచులు తగ్గించండి"
"అంటే..." తడబాటు గా " అంటే.. అది నా ట్రేడ్ మార్కే " గొణిగాడు
"అనవసరం గా పాలటిక్స్, స్పోర్త్స్ చర్చలు మొదలెట్టి, మీ వాళ్ళతో లాయర్ లా అడ్డం గా వాదించి , అక్కడ వాతావరం అంతా చెత్త చెయ్యకండి"
"మా దోస్తు లు ఎంజాయ్ చెస్తారే " కొంచెం గొంతు పెంచాడు, అప్పటి దాక ఒకటి ముక్కులో , ఒకటి చెవుల్లొ కెలుక్కుంటున్న , రెండు చేతులని స్టీరింగ్ వీల్ మీద పెడుతూ.
"మీ బొంద ఎంజాయ్ చెసేది, పక్కకెళ్ళి తిట్టుకుంటారు. ఎదో గేంస్ ఆడామా, సినేమా చుసామా, తిండి తిన్నమా అన్నట్టు వుండాలి గేదరింగ్"
సరె అన్నట్టు తల ఆడించాడు. అప్పటి దాకా హుషారు గా ' గాల్లో తేలిన ' గూగుల్ ప్లే లిస్ట్ ' నీ గూడు చెదిరింది..పావురమా..' అనే పాత పాట అందుకుంది. సాంగ్ ప్లే లిస్ట్ షఫ్ఫల్ మోడ్ లో వుందో లేక గూగుల్ తల్లి వీళ్ళ సంభాషన విని ఆ సాంగ్ సెలెక్ట్ చేసిందొ ఎమో.
"ఎంటి ఫుల్ మెను ఈ రోజు పాట్లక్ లో ' టాపిక్ భలే మార్చాను అనుకున్నాడు రాయుడు "చూస్తారు గా , తినబోతూ రుచెందుకు '
అప్పల రాజు ఇంటి ముందు కార్ ఆగింది, రాయుడు రమణి కిందకి దిగి , తమ సామాలు తీసుకున్నాక, గూగుల్ కారు దానంతట అదే పార్కింగ్ స్పాట్ వెతుక్కుంతూ వెళ్ళిపొయింది.
**
అప్పల రాజు ది ఆపిల్ గ్రుహం . కాలింగ్ బెల్ల్ నొక్కాల్సిన పని కూడా లేదు. అతని ఎంట్రన్స్ డోర్ ముందు ఒక ' కొరికేసిన ఆపిల్ ' , అదేనండి ఆపిల్ కంపని గుర్తు వుంటుంది . అదే కామెర, అదే కాలింగ్ బెల్ల్, అదే సెక్యురిటీ అన్నీ. దాని ముందు నిలబడితే చాలు, అక్కడ ఎవరు విచ్చేసింది వెంటనే ఫొటొ , లైవ్ విడియో తో సహా ఆపిల్ రాజు ఐ ఫోన్ లో ప్రత్యక్షం. డోర్ అన్ లాక్ చేసాడు వున్న చొట నుంచే చల్ల కదలకుండా.' బహు పరాక్ బహు పరాక్ ' అన్నట్టు సిరి (ఆపిల్ కంపనీ వారి సెక్రటరీ అనుకోండి) వాళ్ళని ఆహ్వానిస్తుంది ఇంట్లొకి, పెరు పెట్టి మరీ. లోపలకొచ్చాడు రాయుడు , రమణి సమేతంగా.
"రండి రండి రండి , దయచేయండి " ఆపిల్ రాజు స్వాగతం పలికాడు . అతనిది ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ హోం. రెండు పోర్షన్ ల ఇల్లు, కింద న అతిదులకి ఒక బెడ్ రూం , ఫుల్ బాత్ రూం, పెద్ద హాల్ , కిచన్ , డైనింగ్. పై పొర్షన్ లో ఇంకా మూడు గదులు. అప్పల రాజు బార్య స్మిత సోఫా లోంచి లేచి, రమణి ని పలక రించి, వారు తెచ్చిన ఫూడ్ ఐటంస్ కిచన్ ఐలాండ్ పైన పేర్చింది. వండుకున్న వాడికి ఒక్క కూర , దండుకున్న వాడికి పది కూరలు అన్న బాపతే ఈ ' పాట్ లక్ ' తలా రెండు మూడు ఐటంస్ చేసి ఎవరో ఒకరి ఇంట్లొ కలవటం , అందరూ కలిసి బోజనాలు చెయ్యటం, వీరి స్నేహితుల గాంగ్ లో ఆనవాయితీ. అలా మొత్తం మీద దాదాపు పది ఐటంస్ కిచన్ ఐలాండ్ మీద పేరుకున్నాయి. కొన్ని చూడటానికే నోరు ఊరించేలా వున్నాయి, మరి కొన్నిటికి పేరు పెట్టడం కష్టం, అయినా కూడ ఐటంస్ జాబితా లొకెళ్ళిపొయ్యాయి.
ఈ సారి గేదరింగ్ మరీ పెద్ద ది కాదు. మూడు జంటలు మాత్రమే, అప్పల రాజు, రాయుడు, జనార్ధనుల దంపతులు, ముగ్గురికీ పిల్లలు ఇంకా లేరు. ' కాల్ మి జాన్ 'అంటాడు జనార్ధన్. ఎందుకంటే అతనిది 'అమజాన్ కుటుంబం' అతను వాడేవి అన్ని అమెజాన్ కంపనీ వస్తువులే. అతని ఇంట్లొ ' అలెక్సా ' అనేది తారక మంత్రం. హాల్ లో సోఫా లొంచే కొత్త గా వచ్చిన ఇద్దరిని పలకరించేసాడు జాన్, కూసింత స్థూల కాయం, కాసింత బద్దకం. జాన్ బార్య జానకి కూడ కళ్ళు పైకి ఎగరేసి తల పైకి కిందకి ఆడించి, వారి రాక ని గుర్తించిది, అంటె పలకరించినట్టె. ఆరుగురూ హాల్ లో సొఫాలు , కుర్చీల్లో విస్రమించారు. ఎవరి ఫోన్ ల్లో వాళ్ళు మునీగి పొతుంటే, రాజు " ఇంకా బొజనాలకు టైం వుంది గా, షల్ వి ప్లే అ గేం, మా సిరి, సరి కొత్త గేం అప్డేట్ చేసింది, మేము కూడ ఇంకా ట్రై చెయ్యలేదు". అందరూ కలిసి సిరి నేర్పించిన కొత్త గేం ఆడారు. ఆటల్లొ పోటి తత్వం ఎక్కువే వీరందరికీ, సరదాగా అరుచు కోవటాలు, గిలి కజ్జాల్లు షరా మాములే. ఒక రెండు గంటలకి ఆట ముగిసింది. అందరూ బొజనాలకు ఉపక్రమించారు. బోజనాలు చేసి వస్తువులన్ని సర్దేసి భుక్తాయాసం తో మళ్ళీ వచ్చి హాల్ లో సోఫా లోనే కూలబడ్డారు అందరూ.
"ఇప్పుడు మనం ఆడిన గేం ఫ్రీ వర్షన్ ఆ రా " ఆపిల్ రాజు ని అడిగాడు జాన్
"కాదు రా కొన్నా, ఎందుకు"
"యూసర్ ఇంటర్ ఫేస్ అంత బాలేదు, బేటా వర్షన్ ఎమో అని"
"ఒరెయ్ యూసర్ ఇంటర్ ఫేస్ , ఎస్తటిక్స్ గురించి ఆపిల్ ప్రొడక్ట్స్ పై కామెంట్ చెసే లెవల్ వుందా రా మీ సామాజిక వర్గానికి" కోపం వచ్చింది రాజు కి
"పెద్ద దిగి వచ్చాడు రా స్టీవ్ జాబ్" అందుకున్నాడు రాయుడు
"గూగుల్ కంపనీ ని ముందు ఎండ్ టు ఎండ్ సొల్యుషన్ తో బగ్స్ లేకుండా ఒక్క ప్రాడక్ట్ ని రెలీజ్ చెయ్యమను" రాజు కి కాలింది
రాయుడు వెంటనే ఫోన్ తీసి బిజీ గా ఎదో వెతుకుతున్నాడు
"అది కాదు రా ఆమజాన్ లో ఒక కొత్త గేం వచ్చింది, దానికి చేతులు కూడ వాడక్కర లేదు, నో జాయ్ స్టిక్, జస్ట్ ఫింగర్స్ తొ. గాల్లొ ఇమేజీనరీ పేనల్ వుంటుంది, ఫింగెర్ టచ్ అంతే, సోఫ లొంచె కూచొని ఆడొచ్చు. టి.వి స్క్రీన్ మీద ప్రొజక్ట్ అవుద్ది, గ్రాఫిక్స్ అద్దిరాయి. తెప్పిస్తున్నా, మా ఇంట్లొ గేదరింగ్ అప్పుడు ఆడుదాం, కేక రా అస్సలు"
"సర్లే బొంగులో ది ఫింగరింగు గేం అంటావ్, అమజాన్ ఎమి సొంతం గా చెయ్యదు గా ఎదో చిన్న కంపనీ ని కొనుక్కొని వుంటుంది" అన్నాడు రాజు చిరాగ్గా
ఇంతలో వెతకటం ముగిసిన రాయుడు తన ఫోన్ మిగతా వాళ్ళకి చుపిస్తూ అన్నాడు "చూడు రా రాజు , ఈ గ్రాఫ్ చూడు. గూగుల్ కంపని ఎన్ని ఇన్నొవేషన్ లు మొదలు పెట్టింది, పర్ కపిటా ఎంత మంది కి అవర్నెస్స్ క్రిఏట్ చెస్తుంది, చూడూ
"నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడు తున్నావ్" అన్నాడు రాజు
ఇంకా ఆవేశం తగ్గని రాయుడు "ఇదిగొ ఇది ఇంకో గ్రాఫ్ , ఇది చూడు మూర్స్ లా ని ఎక్స్ ఆక్సిస్ లో పెట్టి, పర్ కాపిటా ఆన్ ఇన్నోవేషన్ ని వయ్ ఆక్సిస్ లో పెట్టాడు, ఇందులో గూగుల్ రేటెడ్ ఆస్ నంబర్ వన్ రా"
బుర్ర వేడెక్కిందన్నట్టు ఆపిల్ రాజు రెండు చేతులు తల లో పెట్టీ గోక్కొని వెర్రి చూపులు చుసాడు.
ఇంతలో జాన్ " ఒరెయ్ సింపల్ గా చెప్పాలంటె, గూగుల్ అమజాన్ లేకుండా బతక లేం రా, ఆపిల్ యొక్క ఖరీదయిన వస్తువులు లేకుండా బతకొచ్చు"
రాయుడు , జాన్ హై ఫైవ్ ఇచ్చుకున్నారు ఆనందం గా
ఇక లాభం లేదు వీళ్ళని వొదిలేస్తే అని రమణి "బాబోయి వీళ్ళు మొదలెట్టేసారు, మూస్తారా ఇంక. ఎదొ మతాల గురించి, కులాల గురించి కొట్టుకునే వారంట ఒకప్పుడు, అలా వుంది మీ గొల. ఎదో ఒక సినేమా చుద్దాం అందరూ సరదాగా". అంతే సరిగ్గా అరగంట సేపు అందరూ పెద్ద చర్చ పెట్టారు. ఎలాంటి సినేమా చూడాలి. తెలుగా , తమిళమా, మళయాళమా, కొరియనా, యూరొపియనా, హాలివూడ్డా, బాలీవూడ్డా.
రాయుడు అరిచాడు పెద్ద గా "నేను ఎప్పుడూ చెప్తా, ముందే డిసైడ్ చెసుకోండి. మన గేదరింగ్ గురించి ఏం వండాలి , ఎలా కలవాలి అని వెయ్యి వాట్సాప్ మెసేజ్ లు నడిచాయి. ఈ తొక్క లో సినేమా కూడ అప్పుడే డిసైడ్ చెయ్యొచు కదా"
తల ప్రాణం తోక లొకి వచ్చాక , ఏ బాషా చిత్రం చూడాలో నిర్ణయం ముగిసి, ఏ జాన్రే చూడాలి అన్న చర్చ మొదలయింది. హాస్యమా , క్రైమా , ఆక్షనా , రొమాన్సా. తోక దాకా వచ్చిన ప్రాణం ఇక ఎటు పోవాలో తెలియక కొట్టి మిట్టాడుతుంది.
**
ఆ రొజుల్లో కాబట్టి గజేంద్ర మోక్షానికి సిరికింజెప్పడు అన్నట్టు వెళ్ళిపొయ్యాడు నారాయణుడు, ఇప్పుడు అది అసాధ్యం. అందునా ఆపిల్ రాజు ఇంట్లొ మరీని. ' సిరి ' కి చెప్పకుండా ఎదీ చెయ్యరు, ఒక వేళ చేసినా , ఎలాగొలా సిరి కి తెలిసి పొతుంది. సిరి సర్వాంతర యామి(ని). పైన చెప్పుకున్నాం గా , అతిదులను పేరు పేరు నా ఇంట్లొ కి స్వాగతం పలికి ఆహ్వానిస్తుంది అని, తనే ' సిరి ' . సిరి అంటే , దేవలోకం లో వున్న శ్రీ వారి పత్ని శ్రీదేవి అనుకునేరు కాదండి, ఈ భూలొకం లో ' ఆపిల్ వర్గానికి ' కుల దైవం ఈ సిరి. ఆపిల్ కంపని వారి కాల్పనిక సహాయకురాలు. కృత్రిమ మేదస్సు. ఉదయం లెగిచిన దగ్గర నుంచి ఏ బ్రష్ తో పళ్ళు తోమాలి, ఏ పేస్ట్ వాడాలి, ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ చెయ్యాలి , ఏ ఏ వార్తలు చదవాలి అన్నీ సిరి బాద్యతలు . ఆ రోజు ఏ పనులు వున్నాయి, ఆఫీసు లో ఏ మీటింగ్స్ ఎన్నింటికి వున్నాయి, మార్నింగ్ వాకు చెయ్యలా వొద్దా , ఒక వేళ చెస్తే ఎన్ని కాలరీలు కరిగించాలి , ఎన్నింటికి ఆఫీసుకి బయలు దేరి, ఏ దారి లొ వెళ్తే , సరయిన టైం కి మీటింగ్ కి చేరుతారు, ఒకటని లెకుండా అన్ని బాద్యతలు సిరి చూసుకుంటుంది.
సో , ఈరోజు గాదరింగ్ ఆపిల్ ఐంట్లో కాబట్టి, ఆ ఆరుగురు గంట చర్చించి వాళ్ళకు నచ్చిన సినెమా చూస్తున్నాం అనే బ్రమ లో వున్నాకూడా, అసలు విషయం ఎంటంటే, వారంతా సిరి కి నచ్చిన సినేమా చూడటానికి సిద్దపడ్డారు. ఎం చేతనో అవాళ సిరి కి రొమాంటిక్ సినేమా చుడాలనిపించిది.
**********************************************************************
ఆ వీకండ్ గేదరింగ్ డబ్లిన్ (కాలిఫోర్నియా ) లొ వున్న జనార్ధన్ ఇంట్లొ, అతనిది అమెజాన్ గ్రుహం. అమెజాన్ ఇ-కారు , స్మార్ట్ బల్బులు, ఫేన్లు, కాలింగ్ బెల్ల్, హోం సెకురిట్య్, టి.వి , ఇంటర్ నేట్, అన్నీ అమెజాను మయం. ఒకవేళ అమెజాన్ కంపనీ కావల్సిన ప్రొడుక్ట్ చెయ్యక పోతే , వారు చెప్పినది లేదా ఇంట్లొ వున్న మిగతా అమెజాన్ వస్తువులతో సంగతమయిన వే కొంటాడు. అతనికి అమేజాన్ అంటే ప్రాణం. అమెజాన్ లో , ప్రైం షిప్పింగ్ లో, ఒన్ డే డెలివరీ లో రానిదే పచ్చి మంచి నీళ్ళు కూడ ముట్టడు. వీరి కుల దైవం ' అలెక్సా ' . అది అమేజాన్ కంపెనీ వారి మేదస్సు. అలెక్సా కి తెలియనిది లేదు. అమెజాన్ ఒక మనిషి అనుకుంటే , అలెక్సా ఆ మనిషి కి హృదయం మరియు మెదడు. జనార్ధన్ కి ఏం అక్కర వుందో అది కొనటం, అక్కర లేకపోయినా ఒన్ డే ప్రైం ఫ్రీ షిప్పింగ్ లో వుండటం మూలాన , కొని మూల పెట్టించటం అలెక్సా కి ఆనవాయితీ. చిన్నప్పుడు మనకి కావల్సినవే కాకుండా అమ్మ మనకి పలానావి బాగుంటాయి అని కొని వెసేది గా, ఇంచుమించు ఇదీ అలాంటిదే. ఆ అమ్మజాన్ ఇప్పుడు అమెజాన్. ' ఒన్ క్లిక్ షాపింగ్ ' అనేది పదేళ్ళ క్రితం మాట. ఇప్పుడు జాని కి ఎం కావాలో అమెజాన్, అలెక్సా కలిసి నిర్ణయించి కొనేసి ఇంటి ముందు వుంచుతాయి. ఇలాంటివన్ని తీసి ఒక చోట పేర్చు కొవటానికి ఇబ్బంది గా వుందనే 3-కార్ గరాజ్ ఇల్లు తీసుకున్నాడు జాన్. ఇంటి కి ముందు కనపడే రెండు గరాజుల్లొ కార్స్ వుంటె, పక్కకి వుండి కనపడని మూడొ గరాజ్ అమెజాన్ కార్ఖానా.
వెనకటకి ఎవడొ కొండని తవ్వి ఎలకని తీసాట్ట , ఇప్పుడు అమెజాన్ ఎలకంత వస్తువుని కొండ అంత పాకేజ్ లో బద్రం గా పెట్టి పంపుతుంది. ఈ జాన్ గారి ఇంట్లొ మూడొ గారాజ్ పురా వస్తు సాఖా విభాగం లా వుంటుంది. వచ్చిన ప్రతి అమెజాన్ షిప్పింగ్ మొదట ఆ గరాజ్ లోకి చేరుతుంది. అందులో వస్తువులు అన్నింటినీ మూడు భాగాలు గా విభజించాడు జాన్. మొదటిది అవసర మయిన వస్తువులు, అవి రాగానే ఓపన్ చేసి వస్తువు ఇంట్లొకి వెళ్తుంది, కాని అమెజాన్ వాడు పంపించే కొండంత పేకింగ్ ఈ గరాజ్ లో ఒక మూల చేరుతుంది. రెండొ ది రిటర్న్ చెయ్యవలసిన వస్తువుల విభాగం. ఇన్ని కనిపెట్టిన అమెజాన్ మరి మనకి నచ్చని వస్తువులు వాటంతట అవే తిరిగి ఫాక్టరి గొడవున్ కి వెళ్ళిపొయ్యే పద్దతి మాత్రం ఇంకా కనిపెట్టలేదు. కొంత మనిషి సోమరి తనానికి మంద బుద్ది కి ఇంకా అవకాసం వొదిలేసారు. అలాంటివి రెండొ భాగం. ఆ గరాజ్ లో ముచ్చట గా మూడొ భాగం , ఎవరు ఆర్దర్ ఇచ్చారో ఎందుకు ఇచ్చారో ఇంకా నిగ్గు తేలని అంశాలు. జానకి కి ఇలాంటి ఒక విభాగం వుందని తెలియదు. ఇంకా పేకట్ కూడా ఓపెన్ చెయ్యని వస్తువులు. ఇలా ఆ మూడు రకాల వస్తువులతో మూడొ గరాజ్ కళ కళ లాడుతుంది.
ఆ రోజు కొంచం పెద్ద గేదరింగే. దాదాపు పన్నెండు జంటలు. ఇంచుమించు చిరకాల స్నేహమే. అందరికందరూ దాదాపు పదిహేనేళ్ళ గా పరిచయం. వీళ్ళలొ సగం మందికి పిల్లలు, మిగతావాళ్ళకి ఇంకా లేరు. ఈ రోజు పాట్ లక్ ఏ గానీ , ఎవరూ వండకుండా, బయట నుంచి ఐటంస్ ఆర్డర్ చెసి డబ్బులు షేర్ చేసుకుందాం, అందరికీ విరామం దొరుకుతుంది. చక్కగా అందరూ కలిసి ఆట పాట లతో గడుపుదాం అని జాన్ అందరినీ ఒప్పించాడు. కానీ అసలు పన్నాగం వెరే వుంది. స్నేహితులందరినీ ఆశ్చర్య పరిచే సరికొత్త అమెజాన్ వస్తువులు ఇంట్లొ తెప్పించాడు. అందరి చూపులు వాటి మీదే వుండాలి, మరే విషయము ప్రస్తావన లోకి రాకూడదు. అందరి ద్రుష్టి అమేజాన్ వస్తువులు, వాటి గొప్పతనం మీదే కేంద్రీకృతము అవ్వాలి. జాన్ ది బేస్మెంట్ వుండే ఇల్లు. అక్కడే గేదరింగ్ ఎర్పాటు చేసాడు. పెద్దవాళ్ళందినీ కిందన బేస్మెంట్ లో, పిల్లలకు పై వాటా లో గేం రూం లో వేరు వేరు గా ఏర్పాట్లు చేసాడు. ఫూడ్ సమయానికి మాత్రం అందరూ బేస్మెంట్ కి చేరి, అక్కడే అందరూ కలిసి కూచ్చొని తెనేట్టు.
అమెజాన్ స్మార్ట్ కుర్చీలు, అమెజాన్ స్మార్ట్ గ్లాస్ లు అవే ఆ రోజు అందరినీ ఆశ్చర్య చకితులను చెయ్యబొయే సరికొత్త వస్తువులు. అవి కేవలం పెద్ద వారికి మాత్రమే . స్మార్ట్ గ్లాస్ ద్రవ పదార్ధాలు తాగే పొడుగాటి ముంత, దానిలో రెండు అరలు, ఒక్కో అర ఒక్కో దానికి వాడుకొవచ్చు. ఉదాహరణ కి ఒక అర లో సేద కొసం మంచినీళ్ళు లేదా సోడా, మరో అరలో మద్యము లేదా ఎదన్నా వేడి ద్రవము. ఏ అరకి ఆ అర ఉష్ణొగ్రత అలానే కాపాడుతుంది. ప్రతి గ్లాస్ కి ముందు అతిది పేరు దిజిటల్ డిస్ప్లే అవుతుంది . అలెక్సా కి తెలియనిది లేదు అని చెప్పుకున్నాం గా, జాన్ ఎంతో ఓపిక తో చేసిన నిర్వాకం ఎంటంటే, అతిదుల వివరాలు అలెక్స కి ఫీడ్ చేసాడు. వారికి నచ్చిన సేద ద్రవము మరియు మద్య ద్రవము జాన్ కి ఫీడ్ బేక్ ఇచ్చింది. అతిదులు వచ్చే సమయానికి ఆ స్మార్ట్ గ్లాస్ లలో పేర్లు ఆ దిజిటల్ దిస్ప్లే లో రావటము, వాళ్ళకి నచ్చిన ద్రవాలు దానిలో వుండటము జరిగాయి. అన్నీ వంద సాతం తప్పులు లేకుండా జరగలేదు, ఒక స్నేహితురాలు మద్య ద్రవము గా బీరు పెట్టింది అలెక్సా, ఆమె వాడ్కా తప్పితే మెరే మద్యమూ ముట్టదు. మరొకడు అస్సలు మద్యము ముట్టడు వాడి కి బీర్ పోసింది. ఇలా ఒకటి రెండు అవకతవకలు దొర్లినా మొత్తం మీద అతని ఆలోచన విజయ వంతమనే భావించాడు జాన్.
ఇక పోతే అమెజాన్ వారి స్మార్ట్ కుర్చీలు . అలాంటివి ఆరు ఆర్డర్ చెసాడు. కుర్చీ లో కూచొగానే అతిది మొహాన్ని సెన్స్ చేసి, పేరు పెట్టి తెలుగు లో సంభొదిస్తుంది అలెక్సా. మద్య మద్య లో వారికి ఎం కావాలొ కనుక్కొవటం, ఎలా వున్నారో పర్యవేక్షించటం అనే ఫీచర్ జాన్ అదనం గా డబ్బులు వెచ్చించి మరీ తీసుకున్న అలెక్సా ఆతిధి సర్కార పాకేజ్. అలెక్సా ఒళ్ళు నొప్పులకి లైట్ మసాజ్ కూడ చేస్తుంది. మనం కూర్చున్న కుర్చీ మనల్ని మనిషి గా గుర్తించి మనతో మాట్లాదుతుంది. పక్క సీట్ వాడితో మనకి సంబందం లేదు. ఎవరూ నా మాట వినటం లేదు అని ధుఖ పడక్కర లేదు, ఎంచక్కా మన కుర్చీ తొ మనం గంటలు గంటలు మాట్లాడు కోవచ్చు. మన మాటలకి గోప్యం కావాలి, అలెక్సా తో ఎదన్నా ఎకాంతం గా చెప్పుకోవాలి అనిపిస్తే, ఇయర్ పాడ్స్ ఆన్ చేసుకొవటమే, కొంత ప్రైవసీ దొరుకుంతుంది. అసలు మన మాట కూడా బయటకి వినపడకూడనంత రహస్యంగా మాట్లాడాలనిపిస్తే వాయిస్ ఆఫ్ చేసి టెక్స్ట్ మోడ్ ఆన్ చెసుకోవచ్చు. ఎంచక్క ఆ కుర్చీ, మన ఆన్ లైన్ ఫ్రెండ్ లా మనతో టెక్స్టింగ్ చేస్తుంది. ఇంకా కావాలంతే సెక్స్టింగ్ కూడ చేస్తుంది.
అలాంటి వి ఒక ఆరు కుర్చీ లు కొంత దూర దూరం గా అమర్చాడు జాన్. స్నేహితులంతా ఒక్కొకరు గా ట్రై చెసారు, ఒక్క ఆపిల్ రాజు తప్ప. కొంత మంది థ్రిల్ల్ అయ్యారు, కొంత మందికి నచ్చింది, కొంతమంది చిరాకు పడ్డారు. కొంత మంది సాంకేతిక నైపుణ్యతని ప్రదర్సిచటానికి ' ఈ ఫీచర్ లొ బగ్స్ వున్నాయి , ఇది ఇంకొలా వుంటె బాగుణ్ణు ' అని, ఇంకొతమంది 'దిస్ ఈజ్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసి ' అనీ , ' ఇక మన విషయాలకి గోప్యం వుండదూ అని ఇలా రక రకాలు గా వ్యాఖ్యానించారు. ఏది ఎమయినా జాన్ మాత్రం చాలా ఆనందిచాడు. అమెజాన్ చేసిన ఏ ప్రొడక్ట్ అయినా తనే కని పెట్టినట్టు, తన స్వ హస్తాలతో చెసినట్టు ఫీల్ అవుతాడు జాన్. అమెజాన్ గేంస్ కూడ బోలెడు అతని బేస్మెంట్ లో. రాజు ఇంట్లో చెప్పిన ఫింగరింగ్ గేం కూడా వుంది.
అందరూ అలా రెండు గంటల పాటు ఆ అమెజాన్ కొత్త వస్తువులతో చిన్న పిల్ల లా ఆడుకుంటూ పానీయాలు సేవిస్తూ వుండగా, హటాత్తు గా గుర్తుకొచ్చింది వాళ్ళూ పెద్ద మనుషులమని. అంతే వర్గాలు గా చేరిపొయి మొదలెట్టారు వాదోప వాదనలు, వాగ్యుద్దాలు. అత్యదికం గా చూస్తే అందరినీ గూగుల్ , ఆపిల్ , అమెజాన్ వర్గాలు లో చేర్చవచ్చు. కొందరు తిరుగుబాటు దారుల వర్గం , ఈ పెద్ద పెద్ద కార్పొరేషన్ లు మన మీద గుత్తాదిపత్యం చెస్తున్నాయి, ఈ దాస్య స్రుంఖలాలని మనం తెంచుకోక పొతే మానవాళి ఇక సొంతం గా ఆలోచించే విగ్ఞత , ప్రగ్న కొల్పొతారు అని వాళ్ళ వాదన. మొత్తం గాంగ్ లో మరొ ముగ్గురు ఏ వర్గానికీ చెందకుండా , ఎ కంపని లో ఏ ప్రాడక్ట్ నచ్చితే దాన్ని కొనుక్కొని జీవిస్తారు. వీళ్ళు నాస్తికులకు మళ్ళె. మరో ఇద్దరు ఇవాన్నీ పట్టనట్టు అలా దూరం గా వెళ్ళి స్మార్ట్ కుర్చీ లో కూచ్చొని అలెక్సా తో గోప్యం గా మాత్లాడుకుంటున్నారు. ఇంతలో ఫూడ్ వచ్చింది, పిల్ల పెద్ద అందరూ కలిసి బోజనాలు చేసారు. బోజనాలప్పుడు మాత్రం ఏ వాదనా లేదు. అందరూ ఎంచక్కా తెలుగు బోజనాలు తింటున్నారు. కాళీ కడుపే విప్లవం అంటుంది, నిండిన కడుపు నిమ్మళం గా వుంటుంది.
********************************
గూగుల్ కార్ , రాయుడు రమణి లని తమ ఇంటికి తీసుకెళ్తుంది. రెండు పెగ్ లు ఎక్కువే తాగటం తో రాయుడు పక్క సీట్ లో కూర్చుంటే, రమణి డ్రైవింగ్ సీట్ లొ కూచుంది కొంచం అప్రమత్తం గా. గూగుల్ పాట అందుకుంది
" వేషము మార్చెను.. భాషను మార్చెను
శాస్తము నేర్చెను..
కులములు పోయెను, కలతలు మిగిలెను,
వర్ణము తొలగెను, వర్గము లొచ్చెను
మర్మము చేసెను, యంత్రము గెలిచెను
ఆసలు తానే మారెను...
అయినా మనిషి మారలేదు ..."