“భయం, భక్తి లేకుండా… ఇష్టం వొచ్చినట్టు ప్రవర్తిస్తే ఇలాంటి వ్యాధులే వస్తాయి. ఒకని కన్నా భయం ఉందా? నమాజు లేదు, దేవుడికి భయపడరు… అందుకే ఇలాంటి ముదనష్టపు వ్యాధులొచ్చి ఈ ప్రపంచం ఇట్లైపోతాంది. ఇంత తొందరగా ఖయామత్ రోజులు వస్తాయనుకోలేదు.”
ఖాజాబీ…ఇంట్లో ఇజితిమా పెడుతున్నామని వీధిలో ఆడోళ్లకు చెప్పి రాపో. ఖయామత్ రోజుల్లో నమాజు చేసుకుంటూ… అల్లా మార్గంలో ఉంటే… ఎట్టా జరిగితే అట్ట జరుగుతుందని నలభై మూడేళ్ల కూతురికి చెప్పింది నూర్జహాన్.
‘లేదు అమ్మిజాన్’ టీవీలలో చెప్తున్నది అర్థం కాలేదా? “ఇప్పుడు ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలి. బయటికి పోకూడదు. మనుషులు గుంపులు గుంపులుగా ఉండకూడదని మొత్తుకుంటున్నారు.” నువ్వు మళ్ళీ… వీధిలో వాళ్లని ఇంట్లో పెట్టుకుంటాంటే ఎట్టా?
‘ఎవరు నీకు చెప్పింది?’ నా ఇంట్లో నేను అల్లాకు క్షమాపణ చెప్పుకోకూడదా? నమాజు చేసుకోకూడదా? బాగానే చెప్పినారే నీకు ఎవరో? నేను చెప్పింది చేయి… మిద్దె పైన షామియానా వేయించమని ఫారుక్ కి చెప్పు పో.
“నమాజు చేసుకోవద్దని… ఎవరూ చెప్పలేదు అమ్మిజాన్…” “మనుషులు గుంపులుగా కాకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు నమాజు చేసుకోవచ్చు” అంతే గాని వేరే వాళ్లను ఇళ్లలోకి రానివ్వకూడదని డాక్టరులు చెప్తున్నారు.
“ఎవరు ఆ డాక్టరులు? బో చెప్పినారే..,” ఇప్పుడు మన వీధిలో వాళ్లను పిలిచి ఇజితిమా పెట్టుకుంటే కరోనా గిరోనా ఏమీ రాదు” కాని నువ్వు మాటలు ఆపి… నేను చెప్పింది చేయి, లేదంటే వాళ్ళకు చెప్పడానికి వీధిలో నేనే పోతా.
చెప్తే వినే రకం కాదంటూ… తల్లిపై గొణుక్కుంటూ ఖజాబి… తమ్ముడు ఫారుక్ దగ్గరికి వెళ్లి, తల్లి చెప్పిన విషయాన్ని తెలియజేసింది.
“సరేలే అమ్మిజాన్ చెప్పింది కదా! నేను షామియానా వాళ్లకు ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళు పొద్దున్నే ఇంటిపైన షామియానా వేసి మిగిలిన ఏర్పాట్లన్నీ చేస్తారు.”
“అది కాదు ఫారుక్… ఇళ్లలోకి ఎవరిని రానివ్వకూడదు జనాలు అంటున్నారు కదా! ఈ సమయంలో ఇజితిమా పెట్టుకుంటే బాగోదేమో? నేను చెప్తే వినడం లేదు. కనీసం నువ్వైనా అమ్మిజాన్ కు చెప్తావని వస్తే…, నువ్వు కూడా అమ్మకు వంత పాడుతున్నావేంటి?”
‘దిదీ! అలా ఏమీ కాదు.’ మన వీధిలో వాళ్ళు విదేశాల నుండి రాలేదు కదా. అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. “మనమేమైన తప్పుడు పని చేస్తున్నామా… అల్లాకు క్షమాపణలు చెప్పుకొని, ప్రపంచాన్ని కాపాడమని” కోరుకుందాము.
‘అది కాదు రా!’ “కరోనా చాలా భయంకరమైన వ్యాధి అంట… అరవై సంవత్సరాలకు పైబడిన వారికి, చిన్న పిల్లలకి వస్తే కోలుకోవడం కష్టం అంట… ఈ సమయంలో ఇజితిమా అంటే నాకు భయంగా ఉంది.” మనం మాత్రమే ఇంట్లో నమాజు చేద్దాం లే.
‘ఎందుకు దిదీ? అంతగా భయపడతావ్!’ ఏమి కాదులే… అందరూ ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే. టివీ వాళ్ళు భయపెట్టడం మామూలే, వాళ్ళు… ఇంత ఉంటే అంత చేసి చెప్తారు.
‘ఖజాబీకి కోపమోస్తాంది!’ కాని ఏమీ చేయలేని పరిస్థితి. అమ్మిజాన్, ఫారుక్ చెప్పిన మాట వినడం లేదు, నమాజు చేసుకోవడం తప్పు కాదు కాని ఇలాంటి సమయంలో ఇంట్లో ఇజితిమా వద్దంటే వినడం లేదు. ముందే దేశంలో కరోనా రెండో దశలో ఉందంట. ఈ సమయంలో గుంపులుగా మనుషులు ఉంటే మనకు మాత్రమే కాదు దేశానికి కూడా ముప్పేనని ఎలా చెపితే? వింటారు వీళ్ళు అనుకుంటూ… అక్కడి నుండి కదిలిపోయింది.
***
రాత్రంతా ఖజాబికి నిద్రే పట్టలేదు. తనకు ఇద్దరు పిల్లోలు ఉన్నారు. వారి గురించే తన భయమంతా. తన పిల్లలను ఎలాగైనా సంరక్షించుకోవాలి. అమ్మిజాన్, ఫారుక్ చెప్పేది వినడం లేదు. ఈ సమయంలో ఇజితిమా పేరుతో ఇంట్లో ముప్పై, నలభై మంది ఉంటే ఏమైనా జరగచ్చు. నేను ఈ ఇంట్లో ఉండకూడదు. నా పిల్లలను తీసుకొని ఎక్కడికైనా వెళ్లిపోవాలి అనుకుంది కానీ తనకు తల దాచుకునే పరిస్థితి లేదు. భర్త గుండెపోటుతో మరణించి రెండేళ్లు అయ్యింది. అప్పటి నుండి అమ్మగారి ఇంట్లోనే ఉంటోంది. అత్తింటి వారు అప్పుడప్పుడు వచ్చి పిల్లలను చూసి పోవడమే తప్ప పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ సమయంలో నేను ఎక్కడికని వెళ్ళేది అంటూ బాధపడింది.
“మళ్ళీ సుదీర్ఘంగా ఆలోచించి ఈ సమయంలో బయటకి వెళ్ళడం కూడా మంచిది కాదని ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంట్లో ఉన్న మూల గదిలోకి వెళ్లి అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. పిల్లలకు అవసరమైన వస్తువులు, తిండి తీసుకొని గదిలోకి వెళ్లి వాకిలి వేసుకుంది.”
మరుసటి రోజు ఉదయమే షామియానా వాళ్ళు మిద్దెపైన షామియానా వేశారు. పొద్దున్నే లేచిన నూర్జహాన్.., మూల గదికి వాకిలి వేయడం చూసి “ఏందే? లోపలే ఉన్నావు… బయటకి రా… అంటూ కేకలు వేసింది.”
‘లేదు అమ్మిజాన్’ మీరు ఇంట్లో ఇజితిమా పెట్టుకుంటే… నేను బయటకి రాను. నాకు నా పిల్లల జీవితం ముఖ్యం. ఎవరెవరో ఇంట్లోకి వచ్చి తిరుగుతుంటే ఏదైనా జరగరానిది జరిగితే నేను తట్టుకోలేను. ఇప్పటికే భర్తను పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా జీవితం నా పిల్లలే… వాళ్లకి ఏమైనా జరిగితే తట్టుకోలేను. ఈ గది నుండి బయటకి రాను. నాకు, పిల్లలకి అవసరమైనవి తెచ్చుకున్నాను. నన్ను ఇక్కడే వదిలేయండి అంటూ ఏడ్చింది.
“ఎట్టా పుట్టినావే నా కడుపునా ఇంత పిరిగిదానివి. ఎక్కడో వచ్చిన రోగం మనకు ఎందుకు వస్తుంది.? నీకు పోయే కాలం వచ్చింది అందుకే ఇట్టా చేస్తున్నావంటూ గొణుక్కుంది.”
తనే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఇజితిమా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వచ్చింది నూర్జహాన్. దాదాపు యాభై ఇళ్లకు చెప్పి వస్తే… కేవలం పది మంది మాత్రమే వచ్చారు. అందరూ కరోనా భయంతోనే వెళ్ళలేదు. దానికి కూడా… నూర్ జహాన్ నొచ్చుకుంది. వీధిలో వాళ్లకి పోయే కాలం వచ్చింది… ఇజితిమా అంటే ఒక్కరూ రావడం లేదు. ఇంట్లో కూర్చొని సినిమాలు చూసుకుంటూ, సెల్లులల్లో పనికిమాలిన పనులు చేసుకుంటున్నారు అంటూ వదిరింది.
అన్నట్లుగానే వారం రోజులు నూర్ జహాన్ ఇంట్లో ఇజితిమా జరిగింది. అయినప్పటికీ ఖజాబి మాత్రం గదిలో నుండి బయటకి రాలేదు.
పిల్లోలను చూసి వారం రోజులు అయితాంది. ఇప్పటికైనా బయటకి రా అంటూ నూర్ జహాన్ బతిమిలాడిన ఖజాబి మాత్రం బయటకు రాలేదు.
‘లేదు అమ్మి జాన్’ నేను ఇప్పుడే బయటకి రాను ఇంకో పది రోజుల పాటు ఈ గదిలోనే ఉంటాను. ఫారుక్ సెల్లుకు… నాకు కావాల్సిన వస్తువులు మెసేజ్ చేశాను. వాటిని నాకు ఇవ్వండని చెప్పింది.
చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయింది నూర్జహాన్.
ఆ గదిలో వంట చేసుకుంటూ, ఉన్నది తినుకుంటూ, పిల్లలను ఆడిపించుకుంటూ రోజులు గడుపుతోంది ఖజాబి.
***
“ఒరే! ఫారుక్ దానికేమైనా పిచ్చి పట్టిందేమోరా? లేదంటే గదిలోకి వెళ్లి వాకిలి వేసుకోవడం ఏంది?” నాకు అనుమానంగా ఉంది. దానికి ఏంటో కావాలంట? అవి తెచ్చి దాని ముఖాన కొట్టు.
ఎందుకు అమ్మిజాన్…? దిదీని అలా అంటావు?. పోనీలే… తన పిల్లల క్షేమమే కదా…! తాను కోరుకుంటున్నది. తనకు కావలసినవి నేను తెచ్చిస్తాను కాని… దిదీని నువ్వు ఏమి అనకు అన్నాడు ఫారుక్.
‘నేనేం అనలేదు నాయన’ నాకు కూడా… రెండు ఒళ్లు నొప్పుల మాత్రలు తీసుకురా… ఒళ్ళంతా ఒకటే నొప్పులు పైకి కిందికి తిరిగి తిరిగి అలసిపోయాను.
“సరే అమ్మి జాన్… తెచ్చిస్తానులే. నువ్వు వెళ్లి పడుకో.”
పది రోజులు గడిచిపోయింది. నూర్జహాన్ కి జ్వరం, దగ్గు ఎక్కువైపోయాయి. ఫారుక్ కి తెలిసిన డాక్టర్ ని ఇంటికే పిలిపించాడు. నూర్జహాన్ ని చెక్ చేసి ఏవో మాత్రలు ఇచ్చాడు. అయినా దగ్గు, జ్వరం మాత్రం తగ్గలేదు.
ఫారుక్ కి అనుమానం వచ్చి అమ్మిజాన్ ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రిలో రెండు రోజులు ఉండాలని, రక్త పరీక్షలు చేయాలనీ చెప్పడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రెండు రోజుల తర్వాత నూర్జహాన్ కి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్దారించారు. వెంటనే ఇంట్లో అందరిని అధికారులు అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు చేశారు.
“నూర్జహాన్ తో పాటు కొడుకు ఫారుక్, కోడలు మెహర్ తాజ్ కి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది.” “ఖజాబి మరియు తన ఇద్దరి పిల్లలకి మాత్రం కరోనా నెగటివ్ వచ్చింది.”
“నూర్ జహాన్ కి కరోనా ఎలా వచ్చిందని? దర్యాప్తు చేయగా… ఇజితిమాకి పిలవడానికి యాభై ఇళ్లకి తిరిగినప్పుడు మొహమ్మద్ ఇంటికి కూడా వెళ్ళింది. మొహమ్మద్ కొడుకు, కోడలు ఇటీవలే దుబాయ్ నుండి వచ్చారు వారి నుండి కరోనా సోకినట్లు అధికారులు తేల్చారు.”
“వాస్తవానికి మొహమ్మద్ వాళ్ళు ఇంటి నుండి బయటకి రాలేదు. కాకపోతే పెద్దావిడ ఇంటికి వచ్చిందని ఇంట్లోకి రానిచ్చారు. అదే నూర్ జహాన్ కి శాపంగా మారింది.”
ఇజితిమాలో పాల్గొన్న పది మందికి, ఆ పది మంది ఇళ్లలో ఉన్న వారికి… అలా ఆ వీధిలో మొత్తం ముప్పై మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అధికారులు పులివెందులను రెడ్ జోన్ గా ప్రకటించారు. నూర్జహాన్ నిర్లక్ష్యం, అవివేకం నూర్జహాన్ తో పాటు… ఎంత మంది ప్రాణాలను బలి తీసుకుంటుందో!?.
***