పడమటి సంధ్యా రాగం - : సి హెచ్. వి యస్. యస్. పుల్లంరాజు

Padamati sandhyaragam

పావన్ గంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపటి లో పదవ నెంబర్ ప్లాట్ ఫామ్ కి వస్తోందన్న ప్రకటన వినగానే,కునుకు తీస్తున్నa ప్రయాణీకులందరు గబ గబా లేచి సామానులు చేత్తో పట్టుకొని నుంచున్నారు. అర్థరాత్రి దాటినా విజయవాడ రైల్వేస్టేషన్ వచ్చి పోయే రైళ్ల హడావిడి తో పట్లపగలు లా కళకళ లాడుతోంది. బోగీ సంఖ్య చూసుకొంటూ,సామాన్లు మోసుకొంటూ నడుస్తున్నాడు ప్రశాంత్. చేత్తో బ్యాగ్ పట్టుకుని, వెనుక నే జాగ్రత్తగా నడుస్తోంది అతని తల్లి కామాక్షి. "శాంతమ్మ, సుభద్ర, కృష్ణ కుమారి,భారతి గారు వుండగా నాకేం భయం లేదు. నువ్వుధైర్యంగా వుండు. అయినా ఎప్పట్నుంచో కాశీ చూడాలని వుందని" కొడుకు కి చెప్పి స్నేహితులతో బయలుదేరింది కామాక్షి. ఎక్కే వాళ్లు దిగే వాళ్ళు, సామాన్లుమోసే కూలీలతో, బోగీ అంతా గందరగోళం గా వుంది. బెర్త్ క్రింద సామాన్లు సర్ది ,"మూడు సీట్ల అవతల శాంతమ్మ గారు వాళ్ళు వున్నారు, జాగ్రత్త గా వుండని", చెపుతూ కదులుతున్న బండి లోంచి చకాచకా దిగిపోయాడు ప్రశాంత్. క్రింద బెర్త్ లో పడుక్కొన్న రాజారామ్ ,మంచి నీళ్ళు సీసా తీసి, నీళ్లు త్రాగి,ముసుగు తన్నాడు. లైట్లని ఆర్పేసి నిద్రకందరూ వుపక్రమిస్తున్నారు ఆ ఏసి బోగీ లో. కానీ కామాక్షి పరిస్థితి వేరుగా వుంది. పై బెర్త్ ఎక్కలేక, ఏమి చేయాలో తెలియక నుంచుంది. ఒకవైపు నిద్ర ముంచుకొస్తోంది.మరోవైపు మోకాళ్ళ నొప్పి. ధైర్యం చేసి,నడి వయస్సు లో వున్న, రాజారామ్ కాళ్ల దగ్గర కూర్చుంది. అంతలో అతను లేచి నిలబడి,తలుపు తీసి వాష్బేసిన్ దగ్గర పరుగున వెళ్ళాడు. కామాక్షి భయంతో లేచి నిలబడింది. "ఇక్కడ కూర్చున్నారేమిటి,మీ బెర్త్ ఎక్కడ?" లోపలికి వస్తూ అడిగాడు రాజారామ్. వివరాలు చెప్పింది . "సరే మీరు నా బెర్త్ తీసుకోండి, నేను పైన పడుక్కొంటాను." ఆమె సమాధానం కోసం చూడలేదతను. రైలు కూత పెడుతూ వేగం పెంచింది . నిద్రపోయిన కామాక్షి కీ తెల్లవారు జామునే మెలకువ వచ్చింది . లేచి కాలకృత్యాలు తీర్చుకొని,బెర్త్ మీద పడుక్కొని,ఏదో ఆలోచిస్తూ గతంలో కి దొర్లింది.

******************

ఆదరించే ఇరుగు పొరుగు, స్వంత ఇల్లు, పెన్షన్, గుళ్ళు గోపురాలు వుండడంతో , భర్త లేని దుఃఖాన్ని తక్కువ సమయంలో నే దిగ మింగ గలిగింది కామాక్షి. అప్పుడప్పుడు కొడుకు, కూతురు వచ్చి వెళుతుండేవారు. తమతో బాటే ,తమకు తోడుగా వుండమని బలవంతం చేసినా వాళ్ల మాటలిని సున్నితంగా తిరస్కరించింది. కానీ కొంత కాలానికి, శారీరిక అనారోగ్యం కొడుకు దగ్గరకు చేరేలా చేసింది. అయినా కామాక్షి బాధ పడలేదు. కాని కొడుకు ఇంటి లోని పరిస్థితులు కి సర్దుకోలేక ఇబ్బంది పడుతోంది.

కొడుకూ కోడలు ఉద్యోగస్తులే.ఎవరి గోల వాళ్ళది అన్నట్లు వుంటారు. అత్తగారు వంటింట్లో కాలు పెట్టడం కూడా కోడలికి ఇష్టంవుండదు. అత్తగారి వంటలు కోడలికి నచ్చవు. కోడలికి చరవాణి నెచ్చలి. షాపింగులు, సినిమాలు, సరదాలు, పిజ్జా ల సంస్కృతి కోడలిది. అప్పుడప్పుడు కొడుకు ఏవో ఆఫీసు కబుర్లు, ముచ్చట్లు చెప్పుతూ తల్లి ని సంతోష పెడతాడు. ఆ క్షణాలులో కామాక్షి మనసుపొంగిపోతుంది. కాని ఏదో చెప్పలేని అసంతృప్తి కామాక్షి మనసులో రగులుతూ నే వుంది. పచ్చని పొలాల్లో మధ్య మోడు బారిన చెట్టు లా, నాటకంలో సంభాషణలు లేని పాత్ర రంగస్థలం మీద తచ్చాడు తున్నట్టు గా తనను తాను భావించుకొంటూవుంటుంది. కామాక్షి కి పరిచయం వున్న శాంతమ్మ స్నేహితులు తో కాశీ వెళుతున్నానని కబురు చేసి, అందరూ విజయవాడలో కలిసి ఒకే రైలులో ప్రయాణానికి ఏర్పాట్లు కుడా చేసింది.

******************

"ఏమండోయ్ కామాక్షి గారూ! ఇంకా లేవలేదా, మా కాఫీలు కూడా అయ్యాయి." శాంతమ్మ కంఠం, కంచుగంట లా మ్రోగుతుంటే, గబుక్కున లేచి కూర్చుంది కామాక్షి. "మీ అందరి కంటే ముందుగానే లేచి...." కామాక్షి మాట్లాడుతుంటేనే, శాంతమ్మ అందుకుంది, "పులిహోర, పూరీలు ఏమీ పాడవ్వలేదు. పనిపాటా లేకపోతే ఆకలి కుడా ఎక్కువే సుమా!" కామాక్షి కొంచెం జరిగి, "నిలబడే మాట్లాడుతున్నారు, ఇలా కూర్చొని ...." ఇంకా పూర్తి కాకుండానే శాంతమ్మ అంది, "కూర్చొని తీరికగా కబుర్లు చెప్పడానికి టైమ్ ఎక్కడిది? వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మీరే రండం" టూ తన సీటు వైపు సాగింది. కామాక్షి బ్యాగ్ లోని చరవాణి తీసి కొడుకు కి ఫోన్ చేసింది. కానీ అటువైపు నుండి స్పందన రాలేదు. కాఫీ త్రాగుతుంటే పై బెర్త్ ఆయన గుర్తుకు వచ్చాడు. నిలబడి పైకీ చూసింది. ఆయన ఇంకా నిద్రపోతున్నాడు. ఏమీ తోచక, శాంతమ్మ దగ్గరకి వెళ్ళింది. "రా కామాక్షి!" అంటూ జరిగి, చోటు ఇచ్చింది సుభద్ర. ఆవకాయ పెట్టినప్పుడు, మంచి మామిడి కాయలు, కారాలు దొరకక తాను ఎంత శ్రమ పడిందో, ఎలా ఆ కష్టాలను అధిగమించిందో వర్ణిస్తోంది కృష్ణకుమారి. మనవడి ముద్దుముచట్లు, కూతురి గడుసుతనమనే అల్లుడి మెతకతనాన్ని, గుక్కతిప్పుకోకుండా చెప్పుతోంది భారతి. ఎవరి మాటలు వినాలో తెలియక అందరి కేసి చూస్తూ తలాడిస్తోంది సుభద్ర. అతి కష్టం మీద అక్కడ కూర్చొంది కామాక్షి. ఇంతలో కొడుకు నుంచి ఫోన్. తన సీటు దగ్గరకు వెళుతూ,ఫోన్ మాట్లాడింది. అప్పటికే రాజారామ్ నిద్ర లేచి, కిందకి వచ్చి బెర్త్ మీద కూర్చొన్నాడు. కామాక్షి రాక ని చూసి, కిటికీ వైపు జరిగాడు.

*************

"చాలా థాంక్స్, రాత్రి మీ సీటు ఇచ్చి పుణ్యం కట్టుకొన్నారు." అంది కామాక్షి రాజారామ్ తో. "పరవాలేదు లెండి, ఈ మాత్రం దానికి థాంక్స్ ఎందుకు?" అతని మాటల్లో నిజాయితీ వుంది. "రాత్రి వాంతులు తో బాధ పడినట్లున్నారు, ఇప్పుడెలా వుంది?" మర్యాద పూర్వకంగా అడిగింది కామాక్షి. "వాంతులు తగ్గాయి కానీ అజీర్తి తగ్గినట్లు లేదు, నిన్న రైల్వే స్టేషన్ లో తిన్న ఆహారం తో పొట్ట లో తేడా చేసింది" అన్నాడు.

"మీ కళ్లు బాగా ఎర్రగా వున్నాయి," కామాక్షి అంటుంటే ,"అవును, కొంచెం చలి, జ్వరం అనిపిస్తోంది " అన్నాడు రాజారామ్. "ముందు ఏదయినా, మాత్ర వేసుకోండి." వెంటనే అంది కామాక్షి. చిన్నాగా నవ్వుతూ, "కొద్ది పాటి జ్వరాని కి మాత్ర ఎందుకు? అదే పోతుంది." అన్నాడు. "నిజమే కానీ ప్రయాణాలలో ఆరోగ్యం చాలా ముఖ్యం. నా దగ్గర మాత్రలు వున్నాయి," అంటూ బ్యాగ్ తీసి రెండు మాత్రలు యిచ్చింది ఆమె. "వెంటనే వేయండి, రెండు గంటల్లో తగ్గిపోతుంది" అంది. మోహమాటానికి తీసుకున్నాడు కాని, మాత్ర అవసరం లేదనిపించింది, కానీ అనారోగ్యంతో ప్రయాణం చేయడం మంచిది కాదేమో, మాత్ర వేసుకుంటే నష్టం లేదు కదా అనుకొంటూ మాత్ర వేసుకొని, పైకెళ్లిపడుకొన్నాడు. కామాక్షి బ్యాగులోంచి పూరీలు తీసికొని స్నేహితుల దగ్గర కెళ్లింది. టీవి సీరియల్స్ మీద, అంతర్జాల పెళ్ళి సంబంధాల విశ్వసనీయత మీద వాడివేడిగా చర్చలు నడుస్తున్నాయి. వారి సంభాషణలు వింటూ పూరీలు తింది. కొంచెం సేపయిన తర్వాత సీటు దగ్గర కు వచ్చింది. రాజారామ్ సీటు లో కూర్చుని ఫోన్లో విసురు గా మాట్లాడుతున్నాడు. "నేను ఇప్పుడు మీకోసం అపార్ట్మెంట్ అమ్మలేను,..ఇప్పుడు నాకు డబ్బులు అవసరం లేదని చెప్పానుగా..సరే వుంటా" నంటూ ఫోన్ కట్ చేసాడు. కామాక్షి కేసి చూస్తూ "మీరిచ్చిన మాత్ర బాగా పనిచేసింది, జ్వరం తగ్గింది. థాంక్స్" అన్నాడు నవ్వుతూ. "సంతోషం, మంచిమాట చెప్పారు. ఏమీ తినలేదు మీరు, కొంచెం పులిహోర తింటారా? ఇంట్లో చేసిందే" అంది. "వద్దండీ, మీకెందుకు శ్రమ, యాపిల్ వున్నాయి,చాలు" అన్నాడు. బోగీ లో వున్న ప్రయాణీకులని పరిశీలన గా చూస్తోంది కామాక్షి. కట్టు, బొట్టు, భాష, ఆహారం యిలా ఎన్నో తేడాలు. కానీచిత్రం, అందరూ భారతీయులే.. ఆలోచన లో వుండి పోయింది. ఇంతలో రాజారామ్, "మీరంతా కాశీలో ఎక్కడ వుంటారు?" అడిగాడు. కామాక్షి "నేను కాశీ రావడం ఇదే ప్రధమం,ఆ ఏర్పాట్లులన్నీ శాంతమ్మ గారే చూస్తున్నారు. ఆంధ్రాశ్రమం దగ్గర లో రూమ్ వుందట", అంది. రాత్రి టిఫిన్లు ముగించి అందరూ ముసుగులు పెడుతున్నారు. రాజారామ్, పై బెర్త్ మీద కెళ్లి పడుకొన్నాడు. మాటలు సద్దుమణిగాయి. బోగీ అంతా నిశ్శబ్దంగా వుంది. నగరాలు, నదులు, కొండలు, వనాలు దాటుకొంటూ రైలు పరుగులు పెడుతోంది. ఉదయానికి వారణాసి చేరుకొంది రైలు. శాంతమ్మ స్నేహితులతో, కామాక్షి కూడ జాగ్రత్తగా ఆంధ్రాశ్రమం కి దగ్గరగా వున్న వసతి లోకి అడుగుపెట్టింది. కొడుకు కి, కూతురి కి ఫోన్ చేసి, ప్రయాణ విశేషాలు చెప్పింది కామాక్షి.

***************

సాయంత్రం విశ్వేశ్వరుడి దర్శనానికి కి బయలుదేరు తుంటే, "మీ మంగళసూత్రాలు, గాజులు, పర్సులు జాగ్రత్తగా గా చూసుకోండి. చెప్పులు వేసుకోవద్దు...." శాంతమ్మ సూచనలు చేసింది. సాక్షి గణపతి, డుంఠి గణపతి ల దర్శనం చేసుకొని, విశ్వనాథ మందిరం వైపు నడిచారు. గుడి పరిసరాలు జనం తో కిటకిటలాడుతుంటే,భారీ బందోబస్తు మధ్య భక్త్తులు దర్శనం చేసుకొంటున్నారు. కామాక్షి జాగ్రత్తగా సుభద్ర ని,కృష్ణకుమారి ని గమనించుకొంటూనే నడుస్తోంది. కానీ ఏమి జరిగిందో తెలియలేదు కామాక్షి కి. దర్శనమయ్యి, గుడి నుండి బయటకు వచ్చి చూస్తే, చేతిలో పర్సు లేదు. శాంతమ్మ, భారతి ఎవ్వరూ కనబడలేదు. వాళ్లు ఎక్కడ కి వెళ్లారో, ఎలా వెళ్ళారో తెలియదు. ఎవరినైనా అడుగుదామంటే భాష రాదు ఆమె కి. గుండె దడ దడ లాడుతుంటే, కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే, పిచ్చి దానిలా, వచ్చిపోయే జనాల వంక చూస్తోనిలబడింది. "ఇక్కడ నిలబడ్డారేమిటి? ఏమయ్యింది మీకు? ఏదైనా సమస్యా" చెప్పండిఅడుగుతున్నాడు రాజారామ్. ఆమెకు ఒక క్షణం నోట మాట రాలేదు. కొంచెం తమాయించుకొని, "మీరా రాజారామ్ గారు! బతికించారు. నాకు ఎంత భయం వేసిందో, మా వాళ్లంతా..." జరిగిందంతా చెప్పింది కామాక్షి. "ఇంతేనా, ఏమీ భయపడకండి, ఒకొక్కసారి ఆలా జరుగుతుంటాయి. ఏమి చేస్తాం. స్వామి దర్శనం చేసుకొన్నారు గా, సంతోషం గా వుండండి". ధైర్యం చెప్పాడు రాజారామ్. "సరే, మిమ్మల్ని రూమ్ దగ్గర వదిలి పెట్టనా?" అడిగాడు. ఏమిచేయాలో, ఏమి చెప్పాలో కామాక్షి కి పాలుపోలేదు. ఒక నిమిషం తర్వాత రాజారామ్ అన్నాడు, "ఇక్కడి కి దగ్గర లో దశాశ్వమేధాఘాట్ వుంది. గంగాహారతి జరుగుతుంది అక్కడ. చూస్తారా, చాల బాగుంటుంది. ఆ తర్వాత రూమ్ కి వెళ్ళచ్చు."

"సరే, నడవండి, రూమ్ కి వెళ్లి చేసే పనేమీలేదు నాకు. కానీ…" అంది అనుమానంగా. "మీకు, ఆ సందేహం వద్దు, మీ వాళ్లలా మధ్యలో మిమ్మల్ని వదిలేసి..." ఇద్దరూ నవ్వు కొన్నారు. రాజారామ్ కొన్ని అరటిపండ్లు కొని, రోడ్డు మీద వున్న ఆవులకు పెట్టాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత, స్వీట్స్ షాప్ లోకి వెళ్లి, స్వీట్లు కొని, ఆ రోడ్డు మీదున్న బిచ్చగాళ్ల కి పంచాడు. ఘాట్ లో దిగి కాళ్లు కడుగుకొని మెట్ల మీద కూర్చొన్నారు. వృద్ధాప్యం ఛాయా లా నీరెండ పరుచు కొంటోంది మెట్ల మీద. కెమెరాలలో, విదేశీ యాత్రకులు అక్కడిదృశ్యాలని దాచుకొంటున్నారు. జనాలతో ఆ ప్రాంగణం కిక్కరిసి పోతోంది హారతి కి వచ్చిన భక్తులు కొందరునది లో దీపాలు వదలి గంగమ్మకు ప్రణమిల్లుతున్నారు. నది లో పడవలు నెమ్మదిగా సాగుతున్నాయి. "దూరంగా ఏవో మంటలు కనబడుతున్నాయి. ఏమి జరుగుతుందో..." అడిగింది కామాక్షి ఆందోళనతో. "అది మణికర్ణికా ఘాట్. నిత్యం, రాత్రి పగలు శవ దహనాలు జరుగుతూనే వుంటాయి అక్కడ. చుట్టుప్రక్కల వూళ్లనుండి కూడా శవాల్ని తెచ్చి, దహనం చేస్తారు. ఆ జీవులు కి ఇక జన్మలేవుండవని విశ్వాసం". రాజారామ్ చెప్పిన విషయాల ని శ్రద్ధగా వింది కామాక్షి. చల్లని గాలుల మధ్య, సుందరంగా అలంకరించిన వేదిక ల మీద అందమైన వస్త్రాలు ధరించిన యువకులు, హారతులు కి సిద్దమవుతున్నారు. పవిత్ర వాతావరణం లో, గంగాహారతి గీతం వీనులవిందు గా ప్రారంభమైయ్యింది. ఆ సుందర దృశ్యాన్ని మొదటి సారి గా చూస్తూ పులకరించిపోయింది కామాక్షి. ఇద్దరూ బయలు దేరారు. రాజారామ్ వెనుకే నడుస్తోంది కామాక్షి. "రేపు ఎక్కడి కి వెళతారు?" అడిగింది కామాక్షి. "అజీర్తి ఇంకా తగ్గినట్టు లేదు.ఎక్కడికి వెళ్లాలనిపించడం లేదు. ఉదయం కేదార్ నాధ్ ఘాట్ లో స్నానం చేసి గుడి లొనే వుంటాను, వస్తే మీరూ రండి", అన్నాడు.

************

శాంతమ్మ, నాలుగు రోజులు పాటు నైమిశారాణ్య యాత్ర కు నిర్ణయించింది. మోకాళ్ళ నొప్పితో కారులో అంత దూరప్రయాణం చేయలేనని చెప్పి కాశీలో నే వుంటానంది కామాక్షి. ఉదయ మే నారదా ఘాట్ లో స్నానం చేసి, కేదార్నాథ్ మందిరానికి చేరుకొంది కామాక్షి. రాజారామ్ గుడి మండపంలో ఒక స్తంభానికి ఆనుకొని కూర్చొన్నాడు. ఇద్దరూ కలిసి రోడ్డు మీద కి వచ్చారు. యధాలాపంగా, అతని వంక చూసి, ఆశ్చర్యం తో, "మీ కళ్ళు బాగా ఎర్రగా వున్నయే, మొహం చాలా నీరసంగా కనిపిస్తోంది? డాక్టర్ ని సంప్రదిస్తే మంచిదేమో చూడండి" అంది అభ్యర్ధనగా. "నిజమే, మీరన్నది, ఏమీ తినాలని, త్రాగాలనిపించడం లేదు. నీర్సంగా కుడా వుంది" అన్నాడు రాజారామ్. ఆ మాటల్లోకొంతనిరాశ ధ్వనించింది ఆమెకు. అంతలో ఒక ఆటోరిక్షా రాక ని గమనించి, ఆగమన్నట్లు సంజ్ఞ చేసింది కామాక్షి. అటో అగర్వాల్ వైద్యశాల ముందు ఆగింది. రాజరామ్ ని పరీక్ష చేశాడు డాక్టర్. చకాచకా వైద్యం నడుస్తోంది. ఒళ్లు తెలియకుండా నిద్రపోతున్న రాజారామ్ ని చూసి, కామాక్షి కి జాలి వేసింది. సాయంత్రం మెలకువ వచ్చింది అతనికి. ఎదురుగా కామాక్షి స్టూల్ మీద కూర్చొని వుంది. ఆమె ను అలా చూసి, ఏదో మాటకు అందని భావావేశాని కి లోనయ్యాడు రాజారామ్. మంచం మీద నుంచి లేచి బిల్లింగ్ కౌంటర్ వైపు వెళుతున్న రాజారామ్ ని చూసి మనసులో నే విశ్వనాధుడి కి దండం పెట్టుకొంది కామాక్షి. ఆసుపత్రి నుంచి వచ్చిన ఆటో, కేదార్నాథ్ గుడి దగ్గర లో ఆగింది. కామాక్షి, రాజారామ్ ఎవరి బస కు వాళ్ళు చేరుకున్నారు. సమయం రాత్రి ఏడు గంటలు దాటింది. జోరువాన, ఈదురు గాలులు, మెరుపులు తో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బయట నుంచి ఎవరో తలుపులు గట్టిగా బాదుతున్నారు. తలుపు చప్పుడు కి ఉలిక్కిపడి,లేచి , లేని ఓపిక తెచ్చుకొని ,తలుపు తీసాడు రాజారామ్. కొంగుచాటు లో దాచిన,వేడి వేడిఉప్మా పాకెట్ ని, అతని చేతిలో పెట్టి, వెనక్కి తిరిగి మెరుపులా మాయమయ్యింది కామాక్షి. ఊహించని సంఘటన కి, ఖంగుతిని, కాసేపు కొయ్యబొమ్మలా తలుపు దగ్గరే నిలబడి పోయాడు రాజారామ్.

*************

మంచం మీద పడుకొన్న రాజారామ్ కి, జరిగిన సంఘటన పదే పదే గుర్తుకు వచ్చింది. కామాక్షి, మోకాళ్ళ నొప్పి ని లెక్కచేయకుండా, భయంకర వర్షం లో, తడిసి ముద్దయ్యి,రూమ్ కి వచ్చి, ఉప్మాపాకెట్ ని తనకి ఎంతో ఆత్రంగా ఇచ్చిన వైనం. నిజానికి రాజారామ్ కి కామాక్షి వ్యక్తిత్త్వాన్ని తలుచుకుంటుంటే, చెప్పలేని సంతోషం, సంభ్రమం కలిగాయి. వెంటనే ఆలోచనలు చుట్టుముట్టాయి. మరి తన కొడుకుల సంగతి. విదేశాల్లో వున్నారు, కాదు అక్కడే వుండి పోతారు. ఎప్పుడో ఆరు నెలల కి ఒకేసారి, వాళ్లకిచనిపోయిన తల్లి , యింకా బ్రతికున్న తండ్రిజ్ఞాపకం వస్తారు. కొడుకులు ఫోన్ చేస్తారని ఎంతో ఆత్రంగాఎదురు చూసిన తండ్రికి నిరాశే మిగులుతుంది.

"నాన్న ఎలా ఉన్నావ్, ఆరోగ్యం ఎలా ఉంది?" ఆ మాటలేచోటుచేసుకోవు. "నీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత వుంది? నీకు ఎంత కావాలో చెప్పు?'" ఆ మాటలు వింటూనేఆనందంఆవిరయివుతుంది. ఇక కూతురు, ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది ఆమె గురించి. తల్లి చనిపోయిందని వార్త తెలిసి విదేశాల్లో వున్న కొడుకులు,కోడళ్ళు, మనవళ్లు ఆదుర్దా గా వచ్చారు. కానీ, అదే వూరు లో వున్న కూతురు, తనకి తల్లి కి చెందిన భూమి , బంగారం యిస్తామని అన్నలు,తండ్రి,మాట యిస్తేనేవస్తాననిపేచీ పెట్టింది. తన దుస్థితి కి తన మీద తన కేజాలి వేసింది రాజారామ్ కి. కానీ, కామాక్షి?ఒక అమృత మూర్తి. ఆమె లోని నిస్వార్ధప్రేమ, సానుభూతి మాటలకు అందవు. ఆ సుగుణాలే ఆతని మస్తిష్కం లోఒక చిత్రమైనతుఫాను సృష్టించాయి.

రోజంతా విశ్రాంతి లేకపోవడం, ఆహారం తీసుకోకపోవడం, వర్షం లో తడవడంతో, కామాక్షి బాగా అలసిపోయింది. స్వామి ఆశ్రమం నుండి తెచ్చుకున్న ఉప్మా తిని, నిద్రపోయింది. సాటి మనిషి కి కష్ట సమయం లో, ఎంతో కొంత సహాయం చేయగలిగానన్న తృప్తి, సంతోషం తో గాఢ సుషుప్తి లో మునిగిపోయింది ఆమె.

***********

భాగవత సప్తాహం, చూసుకొని వస్తామని, ఇప్పుడిప్పుడే రాలేమని, శాంతమ్మ ఫోన్ చేసింది కామాక్షి కి. నిజానికి, కామాక్షి కి రాజారామ్ సాంగత్యం, స్నేహం ఎంతో సంతోషం కలిగిస్తోంది. అతని సమక్షంలో ప్రపంచం కొత్త గా, సుందరంగా కనిపిస్తోంది. అతని మాటల్లో చిత్రమైన మంత్ర శక్తీ ఆమె ను కట్టిపడేస్తుంది. ఇప్పుడు కొడుకు, కోడలు,కూతురు,తన ఇల్లు, వూరు, అక్కడి మనుషులు,ఆ జ్ఞాపకాలను అన్నింటినీ మరిచి పోతోంది. రాజారామ్ పరిస్థితి కూడా ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు. మాటలకి అందని ఆనందం అతని కికామాక్షి ని చూస్తే. ఆమె లోని, ప్రకృతికాంతఅందాలు, స్త్రీ సహజ మైన లాలిత్యం,కరుణ తో బాటు సున్నితమైన హావభావప్రకటనఇలా యెన్నో అంశాలు అతని మనస్సు లో ముద్రితమయ్యాయి. ఒకరి స్నేహహస్తాన్ని మరొకరు ఆప్యాయంగా అందుకొంటున్నారు. కానీ ఇంతకాలం గుంభనంగా,గంభీరం గా వున్నారు.. మాట్లాడుకోవలసిన సమయం రానే వచ్చింది. అందుకు కారణం, శాంతమ్మ స్నేహితులతో కాశీ తిరిగి వచ్చింది. తిరుగు ప్రయాణ ఏర్పాట్లు లోవుంది.

**************

నదిలో పడవ నెమ్మదిగా నడుస్తోంది. కామాక్షి, రాజారామ్ పడవకి చెరో వైపు కూర్చొన్నారు. "నాకు ఒక సందేహం కలుగుతోంది" అంది కామాక్షి. "వయస్సు లో వున్న ఆడపిల్ల, మగ పిల్లాడు, ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులై, కలిసి జీవించాలనుకొంటేతప్పు కాదు. కానీ... జీవిత చరమాంకం లో వున్న మన ఇద్దరి బంధం..." కామాక్షి ఆగిందిఆర్ధోక్తి గా. తల వంచుకొని వింటున్న రాజారామ్ తల పైకెత్తి చూసి."భౌతిక వాంఛల పునాదులు పై ,ఆర్థిక అవసరాల సాధన కోసం,సంతానం కోసం మన స్నేహ సౌధాన్నినిర్మించుకోవడంలేదు", ఒక క్షణం ఆగాడు రాజారామ్. వెంటనే కామాక్షి అంది."అవును,నిజమే,కానీ మనమిద్దరం ఒకరి సాంగత్యాన్ని ,సహచర్యాన్ని మరొకరు ఎందుకు కోరుకొంటున్నాము? ఇద్దరి మనసుల్ని కలుపుతున్న సూత్రం ఏమిటి? సమాజం అంగీకరించే జీవన విధానమా ఇది?హృదయసముద్రం లో ఎగసిఎగసి పడుతున్న వేదనా కెరటాల్ని,, తన అంతర్మథనాన్ని ఆవిష్కరించింది. ఉద్రేకం గా. కన్నీటి బిందువులు జలజలా రాలిగంగ లో పడ్డాయి. ఒక్క క్షణం మౌనం తర్వాత రాజారామ్, కామాక్షి దగ్గరగా వచ్చి చెప్పాడు, "పిల్లల కి పెళ్ళి ళ్ళు చేసాం, ఎవరికుటుంబం వాళ్ల కి ఏర్పడింది. హోదా మారి తల్లులు లేదా తండ్రులు అయ్యారు. బాధ్యతలు పెరిగాయి వాళ్లకు. వాళ్ళ జీవితం వాళ్ళది. అక్కడ అతిధుల మే మనం. ఇకమనం,జీవిత రంగస్థలం మీద, నటన ముగిసిన, సంభాషణలు లేని పాత్రలమే. ఎందుకంటే మన పాత్రలకి ముగింపు పలుకుతాడు దర్శకుడు. ఇక్కడ మన సంగతి కి వస్తే, పిల్లల కుటుంబాలతో కలిసి వుండడం వల్ల, అక్కడ కోల్పోయిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యo, గౌరవం, తృప్తి ఇక్కడమనకు లభించాయి. మనజీవితాలన్ని మనకి కావల్సిన విధంగా గడుపుతున్నాం. ఇక్కడ అవమానాలు, అనుమానాలు ,ఉద్రిక్తతలు, ఛీత్కరాలు, సాధింపులు కనిపించవు, వినిపించవు. బాంధవ్యాల బందీలు కాము. సమాన వయస్కు ల్లో వుండే భావావేశాలు, ఆలోచనలు, ఇష్టాయిష్టాలు, పరస్పర సహకారం ,వంటి అనేక అంశాలు మన మనసుల్నిదగ్గరగాచేసి, పెనవేసి ఒకటి చేసాయి...". శాంత గంభీరంగా సాగిన ఆ వాక్ప్రవాహంలో, పూల పడవ లా తేలిపోయిందికామాక్షి. నదీ వేగానికి, పడవఒక్కసారి కొంచెంఒక వైపు ఒరిగింది. భయపడిన కామాక్షి తూలి, రాజారామ్ ని గట్టిగా పట్టుకొంది. గాలికి రేగిన ముంగురులను సవరించుకొంటూ,సమాధానం పూర్తి కాలేదుగాఅన్నట్లు చూసింది. "సమాజంలో జరుగుతున్న మార్పులు చేర్పులు అందరూ ఆమోదించాలని నియమం ఎక్కడా లేదు. ఎవరి జీవితం వారిది.కానీ చట్ట విరుద్ధంగా ఎవరూ. నడుచుకోకూడదు." ఆగి ఆమె కేసి చూసాడు. కామాక్షి తల వంచుకుని చాలా నెమ్మదిగా అంది, "మనలో ఎవరో ఒకరు, చెప్పా చేయకుండా గడప దాటి, మణికర్ణికాఘాట్ కి...'' ఆమె గొంతు మూగ బోయింది. ప్రశ్న పూర్తి కానీకుండాఆమె నోటిమీద చెయ్యి వేసాడు. సమయమే సమాధానం ఇస్తుంది అన్నట్లు చూసాడు. పడవ తీరం చేరింది. ఇద్దరూ జంటగా నడుస్తున్నారు. "మీ గది చూడవచ్చా?" కామాక్షి అడిగింది. రాజారామ్ అన్నాడు,"లోపలికి వచ్చి మా ఆతిధ్యం కూడా స్వీకరించవచ్చు,అభ్యంతరం లేకపొతే." నవ్వుతూ. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా "నేనూ మీతో కాశీ వాసం చేస్తాను"అంది కామాక్షి.

***********

పడమటి సంధ్యారాగం లోకొత్త కోక చుట్టు కొంటోంది ప్రకృతి. ఎర్రటి బొట్టు పెట్టుకొని, తెల్ల మబ్బుల మల్లెలు సింగారించుకొంది. ఒకరి చేతులు మరొకరు అపురూపం గా పట్టుకొని, మందిరం లో గౌరీ కేదార్నాథ్ ల దర్శనం చేసుకొన్నారు. రాజారామ్ మెడలోని, స్వర్ణ పులిగోరు పతకం ఆమె కంఠాభరణంగా మారింది. పావవ గంగా జలాన్ని తలల పై జల్లుకొని, ఘాట్ మెట్ల మీద పక్కపక్కనే కూర్చొన్నారు కామాక్షి రాజారామ్ లు. వీనులవిందు గా ఘంటా నాదాలతో గంగాహారతి ప్రారంభమయ్యింది. హారతులందుకొంటూ, గట్టున ఆశీనులయిన పార్వతీపరమేశ్వరులను, క్రీగంట గమనించి, మందగమనం తో గంగమ్మ సాగుతోంది మణికర్ణికాఘాటు వైపు.

*************

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు