“అమ్మో…,! అమ్మో…,! నాయనా.., దేవుడా…, పిల్లగాడు బండి కింద పడినాడు తల్లీ… నీ దూం తగిలిపోను ముదనష్టపు నాయాల చూసుకొని నడిపి సావచ్చు కదా… పిల్లోన్ని చంపేస్తివి.”
అంతలోనే జనమంతా పోగైనారు. బండి నడిపెటోన్ని తలా ఒక తిట్టు తిట్టినారు. సాకలి గంగరాజు… బండి బీగంచెవులు లాక్కున్నాడు. పిల్లోనికి ఏమైనాఅయితే… నీ కథ చెప్తా నాకొడక అంటూ… తిట్ల పురాణం ఎత్తుకున్నాడు.
“చెర్రీ… చెర్రి… కళ్ళు తెరుసు నాయన ఏమైంది?” ఒమ్మే సుస్మిత…, గలాసుతో కొన్ని నీళ్ళు తీసుకురా… పిల్లోడు కళ్ళు తెర్సడం లేదు.
సుస్మిత వచ్చేలోపు చెర్రి గాని కాళ్లు, చేతులు, శరీరం మొత్తం చూసాను. ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని…,దెబ్బలేమి తగలలేదు. మరి కళ్ళెందుకు తెర్సడం లేదో! భయమెత్తుకుంది.
ఎడమ భుజం దగ్గర చొక్కా చినిగిపోయింది. భుజం దోక్కపోయి రక్తం వస్తాంది. చీర కొంగు చింపి ఒత్తుగా కట్టు కట్టినాను. రక్తం ఆగడం లేదు… గుడ్డ కూడా నానిపోయింది. అంతలోనే పరిగెత్తుకుంటూ… చెర్రి వాళ్ల అమ్మ… ప్యారి వచ్చింది.
“ఏమైంది పిల్లగానికి? ఎవడు? నా పిల్లోన్ని ఇట్టా చేసింది? అంటూ కేకలు పెట్టింది.” ఇంతలోనే సుస్మిత నీళ్ళు తెచ్చింది. చెర్రి గాని ముఖంపై నీళ్ళు గుమ్మరిచ్చగానే రెండు నిమిషాల్లో కళ్ళు తెర్సినాడు. అమ్మయ్య… అని ఊపిరి పీల్చుకుంటి.
కళ్ళు తెరుస్తానే వాళ్లమ్మ దగ్గరకి కాకుండా… నా ఒళ్లోకి చేరుకున్నాడు. ఇటు రారా… అని ప్యారి… బతిమిలాడినా వాళ్ళమ్మ దగ్గరికి పోలేదు. భుజం నుండి రక్తం వస్తానే ఉంది. నా మనసు ఉండబట్టలేక వెంటనే రోడ్డు మీద పోతున్న ఆటో ఆపి… ఆసుపత్రికి తీసుకుపోయినాను. నా వెంటే ప్యారి, గంగరాజు, బండి నడిపినోడు, వీధిలో ఇంకో ఇద్దరు కూడా వచ్చినారు.
ఏమీ ఫర్వాలేదు చిన్న గాయమేనని… గాయానికి కట్టు కట్టింది డాక్టరమ్మ. ఒక సూది వేసి మందు బిళ్ళలు రాసిచ్చింది. డబ్బూ… బండివాడే కట్టినాడు. అప్పటికే గంగరాజు వాని వివరాలన్నీ… అడిగి తెలుసుకున్నాడు. ఏమైనా అవసరం అయితే ఇంటి కాడికి వస్తానని చెప్పి వదిలేసాడు.
చెర్రిని ఇంటిని తీసుకొచ్చినాము కాని… వాడేమో వాళ్లింటికి పోనని మారం చేసినాడు.
ప్యారీ… పిల్లోడు నా దగ్గర అలవాటు పడినాడు కదా! కొంచేపు మా ఇంట్లో ఉండి పోదువులే అన్నాను. తను కూడా సరే అని మా ఇంటికి వచ్చింది. సాయంత్రం వరకు ఉండి… ఇక మన ఇంటికి పోదాం పదా నాయన అంటే గొంగేలు పెట్టి ఏడ్వడం మొదలుపెట్టినాడు. చేసేది లేక ప్యారి కూడా మా ఇంట్లోనే పడుకుంది. మరుసటి రోజు కూడా చెర్రి పోడానికి ఇష్టపడలేదు. అలా నా దగ్గరే ఐదు రోజులు గడిచాయి. ప్యారి బంధువులు కూడా… మా ఇంటికే వచ్చి పిల్లోన్ని చూసి పోతాండారు. పది రోజుల తర్వాత చెర్రికి బాగైంది.
చెర్రికి ఆరేళ్లు ఉంటాయి. నా మనవరాలితో ఆడుకోడానికి మా ఇంటికి వస్తూ ఉంటాడు. అలా అలవాటు పడిన వాడిని ఎంతో ప్రేమగా చూసుకునేదాన్ని. దాదాపుగా పగలంతా నా దగ్గరే ఉండి… రాత్రి నిద్రపోడానికి ఇంటికి పోతాడు. ఇరవై ఇళ్ళు ఆ పక్క చెర్రి వాళ్ల ఇల్లు. పూర్తి పేరు చాంద్ బాష అయితే… నేను చెర్రి అని పిలుచుకుంటాను.
“మేము సాకలోల్లము. చెర్రి వాళ్ళు తురకోల్లు. అయినా మాకి అలాంటి తేడాలు ఏమి లేవు. ప్యారి కూడా నా కులం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. పెద్దమ్మా…అని ప్రేమగా పిలుస్తుంది. చెర్రి గాడేమో జేజి… జేజి… అంటూ నేనంటే పానం తీసుకుంటాడు.”
***
ఉన్న ఇల్లు అమ్ముకొని పెద్ద బిడ్డ పెళ్లి చేసినాను. ఇంక ఆ వీధిలో మాకు చోటు లేదు. ఊరి బయట అద్దె కొంపకు మకాం మార్చినాను. నాతో పాటే నా పెద్ద కొడుకు వచ్చినాడు. చిన్నోడు మాత్రం వేరు పోయినాడు. నాకు చేతులు, కాళ్లు సరిగా ఆడటం లేదు. చాకరేవుకు పోవడం, ఇంట్లో ఇస్తిరి చేయడం మానేస్తి. పెద్దోడే నన్ను చూసుకుంటున్నాడు.
“నా పెద్ద కొడుకు చెడ్దోడు కాదు కాని ఆదాయం తక్కువ. పూట గడవడమే కష్టం. ఒక పూట తిని మరో పూట తినక… అలానే పస్తులు ఉండటం అలవాటైపోయింది.”
చూస్తుండగానే… ఇరవై ఏళ్లు నడిచినాయి. వయసు మీద పడింది. అప్పుడప్పుడు చెర్రి గాడు బాగా గుర్తు వస్తూ ఉంటాడు. ఆ వీధి వదిలి వచ్చిన తర్వాత… నేనే ప్యారి ఇంటికి పోయి చెర్రి గానితో కాసేపు గడిపి వస్తూ ఉంటి. ఆ తర్వాత వాడి చదువుల కోసం ప్యారి ఊరు వదిలి వెళ్ళిపోయింది. హైదరాబాద్ లో ఉంటున్నారని చెర్రి వాళ్ల అవ్వ ఒకసారి చెప్పింది.
ఈ మధ్య ఇస్లాంపురం ఉర్దూ స్కూల్ లో ముసిలోల్ల పింఛన్ ఇస్తున్నారు. ప్రతి నెల ఆటోలో ఆడికే పోయి పింఛన్ తెచ్చుకుంటున్నా. ఈ నెల కూడా పింఛన్ తెచ్చుకోడానికి పోయి అక్కడే లైన్ లో నిలుచున్న రెండు గంటలు అయితైంది… నా వేలి ముద్రలు పడటం లేదని పింఛన్ ఇచ్చే ఆమె అట్టే కుచ్చోపెట్టుకుంది.
నెల నెలా ఈ పీడ ఏందిరా? దేవుడా…! అనుకుంటూ ఉండగా ఓ పెద్ద కారు వచ్చింది. అందులో నుండి ఒక ముసలామెను దింపుతున్నాడు ఇరవై ఐదేళ్ల పిల్లోడు. వాణ్ణి చూస్తే అచ్చం చెర్రి లాగానే ఉన్నాడు. ఎవరో లే… అని గమ్ముగా ఉండిపోయినాను.
‘ఆ ముసలామె నా దగ్గరకు వచ్చి… ఏం బీబి…? ఎలా ఉన్నావు? ఎక్కడ ఉంటున్నావు? ఈ మధ్య కనిపించడం లేదే అని అడిగింది.’
‘నేను కనుక్కోలేక పోయాను.’
‘నేను… చెర్రి వాళ్ల అవ్వను అని చెప్పింది.’
‘అక్కా…, చత్వారి వచ్చి సచ్చింది. ఎవరూ సరిగా కనపడరు.’ ఈ పిల్లగాడు అంటూ తన వైపు చూసాను. చెర్రి తమ్ముడు అని చెప్పింది. అవునా… అని పలకరించాను. నా పరిస్థితి మొత్తం చెప్పుకొని ఎడ్సినాను.
“చెర్రి రాలేదా.?”
లేదు… లేదు… వాడు ఈ ఊరికి రాడు. వచ్చినా… ఒకరోజు కంటే ఎక్కువ ఉండడు. ఇప్పుడు చెర్రి వాళ్లు బెంగళూరులో ఉంటున్నారు. చెర్రి ఉద్యోగం చేస్తున్నాడు తెలుసా…! నెలకు రెండు లక్షలు జీతం అనగానే… కడుపు సల్లపడింది.
ప్యారి నానా కష్టాలు పడి పిల్లోళ్లను చదివించింది. పోనీలే ఇప్పటికైనా బాగు పడింది అనుకున్నాను. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే చెర్రి వాళ్ల అవ్వను పింఛన్ ఇయ్యడానికి పిలిచారు. డబ్బులు తీసుకొని పోయి వస్తానని చెప్పి… ఎల్లిపోయింది.
***
ఏమైందో ఏమో? ఐదు నిమిషాల ముందు పోయిన కారు మళ్ళీ వచ్చింది. కారు దిగి ఇద్దరు పిల్లోళ్లు నా వైపుకే నడుచుకుంటూ వస్తాన్నారు. నా కళ్ళు మసక మసకగా అయిపోయినాయి. నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు ఊరినాయి. ఆ పిల్లోడు చెర్రి లాగే ఉన్నాడు. కాని ఇందాకే చెర్రి వాళ్ల అవ్వ చెప్పింది కదా…! చెర్రి రాలేదని. ఎవరో లే అనుకుంటున్నా కాని… వాళ్ళిద్దరూ నా దగ్గరికి నడుస్తుంటే మనసు బరువెక్కుతోంది. కాళ్లు, చేతులు ఆడటం లేదు. కళ్ళు తిరిగినట్లు అనిపించింది.
ఇంకా కొద్దిగా దూరంలో ఉండగానే జేజి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను లేవబోయే లోపు వచ్చి నా కాళ్ల మీద పడ్డాడు.
“లే నాయన లే… నువ్వు కారు దిగి వస్తున్నప్పుడే… నా చెర్రిగానివే అనుకున్న. నా బంగారు కొండ ఎంతోనివి అయిపోయావు. రా.., రా.., ఇదో ఈడ కుచ్చో. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందో! నిన్ను చూసి… ఇక చూస్తానో… లేదో? అనుకున్నాను.”
‘ఎట్లుండావు జేజి? నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు?’
‘నేను బాగానే ఉన్నాను లే నాయన. వయసు మీద పడింది. నొప్పులు మామూలే. కళ్ళు కనపడవు. ఇదో… నెల కొకసారి పింఛన్ కోసం తప్ప… బయటకే రాను’
‘అవ్వ…. నువ్వు రాలేదని చెప్పిందే!?.’
‘అది వదిలై గాని… ఏమి నీకు పింఛన్ ఇవ్వడం లేదంటా! ఏమైంది? పద నేను అడుగుతాను అంటూ నన్ను లోపలికి తీసుకుపోయాడు.’
ఎడా… పెడా… ఇంగిలీసులో ఏదో మాట్లాడినాడు. అక్కడి వారంతా గప్ చుప్ అయిపొయినారు. ఈ ముసలి దాని కోసం ఎవరబ్బా? ఇంత పెద్ద కారులో వచ్చినారు అంటూ గొణుగుడు వినిపించింది. చెర్రి రెండు నిముషాలు మాట్లాడినాడో లేదో… నా వేలిముద్ర కాగితంలో వేయించుకొని…పింఛన్ ఇచ్చినారు.
చెర్రి ఇంగిలీసులో మాట్లాడుతుంటే… నా మనసు గాలిలో తేలిపోయింది. బుడ్డ… బుడ్డ… మాటలు మాట్లాడేటోడు ఏమి మాటలు నేర్చినాడు!. నా బిడ్డ వజ్రం అనుకున్నాను. పింఛన్ తీసుకొని కారులో నన్ను ఇంటి కాడికి తెచ్చినాడు. వీధిలో అందరూ నోర్లు వెల్లబెట్టి చూసినారు. ఈ వీధిలోకి ఇంత పెద్ద కారు ఎవరిది? ఈ అనామక ముసిలిదాన్ని కారులో ఎందుకు తెచ్చినారు? అని వాళ్ల సందేహం.
కారు దిగి ఇంట్లోకి పోయినాను. చెర్రి కూడా ఇంట్లోకి వచ్చి మంచం మీద కూర్చొన్నాడు.
నీ గురించి అవ్వ చెప్పింది జేజి. నువ్వు ఉర్దూ స్కూల్ లో ఉంటావో… లేదో…? అనుకుంటూ వచ్చినాను. ఎలాగో ఉన్నావు. ఎలా ఉండే దానివి! ఎలా అయిపోయావు? అంటూ చెర్రి మాట్లాడుతుంటే అలా వింటూనే ఉండిపోయాను. ఇంతలో చెర్రికి మాడికాయ ఊరిబిండి అంటే ఇష్టమనే సంగతి గుర్తు వచ్చింది.
‘వేడి వేడి అన్నం, మాడికాయ ఊరిబిండి చేస్తాను… అన్నం తిని పోదువులే నాయనా?’
‘లేదు… లేదు.. జేజి ఇంకో రెండు గంటల్లో… బెంగళూరుకి బయలు చేరుతాను. టైం లేదు లే.’
‘మళ్ళీ ఎప్పుడు వస్తావో! ఏమో!? నా చేతి అన్నం… తినే పోవాలి.’
‘సరే అన్నాడు.’
భోజనం చేసిన తర్వాత పోతూ పోతూ… నా ఫోన్ నెంబర్, ఎకౌంటు నెంబర్ తీసుకున్నాడు. చేతిలో యాభై వేలు పెట్టి కళ్ళు కనపడటం లేదన్నావు కదా…! ఆసుపత్రికి వెళ్లి చూపించుకో. నేను బెంగళూరు వెళ్ళగానే ఫోన్ చేస్తాను. నీ ఫోన్ లో…నా నెంబర్ సేవ్ చేసి పెట్టినాను. నీకు ఏదైనా అవసరమైతే… ఒకటి నెంబర్ ని గట్టిగా ఒత్తి పట్టుకుంటే… నాకు ఫోన్ వస్తుంది.
నాకెందుకు నాయన? ఇంత డబ్బు. రేపూ… మాపో… పోయేదానికి కళ్ళు కనపడితే ఎంత? కనపడకపోతే ఎంత?. ఈ డబ్బును నీ దగ్గరే ఉంచు… నీకేమైనా అవసరాలు ఉంటాయి.
జేజీ… చెప్పిన మాట విను. నా అవసరాలకు ఉన్నాయి కాని… నువ్వు వెంటనే రాజారెడ్డి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకో, అక్కడ భాస్కర అన్న ఉంటాడు. ఆయనకి నేను ఫోన్ చేసి చెప్పినాను. అన్నీ… ఆయనే చూసుకుంటాడు.
గట్టిగా కౌగిలించుకొని… నీ మనసు వెన్న ముద్దా రా… అని ఎడ్సినాను. ఏంది జేజి ఇది… చిన్న పిల్లదానివా? ఎడ్చాకు… నేను వెళ్లొస్తాను, రేపు ఫోన్ చేస్తాను లే. నెల… నెలా… ఐదు వేలు ఎకౌంటులో వేస్తాను… ఖర్చులకు ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోయాడు.
***