వినోద్ 10వ తరగతి చదువుతున్నాడు. చదువులో ఎప్పుడూ వెనుకబడేవాడు. సినిమాల పిచ్చి బాగా ఉండేది. తన అభిమాన నటుని సినిమా వస్తే బడికి ఎగనామం పెట్టి మరీ సినిమా చూసేవాడు. మరునాడు స్నేహితులకు ఆ సినిమా కథ చెప్పేవాడు. నోట్ బుక్సులో తన అభిమాన సినిమా హీరో బొమ్మలు వేసేవాడు. సినిమా టైటిల్స్ అందంగా ఆర్ట్ వేసేవాడు. ఎవరైనా తన అభిమాన నటుడిని తిడితే వారిని కొట్టేవాడు. చదువు లేకపోగా ఇంటి మీదకి గొడవలు తెచ్చేవాడు. తన అభిమాన నటుడిని అనుకరిస్తూ అవతలి వాళ్ళతో ఫైటింగ్స్ చేస్తూ తరచూ దెబ్బలు తగిలించుకునేవాడు. తల్లిదండ్రులు బుజ్జగించి, తిట్టి, కొట్పి చెప్పినా వినోద్ మారలేదు.
వినోద్ చెల్లెలు విజయ 8వ తరగతి చదువుతుంది. తరగతిలో మొదటి ర్యాంకు సాధించేది. అన్నకు హితబోధ చేసింది సినిమా పిచ్చి వదులుకోమని. అన్ని రకాల పాత్రలనూ అవలీలగా పోషిస్తూ పేరు తెచ్చుకునేవాడు ఉత్తమ నటుడని, కేవలం పాటలలో, ఫైట్లలో మెరిసేవాడు ఉత్తమ నటుడు కాలేదని, ఫైటింగ్సులో సహజత్వం ఉండదని, పైగా అది హింసా ప్రవృత్తిని పెంచుతుందని చెప్పింది. నాటక రంగంలో రాణించేవారు అత్యుత్తమ నటులని చెప్పింది. తన అభిమాన నటుడిని కించపరిచిందనే ఆవేశంతో చెల్లెలిని కొట్టాడు. విజయ వినోదుతో మాట్లాడటం మానేసింది. వినోద్ ఎంతో బాధ పడ్డాడు. బతిమాలినాడు. సినిమా పిచ్చి పూర్తిగా వదిలించుకొని బుద్ధిగా చదువుకుంటేనే మాట్లాడుతా అంది. అయినా మనోడు మారితే ఒట్టు.
ఆ సంవత్సరం పాఠశాల వార్షికోత్సవాలు జరుగనున్నాయి. చాలా పాఠశాలల్లో వార్షికోత్సవాల పేర్లతో కేవలం విద్యార్థుల డాన్సులే ప్రదర్శిస్తారు. కానీ తెలుగు ఉపాధ్యాయులు కృష్ణమాచార్యులు వార్షికోత్సవాల సందర్భంగా అంతరిస్తున్న కళలను విద్యార్థులకు నేర్పి, ప్రదర్శింపజేయాలని నిశ్చయించారు. హరికథలు, బుర్రకథలు, తోలు బొమ్మలాటలు, యక్షగానాలు, నాటకములు, ఏక పాత్రాభినయం తదితరులు విద్యార్థులకు పట్టుదలతో నేర్పి, ప్రదర్శింపజేయాలని తద్వారా అంతరించిన గ్రామీణ కళలను బతికించాలని అనుకున్నాడు. ఇతివృత్తాలను సిద్ధం చేసి, విద్యార్థులకు నేర్పుతున్నారు. వినోదును పిలిచి, "నువ్వు ఒక నాటకంలో హీరో పాత్ర వేయాలిరా!" అన్నాడు మాస్టారు. "అమ్మో! నా వల్ల కాదండీ!" అన్నాడు వినోద్. "అవునులే! నాటకాల్లో ఫైటింగ్స్ ఉండలుగా! నీకు ఎందుకు నచ్చుతుందిలే!" అన్నాడు కృష్ణమాచార్యులు. పగలబడి నవ్వారు తోటి విద్యార్థులు. చిన్నబుచ్చుకున్నాడు వినోద్.
పాఠశాల వార్షికోత్సవాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కొంతమంది ప్రతిభావంతులు చాలా కార్యక్రమాల్లో పాల్గొని, తమ ప్రతిభను ప్రదర్శించి, ప్రేక్షకుల మన్ననలను పొందారు. ముఖ్యంగా విజయ ప్రతి రంగంలో పాల్గొని, అన్నిటా మంత్ర ముగ్ధులను చేసే నటనతో పలువురి దృష్టిని ఆకర్షించింది. అందరూ విజయ నటనను వేనోళ్ళ పొగిడారు. మరునాడు పాఠశాలకు వచ్చిన వినోద్ శ్రీనివాసుతో "రేపు మన అభిమాన నటుడి కొత్త సినిమా విడుదల అవుతుంది. మార్నింగ్ షో పోదామా?" అన్నాడు. "నాకు ఆసక్తి లేదురా! నిన్న నీ చెల్లెలి నటన చూశాక అంత అద్భుతమైన నటనను మళ్ళీ చూడలేమని అనిపిస్తుంది." అన్నాడు శ్రీనివాసు. ఎవ్వరి నోట విన్నా విజయ నటన గురించే. ఎవ్వరూ సినిమా చూడటానికి ఆసక్తిని చూపించలేదు. వినోద్ ఆలోచనలో పడ్డాడు. తన అభిమాన నటుడినే డామినేట్ చేసిన విజయ తన చెల్లెలు కావడం అతనికి గర్వం అనిపించింది. చెల్లెలిని బాగా మెచ్చుకున్నాడు. చెల్లెలు చెప్పినట్లు కష్టపడి చదువుకుంటానని ప్రమాణం చేశాడు వినోద్. సంతోషించింది విజయ.